PV: కాకతీయ వర్సిటీలో పీవీ విద్యా పీఠం
పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు శత జయంతి ముగింపు ఉత్సవాలను నగరంలోని పివి మార్గ్‌లో ఉన్న జ్ఞానబూమిలో నిర్వహించారు. ఇందులో భాగంగా గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి కెసిఆర్ 26 అడుగుల పివి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పివిమార్గ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పివిని ఎంత స్మరించుకున్నా, ఎంత గౌరవించుకున్నా తక్కువే అన్నారు. పీవీ ఒక కీర్తి శిఖరం. పరిపూర్ణమైన సంస్కరణ శీలి అని సిఎం అన్నారు. కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నప్పటికీ.. గతేడాది కాలంలో కేకే ఆధ్వర్యంలో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన మహేశ్ బిగాలకు ముఖ్యమంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

విద్యా సంస్కరణల్లో భాగంగా గురుకుల, నవోదయ పాఠశాలలను పీవీ నరసింహారావు తీసుకొచ్చారు అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. అలాగే పీవీ తీసుకొచ్చిన అనేక సంస్కరణలు మన కళ్ల ముందు ఉన్నాయి అని కేసీఆర్ తెలిపారు.
కాకతీయ వర్సిటీలో పీవీ విద్యా పీఠం
మన కాకతీయ వర్సిటీలో పీవీ పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వర్సిటీ వీసీ తాటికొండ రమేశ్ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తున్నదని పేర్కొన్నారు. పివి తెచ్చిన నాటి ఆర్థిక సంస్కరణ వల్లే నేడు పెట్టుబడులు వస్తున్నాయి. ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పీవీ విగ్రహాన్ని చూస్తుంటే కడుపు నిండిపోయింది అని సీఎం అన్నారు. ఈ రహదారికి పీవీ మార్గ్ అని నామకరణం చేయడం సంతోషంగా ఉన్నదని సిఎం పేర్కొన్నారు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపిన ప్రజ్ఞాశీలి పివి అని సిఎం తెలిపారు.