చెరువును తలపిస్తున్న కనుమ దారులు
తిరుమలలో భారీ వర్షం.. నడకదారులు మూసివేత

తిరుమల (CLiC2NEWS): అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో కురుస్తున్న కుండపోత వర్షానికి భారీగా వరద ప్రవహిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ సెల్లార్‌లో భారీగా వరద నీరు చేరింది. వర్షానికి మాడవీధులు జలమయమయ్యాయి. అలాగే అలిపిరి నడకమార్గం, కనుమదారుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. తిరుమల కొండల్లో అటవీప్రాంతం నుంచి భారీగా వరద వస్తోంది. ఆ వరద నీటి ప్రవాహంతో మెట్లమార్గం జలపాతంలా కనిపిస్తున్నది. ఇప్పటికే ముందు జాగ్రత్తలు తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నడకదారిని మూసివేసింది. వర్షంతో రెండో కనుమదారిలో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వరదలతో రెండో కనుమదారి ప్రమాదకరంగా మారింది. రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. హరిణికి సమీపంలో రహదారిపై చెట్టుకూలిపోయింది. కొండపై నుంచి రహదారిపైకి రాళ్లు, మట్టి కొట్టుకు వచ్చాయి. దీంతో అధికారులు వాటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో కనుమదారులను మూసివేసింది. వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.