ATM: పరిమితి దాటితే విత్‌డ్రాపై ఛార్జ్ పెంపు..

ముంబయి (CLiC2NEWS): ఎటిఎం లావాదేవీలు నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీపై రూ.23 వసూలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. ఇది మే 1 నుండి ఈ పెరిగిన ఛార్జీలు అమలులోకి రానున్నట్లు సమాచారం. ఆన్‌లైన్ వాలెట్లు, యుపిఐ లావాదేవీలు పెరగడంతో ఎటిఎంల నుండి నగదు ఉపసంహరణ తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికీ నగదు లావాదేవీలపై ఆధారపడే వారిపై భారం పడే అవకాశం ఉంది.
బ్యాంకులో దాచుకున్న సొమ్మును మనం ఎటిఎం ద్వారా విత్‌డ్రా చేసుకుంటాం. ఇలాంటి లావాదేవీలు నెలలో సొంత బ్యాంకు ఎటిఎం నుండి ఐదుసార్లు ఉచితంగా చేసుకోవచ్చు. అదే వేరే బ్యాంకు ఎటిఎం నుండి అయితే.. మెట్రో ప్రాంతాల్లో 5 లావాదేవీలు, ఇతర ప్రాంతాల్లో అయితే 3 లావాదేవీలకు అనుమతి ఉంది. ఒక సారి విత్‌డ్రా చేస్తే ప్రస్తుతం రూ.21 చొప్పున ఖాతాదారుల నుండి రుసుము వసూలు చేస్తారు. తాజాగా రూ.23 చొప్పున వసూలు చేసేందుకు ఆర్‌బిఐ అనుమతించింది.