Remdesivir అక్రమ దందా ముఠా సభ్యుల అరెస్టు

వరంగల్‌ (CLiC2NEWS): రాష్ట్రంలో క‌రోనా సెకండ్ విజృంభిస్తున్న వేళ మ‌హ‌మ్మారి వ్యాప్తిని ఆసరా చేసుకుని కొంద‌రు రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌మ‌యిస్తున్నారు. తాజాగా ఇలా రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను గురువారం వరంగల్‌ కమిషనరేట్‌ టాస్క్‍ఫోర్స్​‍ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీనికి సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్‌ తరుణ్‌జోషి గురువారం మీడియాకు వెల్లడించారు. కరోనా చికిత్సలో వినియోగించే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ మార్కెట్‌లో ప్రస్తుతం తగినంత అందుబాటులో లేదు. దీంతో నగరంలోని లైఫ్‌లైన్‌ హాస్పిటల్‌లో ఫార్మసీ నిర్వహించే మండిబజార్‌కు చెందిన బాగాజీ మనోహర్‌, బీమారానికి చెందిన కొలిపాక కుమారస్వామి, కరీమాబాద్‌కు చెందిన ఐత అశోక్‌ హెటిరో కంపెనీ నుంచి ఒక్కొక్క ఇంజక్షన్‌ను రూ.2,800కు కొనుగోలు చేశారు. సాధారణంగా కరోనా వ్యాధి గ్రస్తులకు రూ. 3,490కు విక్రయించాల్సి ఉండగా, ఇంజక్షన్ల కొరతతో రూ 35,000 నుంచి 45,000 వరకు బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్‍ఫోర్స్​‍ సుబేదారి పోలీసుల సహకారంతో లైఫ్‌లైన్‌ దవాఖాన ఫార్మసీపై దాడులు చేసి 28 ఇంజక్షన్లతోపాటు రూ 20,000 నగదు స్వాధీనం చేసుకొన్నామ‌ని తెలిపారు. అలాగే ఈ కేసులో ముగ్గురు నిందితుల‌ను అరెస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.