యుపిలో రోడ్డు ప్రమాదం: 8 మంది సజీవ దహనం

బరేలి (CLiC2NEWS): ఉత్తరప్రదేశ్‌లోని భోజిపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని బరేలీ-నైనిటాల్ హైవేపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రక్కు- కారు బలంగా ఢీకొనడంతో ఎనిమిది మంది ఘటనాస్థలంలోనే సజీవదహనమయ్యారు. మృతులలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కారు టైరు పగిలిపోవడంతో ఉత్తరాఖండ్ నుంచి వస్తున్న ట్రక్కును ఢీ కొంది. ఆ సమయంలో కారు సెంట్రల్ లాక్ పడటంతో అందులో ఉన్నవారు బయటకు రాలేకపోయారని స్థానికులు తెలిపారు. వీరంతా ఓ పెళ్లి కార్యక్రమానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
భారీ శబ్దం విని బయటకు వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారం. వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ట్రక్కులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
బరేలీ స్పెషల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివరాలను మీడియాకు వెళ్లడించారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 8 మంది మరణించినట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.