నగరానికి రూ.5 వేల కోట్ల కేటాయింపులు
రూ. 3,866.21 కోట్లతో కొత్తగా 31 ఎస్‌టీపీల నిర్మాణం
శివారు ప్రాంతాల తాగునీటి సరఫరాకు మరో రూ.1200 కోట్లు
ఒకేరోజు నగర ప్రజలకు రెండు శుభవార్తలు
మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ప్రకటన
హైదరాబాద్ (fCLiC2NEWS): నగరంలో 100 శాతం మురుగునీటి శుద్ధి కోసం కొత్తగా 31 సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను గురువారం కేటీఆర్ వెల్లడించారు. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలని, దానికి అనుగుణంగా నగరంలో మౌలిక సదుపాయాలు ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. గత ఏడు సంవత్సరాలుగా ఇందుకు తగ్గట్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 90 – 95 శాతం తాగునీటి సమస్యను ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. జలమండలి సమర్థమైన పనితీరు వల్ల వాటర్ ప్లస్ సిటీగా హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని కేటీఆర్ తెలిపారు.
వంద శాతం మురుగునీటి శుద్ధి:
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ప్రతీ రోజూ 1950 ఎంఎల్‌డీల(మిలియన్ లీటర్స్ పర్ డే) మురుగునీరు ఉత్పత్తి అవుతుందని కేటీఆర్ తెలిపారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 1650 ఎంఎల్‌డీ, జీహెచ్ఎంసీ అవతల, ఓఆర్ఆర్ పరిధిలో మరో 300 ఎంఎల్‌డీల మురుగు నీరు ఉత్పత్తి అవుతోందన్నారు. అయితే, ప్రస్తుతం నగరంలో 772 ఎంఎల్‌డీ సామర్థ్యంతో 25 సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉన్నాయన్నారు. వీటి ద్వారా మొత్తం ఉత్పత్తి అవుతున్న మురుగునీటిలో 46.78 శాతం మాత్రమే ట్రీట్‌మెంట్ చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లామని, హైదరాబాద్ నగరంలో చెరువులు బాగుండాలన్నా, మూసీ నది ప్రక్షాళన కావాలన్నా 100 శాతం మురుగునీటి ట్రీట్‌మెంట్ జరగాలని వివరించామని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని చెరువులు, హుస్సేన్‌సాగర్ బాగుండాలనేది, మూసీ నది ప్రక్షాళన కావాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందుకే తాము చెప్పగానే 100 శాతం మురుగునీటి శుద్ధి చేయాలని ఆయన నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగానే కాకుండా రాబోయే రోజుల అవసరాలకు తగ్గట్లుగా సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
రూ.3,866.21 కోట్లతో కొత్తగా 31 ఎస్‌టీపీలు
గత రెండేళ్లుగా షా టెక్నాలజీస్ అనే సంస్థతో నగరంలో సీవరేజి వ్యవస్థపై అధ్యయనం చేయించామని, వారి నివేదిక ఆధారంగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించినట్లు తెలిపారు. దీని ప్రకారం.. జీహెచ్ఎంసీలో పదేళ్ల తర్వాత 1950 ఎంఎల్‌డీల వరకు మురుగునీరు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. పదేళ్ల తర్వాత అవసరాలకు తగ్గట్లుగా సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 772 ఎంఎల్‌డీల సామర్థ్యం ఉన్న ఎస్‌టీపీలకు అదనంగా 1259.5 ఎంఎల్‌డీల సామర్థ్యంతో కొత్త సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను రూ.3,866.21 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు.
ఈ నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదించిందని పేర్కొన్నారు. ఇది సంతోషకరమైన విషయమని, నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు, తమ శాఖ తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపున్నామని అన్నారు. ఇంతపెద్ద నిర్ణయం తీసుకొని హైదరాబాద్ ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్ అవసరాలను కూడా తీర్చేలా నిధులు మంజూరు చేయడం హైదరాబాద్ వాసులకు గొప్ప శుభవార్త అన్నారు. నగరంలోని 31 ప్రాంతాల్లో కొత్త సీవరేజి ప్లాంట్ల నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. నిర్మించిన సంస్థలకే 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. చెరువులు, నాలాలు, మూసీ సమీపంలో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని, తద్వారా నగరంలోని చెరువులను సంరక్షించే అవకాశం కలుగుతుందన్నారు. ఇంతపెద్ద మొత్తంలో ప్రభుత్వం జలమండలికి నిధులు మంజూరు చేయడం ఇదే మొదటిసారి అని అన్నారు. ఎస్‌టీపీల నిర్మాణం పైర్తైతే దేశంలో 100 శాతం సీవరేజి ట్రీట్‌మెంట్ చేస్తున్న ఏకైక నగరంగా హైదరాబాద్ నిలుస్తుందన్నారు.
శివారు ప్రాంతాల తాగునీటికి రూ.1200 కోట్లు
ఓఆర్ఆర్ లోపల ఉన్న నగర శివారు ప్రాంతాల్లో మంచినీటి సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ తెలిపారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి గానూ రూ.1200 కోట్లతో 137 ఎంఎల్ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ల నిర్మాణానికి, 2100 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణానికి ప్రభుత్వం జీవో విడుదల చేసినట్లు కేటీఆర్ తెలిపారు. దీని వల్ల శివారు ప్రాంతాల్లో దాదాపుగా 20 లక్షల కుటుంబాలకు మంచినీటి సమస్య తీరుతుందన్నారు. 2 లక్షల కొత్త మంచినీటి కనెక్షన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒకేరోజు నగరానికి దాదాపుగా రూ.5 వేల కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడం నిజంగా నగర ప్రజలకు గొప్ప శుభవార్త అన్నారు. ఈ రెండు ప్రాజెక్టులను రాబోయే రెండేళ్లలో పూర్తి చేసి ప్రజలకు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
- హైదరాబాద్ నగర సీవరేజి మాస్టర్ ప్లాన్ ముఖ్యాంశాలు
ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 1650 ఎంఎల్‌డీ సీవరేజి ఉత్పత్తి అవుతోంది. - ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 25 సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి మొత్తం సామర్థ్యం 772 ఎంఎల్‌డీ.
- ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఉత్పత్తి అవుతున్న మురుగులో 46.78 శాతం ట్రీట్‌మెంట్ జరుగుతోంది.
- మరో 878 ఎంఎల్‌డీ మురుగు ట్రీట్‌మెంట్ జరగాల్సి ఉంది.
- హైదరాబాద్ నగరంలో సీవరేజి మాస్టర్‌ప్లాన్ రూపకల్పన కోసం ప్రభుత్వం ముంబైకు చెందిన షా టెక్నికల్ కన్సెల్టెంట్‌ను నియమించింది.
- ప్రస్తుతం(2021) నగరంలో 1950 ఎంఎల్‌డీ(1650 ఎంఎల్‌డీ జీహెచ్ఎంసీలో, 300 ఎంఎల్‌డీ ఓఆర్ఆర్ పరిధిలో) మురుగు ఉత్పత్తి అవుతోంది. 2036లో 2,814 ఎంఎల్‌డీ, 2051లో 3,715 ఎంఎల్‌డీ మురుగు ఉత్పత్తి అవుతుందని ఈ సంస్థ అంచనా వేసింది.
- మొత్తం 62 సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించాలని ఈ సంస్థ ప్రతిపాదించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 31 సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, ఓఆర్ఆర్ పరిధిలో 31 నిర్మించాలని సూచించింది.
- జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్‌టీపీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. జీహెచ్ఎంసీలో మొత్తం 3 ప్యాకేజీల్లో 1259.5 ఎంఎల్‌డీ సామర్థ్యం ఉండేలా 31 ఎస్‌టీపీల నిర్మించాలని ప్రతిపాదించడం జరిగింది. ఓఆర్ఆర్ పరిధిలో దశలవారీగా ఎస్‌టీపీల నిర్మాణం చేపట్టాలని సంస్థ సూచించింది.
- హెచ్ఎంసీ పరిధిలో 100 శాతం సీవరేజి ట్రీట్‌మెంట్ జరిపేందుకు గానూ 1259.5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఉండేలా 31 సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మానానికి, 15 ఏళ్ల ఓ ఆండ్ ఎంకు రూ.3,866.21 కోట్‌ీకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం, భవిష్యత్‌లో నగరంలో ఉత్పత్తి అయ్యే సీవరేజిని పూర్తి స్థాయిలో శుద్ధి చేయడానికి ఈ ఎస్‌టీపీలు సరిపోతాయి.
- ఈ 31 ఎస్‌టీపీలు ప్రారంభం అయితే సీవరేజి ట్రీట్‌మెంట్ విషయంలో అన్ని మెట్రో నగరాల్లో హైదరాబాద్ మొదటిస్థానంలో ఉంటుంది.