సైదాబాద్ ఘటన నిందితుడి కోసం గల్లీగల్లీ జల్లెడ

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై పాశవికంగా లైంగిక దాడి చేసి, హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. నిందితుడిని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్‌లతో పాటు తెలంగాణ లోని అన్ని ప్రాంతాలలోని పోలీసులను అప్రమత్తం చేశారు. అన్ని పోలీస్స్టేషన్లకు రాజు ఫొటో పంపించారు. సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసు పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. విపక్షాలు విమర్శలు తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండడంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. ఘటన జరిగిన వారమైనా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై తాజాగా తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సమీక్ష చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్‌రెడ్డితో సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు.
రాజధానిలోని గల్లీగల్లీని గాలిస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరా ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్‌లో బస్సు ఎక్కినట్లు గుర్తించారు. బస్సులో వెళ్లిన రాజు ఎక్కడ దిగారో తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే అన్ని బస్సుల డ్రైవర్లు, కండక్టర్లను ప్రశ్నిస్తున్నారు. అలాగే నిందితుడికి మద్యం తాగే అలవాటు ఉండడంతో రాష్ట్రంలోని వైన్స్ దుకాణాల యజమానులను అప్రమత్తం చేశారు. ప్రతి దుకాణానికి నిందితుడి ఫొటోలు పంపారు. అలాగే కల్లు కాంపౌండ్‌లో సిబ్బందిని అప్రమత్తం చేశారు.