సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య

హైదరాబాద్ (CLiC2NEWS): సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచారం ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ సమీపంలోని నష్‌కల్ రైల్వేట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి రాజు సూసైడ్ చేసుకున్నట్లు లోకో పైలట్ పోలీసులకు తెలిపాడు. మృతదేహాన్ని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. రాజు మృతిని డిజిపి మహేందర్‌రెడ్డి ద్రువీకరించారు. స్టేషన్ ఘన్‌పూర్ వద్ద మృతదేహాన్ని గుర్తించామని.. నిందితుడి శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా నిర్ధారించినట్లు డిజిపి తెలిపారు.
గత ఏడు రోజుల నుంచి రాజు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. రాజును పట్టుకునేందుకు 70 బృందాలను పోలీసులు రంగంలోకి దించారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాజు ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పట్టారు. ఈ నెల 9వ తేదీన సైదాబాద్‌లో చిన్నారిపై రాజు హత్యాచారం చేశాడు. నాటి నుంచి రాజు కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేపట్టారు. రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షలు రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.
నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు కొనసాగుతున్న నేపథ్యంలో రాజు ఆత్మహత్య చేసుకునే అవకాశముందని పోలీసులు ముందే భావించారు. రైల్వే ట్రాకులపై గాలింపు చేపట్టడంతో పాటు మార్చురీల్లో భద్రపరచిన మృతదేహాలను పరిశీలించారు. రైల్వే ట్రాక్‌లపై మృతి చెందిన వారి వివరాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో పోలీసులు ఊహించినట్లే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.