పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రి కెటిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా పలు కార్యక్రమాలు చేపట్టాలని జలమండలి అధికారులను పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు ఆదేశించారు. ఈ మేరకు పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమాలపై జలమండలి అధికారులు మంత్రి కే తారకరామారావుకు వివరాలు అందజేశారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి ఈ మేరకు జలమండలి అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జలమండలి పరిధిలో ఉన్న జీహెచ్ఎంసి మరియు పరిసర పురపాలికల్లో నాలాల క్లీనింగ్ మరియు పూడికతీత వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దీంతో పాటు స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ల పూడికతీత మరియు క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మరియు పరిసర పురపాలికలతో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలన్నారు.
పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు ప్రస్తుత వర్షాకాల ప్రణాళికకు సంబంధించి కూడా జలమండలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జలమండలి పరిధిలోకి వచ్చే అన్ని ప్రధాన రహదారుల పైన ఉన్న మ్యాన్ హోళ్ళ కి సంబంధించి ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. తాజాగా నగరంలో 11వేల మ్యాన్ హోళ్ళ ని సరి చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రి కేటీఆర్ కు తెలిపారు. నగరంలో ప్రధాన రోడ్లుగా ఉన్న సుమారు వెయ్యి కిలోమీటర్ల పరిధిలో ఈ మ్యాన్ హోళ్ళ సమస్య రాకుండా చూడాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులకు సూచించారు. ఇందుకోసం రానున్న రెండు వారాల పాటు యుద్ధప్రాతిపదికన ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాకాల ప్రణాళికలో భాగంగా నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని.. ఎప్పటికప్పుడు నివాస ప్రాంతాల్లో ఉన్న మురికి కాలువల క్లీనింగ్ పై ఫోకస్ పెట్టాలన్నారు. జలమండలితో పాటు జీహెచ్ఎంసి వద్ద ఉన్న మినీ జెట్టింగ్ మరియు భారీ జెట్టింగ్ మిషన్లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా జలమండలి అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలిపారు.
ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.