పేద,ధనిక తారతమ్యం లేకుండా రూ.5లక్షల ఉచిత బీమా..

ఢిల్లీ (CLiC2NEWS): పేద,ధనిక తారతమ్యం లేకుండా 70ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత ఆరోగ్య బీమా సదుపాయంను ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) కింద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దలకు ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం అందించనున్నారు. ధన్వంతరి జయంతి, తొమ్మిదవ ఆయుర్వేద డే సందర్భంగా ఈ పథకానికి ప్రధాని ప్రారంభించారు ఆయుష్మాన్ కార్డు ఉన్న వృద్దులు కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ.5లక్షలు వరకు లబ్ధి పొందుతారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేరనున్నట్లు సమాచారం.
ఈ సందర్బంగా ఆరోగ్యరంగానికి చెందిన పలు అభివృద్ధి పనులతో పాటు, గర్భిణులు, చిన్నారుల వ్యాక్సినేషన్ కోసం ఉద్దేశించిన యు-విన్ పోర్టల్ (U-WIN) ను కూడా ప్రారంభించారు.
పిఎమ్‌జెఎవై కింద దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త కార్డులు అందిస్తారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వారు ఇపుడు రూ.5లక్షల వరకు అదనపు కవరేజి లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లు పైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం వర్తిస్తుంది. సిజిహెచ్ ఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యాటరీ హెల్త్‌స్కీం, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయోవృద్ధులు వాటిని గానీ, ఎబిపిఎంజెఎవైని గానీ ఎంచుకోవచ్చు. ఎబిపిఎంజెఎవై లబ్ధి పొందేందుకు పిఎంజెఎవై పోర్టల్‌లేదా ఆయుష్మాన్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.