పరీక్షల సమయంలో థర్డ్ వేవ్ వస్తే.. ఏం చేస్తారు?: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ (CLiC2NEWS): పదో తరగతి, ఇంటర్‌పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. పరీక్షలకు సంబంధించి పక్కా సమాచారం ఇవ్వాలని ఆదేశించినా అఫిడవిట్‌లో అది కనిపించలేదని పేర్కొంది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని.. సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ సర్కార్ ఆలోచించాలని సూచించింది. ఒక్కరు చనిపోయినా.. ఒక్కొక్కరికీ రూ.1 కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. మన నిర్ణయాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది.
‘‘ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది విద్యార్థులు ఎలా పరీక్ష రాయగలుగుతారు. వేలకొద్దీ పరీక్ష గదులను ఎలా అందుబాటులోకి తీసుకొచ్చి, సమన్వయం చేయగలుగుతారు. పరీక్ష నిర్వహించాం.. పని అయిపోయింది అనుకోలేము కదా. పరీక్ష తర్వాత వాటిని మూల్యాంకనం చేయాలి, ఆ తర్వాత చాలా ప్రక్రియ ఉంటుంది.. ఇవేమీ మీ అఫిడవిట్‌లో కనిపించలేదు. రెండో దశ తీవ్రతను చూసి.. పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణులు చెపుతున్నా.. ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు’’ అని సుప్రీం వ్యాఖ్యానించింది.
ఒక నిర్ణయాత్మక ప్రణాళిక ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అవసరమైతే సీబీఎస్ఈ, యూజీసీ, ఐసీఎస్ఈ బోర్డుల సలహాలు తీసుకోవాలని సూచించింది. గ్రేడ్లను మార్కులుగా మార్చడం కష్టమే అయినప్పటికీ, పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుందని చెప్పింది. కొంత సమయం ఇస్తే.. చర్చించి ప్రభుత్వం నిర్ణయం వెల్లడిస్తామని ఏపీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవాలని, ఈ వ్యవహారం విద్యార్థులపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. పరీక్షలు జరుగుతున్న సమయంలోనే మూడో వేవ్ వస్తే అప్పుడు ఏం చేస్తారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఇవేమీ మీరు ఆలోచించకుండా అఫిడవిట్ దాఖలు చేశారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ రేపే చేపట్టనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.
సరైన అధ్యాయం కసరత్తు లేకుండా పరీక్షలకు వెళ్తే విద్యార్థులు, సిబ్బంది ప్రమాదంలో పడతారు. అన్ని అంశాలపై అఫిడవిట్ దాఖలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సోమవారం అఫిడవిట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వలని ఏపీ ప్రభుత్వం కోరింది. రేపే అఫిడవిట్ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు… ఇతర బోర్డుల ఫలితాలు ముందుగా వస్తే విద్యార్థులకు ఇబ్బంది కాదా అని ప్రశ్నించింది. పరిక్షల నిర్వహణ పై యూజిసీ,సీబీఎస్ఈ, ఐసిఎస్ఈ సలహాలు తీసుకోవచ్చు. గ్రేడింగ్ విధానం ఉందని, పరీక్షల నిర్వహణ ఒక్కటే మార్గం కాదు.ఇతర పరిష్కార మార్గాలు కూడా ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా దీనిపై రేపే విచారణ చేపట్టనున్నట్లు జస్టిస్ ఖన్వీల్‌కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి ధర్మాసనం స్పష్టం చేసింది.