Hyd: సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి!
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. పక్కింట్లో నివసించే రాజు అనే వ్యక్తి ఇంట్లో బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
కాలనీకి చెందిన చిన్నారి గురువారం సాయంత్రం 5 గంటల నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో పక్కింట్లో ఉండే రాజు అనే వ్యక్తి ఇంట్లో ఆమెను గుర్తించారు. అయితే ఆమె విగతజీవిగా పడిఉండటంతో స్థానికులు ఆందోళనకు దిగారు. బాలికపై రాజు అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటాడని.. నిందితుడిని తమకు అప్పగించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తూ చంపాపేట్ రహదారిపై సింగరేణి కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. ఈక్రమంలో పోలీసులకు, కాలనీ వాసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక దశలో పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడికిదిగారు. ఇందులో పది మంది పోలీసులు, మరో 15 మంది స్థానికులు గాయపడ్డారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టుచేశారు. సింగరేణి కాలనీలో భారీగా పోలీసులు మోహరించారు. నిందితునికోసం గాలిస్తున్నారు.