రాజ్యసభలో కాపు రిజర్వేషన్ల అంశం ప్రస్తావించడంపై హర్షం..
జివిఎల్ నరసింహారావుకు సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ కృతజ్ఞతలు..
మండపేట (CLiC2NEWS): దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న కాపు రిజర్వేషన్ల అంశంపై రాజ్యసభ సభ్యుడు జివిఏల్ నరసింహారావు పెద్దల సభలో లేవనెత్తడం పట్ల సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ హర్షం ప్రకటించింది. ఇటీవల రాజ్యసభ సమావేశాల్లో జివిఎల్ నరసింహారావు కాపు రిజర్వేషన్లు అమలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. దీనిపై సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు అడబాల బాబ్జీ స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాపు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇప్పటికే కాపులు అన్ని రంగాల్లో వెనకబడిన కులంగా ఉండి పోయారని అన్నారు. విద్య ఉద్యోగ ఆర్ధిక సామాజిక పరంగా కాపులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. వెనుకబడ్డ కాపుల శ్రేయస్సు కోసం రిజర్వేషన్ అంశాన్ని మళ్లీ తెరమీదకు తీసుకొచ్చిన జివిఎల్ కు ఆయన ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో కాపులకు విద్య ఉద్యోగ పరంగా 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తెచ్చిందన్నారు. ఆ బిల్లును వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా అడబాల బాబ్జీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.