నిస్వార్థ నేత దామోదరం సంజీవయ్య..

మండపేట (CLiC2NEWS): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య నిస్వార్థ నేత అని సేవా స్తంబ్ జిల్లా అధ్యక్షుడు గండి స్వామిప్రసాద్ పేర్కొన్నారు. సేవాస్తంబ్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మండపేట మండలం ద్వారపూడిలోని బాలుర హాస్టల్లో దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం నిర్వ‌హించారు. తొలుత సంజీవయ్య చిత్ర పటానికి గండి స్వామి ప్రసాద్ పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ఆయన ప్రజలకు చేరువయ్యారు అన్నారు. కార్మికులకు బోనస్ లు, ఆరు లక్షల ఎకరాల బంజరు భూములను నిరుపేదలకు పంపిణీ చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అవినీతి నిరోధక శాఖ, భూగర్భ గనుల శాఖ, లలిత కళల అకాడమీల ఏర్పాటు ఆయన దార్శినికతకు దర్పణాలని అన్నారు.

ఉచిత నిర్బంధ విద్యను అమలు పరచడం, తాలూకా స్థాయిలో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలని ఉత్తర్వులు ఇచ్చిన మహనీయులు సంజీవయ్య. చనిపోయే నాటికి సొంత ఇల్లు కూడా లేని గొప్ప వ్యక్తి అన్నారు. అసెంబ్లీకి రిక్షాలో వెళ్లిన నిరాడంబరులు, నేటి తరానికి నిజమైన ఆదర్శ ప్రాయులని సంజీవయ్య సేవలను శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎమ్.ఎమ్.ఆలీ, యూ.టి.ఎఫ్.జిల్లా డైరెక్టర్ డి.శ్రీనివాసరావు, సేవాస్తంబ్ నాయకులు టి.నరేంద్ర, సి.హెచ్.లక్ష్మణ రావు, డాక్టర్ మద్దుకూరి సత్యనారాయణ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు ఎస్ రమేష్, హాస్టల్ సిబ్బంది పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.