బాబాయ్ అంటూ ఆప్యాయంగా పలకరించి.. రూ. 80 వేలతో పరార్

విజయవాడ (CLiC2NEWS): బాబాయ్ బాగున్నావా అంటూ.. ఓ వ్యక్తి దగ్గర కూర్చుని మాట కలిపాడు. పిన్నిబాగుందా అని క్షేమ సమాచారాలు అడిగాడు. చివరికి రూ. 80 వేలు పట్టుకుని ఉడాయించాడు. ఈ ఘటన విజయవాడ లో పెనమలూరు మండలం పెనమలూరులో చోటుచేసుకుంది. డిఎన్ కాలనీకి చెందిన రిటైర్ రైల్వే ఉద్యోగి స్థానిక నారాయణ పాఠశాల బెంచిపై కూర్చుని ఉండగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బాబాయ్ బాగున్నావా, పిన్ని బాగుందా అని అప్యాయంగా పలకరించాడు. తాను బంధువని వయసుపైబడటం వలన గుర్తు పట్టలేక పోతున్నావని మాట కలిపాడు. నిజమని నమ్మిన పెద్దాయన ఇంటికి తీసుకెళ్లి మర్యాదలు చేశాడు.
అనంతరం సదరు వ్యక్తి తన కూతురుకి ఓణీల ఫంక్షన్ చేస్తున్నానని.. ఇద్దరు వచ్చి తన కూతురిని ఆశీర్వదించాలని కోరాడు. అనంతరం తన వద్ద రూ.80 వేల రూ.2 వేల నోట్లున్నాయని.. దానికి సరిపడా రూ. 500 నోట్లు ఇవ్వాలని కోరాడు. ఆ పెద్దాయన రూ. 80వేలకు సరిపడా రూ. 500 నోట్లను ఇవ్వగా.. రూ.2 వేల నోట్లను ఎటిఎం నుండి డ్రా చేయాలని పెద్దాయనను బైక్పై ఎక్కించుకుని వెళ్లాడు. కామయ్య తోపు వద్దకు తీసుకొచ్చి దింపి డబ్బులు డ్రా చేస్తానని చెప్పి ఇక్కడే ఉండు అని వెళ్లాడు. వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ తిరిగి రాకపోయే సరికి మోసపోయినట్లు గ్రహించిన ఆ పెద్దాయన పోలీసులను ఆశ్రయించారు.