అత్యధిక కాలం మహిళా ప్రధానిగా షేక్ హసీనా..
ఢాకా (CLiC2NEWS): బంగ్లా రాజకీయాల్లో `కోటా` దెబ్బతో ప్రధాని పీఠం నుంచి షేక్ హసీనా తప్పుకోవాల్సి వచ్చింది. ఐదుసార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన బంగ్లాదేశ్ ప్రధాని హసీనా అనూహ్యరీతిలో ప్రధాని పీఠం నుండి వైదొలగాల్సి వచ్చింది. 1971 లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పోరాడిన వారి కుటంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ పునరుద్ధరించడంతో ఒక్కసారిగా విద్యార్థులు ఆందోళనచేపట్టారు. ముందు శాంతియుతంగా చేపట్టిన నిరసనలు తర్వాత హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని రిజర్వేషన్లు కుదించాలని సర్కార్‌ను ఆదేశించింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు హసీనా ప్రభుత్వం అంగీకరించింది. అయినా దేశంలో ఘర్షణలు చెలరేగడంతో ప్రధాని పదవి నుండి వైదొలగాల్సివచ్చింది.
ఐదేళ్లపాటు ప్రదానిగా కొనసాగిన హసీనా
అత్యధిక కాలం ఓ దేశానికి ప్రభుత్వాధినేతగా కొనసాగిన మహిళా నేతల్లో ఒకరిగా హసీనా రికార్డు సృష్టించారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె హసీనా. హసీనా భర్త అణు శాస్త్రవేత్త. 1971వ సంవత్సరంలో పాక్ నుండి బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముజిబుర్ దేశాధ్యక్షుడిగా తర్వాత ప్రధానిగా పనిచేశారు. 1975 ఆగస్టులో ఆయనతో సహా పలువురు కుటుంబ సభ్యులు మిలిటరీ అధికారుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ దాడుల్లో హసీనా తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులు మృతి చెందారు. చివరకు కుటుంబంలో మిగిలింది హసీనా , ఆమె చెల్లెలు రెహనా మాత్రమే. కుటుంబ సభ్యులు హత్యకు గురైన సమయంలో వారు విదేశాల్లో ఉండటమే కారణం.
ఈ ఘటన అనంతరం హసీనా బంగ్లా దేశ్‌ను వీడి దాదాపు ఆరేళ్లపాటు భారత్‌లో ప్రవాస జీవితం గడిపారు. 1981లో తిరిగి స్వదేశానికి వెళ్లిన ఆమె ప్రజాస్వామ్యం కోసం పోరాడారు. తండ్రి స్థాపించిన అవామిలీగ్ పార్టికి నాయకురాలిగా 1991 ఎన్నికల్లో పాల్గొన్నారు. కానీ అవామిలీగ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టి సాధించలేకపోయింది. 1996లో తొలిసారి దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. మళ్లీ 2008 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో మళ్లీ ప్రధాని పీఠమెక్కారు. 2014, 2018, తిరిగి ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో హసీనా సర్కార్ ఏర్పాటైంది.
షేక్ హసీనా దేశ ప్రధాని పదవికి రాజీనామా చేసిన అనంతరం ఇండియాకు చేరుకున్నట్లు సమాచారం. ఆమె రాజకీయ శరణార్థిగా యుకెలో ఆశ్రయం కోరినట్లు సమాచారం. ఆమె సోదరి రెహనా యుకె పౌరురాలు. ఆమె కుమార్తె తులిప్ సిద్ధికీ ప్రస్తుతం లేబర్ పార్టి తరపున పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. యుకెలో ప్రస్తుతం లేబర్ పార్టి అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో హసీనా బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. దీనిపై బ్రిటన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. యుకె ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చే వరకు తాత్కాలికంగా భారత్‌లోనే ఉండనున్నట్లు సమాచారం.