గిరిజనుల అభివృద్దికి సమగ్రమైన దృక్పథంతో ముందుకు సాగాలి: గవర్నర్
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర జనాభాలో 10 శాతం పైగా ఉన్న గిరిజనుల అభివృద్ధికి సమగ్రమైన దృక్పథంతో ముందుకు పోవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. పి.వి నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్ లో ఈరోజు జరిగిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని ఆదిమ జాతి గిరిజన తెగలకు చెందిన కొంతమందికి రాజశ్రీ రకం నాటు కోళ్లను, కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ తమిళిసై మాట్లాడుతూ.. గిరిజనుల సమగ్ర సామాజిక, ఆర్ధిక, విద్య అభివృద్ధికి, వారి స్వయం ఉపాధి, ఇతర జీవనోపాదుల మెరుగు కోసం మరింత చొరవతో పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.గిరిజన మహిళల్లో, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో పోషకాహార లోపాలు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం అన్నారు. మంచి పోషకాలతో కూడిన ఇప్ప పువ్వుతో తయారయ్యే మహువా లడ్డును వీరికి అందించడం ద్వారా మంచి పోషకాలను అందించే అవకాశం ఉందని గవర్నర్ వివరించారు.
అదిలాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాలలోని కొన్ని ఆదిమ జాతి ప్రజల ఆవాసాలలో చేపట్టిన ప్రత్యేక పోషకాహార పైలెట్ ప్రాజెక్ట్ నిరంతరం కొనసాగాలని గవర్నర్ సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జాతీయ పోషకాహార సంస్థ, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, వ్యవసాయ, హార్టికల్చర్, వెటర్నరీ, ఆరోగ్య విశ్వవిద్యాలయాల సమన్వయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు గిరిజన ప్రజల సమగ్ర అభివృద్ధికి పాటుపడేంత వరకూ కొనసాగాలని గవర్నర్ స్పష్టం చేశారు. రాజశ్రీ రకం దేశి కోళ్ల పంపిణీ ద్వారా ఆదిమ జాతి గిరిజన ప్రజల స్వయం ఉపాధికి, వారిలో పోషకాల పెంపుకు ఉపయోగపడుతుందని గవర్నర్ ఆశా భావం వ్యక్తం చేశారు.