ఏప్రిల్ నాటికి ఎస్టీపీల సివిల్ పనులు పూర్తి చేయాలి
31 కొత్త ఎస్టీపీల పనులు సమీక్షించిన జలమండలి ఎండీ దానకిశోర్

దసరా లోపు ఎస్టీపీలు పూర్తి చేయడమే లక్ష్యం
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో 100 శాతం మురుగు శుద్ధి చేయడమే లక్ష్యంగా సుమారు రూ.3,800 కోట్లతో చేపడుతున్న 31 కొత్త ఎస్టీపీల(సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల) నిర్మాణాన్ని దసరా లోపు పూర్తి చేయాలని, ఇందుకు తగ్గట్లుగా ప్రణాళికబద్ధంగా పనులు జరగాలని జలమండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. శుక్రవారం అంబర్‌పేటలోని జలమండలి ఎస్టీపీ ప్రాంగణంలో ఆయన జలమండలి ఎస్టీపీ విభాగ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇప్పటికే అనుమతులు లభించిన స్థలాలలో సాయిల్ టెస్టులు పూర్తి చేసి వెంటనే ఎస్టీపీ నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. భూమికి సంబంధించిన సమస్యలు ఉన్న ప్రాంతాల్లో త్వరగా సమస్యలు పరిష్కరించుకొని, అనుమతులు తెచ్చుకునేలా అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించారు. ప్రతీ ఎస్టీపీకి సంబంధించి ఏ రోజుకు ఆ రోజు చేయాల్సిన పనులపై చెక్‌లిస్టు రూపొందించుకొని, కచ్చితంగా ఆ రోజు పనులు పూర్తి చేయాలన్నారు. ఈ చెక్‌లిస్టు వివరాలు జలమండలి అధికారుల వద్ద, సైట్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధుల వద్ద అందుబాటులో ఉండాలన్నారు.
అన్ని ఎస్టీపీల ప్లాన్లను సాధ్యమైనంత త్వరగా రూపొందించి వేగంగా పనులు మొదలుపెట్టడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి ఎస్టీపీకి సంబంధించి పూర్తి ప్రాజెక్టు వివరాలు, వర్క్ షెడ్యూళ్లను రూపొందించుకొని ఆ ప్రకారం ప్రణాళికబద్ధంగా పనులు జరిపి దసరా వరకు ఎస్టీపీలను పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు సూచించారు. మొదటి దశలో ఈ ఏప్రిల్‌లోపు సివిల్ వర్కులు పూర్తి చేస్తేనే దసరా వరకు ఎస్టీపీలను పూర్తి చేసే అవకాశం ఉంటుందని, కాబట్టి, అందుకు అనుగుణంగా పనులు జరిగేలా చూడాలన్నారు. ఏకకాలంలో ఎస్బీఆర్(సీక్వెన్షల్ బ్యాచ్ రియాక్టర్), సీసీటీ(క్లోరిన్ కాంటాక్ట్ ట్యాంక్), తదితర పనులను జరపాలన్నారు. అన్ని ఎస్టీపీలు సెప్టెంబర్‌లో ట్రయల్ రన్ చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.
ఎస్టీపీల నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జలమండలి ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో పనులు జరిపించాలని, ఇందుకు తగినట్లుగా కార్మికులు, నిర్మాణ సామాగ్రి, యంత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎస్టీపీ ప్రాంగణంలో మూడు షిఫ్టుల్లో సైట్ ఇంజనీర్లు కచ్చితంగా పనులను పర్యవేక్షించాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు ఆదేశించారు.
ఎస్టీపీ నిర్మాణ పనుల్లో పని చేస్తున్న కార్మికులు అన్ని రక్షణ చర్యలు పాటించేలా చూడాలని, రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించేలా చూసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో పనులు జరుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సరిపడా వెలుతురు ఉండేలా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు.
జనావాసాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎస్టీపీలతో సహా సుందరీకరణ పనులను కూడా జరిపించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎస్టీపీ ప్రాంగణాల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు గానూ ల్యాండ్‌స్కేప్ అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. నిర్మాణ పనుల వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా చుట్టూ బ్లూషీట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్టీపీ ప్రాంగణంలో వివిధ దశల నిర్మాణ పనుల వివరాలతో కూడిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సైట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.