రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేప‌ట్టాలి..

మండపేట(CLiC2NEWS): దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులు ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ జోనల్ మేనేజర్ డి.పుష్పమణి అన్నారు. మండపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ధాన్యం కొనుగోలుపై మండపేట నియోజకవర్గంలోని తహసీల్దార్లు మండల వ్యవసాయ అధికారులు, మండల పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ , వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండపేట నియోజకవర్గ ప్రత్యేక అధికారి సివిల్ సప్లై జోనల్ మేనేజర్ పుష్పమణి విచ్చేసి మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టాలని అన్నారు. ప్రతీ రైతుకు కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దళారులు, మధ్యవర్తులను రైతుల దగ్గరకు రాకుండా చూడాలని అన్నారు. మిల్లర్ల చేతిలో పడి రైతులు మోస పోకుండా అవగాహన కల్పించాలని వివరించారు. ప్రస్తుతం వాతావరణ పరిస్తితులకు తడిసిన ధాన్యం దామాషా పద్దతిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం చెల్లించే రవాణా చార్జీలు, మోతకూలి చార్జీలు రైతులకు చెల్లించేలా తదితర విషయాలను తెలియజేశారు. రైతు భరోసా కేంద్రములు ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా పూర్తిగా పనిచేయుటకు తగు సూచనలు సలహాలు అందజేశారు. కష్టకాలంలో రైతులను పూర్తిగా ఆదుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మండపేట తహసీల్దారు తంగెళ్ల రాజేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ ఆర్ వి నాగేంద్ర బాబు, ఆర్ ఐలు కంఠంశెట్టి గౌరి, హరిప్రసాద్, ఎమ్మెస్వో పద్మ, ఏడీఏ సీ హెచ్ కే వీ చౌదరి, ఏవో బలుసు రవి, కపిలేశ్వరపురం, రాయవరం మండలాల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.