లోక్‌సభలో దుండగుల కలకలం..

ఢిల్లీ (CLiC2NEWS): పార్లమెంట్‌లో బుధవారం ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు. ఒకరు గ్యాలరీ నుండి ఒక రకమైన పొగను వదలగా.. మరోవ్యక్తి పబ్లిక్ గ్యాలరీ నుండి కిందికి దూకాడు. లోక్ సభలోకి దూకిన వ్యక్తి టేబుళ్లపైకి ఎక్కి నల్ల చట్టాలను బంద్ చేయాలి అని నినాదాలు చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఎంపీలు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మరో ఇద్దరు పార్టమెంట్ భవనం బయట కూడా ఆందోళనకు దిగారు. పసుపు , ఎరుపు రంగు పొగను వదిలారు. వారిని కూడా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో పార్లమెంట్ భవనంలో భద్రత విషయంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
లోక్‌సభలో పట్టుబడిన వారు సాగర్ శర్మ, దేవ్‌రాజ్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరు కర్ణాటకకు చెందిన వారుగా తెలుస్తోంది. పార్లమెంట్ వెలుపల పట్టుబడిన ఇద్దరులో ఒకరు మహిళ కాగా.. ఆమె హరియాణాకు చెందని హిసార్‌కు చెందిన నీలం(42)గా గుర్తించారు. మరో వ్యక్తి మహారాష్ట్ర లాతూర్‌కు చెందిన అమోల్ శిందే (25)గా పోలీసులు గుర్తించారు. అయితే పార్లమెంట్ లోపలికి పొగ గొట్టాలను ఎలా తీసుకొచ్చారనే విషయంపై దర్యప్తు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమేనని పలువురు ఎంపీలు ఆరోపిస్తున్నారు.