TS: రానున్న 3 రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు!

హైదరాబాద్ (CLiC2NEWS): నైరుతి నుంచి గాలులు లోయర్ ట్రోపోస్పీయర్ వరకు వ్యాపించిన ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అండమాన్ దీవుల్లోకి శుక్రవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని అనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది మరింత బలపడి 24వ తేదీ వరకు తుఫానుగా మారే అవకాశం ఉంది. వాయువత్య దిశగా ప్రయాణించి 26న ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని చేరుకునే అవకాశం ఉంది.