TS: భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి విస్తృత స్థాయి సమావేశం పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ బుధవారం టియస్ఐఐసి కార్యాలయంలో జరిగింది.
ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు పరిశ్రమలు, వ్యవసాయం, సివిల్ సప్లైస్ వంటి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగాయన్నారు.
ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతాలైన మహబూబ్ నగర్ లాంటి జిల్లాలు మొదలుకొని తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు ప్రాజెక్టుల నీటితో కళకళలాడుతున్నయని, వ్యవసాయ రంగ అభివృద్ధి భారీగా పుంజుకుందని తెలిపారు.
అయితే ప్రస్తుతం పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైన డిమాండ్‌ని మార్కెటింగ్ సదుపాయాలను క్రియేట్ చేయాలంటే భారీ ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని రాష్ట్రంలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి స్థానిక రైతాంగం నుంచి ఇప్పటికీ పలు డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ జోన్లకు అవసరమైన భూసేకరణ వంటి అంశాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా చొరవ చూపించాలని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి చాలా పెరిగిందని, అందుకనుగుణంగా మిల్లింగ్ కెఫాసిటీ పెంచడం కోసం ఈ జోన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాన్నారు.