TS LockDown మరింత కఠినంగా అమలు చేయాలి: సిఎం కెసిఆర్

వరంగల్ (CLiC2NEWS): లాక్‌డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్ అమలు, ధాన్యం కొనుగోళ్ల అమలుపై జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, వైద్యాధికారులతో వరంగల్ అర్భన్ కలెక్టరేట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని మరో వారం పది రోజుల్లో వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే లాక్‌డౌన్ ఈ నెల 30 వరకు ఉంటుందని, మరింత కఠినంగా అమలు చేయాలని, అనుమతి పత్రాలులేకుండా బయట తిరిగే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలంతా వైరస్ కట్టడికి సహకరించాలని సూచించారు.
ఎంజీఎం దవాఖానా సమీపంలో ఉన్న సెంట్రల్ జైలును తరలించి అక్కడ మాతా శిశు సంరక్షణ కోసం అత్యాధునిక సదుపాయాలతో సూపర్ స్పెషాలిటీ దవాఖానాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, విశాలమైన స్థలంలో చర్లపెల్లి ఓపెన్ ఎయిర్ జైలు మాదిరిగా.. జైలును నిర్మిస్తుందనీ సీఎం తెలిపారు.
కాగా శుక్రవారం ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన చేపట్టారు. మధ్యాహ్నం హెలీకాప్టర్ లో వరంగల్ చేరుకున్న సీఎం, తొలుత ఎంజీఎం దవాఖానాను సందర్శించారు. ఐసీయూలో, జనరల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగుల బాగోగులను తెలుసుకున్నారు. మీరంతా త్వరలోనే కొలుకుంటారనీ కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. సీఎం ను ఉద్దేశించి, మీరే మా ధైర్యం.. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం.. అని ఆయన ఉద్వేగంతో నినదించారు.
ఎంజీఎం ఆస్పత్రి అంతా కలియతిరిగి అక్కడి పారిశుధ్య పరిస్థితులను, సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే.. రోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
మధ్యాహ్న భోజన విరామం తర్వాత సీఎం కేసీఆర్ వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు. జైల్లో ఖైదీలు తయారు చేసిన చేనేత, స్టీలు తదితర ఉత్పత్తులను పరిశీలించారు.
అక్కడి నుంచి ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని, అన్ని జిల్లాల కలెక్టర్లు,డీజీపీ, ఎస్పీ, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.