TS: నేటినుంచి అమల్లోకి కొత్త జోనల్ వ్యవస్థ
రాష్ట్రపతి సవరణ ఉత్తర్వుల అమలుకు గెజిట్.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్‌కుమార్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ జోనల్ వ్యవస్థలో మార్పులకు, చేర్పులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా.. దానికి అనుగుణంగా రాష్ట్ర సర్కార్ బుధవారం ఉత్వర్వులు జారీ చేసింది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త జోనల్ వ్యవస్థ గురువారం నుంచి అమల్లోకి వస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. 2018లో ఏర్పడిన ములుగు జిల్లాను కాళేశ్వరం జోన్‌కు, నారాయణపేట జిల్లాను జోగులాంబ గద్వాల జోన్‌కు కేటాయించారు. జోగులాంబ జోన్లోఉన్న వికారాబాద్ జిల్లాను స్థానికుల కోరిక మేరకు చార్మినార్ జోన్లో కలిపారు. కొత్తగా అమల్లోకి వచ్చిన సవరణ ఉత్తర్వుల ప్రకారం త్వరలో క్యాడర్ వర్గీకరణ చేపడతారు. జిల్లా, జోన్, మల్టీజోన్, రాష్ట్రస్థాయి క్యాడర్లను నిర్వచిస్తారు. ఆ ప్రకారం క్యాడర్ స్ట్రెంత్‌ను నిర్ణయిస్తారు.
ఏడు జోన్లు.. రెండు మల్టీజోన్లు
తెలంగాణ రాష్ట్రంలో మొదట 31 జిల్లాలను ఏర్పాటు చేశారు. తర్వాత ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ములుగు, నారాయణపేట జిల్లాలను కొత్తగా ప్రకటించారు. రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు ముందుగా 31 జిల్లాలకే వచ్చాయి. కొత్తగా ఏర్పడిన ములుగు, నారాయణపేట జిల్లాలను కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పొందుపరచాలని.. ఆ మేరకు సవరణ చేయాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దాదాపు ఏడాదికిపైగా నాన్చిన కేంద్రం తాజాగా సవరణలు చేస్తూ 33 జిల్లాలకు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం రెండు మల్టీజోన్లు, ఏడు జోన్లు ఏర్పాటయ్యాయి.