వైకుంఠ ఏకాదశి.. ( ముక్కోటి ఏకాదశి)
వైకుంఠ ఏకాదశి .. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. . విష్ణాలయాలలో ప్రత్యేకించి ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకునే ఏర్పాటు చేస్తారు. ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు తపించిపోతుంటారు.
సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్ర నామాలు పఠించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
అసలు ఉత్తరద్వార దర్శనం అంటే ఏమిటి.. దాని ప్రాముఖ్యత ఏమిటి.. ముక్కోటి ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది.. ఇలాంటి ప్రశ్నలు తలెత్తక మానవు. వీటకన్నింటికి సమాధానం కావాలంటే కొన్ని పురాణ గాథలు గురించి మనం తెలుసుకోవాలి.
ఈ ఏకాదశి తిథినాడు పాలసంద్రంపై తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా వైకుంఠానికి చేరుకుంటారట. అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరువచ్చింది. మూడు కోట్ల ఏకాదశులకూ సమానం కనుకనే ఆపేరు వచ్చిందనే మరో వాదన కూడా ఉంది. వైకుంఠంలో కొలువుదీరి ఉన్న నారాయణుడిని దర్శించుకోవడం కనకు దీనికి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు.
తిరుమలలో ఈ వైకుంఠ ఏకాదశి వేడుకలు పది రోజుల పాటు నిర్వహిస్తారు. శ్రీరంగంలోని రంగనాధ స్వామి వారి ఆలయంలో ఈ ఉత్సవాలను దాదాపు ఇరవై రెండు రోజులు నిర్వహిస్తారట.
ఈ ఏకాదశి నాడు మధుకైటభులనే రాక్షసులు వైకుంఠ ద్వారం వద్ద విష్ణుమూర్తిని దర్శించుకున్నారట. ఆ స్వామి వారి దర్శనంతో మధుకైటభులకు శాపవిమోచనం కలిగిందట. అపుడు ఆ మధుకైటభులు.. ఇక నుండి ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం గుండా నారాయణుడిని దర్శించుకుంటారో .. వారందరికీ కూడా మోక్షం కలగాలని కోరుకున్నారట. దీంతో ఉత్తర ద్వార దర్శనానికి ప్రాసస్త్యం ఏర్పడిందని ప్రతీతి. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి భక్తులను అనుగ్రహించేందుకు భూమికి చేరుకుంటారని అంటారు.
శ్రీమన్నారాయణుడి దర్శనం మనలోని అజ్ఞానం , అంధకారాన్ని హరింపచేసి.. శాశ్వతమైన శాంతిని, సత్యమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమన్నమాట. ఇది ఈ ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న ఆంతర్యం అయి ఉంటుంది. అందుకే ఈ రోజున ఉత్తరద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం దీనిని ఒక ఆచారంగా మాత్రమే కాకుండా.. తమలోని భక్తినీ, జ్ఞానాన్నీ వికసింపచేయమనీ వేడుకుంటూ స్వామిని కొలుచుకోవాలన్నమాట.
సర్వేజనా సుఖినోభవంతు!
లోకా సమస్తా సుఖినోభవంతు!
– పూర్ణిమ
అడ్వకేట్