వెంకటయ్య సార్‌ యాదిలో..

నిజాయితీగా, నిరాడంబరంగా, నిస్వార్థంగా, నిరంతరం విద్యా వ్యవస్థ అభివృద్ధి కొరకు, సరస్వతి దేవి సేవలో తరించిన  వెంకటయ్య (72) ఉపాధ్యాయ లోకానికి ఆదర్శప్రాయుడని.. అతని మరణ వార్త తెలిసిన పలువురు అతనితో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

వెంక‌ట‌య్య 12 జూన్ 1949 వ సంవ‌త్స‌రంలో కరీంనగర్ జిల్లా నందిమేడారంలో జ‌న్మించారు. ఆదిలాబాద్ లో మొదటగా ఉపాద్యాయ వృత్తిలో చేరి అక్క‌డ రెండేళ్ల‌పాటు సేవ‌లందించారు. అనంత‌రం అక్కడ నుండి లక్షెట్ పేట లో ఒక సంవత్సరం పాటు పని చేశారు. ఆ తర్వాత మంచిర్యాల గర్మిళ్ళ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొద్ది కాలం పనిచేసి, మ‌ళ్లీ ల‌క్షెట్‌పేట‌లో రెండేళ్లు ప‌ని చేశారు. అనంత‌రం సుధీర్ఘ కాలం గర్మిళ్ళ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మంచిర్యాలలో ప‌నిచేస్తూ. 30 జూన్ 2007లో పదవీ విరమణ చేశారు.. పదవీ విరమణ అనంతరం కూడా పాఠశాలకు రెగ్యులర్ ఉపాధ్యాయులవలె సేవలందించారు. ఇరవై నాలుగు గంటలు పాఠశాల కు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే వారి పని చేసి పెట్టేవాడు వెంకటయ్య.

విద్యార్థినీ విద్యార్థులను తన స్వంత పిల్లల వలె చూసుకునేవాడు. ఆ ప్రాంతంలో ప్రైవేటు పాఠశాలలు ఎన్ని ఏర్పాటు అయినా గర్మిళ్ళ పాఠశాల విద్యార్థుల సంఖ్య మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. దానికి వెంకటయ్య మరియు తన లాంటి మరికొంతమంది ఉపాధ్యాయులే కారణం అని పూర్వ విద్యార్థులు గుర్తుచేసుకున్నారు.

(త‌ప్ప‌క‌చ‌ద‌వండి:: Mancherial: ఆత్మీయ ఉపాధ్యాయుడు వెంకటయ్య ఇక‌లేరు)

ఉపాధ్యాయినీ ఉపాద్యాయులతో సోదరుని వలె మెలిగేవారు. వారి కుటుంబ సభ్యుల వలే కలిసిపోయేవారు. ఎవరైనా ఉపాధ్యాయులు అందుబాటులో లేనట్లైతే, ఎంత కష్టమైనా వారు చేయవలసిన పని తనే పూర్తి చేసేవారు.

ప్రధానోపాధ్యాయులు ప్రతి పనికి వెంకటయ్య మీదనే పూర్తిగా ఆధారపడేవారు. అధికారికమైన పనులు ఏమున్నా, ఆ పనులు పూర్తి అయ్యే వరకు తను నిద్రాహారాలు మరిచిపోయి పనిచేసేవాడు.

ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఆ పాఠశాల విషయాలలోనే కాక, ఇతర అధికారిక పనుల్లో వీరి పైన ఆధారపడేవారు. అంతటి నిజాయితీ పరునిగా, నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు సాధించాడు వెంక‌ట‌య్య‌.

అతనితో ఎవరికి ఏ అవసరం వచ్చినా కాదనకుండా ఆ పని చేసి పెట్టేవాడు. అందుకే అతనితో పరిచయం ఉన్న మరియు అతని గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అతన్ని ఎంతో గౌరవిస్తారు. తమ స్వంత మనిషిగా భావిస్తారు.

అతని చేతులమీదుగా అక్షరాభ్యాసం చేసిన ఎంద‌రో విద్యార్థులు అతని కళ్ళ ముందే ఎదిగి మంచి ఉద్యోగాలు సాధించారు. కొంద‌రు విదేశాల్లో స్థిర‌ప‌డ్డారు. మరికొందరు ప్రజాప్రతినిధులుగా మంచి స్ధాయికి ఎదిగారు. నైతిక విలువలను కాపాడుకుంటూ.. విధి నిర్వహణలో రాజీపడకుండా బాధ్యతగా పాఠాలు బోధించే వెంక‌ట‌య్య‌లాంటి  ఉపాధ్యాయుడి సేవ‌ల‌ను గ‌ర్మిళ్ల పాఠ‌శాల‌లో చ‌దివిన ఏ విద్యార్థీ మ‌ర్చిపోరు. వెంక‌ట‌య్య సారు..! లేడ‌న్న వార్త‌ను ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు.

పితృసమానులు..
దాదాపుగా 2000 సంవత్సరం వరకు పేద మధ్యతరగతి పిల్లలు వందశాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరేవారు. తల్లిదండ్రుల నిరక్షరాస్యత, అవగాహనలేమి వ‌ల్ల‌ వెంకటయ్య సార్‌ లాంటి ఉపాధ్యాయులే సరైన నామకరణం, జన్మదిన తేదీలను నిర్ణ‌యించే వారు. అలా రిజిస్టర్లలో రాసిన పేర్లు, పుట్టిన తేదీలే ప్రస్తుతం ఎంతో మందికి అధికారికంగా ఉన్నాయి. అటువంటి బాధ్యతను పోషించిన వెంకటయ్య ఎంతో మంది నా మిత్రుల‌.. అలాగే నా యొక్క పుట్టిన తేదీలు తన చేతుల మీదుగా రాసి తల్లిదండ్రుల పాత్ర పోషించారు. ఆ విధంగా అతను మాకు పితృసమానులు అయ్యారు. వారు ఏ లోకాన ఉన్నా మేము ఉన్నంత వరకు.. వారు మా జీవితంలో భాగం అయి ఉంటారు. వారి మరణ వార్త నాకు.. నా మిత్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని మనసారా ప్రార్థిస్తున్నాను.

-బాలు
(పూర్వ విద్యార్థి)


ఉపాధ్యాయులందరికీ ఆదర్శం వెంక‌ట‌య్య‌..

-నడిపెల్లి దివాకర్ రావు, ఎమ్మెల్యే, మంచిర్యాల

వెంకటయ్య తన వృత్తి నిర్వహణలో ఎంతో నమ్మకంగా ఉండేవాడు. నా రాజకీయ ప్రస్థానం కన్నా ముందు నుండే అతనితో నాకు సాన్నిహిత్యం ఉన్నది. వారి మరణం ఎంతో భాదాకరం. అతను ఉపాధ్యాయులందరికీ ఆదర్శం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ మైన సానుభూతి తెలియజేస్తున్నాను.

-నడిపెల్లి దివాకర్ రావు
శాసనసభ్యులు, మంచిర్యాల


మార్గదర్శి..

-అడ్డిచర్ల సాగర్

నాకు ఉపాధ్యాయ వృత్తి పరమైన సలహాలు సూచనలు అందజేశాడు, సహాయ సహకారాలు అందించాడు. మార్గదర్శి వలె పనిచేసిన వెంకటయ్య మా నుండి భౌతికంగా మాత్రమే దూరమయ్యారు. వారి సహాయ సహకారాలు ఎన్నటికీ మరిచిపోలేను. వారు ఇక లేర‌న్న వార్త‌ నన్ను ఎంతగానో కలిచివేసింది.

-అడ్డిచర్ల సాగర్
ఉపాధ్యాయుడు


మంచి మనిషి

కొత్తవడ్ల లక్ష్మినారాయణ

వెంకటయ్య రెండు దశాబ్దాల క్రితం ఈ పాఠశాలలో పనిచేసినప్పటికీ, ఇప్పటికీ వారి ప్రభావం ఈ పాఠశాలపై ఉన్నది. వారు.. వారిలాంటి ఇంకొంత మంది ఉపాధ్యాయుల కృషి, ప‌ట్టుద‌ల‌, అంకిత‌భావం, మంచిత‌నంతోనే ఈ పాఠశాలకు మంచి పేరు వచ్చింది. అతని వలె పనిచేసి ఈ పాఠశాల పట్ల ప్రజల్లో ఉన్న మంచి అభిప్రాయం తగ్గకుండా ప్రయత్నం చేస్తాను.

-కొత్తవడ్ల లక్ష్మినారాయణ
ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్మిళ్ళ మంచిర్యాల


సోదరసమానులు

-మాలవిదేవి

నేను గర్మిళ్ళ ప్రభుత్వ పాఠశాలలో వారితో కలిసి పనిచేశాను. వృత్తి పరమైన విషయాలలోనే కాక వ్యక్తిగతమైన విషయాల్లో కూడా చేదోడువాదోడుగా ఉండేవాడు. సోద‌రి వలె చూసుకునేవారు.

-మాలవిదేవి
ఉపాధ్యాయురాలు
ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్మిళ్ళ, మంచిర్యాల


నిజాయితీపరుడు

-సూరినేని గంగాధర్

మా ఉపాధ్యాయ మిత్రులకు ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా, తర‌తమ బేధం చూపకుండా పనిచేసి పెట్టేవాడు. వారి వ్యక్తిత్వం చాలా గొప్పది. వారి ఆలోచనలు, ఆశయాలు తెలిసిన వాడిని నేను.. ఉపాధ్యాయులు అంద‌రు…వారివలె నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేయడానికి కృషిచేస్తాము..

-సూరినేని గంగాధర్
జిల్లా ప్రధాన కార్యదర్శి
పీ ఆర్ టీ యు తెలంగాణ
మంచిర్యాల జిల్లా


దైవసమానులు

-సామల సత్యనారాయణ

నేను అతని చేతులమీదుగా అక్షరాభ్యాసం చేసినవాడిని. మా తల్లిదండ్రుల కన్నా ప్రేమగా చూసుకునేవాడు. చదువుతోపాటు సంస్కారం, ఉన్నతమైన వ్యక్తిత్వం నేర్పేవాడు. అతను నేర్పిన విద్యా బుద్ధులు నాతో పాటు నా స్నేహితులను కూడా ఉన్నతమైన స్థాయిలో స్థిరపడడానికి దోహదం చేశాయి. వారు మాకు దైవసమానులు.

-సామల సత్యనారాయణ
పూర్వ విద్యార్థి
డీ ఈ నీటి పారుదల శాఖ
సబ్ డివిజన్ కార్యాలయం మంచిర్యాల

Leave A Reply

Your email address will not be published.