విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-11)

విజయ్ మృతదేహం ఉన్న ఆస్పత్రి అది.. మరో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి బంధుమిత్రులు ఆస్పత్రికి వచ్చి పోస్టుమార్టం పూర్తి అయి మార్చురీలో ఉన్నశవాన్ని తీసుకుపోవడానికి సిబ్బందిని తొందరపెట్టారు. ఈ తొందరలో ఆస్పత్రి సిబ్బంది ఈ వ్యక్తి శవానికి బదులుగా విజయ్ మృత దేహాన్ని అప్పగించారు. తొందరలో ఉన్న వారు ముఖం కూడా చూడకుండా ఆదరాబాదరాగా శవాన్ని తమ వాహనంలోకి ఎక్కించి తోడ్కొని వెళ్లారు. ఈ వాహనం వెళ్లిపోయిన కొద్ది సమయానికి ఆస్పత్రి సిబ్బందిలో ఒకరికి అనుమానం వచ్చి మార్చురీకి వెళ్లి చూడగా విజయ్ దేహం కనిపించలేదు. దీంతో వెంటనే అప్రమత్తమయ్యారు. విజయ్ మృత దేహాన్ని జాగ్రత్తగా భద్రపర్చాలని పోలీసు అధికారులు హెచ్చరించిన విషయం జ్ఞప్తికి వచ్చి వణికిపోయాడు. అప్పుడే వెళ్లిన అంబులెన్స్‌కు ఫోన్ చేసి వారికి సంబంధించిన శవం మార్చురీలనే ఉందని పొరపాటున మరో శవాన్ని అప్పగించామని చెప్పారు. ఆ శవాన్ని తెచ్చి మీ బంధువులకు సంబంధించిన శవాన్ని తీసుకుపోవాలని కోరడంతో …ఆస్పత్రి వారి పనితీరు ఎప్పటికీ మారదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ… వాహనాన్ని వెనకకు మళ్లించాడు.

లక్ష్మీపతి నుంచి వీడ్కోలు తీసుకోవడానికి ఎందుకో విజయ్‌కు మనస్సంగీకరించడం లేదు. అయితే ఇప్పటికే శ్రీహరి అనుజ్ఞనిచ్చినందున మరోసారి ఏమి అభ్యర్థించలేకపోయారు. ఆ దేవదేవుని నుంచి కళ్లు మరల్చడానికి కూడా మనసు ఒప్పుకోవడం లేదు. తధేకంగా శ్రీమన్నారాయణున్ని చూస్తున్న విజయ్‌కు కర్తవ్యం గర్తు చేసింది మహాలక్ష్మి.

జీవుడా… శ్రీహరి ఆజ్ఞ‌ అయింది, ఇక భూలోకానికి వెళ్లడానికి సన్నద్ధం కావాల్సిందే అనడంతో విజయ్ …చూపులు మరల్చకుండానే వెనుకకునడుస్తూ అక్కడే ఉన్న దేవదూతను అనుసరించాడు. వారి నుంచి సెలవు తీసుకుంటున్నట్లుగా ముఖకవలికలతోనే వీడ్కోలు తీసుకుంటున్నాడు విజయ్. దేవదూతతో పాటు విజయ్ ద్వార పాలకుల వద్దకు చేరుకున్నారు.

నీ ప్రాణం పోయిన తర్వాత ఇక్కడికి తీసుకురావడం వరేక మా కర్తవ్యం. ఇక మా అవసరం ఉండదు నీకు. ఇప్పుడు నేరుగా భూలోకం వెళ్లి, నీ దేహంలో ప్రవేశించ వచ్చు, ఇక వెళ్లు అని దేవదూత చెప్పాడు. దీంతో మనో వేగంతో విజయ్ ఆత్మ లేదా జీవి వచ్చి ఆస్పత్రి సమీపంలోకి చేరుకుంది. అయితే అప్పటికే విజయ్ పార్థివ దేహం ఉన్న అంబులెన్స్ ఆస్పత్రి గేటు వద్ద నిలబడి ఉంది. రోడ్డుపై ట్రాఫిక్ అధికంగా ఉండటంతో వాహనాన్ని అక్కడ నిలిపి వేసి, వారు మార్చురీకి వెళ్లి పోయారు. అదే సమయంలో విజయ్ ఆత్మ దేహంలోకి ప్రవేశించడంతో నిద్ర నుంచి లేచిన విధంగా విజయ్ వాహనం నుంచి దిగి, తాను బస చేసిన లాడ్జీకి వెళ్లిపోయారు.

శవం మాయం

మార్చురీకి వెళ్లి శవ నిర్ధారణ చేసుకోవడానికి ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి వాహనం దగ్గరకు వచ్చిన వారికి అక్కడ శవం లేకపోవడం ఆశ్యర్యానికి గురి చేసింది. అంబులెన్స్‌ను తిరిగి మార్చురీ వద్దకు తీసుకు వెళ్లి తమకు సంబంధించిన శవాన్ని ఎక్కించుకున్నారు. ఇప్పటికే తీసుకెళ్లిన శవం ఎక్కడ అని సిబ్బంది నిలదీసినా…మాకు ఏమి తెలియదు…ట్రాఫిక్‌లో ఆస్పత్రి గేటు బయట రోడ్డు పక్కన వాహనం నిలిపాం. మీతో మాట్లాడాలని లోనికి వచ్చాం. తిరిగి వెళ్లి చూసేవరకు ఆ శవం మాయం అయింది. ఇదేమి మిష్టరీయో కానీ శవం వాహనం నుంచి ఎవరు తీసుకువెళ్లారో తెలియడం లేదు. మీరే పోలీసులకు చెప్పండి అని చెప్పి తమకు సంబంధించిన శవం తీసుకొని వెళ్లిపోయారు. శవం మాయం కావడం ఏమిటని ఆస్పత్రి సిబ్బంది ఆందోళన చెందుతూ.. పోలీసులకు ఏమి సమాధానం చెప్పాలని మధనపడసాగారు.

ఇది మరో పెద్దసమస్యగా ఆస్పత్రి సిబ్బంది ఆందోళన చెందారు. పైగా పోలీసులతో ఇబ్బందులు వస్తాయని వెంటనే ఈ విషయాన్ని తమపై అధికారులకు వివరించారు. ఇన్స్‌పెక్టర్ వచ్చినప్పుడు ఏమి సమాధానం చెప్పగలమని వారు చర్చించుకున్నారు. మెడికల్ కాలేజీలకు శవాలను కొందరు విక్రయించడం సాధారణంగా జరుగుతున్నందున ఇదే విషయం చెబుదామని వారిలో వారు నిర్ణయించుకొన్నారు. అయితే పోలీసు సిఐ ఎందుకోగానీ ఈ కేసు విషయంలో వెంటనే ఆస్పత్రిని వర్గాలను ప్రశ్నించకపోవడంతో, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కువ రోజుల తర్వాత అడిగితే శవం కుళ్లిపోయిందని మున్సిపాలిటీకి ఇచ్చామని చెప్పవచ్చని ఆయన భావించారు.

తనేకమి జరిగిందో, ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నాడో , అంబులెన్స్‌లో తాను ఎందుకు పడుకొని ఉన్నానో ఎంత ఆలోచించినా విజయ్‌కు అంతుబట్టలేదు. రూంకు తాళం వేసి వెళ్లిన వారం తర్వాత వచ్చిన విజయ్‌ను లాడ్జీ మేనేజర్ ఇదే ప్రశ్న వేశారు. రెండు రోజుల అడ్వాన్స్ మాత్రమే ఇచ్చి రూంలో దిగిన మీరు ఎక్కువ రోజులవరకు రాకుంటే మేం ఏమిచేయాలి సార్.. ఈ రోజు అయినా వచ్చారంటూ విజయ్‌కు రూం తాళం చెవిని ఇచ్చాడు.

మిగిలిన డబ్బులు వెంటనే చెల్లించండి…ఇంకా ఎన్ని రోజులు ఉంటారని మేనేజర్ ప్రశ్నించడంతో విజయ్ ఆలోచనలో పడ్డారు. చేతిలో సెల్‌ఫోన్ కూడా లేకపోవడం ఆయనకు ఆశ్యర్యమేసింది. తాళం చెవి తీసుకొని రూంలోకి ప్రవేశించి ఫోన్ కోసం వెదకాడు. ఆగ్రా వెళ్లేందుకు ఆ రోజు ఉదయం లాడ్జ్ రూం నుంచి ఆదరాబాదరాగా ఆగ్రాకు బయలు దేరిన విషయం మాత్రం గుర్తున్నది. తర్వాత ఏమిజరిగిందో ఎంతగింజుకున్నా జ్ఞాపకానికి రావడం లేదు. రూంలో ఉన్న పర్స్‌లో బ్యాంకు కార్డులు, తన గుర్తింపు కార్డు భద్రంగా ఉండటంతో త్వరగా రూం ఖాళీ చేసి టాక్సీని పిలిపించుకొని ఢిల్లీలోని ప్రభుత్వ భవన్‌కు చేరుకున్నారు. భవన్ సిబ్బంది విజయ్‌ను గుర్తించి వెంటనే రెసిడెంట్ కమిషనర్ వద్దకు తీసుకు వెళ్లారు.

మీ గురించి ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి గారు ప్రత్యేకంగా అడిగారు. ముఖ్యమంత్రి గారు కూడా గుర్తు చేశారట. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితితో అందరం బిజీగా ఉండిపోయాం. మీ విషయమే మర్చిపోయాం. ప్రసుతం మీ ప్రోగ్రాం ఏమిటి? హైదరాబాద్‌కు ఈరోజు వెళ్తారా లేక ఇంకేమైన కార్యక్రమాలు మిగిలాయా అంటూ రెసిడెంట్ కమిషనర్ ప్రశ్నించారు. తన ఫోన్ కనిపించడం లేదని అందుకే ఎవరిని కాంటాక్టు చేయలేకపోయానని విజయ్ వివరించారు. ఈ రోజు వెళ్లిపోతానని చెప్పడంతో భవన్ అధికారులు ఆయనకు విమానం టికెట్ రఢీ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాయానికి ఫోన్ చేసి ఎంఎల్‌ఎ గారు ఈ రాత్రికి విమానంలో వచ్చేస్తున్నారని సమాచారం అందించి ఊపిరి పీల్చుకున్నారు.

విమానంలో కూర్చున్న విజయ్, తలనిండా ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. అసలు ఏమి జరిగిందనేది అంతుచిక్కలేదు. తాను ఢిల్లీకివచ్చిన తర్వాత ఒక్కటొక్కటిగా జరిగిన విషయాలను నెమరువేసుకుంటుండగా ఆగ్రా బయలు దేరిన రోజు దగ్గర ఆగిపోయాడు. అవును ఆరోజు ఊబర్ కార్ బుక్ చేసుకున్నాను. కరెక్టు..మన తెలుగు వాడు డ్రైవర్.. పేరు .. ఆ.ఆ..గుర్తుకు వస్తున్నది.. పేరు నారాయణ.. మంచి డ్రైవర్.. నేను అసెంబ్లీలో బాగా మాట్లాడుతానని ప్రస్తావించాడు. రైల్వే ఉద్యోగం కోసం ఢిల్లీకి వచ్చి, ఆ జాబ్ నియామకంలో జాప్యం వల్ల ఖాళీగా ఉండటం ఎందుకని ఊబర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రైల్వే జాబ్ రానట్లయితే హైదరాబాద్‌కు రమ్మని,అక్కడ కార్ కొనుగోలుకు సహాయం చేస్తానని తాను చెప్పిన విషయం… అంతకు ముందు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఫోన్‌లో మాట్లాడారు. అంతగా శ్రద్ధ తీసుకున్నారు సిఎం ఎందుకో మరి… ఆగ్రా పర్యటన త్వరగా పూర్తి చేసుకొని బయలుదేరి రావాలన్నారు కూడా… అంతా ఒక్కటొక్కటిగా విజయ్ మనోఫలకంపై కదలాడాయి. తాను ప్రయాణిస్తున్న కారును ఒక లారీ వెంబడించడం గుర్తుకు రాగానే ఒళ్లు జలదరించింది. అవును తిరుగు ప్రయాణంలో లారీ వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. నేను అల్లంత దూరంలో పడిపోయాను. నారాయణ కారులోనే ఉన్నాడా ..కారుకు ఏమైంది,,అసలు నారాయణ బతికే ఉన్నాడా లేదా అనే అనుమానం కూడా కలిగింది. నారాయణను వెతికే వారు ఎవరూ ఢిల్లీలో లేరు. ఆయన ఎక్కడ ఉంటాడో అతనికి ఏమైందో అనే ఆందోళన విజయ్‌కు ఊపిరి సలపనీయలేదు. నాలుక పిడుచకడుతున్నట్లుగా అనిపించడంతో ఎయిర్ హోస్టస్‌ను పిలిచి దాహం అంటూ సైగ చేశారు.

తమ కారును వెంబడించింది ఎవరు? తనను హత్య చేయడానికే లారీ డ్రైవర్‌ను పురమాయించి ఉంటారు.. ఎందుకు ఈ కుట్ర జరిగింది.. నాకు శత్రువులున్నారా? అసలు నాకు శత్రువులు ఉండటానికి అవకాశాలు లేవే.. వారిలో శత్రుత్వం ఎందుకు ఏర్పడి ఉంటుంది… తెలిసీ ఎవరికి నేను కీడు చేయలేదు సరికదా చేతనైన సహాయంచేసేందుకే ప్రయత్నిస్తానే. ఎందుకిలా జరిగిందినాకు..పదేపదే ఇవే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.చంపడానికి పురికొల్పిందెవరు? ఎందుకు? వారిని ఎలా కనుగొనాలి? రోజు వారీ కార్యక్రమాల కంటే తన ముందున్న ప్రథమ కర్తవ్యం ఈమిష్టరీని చేధించడమే అని ఒక నిర్ణయానికి వచ్చాడు విజయ్..విమానాశ్రయం నుంచి ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌కు ఎప్పుడు చేరాడో, ఎలా చేరాడో తెలయలేదు విజయ్‌కు. అంతా యాత్రికంగా మారింది. మానసికంగా అలసి పోయిన విజయ్ కు ఆ రాత్రి నిద్దుర కూడా సరిగ్గాపట్టలేదు. ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని కాపీ తాగుతూ ముఖ్యమంత్రికి ఫోన్ చేశాడు.

సార్ రాత్రి నగరానికి వచ్చాను. వరద సహాయక చర్యల సమీక్షల్లో మీరు బిజీగా ఉండి ఉంటారు తర్వాత స్వయంగా వచ్చి కలుస్తానని ఎక్కువగా మాట్లాడకుండానే ఫోన్ కట్ చేశాడు విజయ్.

మళ్లీ, మళ్లీ ఆ రోడ్డు ప్రమాదం, రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చి తన కారును ఢీకొన్న లారీ యే గుర్తుకు వస్తున్నది. కాలు కాలిన పిల్లిలా తన గదిలోనూ పచార్లు చేస్తున్నాడు. అయ్యో పాపం డ్రైవర్ నారాయణ ఏమయ్యాడో అని ఇప్పటికే ఏ వెయ్యిసార్లో అనుకొని ఉంటాడు. తాను ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకున్నాడో కూడా అంతుబట్ట లేదు అతనికి.. లేదు ముందుగా ఈ సమస్య అంతు తేల్చాలి.. నాకు ఇలా జరగడానికి ఏఏ సంఘటనలు కారణం అవుతాయో తనకు తానే పరిశీలించుకునే పనిలో పడ్డాడు. నా చర్యల వల్ల ఎవరైనా నష్టపోయారా? నన్ను అడ్డు తొలగించుకుంటే వారికి ఆనష్టం ఇక జరగకుండా ఉంటుందా? శాసన సభ్యునిగా ఎన్నికైన తర్వాత ప్రజలను కూడగట్టి ఎవరికి లేదా ఏ సంస్థకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేయలేదు. ఎంఎల్‌ఎ కాకముందు ఇలాంటి నిరసనలు అనేకం చేశాను..ప్రజలతో మమేకం కావడం వల్లనే వారి సమస్యలకు పరిష్కారం చూపడంలో చొరవ తీసుకోవడం వల్లనే సునాయసంగా పార్టీ టికెట్ వచ్చింది. భారీ మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించాను. ఇది జరిగి మూడు సంవత్సరాలు అవుతున్నది. తర్వాత ఏమి జరిగింది? అసెంబ్లీ వేధికగా అనేక సమస్యలు ప్రస్తావిస్తూ మంత్రులను కూడా ఇరుకున పెట్టాను..దీనిపై ఎవరికైనా ఆగ్రహం ఉందా? లేదే మంత్రులందరూ నాతో ఆప్యాయంగానే మాట్లాడేవారు. పైగా ముఖ్యమంత్రి తనను అభిమానిస్తున్నాడనే భయం కూడా వారి మాటల్లో స్పష్టమయ్యేది. ఇంజనీర్లు…కంట్రాక్టర్లు, పోలీసులు లేదా ఎక్సయిజ్ శాఖ వారు..ెటల్స్ యజమానుల సంఘం, కాలేజీ యజమానుల సంఘం ఇంకా ఎవరికి నన్ను భౌతికంగా అంతం చేసి పీడ వదిలించుకునేంత అక్కసు ఉంటుంది…ఇందులో ఎవరు నాకు శత్రువులు..అంటూ పరిపరి విధాలుగా ఆలోచనలో పడ్డాడు విజయ్.

ఇదే నాజీవితానికి మలుపు. హంతకులను పట్టుకోవడమే ప్రప్రథమ కర్తవ్యం. శత్రువును గుర్తించడానికి ఎలాంటి వ్యూహం రచించాలి. పసిగట్టడం ఎలా ?ఇవే ఆలోచనలతో ఈ రోజంతా క్వార్టర్ నుంచి బయటికి కూడా రాలేదు విజయ్..ఎక్కడ నుంచి ప్రారంభించాలి..తనపై హత్యాప్రయత్నం జరిగింది వాస్తవం. కారు పూర్తిగా ధ్వంసమై ఉంటుంది. డ్రైవర్ చనిపోయి ఉంటాడని తను నమ్మకంగా భావిస్తున్నాడు. అంత ఘోర ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయి ఉంటుంది. మరి నేనే ఎలా జీవించి ఉన్నాను.

(సశేషం)

త‌ప్ప‌క చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-10)
Leave A Reply

Your email address will not be published.