విజయుడు (ధారావాహిక నవల పార్ట్-14)
విజయ్ పిఎ నగేష్ ఫోన్ చేసి ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చారు సార్ అడిగాడు… మధ్యలో మీకు కాల్ చేశాను నాలుగైదు సార్లు.. ఔట్ ఆఫ్ కాలింగ్ ఏరియా అని ఒకసారి, ఎంగేజీ బీఫ్‌సౌండ్, తర్వాత మరో రోజు అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నో రెస్పాన్స్ ఏమైందో అర్థంకాక ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా సంప్రదించాను. వారు మీ కోసం వాకబ్ చేస్తున్నట్లుగా చెప్పారు. మీరు ఇక్కడ లేరని మా గ్రామానికి వెళ్లాను సార్. భారీ వర్షాలు, వరదలు అక్కడే ఉండి పోయాను. మీరు వచ్చారుగా రేపు బయలు దేరి వస్తాన్ సార్ అంటూ చెప్పుకుంటూ పోయారు. ఈ మనిషి ఇంతే అనుకుంటూ ఫోన్ పెట్టేశాడు విజయ్.
ప్రభుత్వ వ్యవహరాలు, వరద సహాయక చర్యలు ఎలా అమలు జరుగుతున్నాయో తెలుసుకోవాలని రిలీఫ్ కమిషనర్ నందాకు ఫోన్ చేశాడు విజయ్. సీనియర్ ఐఎఎస్ అధికారి అయిన నందా తన అనుభవాన్ని సద్వినియోగం చేసే స్థాయి పోస్టింగ్ రాలేదని అప్పుడప్పుడు నాకు చెబుతూ ఉండేవారు. సాధారణ సమయాల్లో ఈ రిలీప్ విభాగానికి పెద్దగా పని ఉండదు. ఆఫీసుకు వచ్చి పోవడం తప్ప. కానీ నందా గారికి ఇప్పుడు చేతి నిండా పని లభించింది. క్షేమ సమాచారాల తర్వాత రాష్ట్రంలో ఈ వరదల వల్ల ఎంతమేరకు నష్టం జరిగిందో వివరించారు. నిధుల కొరత ఏమీ లేదు. కేంద్ర సహాయం మరింతగా అందించాలని నిన్ననే ప్రధాని కార్యాలయానికి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు రిపోర్టు పంపాము. కేంద్ర బృందం పర్యటన తర్వాత వారి నివేధిక ప్రాతిపదికగా ఏదో కొంత సహాయం ప్రకటిస్తారు హస్తిన ప్రభుత్వం. ఈ విధానం పోవడం లేదు విజయ్‌గారు.. మేం జాతీయ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీసు పరీక్షలో ఎంపిక అయిన వాళ్లమే. రాష్ట్ర ప్రభుత్వాలపై ఎప్పుడూ కేంద్రానికి విశ్వాసం ఉండదు. ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రాల రిపోర్టులపై ఏనాడు కేంద్రం నమ్మకంగా వ్యవహరించలేదు. కానీ విపత్తు తీవ్రత కనుమరుగు అయిన తర్వాత ఎప్పుడో వస్తుంది కేంద్ర బృందం.
విజయ్ గారూ ఇలాంటి విధానంలో మార్పు రావాలి. అయితే ఎక్కువ మంది ఐఎఎస్ అధికారులు కూడా స్వతంత్రంగా వ్యవహరించడం మరిచిపోయారు. ముఖ్యమంత్రి మెప్పు కోసమా అన్నట్లుగా రిపోర్టులు రూపొందిస్తుంటారు. అది హేతుబద్ధంగా ఉండదు. అందుకేనేమో కేంద్రం తన అధికారుల బృందాన్ని రాష్ట్రాలకు పంపుతుంది. వాస్తవం మాట్లాడు కోవాలంటే పరస్పర విశ్వాసం సన్నగిల్లుతున్నది. దేశంలో అత్యున్నత సర్వీసుగా చెప్పుకునే ఐఎఎస్ అధికారుల్లోనూ నిబద్ధత లోపించడమే మొత్తంగా ఈ వ్యవస్థ పతనానికి కారణమవుతున్నది.
లోపం ఎక్కడుందో మీరే చెబుతున్నారు నందా గారు, ఐఎఎస్‌లు ఎందుకు నిర్భయంగా వ్యవహరించలేక పోతున్నారో మీరు సరిగ్గానే విశ్లేషిస్తుంటారు. ముక్కు సూటిగా పోయే మీలాంటి వారికి కీలక పదవుల్లో పోస్టింగ్ ఇవ్వరు. ఎందుకంటే పై స్థాయిలో సర్దుబాటు అవసరం కాబట్టి. కంట్రాక్టర్లకు వెసలుబాటు కల్పిస్తూ వారి బిల్లులు ఆగకుండా ఉండాలంటే మీ లాంటి వారు ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా ఉంటే కుదరదు కదా. కోట్లాది రూపాయల బడ్జెట్ ఈ శాఖకు ఏటేటా కేటాయిస్తున్నాం. అసెంబ్లీలో పాస్ చేసే సమయం వరేక ఎంఎల్‌ఎల పని. తర్వాత ఏ పని జరుగుతుందో దానికి వాస్తవ వ్యయం ఎంతో అంతా గోల్‌మాల్. ప్రభుత్వ పెద్దలకు పెద్ద ఆదాయ వనరు ఈ ఇరిగేషన్ శాఖయే. రైతు దేశానికి వెన్నముక కాబటి, వారి పంటలకు నీటి సరఫరా నిరంతరంగా జరిగేలా అస్యూర్డు నీటి వనరు కోసం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని నీటిపారుదల ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నామంటూ రాష్ట్ర ప్రణాళికా వ్యయంలో మూడోవంతు ఈ రంగానికే కేటాయింపులు జరుగుతున్నాయి.
మీలాంటి విద్యావంతులైనా.. చురుకైనా యువ శాసనసభ్యుల చేతిలోనే రాష్ట్ర, దేశ భవిష్యత్తు ఉంది విజయ్ గారు. ముందుముందు మీలాంటి వారు ఉన్నత పదవుల్లోకి వెళ్తారని, మీ లాంటి వారైనా అవినీతి అంటకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, ప్రతిపైసా ప్రజలకే వినియోగం అయ్యేలా శ్రద్ధ తీసుకుంటారనే ఆశతో నేను అన్ని విషయాలు మాట్లాడుతుంటాను. ఇది మన ముఖ్యమంత్రికి నచ్చదు. మంత్రులకు కూడా. రెవెన్యూ, పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ వంటి ఇంజనీరింగ్ విభాగాలున్న శాఖలను అధికారులను ఎంపిక చేసుకొని, కేటాయించే సమయంలో ఏ ముఖ్యమంత్రి అయినా వివాదాలు తేకుండా చెప్పు చేతల్లో ఉండే ఐఎఎస్‌లు ఎవరా అని వెతికి మరీ నియమించుకుంటారు. ఇది బహిరంగ రహస్యమే. జరుగుతున్న అక్రమాల, అవినీతి గురించి ప్రతిపక్షాల సభ్యులకు చెప్పినా వారు ఈ సమాచారంతో బ్లాక్‌మెయిల్‌కు వినియోగించుకొని సొమ్ము చేసుకుంటున్న వారు ఎక్కువగా ఉన్నారు. నేను పట్టణాభివృద్ధి శాఖలో ఉన్నప్పడు ఇలాగే ఒక ఏరియాలో జరుగుతున్న అక్రమ లేఅవుట్‌ల విషయం ప్రతిపక్ష నాయకునికి ఏదోవిధంగా చేరవేయగా… ఈ మహానుభావుడు ఈ లేఅవుట్ వేసిన బిల్డర్‌తో మాట్లాడి ఎంత ఇస్తావు లేకుంటే అసెంబ్లీలో మాట్లాడుతా… మీడియాకు వివరిస్తా అంటూ బెదిరించి, బాగా ప్రయోజనం పొందాడు. నా అదృష్టం ఏమిటంటే ఆ వివరాలు నేను ఇచ్చినట్లుగా ముఖ్యమంత్రికి చెప్పలేదు. వారిద్దరు మంచి దోస్తులు… ఏదైనా పెద్ద ప్రాజెక్టు టెండర్లు ఫైనల్ చేసే సమయంలో ఆ కంట్రాక్టర్‌ను పిలిచి ప్రతిపక్ష నాయకున్ని కలిసి రావాలని పరోక్షంగా ఆ నేతకు కొంత కమిషన్ ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రే స్వయంగా చెబుతాడట. అందుకే అసెంబ్లీలో ఆయన గోడమీది పిల్లి వాటం లాగా విమర్శలు చేస్తాడేకానీ వాస్తవాలు వెలికి తీసేలా వాదనలుండవు. శాసనసభలో మీరు మాట్లాడే సమయంలో వింటాను. పాలకపక్షమైనా మీ వాదన బలంగా ఉంటుంది.
ప్రభుత్వాన్ని నడిపేందుకు, ఎన్నికల కోసం డబ్బు అవసరమని అందుకోసం కొన్ని సర్దుకుపోక తప్పడం లేదని, ముఖ్యమంత్రి నాతో అంటుంటాడు. అయినా ఎప్పుడూ నా వాదనల విషయం పట్టించుకోలేదు. అధికార పార్టీ సభ్యున్ని కాబట్టి మాట్లాడరాదని అనలేదు.
మీతో ఆయన ఎందుకు సర్దుకు పోతున్నారో మా అధికారులకు కూడా అర్థం కావడం లేదు. గతంలో మీలాగా మాట్లాడిన ఎంఎల్‌ఎను అదుపు చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నించారని, వినకపోతే అక్రమ నిర్మాణమని ఇళ్లును కూడా కూల్చివేయించారని చెప్పుకున్నారు. అని నందా చెప్పడంతో విజయ్ ఆలోచనలో పడ్డారు.
ఉంటాను సార్… మీ రిలీఫ్ పనులు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఆఫీసుకు వచ్చి కలుస్తానంటూ ఫోన్ పెట్టేశాడు విజయ్.
ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అనుకుంటూ మధ్యాహ్న భోజనం చేసి విశ్రాంతి తీసుకోవడానికి బెడ్ మీదికి చేరాడు. వెంటనే నిద్ర పట్టదని తెలిసీ.. శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థానం బుక్‌ను చేతిలోకి తీసుకొని చదవడం ఆరంభించారు. ఒక్కో కవిత ఇప్పటికి ఎన్నిసార్లు చదివాడో… అభ్యుదయ కవి ఆయన అనుకుంటూ ఒక్కో కవితను మరోసారి చదివారు. సాయంత్రం కావడంతో కుటుంబరావు ఇంటికి వెళ్లాలని రఢీ కావడానికి ప్రయత్నించాడు. వెంటనే విరంచి గుర్తుకు రావడంతో అప్రయత్నంగా పెదాలపై చిరునవ్వు వెలిసింది. ఊ.. గడుగ్గాయి. మాటలతో పోట్లాడుతుంది. తెలివైన అమ్మాయే. పైగా విద్యావంతురాలు. చూద్దాం ఈ పరిచయం ఎటు దారితీస్తుందో..
ఢిన్నర్‌కు బయలు దేరే ముందు కుటుంబరావుకు ఫోన్ చేశాడు విజయ్… తాను కాలేజీలో ఒక మీటింగ్‌లో ఉన్నట్లు అది పూర్తి కావచ్చిందని బయలు దేరుతున్నానన్నారు. మీరు కూడా వెంటనే బయలు దేరండి..మాట్లాడు కుందాం… ముందుగా వస్తే అంటూ ఫోన్ కట్‌చేశాడు.
భోజనం అనగానే మరీ ముందుగా వెలితే బావుండదేమో అనుకుంటూ మరో అరగంట పాటు పత్రికలను తిరగేశాడు. ఉదయం ఫోన్ చేసిన విరంచి కొంత ముందుగా రండి, భోజనం సమయానికే వస్తే ఏమిమాట్లాడినట్లుగా ఉండదు. సాయంత్రం కాఫీ సమయానికే రండని ఆహ్వానించిన విషయం గుర్తుకు రావడంతో వెంటనే బయలు దేరాడు విజయ్.
తన కారు కుటుంబరావు ఇంటికి సమీపించగానే వాచ్‌మెన్ గేటు తీయగా కారును పార్కు చేసి ముందుకు కదులుతుండగా ఎదురుగా కనిపించిన విరంచి చూసి అక్కడే ఆగిపోయాడు. ఏమా అందం. నిన్నటికీ ఈరోజుకు ఆమెలో మరింత సోయగం అద్దినట్లు ఉంది. తనను చూడగానే ఆమె కళ్లలో మెరుపును విజయ్. ప్రబంధ కావ్యాల్లో వర్ణించిన అభిసారిక గా తనకు కనిపించింది విరంచి.
ఆమెనే చూస్తూ ముందుకు అడుగేయడం కూడా మరిచిపోయాడు విజయ్.. శిల్పి చెక్కిన అజంతా శిల్పంలా ఆమె అలా నిలుచుండి తనవైపు చూస్తుండగా మైమరిచిపోయాడు విజయ్…
రండి.. నాన్నాగారు కూడా వస్తున్నానని, విజయ్ గారువచ్చారా అంటూ ఇప్పుడే కాల్ చేశారని విరంచి అనడంతో లోకంలోకి వచ్చిన విజయ్ ఆమెను అనుసరిస్తూ లోనికి వచ్చారు. ఇద్దరు సోఫాలో అసీనులు కాగానే ఏమిటి కారు వద్దనే ఏదో పలవరించారు. అభిసారికా.. అంటే ఏమిటండీ మీ ఉద్ధేశ్యం. ఒంటరిగా ఉంటున్నారు ఏదో పాపం భోజనానికి పిలవమని మా డాడీని ఒప్పించి ఆహ్వానిస్తే ఏమిటా మాటలు. నాకు వేరే పని ఏమి లేదనుకున్నారా? గైడ్ విదేశాలకు వెళ్లడంతో నీ థీసిస్ రాయడానికి కొంత ఆలస్యం అవుతున్నది. కొంత ఖాలీ చిక్కింది. లేకుంటే నా అంత బిజి పర్సన్ ఇంకా ఎవరుండరంటూ చిరుకోపం ప్రదర్శించింది విరంచి.
ఏమిటండి… ప్రతి చిన్న విషయానికి అన్ని అర్థాలు తీసుకుంటారు. నేను ఏమైనా కాని మాట అన్నానా.. మనసులో అనుకున్నది బయటకు వినిపిస్తోంది నీకు. ఏమి చేయను నాకు తెలియకుండానే అలా మాటలు బయటకు వస్తున్నాయి. మీ విషయంలో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. మరోసారి జరగకుండా నేనైతే ప్రయత్నిస్తాను సరేనా.. అంటూ కొంటెగా చూసిన విజయ్ అంతరంగం అర్థమైనా దానిని గమనించనట్లుగా చూడండి విజయ్ గారు మీరే అన్నారుగా స్నేహితుల మధ్య అరమరికలు ఉండరాదని.. అందుకే నేను అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు మీ మాటలను సరేనా.. అవును మీరు ఏమన్నారు. అభిసారికా… దాని అర్థం తెలిసే అన్నారా… కథానాయిక తెల్ల చీర కట్టుకొని ప్రియుని కోసం ఎదురుతెన్నులు చూసే పడుచులనుద్ధేశించి కదా ప్రబంధ కవులు వర్ణించింది. మనం స్నేహితులుగా నిన్ననే పరిచయం అయింది. అప్పుడే మీరు అంత దూరం ఆలోచించారా లేక యధాలాపంగా అన్నారో తెలియదు నాకు. నా పోస్టు గ్రాడ్యుయేషన్ తెలుగు సాహిత్యమే.. నాకు కూడా ఇంతో అంతో పరిజ్ఞానం ఉంది.
అలా కాదండి విరంచి గారు మీరన్నట్లుగా యధాలాపంగా ఆ మాటలు నోటినుంచి వెలువడినాయి. కాఫీ ఇస్తామన్నారు. అందుకే త్వరంగా వచ్చాను సుమా అని విజయ్ అంటుండగానే కుటుంబరావు హాల్‌లో ప్రవేశించారు.
విజయ్ మర్యాదగా లేచి నమస్కారం అంటూ విష్ చేశారు. కొద్దిగా ఆలస్యం అయింది. మీరు కూడా ఇప్పుడే వచ్చినట్లున్నారు.
పది నిమిషాలు అయిందండి. మీ అమ్మాయి ఇంకా కాఫీ ఇవ్వలేదంటూ ఫిర్యాదు చేశారు.
లేదు నాన్నా ఆయన వచ్చి రాగానే మాటల్లో పడిపోయాం. ఇప్పుడే కాఫీ తెస్తానంటూ లోనికి వెళ్లింది.
ఏమిటి విశేషాలు.. నిన్న నీవు వెళ్లిన తర్వాత నేను, విరంచి నీ గురించే కొద్ది సేపు మాట్లాడుకున్నాం. ఎందుకో మరోసారి నిన్ను కలవాలని అనిపించి అమ్మాయికి చెప్పాను ఈ రోజు డిన్నర్‌కు ఆహ్వానించమని.
చాలా థాక్సండీ. నా గురించి ఆలోచించినందుకు. మీలాంటి పెద్దలు పిలిచినప్పుడు రాననలేనుగా.. అందుకు వెంటనే సరే అన్నా.
ఇంతలో విరంచి మూడు కప్పుల కాఫీతో వచ్చింది. వారి మధ్య సినిమాలు, రాజకీయాలపై కొద్దిసేపు చర్చ జరిగింది. అలా వెళ్లి మాట్లాడుకుందామంటూ కుటుంబరావే చొరవ తీసుకొని వసారాలోకి తీసుకు వచ్చి, విజయ్‌తో ఇంటి ముందు ఉన్న పూల మొక్కల మధ్య నిలిచాడు. విజయ్ గారు ఎలా ఉంటున్నారు. క్వార్టర్‌లో ఒక్కరే ఉంటారు కదా బోర్‌వేస్తున్నదా? అంటూ తాను చెప్పదలుచుకున్న విషయానికి ప్రస్తావనగా కుటుంబరావు మాటలు కలిపారు.
వెంటనే విజయ్, కుటుంబరావు గారు నాకు ఎవరైనా శత్రువులు ఉన్నారంటారా అంటూ ప్రశ్నించడంతో నివ్వెరపోవడం కుటుంబరావు వంతైంది.
ఎందుకు అలా అడుగుతున్నారు. అజాతశత్రువు వంటి వారు మీరు. మీకు హాని కల్పించాలని ఎవరు మాత్రం అనుకుంటారు. అందరితో మీరు మంచిగానే మొసలుకుంటారు కదా. ఎందుకని అనుమానం వచ్చింది.
ఏమో తెలియడం లేదు. ఈ మధ్య కొంత అభద్రతగా ఫీల్ అవుతున్నాను. నిన్న మీరు మాటల సందర్భంగా తీసుకువచ్చిన డిసెంబర్ 31 రాత్రి డిన్నర్ విషయం తర్వాత నాలో ఈ అనుమానం మరింత బలపడింది. నా వెనుక ఏమి జరుగుతున్నదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ … అన్నాడు విజయ్
విజయ్ గారు సమాజం అంతా ఒక్క విధంగా ఉండదు. మనుష్యుల మనస్తత్వాలు ఎప్పుడు ఒక్క విధంగా ఉండవు. కొంత సర్దుబాటు తప్పదు. జీవితంలో మరీ ముక్కుసూటిగా వెళ్లడం వల్ల అనుకోని సమస్యలు వస్తాయి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తేల్చుకోవడం కూడా కష్టం. మా కాలేజీల వ్యవహారమే చూడండి. ఏ కాలేజీకి ఆ కాలేజీ సపరేట్ కదా అయినా ఒక కాలేజీకి మంచి పేరు వస్తే ఇతరులకు ఈర్ష్య అధికంగా ఉంటుంది. మీ విషయంలో కూడా అదే జరగవచ్చు. మీరు ఒక నియోజర వర్గం ప్రజాప్రతినిధి కావచ్చు కాని రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. మీ పార్టీ అధిష్ఠానంలోనూ మీకు మంచి గుర్తింపు ఉన్నట్లుగా చెబుతుంటారు. అందుకే ముఖ్యమంత్రి గారు విజయ్‌ను అధికంగా అభిమానిస్తున్నారని మీ రాజకీయ వర్గాలే అంటున్నాయి. కుటుంబరావు మర్మగర్భంగా తాను చెప్పదలుచుకున్నది వివరించాడు.
కానీ అందరూ నాతో మంచిగానే ఉన్నట్లుగా నటిస్తున్నారంటారా ?అంటూ ఆగి కుటుంబరావు మొఖంలోకి చూశాడు విజయ్.
తాను ఊహించినట్లుగానే ఆయనలో కొంత కలవరపాటు కనిపించింది. కానీ దానిని కనబడనీయకుండా కుటుంబరావు మరో అంశంపై మాట్లాడటంతో తాత్కాలికంగా ఈ విషయంపై వారి చర్చ ఆగిపోయింది.అయితే విజయ్ స్వయంగా తెలుసుకున్నాడు కాబట్టి ఆయనే జాగ్రత్తపడుతాడు. ఇంతకు మించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. ఎలా చెప్పాలా అనే తర్జన భర్జనలో నేనుంటే ఆయన ఆ ప్రస్తావన తెచ్చాడు కాబట్టి దీనిని మరింత పొడిగించి విజయ్‌లో ఆందోళన పెంచడం ఇష్టం లేకపోయింది కుటుంబరావుకు. లోపలికి వెళ్దాం పద. అమ్మాయితోనూ మాట్లాడుకుందామని విజయ్‌తోపాటు హాల్‌లోకి వచ్చి కూర్చున్నారిద్దరు. విజయ్ కొంత ఇబ్బందుల్లో ఉన్నట్లుగా నాన్న అన్ని విషయాలు చెప్పి తగిన జాగ్రత్తల్లో ఉండటం మంచిదని ఏదో రూపంగా విజయ్ మనస్సు మార్చుకునేలా వివరించి ఉంటారని విరంచి అనుకుంది. అయినా విజయ్ ను ఢిన్నర్ అంటూ పిలిచింది అందుకే కదా అనుకుంది విరంచి. నాన్నకు కూడా విజయ్ మీద మంచి అభిప్రాయమే ఉన్నందునే బహుశ ఢిన్నర్‌కు పిలిచి శ్రేయోభిలాషిగా సలహా ఇచ్చి ఉంటాడని విరంచి అభిప్రాయపడింది.
అప్పుడే టివిలో సాయంత్రం ఏడు గంటల వార్తలు వస్తున్నాయి. విజయ్ గారు మీకు కాక్‌టైల్స్ పడవు కానీ నాకు ఎవరైనా బంధువులు లేదా మిత్రులు ఇంటికి వచ్చినప్పుడు, నాన్ వెజ్ వంటకం వాసన వస్తే చాలు డ్రింక్ తీసుకోవడం అలవాటుగా మారింది. మీకు అభ్యంతరం లేకపోతే ఒకటి రెండు పెగ్గులే తీసుకుంటాను. కూల్‌డ్రిక్స్‌తో మీరు కంపెనీ ఇస్తారు కదా అంటూ గ్లాసులు తీసుకు రావడానికా అన్నట్లు లోపలికి వెళ్లాడు కుటుంబరావు, ఇక హాలులో విజయ్, విరంచి ఇద్దరే మిగిలారు. ఒకరినొకరు చూసుకుంటూ ఏదో మూగభాష కన్నులతోనే మాట్లాడుకున్నారు. అది మాటలకు అందనిది. ఒకరిపై మరొకరికి ఏర్పడిన అనుబంధం. వారిద్ధరి పరిచయం వయస్సు రెండు 24 గంటలే అయినప్పటికీ ఎన్నాళ్లుగానే పరిచయం ఉన్న వారిలా వారి మనస్సులు గుసగుసలాడుకుంటున్నట్లున్నాయి
(సశేషం)