విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-18)

ఏమిటండీ.. ఇప్పటివరకు క్యూలో నిలబడి ఛలాన్ తీసుకోకుండా పక్కకు వస్తున్నారు. ఈ రోజు ఫీజు చెల్లించకుంటే ఒక సంవత్సరం వృధా అవుతుంది. సరే మీ ఇష్టం అంటూ తన ఛలాన్ తీసుకోవడానికి ఫీజు కడుతూ డబ్బు లెక్క పెడుతున్నాడు. అతని వద్ద అదనంగా డబ్బు ఉండటం చూసిన అమ్మాయి.
ఏమండీ… ఏమండీ ప్లీజ్ నా ఫీజుకు వంద రూపాయలు తక్కువ అయ్యాయి. అందుకే పక్కకు వచ్చి నిలబడ్డాను. మీరు వంద రూపాయలు ఇస్తే తర్వాత మీ డబ్బు మీకు తిరిగి ఇస్తానంటూ వేడుకుండి అమ్మాయి.
ముక్కు మొఖం తెలియని అమ్మాయి, పైగా ఇక్కడే అయిదు నిమిషాల కింద పరిచయం, దీనికే వంద రూపాయలు అడుగుతుంది, ఇవ్వాలా వద్దా అనుకుంటూ తన ఫీజుకు అవసరమైనా డబ్బు కౌంటర్‌లో ఇచ్చాడు.
అయ్యో నా ఒక అకడమిక్ సంవత్సరం వేస్టు అవుతుంది ప్లీజ్ తప్పక తిరిగి ఇస్తాననడంతో.. పోతే పోయింది వంద రూపాయలే కదా.. మళ్లీకలిస్తే తప్పక తీసుకోవచ్చని వంద రూపాయలు ఆమెకు ఇవ్వడంతో వెంటనే క్యూలోకి వచ్చి కౌంటర్‌లో చెల్లించింది ఆ అమ్మాయి.

చాలా థాక్సండీ… సమయానికి మీరు సర్దుబాటు చేసినందున ఫీజుకట్టగలిగానంటూ పదేపదే థాక్స్ చెబుతున్న ఆ అమ్మాయితో..
ఇంతకు మీ పేరు కూడా చెప్పలేదు. నా పేరు నగేష్ అన్నాడు.. నాపేరు నళిని అండి.. అంబర్‌పేటలో బంధువుల ఇంట్లో ఉంటున్నాను. ఫీజుకు ఎంత అవసరమో అంతే డబ్బు తెచ్చుకోవడం వల్ల ఈ ఇబ్బంది వచ్చిపడింది. మీరు ఏమి అనుకోలేదుగా.డబ్బు తప్పక తిరిగి ఇస్తాను. ఎంట్రన్స్ రిజల్ట్సు వచ్చిన రోజున మీరు ఇక్కడికి వస్తారుగా ఆ రోజు మీ కోసం వెయిట్ చేసి వాపస్ చేస్తాను సరేనా.. అంటూ నళిని చెప్పింది.

ఆ రోజు ఎలా కలిసేది మీరు ఎప్పుడు వస్తారో నేను అసలు వస్తానో రానో తెలియదు. మాఫ్రండ్స్ ఉన్నారు క్యాంపస్‌లో వాళ్లే నాకు చూసి చెబుతారు.

అలాగా. మరి ఎలా మీ బాకీ తీర్చడం. అంటూ సందేహంలో పడింది అమ్మాయి… ఇందులో అంత ఇబ్బంది ఏముంది. నా ఫోన్ నెంబర్ చెబుతాను. ఆ వంద రూపాయలు నా నంబర్‌కు రిఛార్జీ చేయించు సరిపోతుందని చెప్పాడు.
అమ్మయ్యా… మంచి ఆలోచన. అంబర్‌పేటకు వెళ్లగానే రీఛార్జీ చేస్తాను. అంటూ తన సెల్‌ఫోన్‌లో నెంబర్‌ను ఫీడు చేసుకొని మిస్స్‌డ్ కాల్ ఇచ్చింది. ఇద్దరు ఒకరి నెంబర్ మరొకరు పేర్లను ఫీడ్ చేసుకున్నారు. మీ ఫోన్ రిచార్జీ కాగానే మెసెజ్ చూసి రిప్లయి ఇవ్వండి చాలు. వెళ్లిపోతున్న నళినీ తో ఇక్కడ క్యాంటిన్‌లో టీ బాగుంటుంది వస్తారా అని ఆఫర్‌చేశారు.
వద్దు లెండి. మనకు పిజి సీటు లభిస్తే ఆ రోజు కలసి కూల్‌డ్రింక్స్ తాగుదాం. నేనే డబ్బులిస్తానంటూ నళిని బస్సుస్టాండ్‌కు వెళ్లబోతుండగా.. ఇప్పుడు మీ వద్ద డబ్బు తక్కువగా ఉందని, బస్సు ఛార్జీకి సరిపోతుందని నాకు అర్థం అయింది. చాయ్‌కేమిటండి నేను పే చేస్తాను రండి. ఇంత సేపు మాట్లాడుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ అయినట్లే కదా అంటూ బలవంత పెట్టడంతో సరే నని ఇద్దరు క్యాంటీన్‌కు వచ్చి టీ తాగి ఎవరికి వారు వెళ్లిపోయారు.

రెండు రోజులైనా సెల్‌ఫోన్ రిచార్జీ చేయకపోవడంతో నళినీ మీద ఆగ్రహం వచ్చింది. తన ఫోన్‌లో బ్యాలెన్స్ అయిపోతున్నది. ఆ అమ్మాయి చేస్తుందా తాను చేసుకోవాలా అని సందిగ్దంలో ఉండగా నళిని నుంచి మెసేజీ.. కొంత ఆలస్యం అయింది.. ఇప్పుడే చేస్తున్నా అని వచ్చిన మెసేజీని చూసి నవ్వుకున్నాడు నాగేశ్వర రావు. అనవసరంగా అమ్మాయి గురించి తప్పుగా ఆలోచించాననుకున్నాడు. ఇంతలో వంద రూపాయల రీఛార్జీ అయినట్లుగా మెసేజీ వచ్చింది ఫోన్‌కు. వెంటనే ఆమెకు ఫోన్ చేయాలనిపించినా బాగుండదని ఊరుకున్నాడు. మర్నాడు నళిని గుర్తుకు రావడంతో ఫోన్ చేద్దాం, మంచిగా మాట్లాడితే సరి లేకుంటే మళ్లీ చేయవద్దు అనుకుంటూ రింగ్ ఇచ్చాడు. నంబర్ అప్పటికే ఫీడ్ అయి ఉన్నందున నగేష్‌తో మాట్లాడితే పోయిదేమీ లేదుగా. సీటు వస్తే క్లాస్‌మేట్ అవుతాడు అని ఫోన్ ఆన్‌చేసి హలో అంది నళిని.

బాగా చదువుతున్నారా.. ఎంట్రన్స్‌కు నోట్స్ ఉన్నాయా.. ఉస్మానియా లైబ్రరీ చాలా పెద్దది. అందులో అనేక పుస్తకాలు ఉంటాయి. మనం నోట్స్ రాసుకోవచ్చు. మీకు వీలుపడితే అప్పుడప్పుడు వెళ్లండి. మన సబ్జెక్టుకు సంబంధించిన సీనియర్లు ఎవరైనా యూనివర్సిటీలో కనిపిస్తే పరిచయం పెంచుకొని వారి నుంచి కూడా సలహాలు తీసుకోవచ్చు. అంటూ నళినికి ఉచిత సలహాలిచ్చాడు నాగేశ్వర రావు.

బాగుందండీ మీ సలహా. నాకు అక్కడ ఎవరూ తెలియదు. మీరు వెళ్తుంటారా. ఏ సమయం ఉంటారో చెబితే ఆర్ట్స్ కాలేజీ బస్ స్టాప్ దగ్గర వేచి ఉంటా. ఇద్దరం కలిసి లైబ్రరీకి వెళ్లవచ్చు ఏమంటారు అని ప్రశ్నించింది. నళిని
అయితే రేపు ఉదయం పదకొండున్నర ప్రాంతంలో నేను వస్తాను మీరు రండి. ఇంట్లోనే తిని వస్తే ఎక్కువ సమయం లైబ్రరీలో కూర్చోవచ్చిని చెప్పాడు.

అలాగే చేద్దాం. సెల్‌ఫోన్స్ చేతిలో ఉన్నాయి కాబట్టి కలుసుకోవడం ఈజీ కదా.

సరే రేపు కలుద్దాం. ఎలాగైనా పిజీ సీటును కొట్టాలి మనం అంటూ ఇద్దరూ మాట్లాడుకున్నారు.

మర్నాడు చెప్పిన సమయానికి ఇద్దరు కలుసుకొని ఎత్తు మీద ఉన్న యూనివర్సిటీ లైబ్రరీ కి కొంత ఆయాసపడుతూ నడుచుకుంటూ వెళ్లారు. నిజాం కాలంలో నిర్మించిన ఆర్ట్ కాలేజీ భవనం ఇప్పటికీ కాంతునీలుతూ ఉంది. చిన్న చిన్న రిపేర్లు అప్పుడప్పుడు జరుగుతున్నా కాలేజీ వైభవం ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. యూనివర్సిటీకే తలమానికంగా ఉన్న ఈ భవనం నుంచి కొంత ఎత్తులో లైబ్రరీ ఉంది. దేశ, విదేశ రచయితల పుస్తకాలు ఇందులో ఉన్నాయి.

నడక అలవాటు తగ్గినట్లుంది. అందుకే రొప్పుతున్నారని నళిని ప్రశ్నించడంతో ఇంటివద్ద ఎక్కువగా బైకుతో తిరగడం వల్ల నడవాల్సిన అవసరం లేకుండా పోయింది.అక్కడ నుంచి బైకు తెచ్చుకోవడం కష్టం కాబట్టి నగరంలో సిటీ బస్సులపై ఆధారపడాల్సి వస్తున్నది. ఇక నడక కూడా అలవాటు చేసుకోవాలి.పైగా ఆరోగ్యానికి మంచిదని నవ్వాడు నగేష్ .
లైబ్రరిలో పక్కనే కూర్చొని నోట్స్ రాసుకుంటూ కొంత క్లోజ్ అయ్యారిద్దరు. అప్పుడప్పుడు క్యాంటిన్‌కు వచ్చి కూల్‌డ్రింక్స్ తాగుతున్నారు. ఈ పరిచయం కాస్తా స్నేహం నుంచి ఇంకా ముందుకు పోతున్నట్లుగా తోచింది ఇద్దరికీ. కానీ ముందుగా సీటు తెచ్చుకోవడంపై దృష్టి సారించారు. ఎంట్రన్స్ రిజల్ట్సు వచ్చాయి. ఆరోజు ఇద్దరు ఫోన్ చేసుకొని యూనివర్సిటీకి వచ్చి జాబితాను పై నుంచి కిందివరకు చూసినా ఇద్దరి పేర్లు కనిపించలేదు. ఒకరికొకరు సానుబూతి చెప్పుకుంటూ విడిపోయారు. కనీసం టీ కూడా తాగలేదు ఆ రోజు.

నళినీకి ఉద్యోగం వచ్చింది. నగర సమీపంలోని స్కూళ్లో అపాయింట్‌మెంట్. ఆనందంగా ఫోన్ చేసింది నగేష్ కు. ఆ శుభ సమయంలోనే తన ప్రేమను వ్యక్తం చేస్తూ అతని అభిప్రాయాన్ని అడిగింది. తానే ప్రపోజ్ చేద్దామనుకున్నాడట. కానీ ఉద్యోగం సద్యోగం లేదు.. ప్రేమ గీమా అంటే ఏం బాగుంటుందని ఆగాడట. తనకు ఉద్యోగం వచ్చే వరకు ఆగితే పెళ్లి చేసుకుందామన్నాడు. సరే అంటే సరే అనుకున్నారు. తర్వాత రెండేళ్లు గడిచింది. గ్రూప్స్ పరీక్ష రాసినా రిజల్ట్సు రాలేదు. ఏమి చేద్దామంటూ మళ్లీ మాట్లాడుకున్నారు. ఉద్యోగం లేకపోతే మా తల్లిదండ్రులు ఒప్పుకోరని చెప్పింది. అంటూ తన కథ వివరించాడు నగేష్ తర్వాత ఏమైంది మరి అన్నాడు విజయ్.

మీ వద్ద పిఎగా జాయిన్ కావడం పెళ్లికి ఆమె తల్లిదండ్రులను ఒప్పించడం వేగంగా జరిగి పోయింది. ఇద్దరు ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి రెండు కుటుంబాల వారు కూడా కులం గురించి పట్టించుకోకుండా మా పెళ్లి జరిపించారు.

అలాగా..అంతా సజావుగానే సాగింది కదా. ఇప్పుడేమి సమస్యలు.

నగరంలోనే కాపురం పెట్టాం. ప్రతిరోజు ఆమెను స్కూల్ దగ్గర దింపి మీ వద్దకు రావాలి. తిరిగి సాయంత్రం తీసుకు రావాలి. వంట, పనుల్లో సహాయంచేయాలి. నాకంటే ఆమె సంపాధన ఎక్కువ నేనే కొంత సర్దుబాటు చేసుకుంటున్నా సార్. అందుకే మీ వద్దకు ఆలస్యంగా వస్తున్నా..తొందరగా వెళ్లిపోతున్నా. మీ వద్ద ఆలస్యం అయిన రోజుల్లో ముందుగా చెబితే ఆమె బస్సులో వస్తుంది అంటూ తన సాధకబాధకాలను వివరించాడు పిఎ.

పీత కష్టాలు పీతవి అనుకుంటూ టైం చూసుకున్నాడు, విజయ్.లంచ్ టైం కావస్తున్నది. ముఖ్యమంత్రి బంగ్లాకు వెళ్లాలని లేచాడు.. ముఖ్యమంత్రి సతీమణి తనను ఎంతో అప్యాయంగా చూసుకుంటుందని ఆమెలో తన తల్లిని చూసుకుంటున్నాడు విజయ్. కానీ సిఎం వైఖరియే తనకు అర్థం కావడంలేదనుకున్నాడు.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-17)

Leave A Reply

Your email address will not be published.