విజయుడు (ధారావాహిక నవల పార్ట్-21)

పిల్లలు, పిల్లలు అంటూ కలవరించే భార్యను ఎలా ఓదార్చాలో తెలియడం లేదు ముఖ్యమంత్రికి. పైగా విజయ్..తన బంగ్లాలోనా.. ఒకే ఇంట్లో తామిద్దరం, ఎలా ? ఊహించలేకపోతున్నాడు. జానకి రామయ్య కలవరానికి గురువుతున్నాడు…
ఏమండి మాట్లాడరేం. నేను ఏమైనా కోరరాని కోరిక కోరానా. ఆ అబ్బాయి, మీతో కూడా ఎంతో చనువుగా ఉంటున్నాడు.. మీరంటే ఎంతో ప్రేమ అభిమానం కూడా ఉన్నాయి వాడిలో.. మన తర్వాత ఈ సంపాధనంతా ఎవరి కోసమండీ, వాని తల్లిదడ్రులు చనిపోయిన తర్వాత కదూ, వాడు మనకు పరిచయం. అప్పుడప్పుడు వస్తూ మనతో బాగా కలిసిపోయాడు. మరో చిన్న పిల్లవాన్ని దత్తత తీసుకుంటే ఈ వయస్సులో నేను పెంచలేను కదా. అందుకే అలా అడిగాను. ఎందుకో విజయ్ మన పిల్లవాడిలా అనిపిస్తున్నాడండీ. ఏమంటారని సిఎంను కదుపుతూ ప్రశ్నించింది.
ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని సిఎం ఎప్పుడూ ఊహించలేదు. ఎందరి సమస్యలో పరిష్కరించిన తనకు ఈ సమస్య పెనుభూతంలా కనిపించింది. కిం కర్తవ్యం… ఆమెను ఎలా ఓదార్చాలి. దత్తత విషయం ఎలా దాటి వేయాలో ఆయన తర్జనభర్జన పడుతున్నాడు. ఆమె మనస్సు కష్టపెట్టకుండా వ్యవహరించాలి. లేకుంటే ఈ వయస్సులో ఇద్దరి మధ్య దూరం పెరిగితే,ఊహూ తట్టుకోలేను. ఆమె మనస్సుకు గాయం చేయకుండా జాగ్రత్తగా ఒప్పించాలని తలపోశాడు.
లేదు, అన్నపూర్ణ. నాకూ విజయ్ పట్ల అభిమానం ఉందని నీకు తెలుసు. సీనియర్ మంత్రులకంటే ఆతనికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నది నీవు గమనించే ఉంటావు. వాడు మనతోనే ఉంటే బాగుంటుంది కానీ, రాజకీయంగా పలు సమస్యలు వస్తాయి పూర్ణ. అర్థం చేసుకో. ఇతర నేతలకు అసూయ పెరుగుతుంది. చిలువలు పలువలు చేసి అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తారు. అప్పుడు ఈ పదవికే చేటు వస్తుంది. ఈ దశలో నేను పదవిని కోల్పోవడం అవసరం అంటావా. చెప్పు అని భార్యను అనునయించేందుకు ప్రయత్నించాడు.
ఎవరూ లేని ఈ పెద్ద బంగ్లాలో నేను ఒక్కదాన్నే ఏకాకిగా ఉంటున్నానండీ. మీరు రాజకీయాలంటూ ఎప్పుడో కాని ఇంటికి రావడం లేదు. మీటింగ్స్ అంటూ బయటే ఉంటారు. విజయ్ నాతోపాటు ఉంటాడు. వాన్ని ఒప్పించి పెళ్లి చేద్దాం. కోడలు వస్తుంది. ఈ కాలంలో ఏముంది ఏడాది తిరగకముందే పాపో,బాబో వస్తారు. వారితో నాకు మంచి కాలక్షేపం. మీరూ సంతోషిస్తారు కాదూ..ఆలోచించండి, ఎందుకో నాకు ఈ ఆలోచన వచ్చింది కాదనకండి అని ప్రాధేయపడింది. అడకత్తరలో పోకచెక్కలా ఉంది సిఎం పరిస్థితి. మరో పెగ్గు అయిపోయింది తప్ప ఈ సమస్య నుంచి బయటపడే మార్గం లభించలేదు ఆయనకు. ఇందులో మీరు అంతగా ఆలోచించేది ఏముందండీ. రాజకీయాలకు మన కుటుంబ సమస్యకు ఎందుకు లింక్ చేస్తున్నారు. మనకు పిల్లలు లేరని అందరికీ తెలుసు. మీ అధిష్ఠానానికి తెలుసు. పైగా విజయ్ నీతిమంతుడు. సత్‌ప్రవర్తన కలిగిన వాడు. మనం అంటే ఎంతో గౌరవం ఉంది. వాడు మనలను వృద్ధ్యాప్యంలో మంచిగా చూసుకుంటాడండి. మరేమి ఆలోచించవద్దు. ఒప్పుకోండి అంటూ రెండు చేతులు జోడించి, వేడుకుంది అన్నపూర్ణమ్మ.
చూడు, అన్నపూర్ణ… దత్తత అంటే ఎన్నో చేసుకోవాల్సి ఉంటుంది మనం.పైగా ఎవరైనా చిన్న పిల్లలను పెంచుకుంటారు. కానీ పెరిగి పెద్ద అయి, అన్ని తెలిసిన వాన్ని పైగా పెళ్లీడుకు వచ్చిన వాడు, ఇలాంటి స్థితిలో దత్తత తీసుకున్నట్లుగా ఎక్కడ వినలేదు కూడా. బాగా ఆలోచించు పూర్ణ. పైగా రాజకీయాల్లో ఉన్న వాడు విజయ్.. వాన్ని దత్తత తీసుకుంటే నా రాజకీయ వారసునిగా అతన్ని తీసుకువస్తున్నాని రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మా పార్టీలో పెద్ద చర్చయే జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి నాకు మంచిది కాదు. రాజకీయాల్లో ఇదిగో పులి అంటే అదో తోక అంటూ ఎవరికి తోచిన విమర్శలు వారు చేస్తుంటారు. అందుకే వద్దంటున్నా అంటూ మరోసారి చెబుతూ నాకు విజయ్ అంటే అభిమానం లేదనుకుంటున్నావా? నీకు తెలుసు కూడా కానీ ఇది మాత్రం మరోసారి ప్రస్తావించకు అంటూ భార్యను దాదాపు వేడుకుంటున్నాడు.
లేదండీ.. మీరు అనవసరంగా భయపడుతున్నారు. మన కుటుంబ విషయం ఇది. రాజకీయాలకు లింక్ పెట్టకండి. మన అవసరం కూడా.. కోట్ల రూపాయలు వెనుకేశారు. మన తర్వాత ఎవరికండీ ఇదంతా… రాజకీయ వారసునికిగా విజయ్‌కు ఉన్న అనర్హత ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు. అన్ని విధాలుగా యోగ్యుడు కూడా..మీ అధిష్ఠానం కూడా అన్యథా అలోచించే అవకాశం లేదు విజయ్ విషయంలో… రాష్ట్ర నేతలంటారా, మీరు దిగిపోతే గద్దెనెక్కడానికి అందరూ బరిలో ఉంటారు. వారి గురించి పట్టించుకోవద్దు, అంటూ అన్నపూర్ణ తన వాదనను కొనసాగించింది.
భార్య మనస్సు కష్టపెట్టడం సిఎంకు ఇష్టం లేదు కానీ విజయ్‌ను దత్తత తీసుకోవడానికి కూడా అదే స్థాయిలో అయిష్టత ఉంది. కారణాలు చెప్పలేకపోతున్నాడు. రాజకీయ పరిస్థితులు వేరని ఆయన ఉద్ధేశ్యం. రక్తకన్నీర్ నాగభూషణం తన నాటకంలో చెప్పినట్లుగా ప్రతి రాజకీయ నేతలు ఇతర అన్ని అంశాలకంటే పదవినే కీలకంగా భావిస్తుంటారు. ఇందుకు సిఎం కూడా వేరుకాదు. తనకు విజయ్ పోటీ వస్తాడని, రాజకీయంగా తన పదవిని కొట్టేస్తాడనే భయం ఇప్పటికే ఆయన మనస్సులో ఉన్నట్లుంది. ప్రత్యర్థిగా ఒకరిని భావిస్తే వాని ఎదుగుదలకు ఎలా సహకరిస్తాడు పైగా వాని భవిష్యత్తుకు అడ్డుగోడలు కట్టాలనే ఏ పాలిటీషియన్ అయినా అధికంగానే ప్రయత్నిస్తాడు. పైగా తన ప్రమేయం లేకుండానే విజయ్ రాష్ర్ట ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని వారి ఆశాజ్యోతిగా వెలుగొందుతున్నాడు. ఇక అధిష్ఠానం దృష్టిలోనూ విజయ్ నూటికి నూరు శాతం మార్కులు కొట్టేశాడు. ఇలాంటి పరిస్థితిలో విజయ్‌ను దత్తత తీసుకునే ప్రసక్తి వద్దు, భార్యను మరో విధంగా సంతృప్తి పర్చాలని నిర్ణయించుకొని… పూర్ణ అంటూ ఆమెను మరో గదిలోకి తీసుకువెళ్లాడు సిఎం.
బీరువాలు వరుసగా ఓపెన్ చేసి చూడు మన సంపద ఎంత ఉందో.. వజ్రాలు, బంగారు బిస్కట్లు, నగదు మనం లెక్కించలేనంతగా మూలుగుతున్నది. ఇదే అనుకుంటున్నావా.. ఇంకా భూముల వందల ఎకరాలు. చూడు ఈ పట్టా కాగితాలు. ఇక విదేశాల్లో కూడా మనకు అకౌంట్స్ ఉన్నాయి. స్విస్ బ్యాంకు అంటూ పత్రికల్లో వార్తలు వస్తుంటాయి కాదూ.. బ్లాక్ మనీ మన దేశంలో అధికంగా దాచి పెట్టుకునే అవకాశాలు లేనందున నాలాంటి నేతలు అక్కడ డబ్బు పెడతారు. ఈ దఫా అసెంబ్లీ సమావేశాలు రాగానే మనిద్దరం విదేశాలు తిరిగి వద్దాం. సరేనా అంటూ ఆమె మనస్సును పక్కకు తప్పించేందుకు విఫల ప్రయత్నం చేశాడు సిఎం.
ఇంత సంపదను అదేపనిగా చూపినప్పటికీ ఆమెలో పెద్దగా ఉత్సాహం కనిపించలేదు. నిర్లిప్తంగానే భర్తవెంట నడిచి, వాటిని చూసిందే కానీ వజాల్రు, బంగారం, ఇతర పత్రాలను కూడా ఆమె కనీసం తాకలేదు.
ఎందుకండీ ఇవన్నీ .. మనిద్దరం బతకడానికి ఎంత కావాలి మనకు. మీరు ఎలా సంపాధించారని అడగటం లేదు నేను. ఈ కోట్ల సంపద మనకు పిల్లలు లేని లోటును తీరుస్తుందంటావా? అంటూ సూటిగా ప్రశ్నించింది.
నిరుత్తరుడయ్యాడు సిఎం. ఏం పాలుపోవడం లేదు. ఇంటికి ముందుగా వచ్చి, కొంత అధికంగానే తాగినా..ఆమె మాటలతో ఎప్పుడో దిగిపోయింది మత్తు. ఎలా ఆమెకు నచ్చచెప్పడమంటూ తనలో తానే తర్జనభర్జన పడుతున్నాడు.
పూర్ణ, అయితే ఓ పనిచేద్దాం. విజయ్‌కు మనమే దగ్గరుండి, వాని తల్లిదండ్రులుగా పెళ్లి చేద్దాం. పెళ్లి తర్వాత కోడలిని ఒప్పించి, వారిని మన బంగ్లాలో ఉండేలా ఒప్పిద్దాం. వాని పిల్లలు మన ఇంట్లోనే పెరుగుతారు. నీకు ఆ అమ్మాయి చేదోడు వాదోడుగా ఉంటుంది. మన తదనంతరం వారికే ఈ సంపధ వస్తుందని ఆశిస్తారు కూడా. విజయ్ పిల్లా పాపలతో సంతోషంగా మన దగ్గరే ఉంటే చాలు కదా,కొడుకుగా దత్తతే అవసరం ఏముంటుందని,భార్య ఇక సంతృప్తిపడుతుందని ఆమె వైపు చూశాడు సిఎం.
ఈ ప్రతిపాదనకు కూడా ఆమెలో మార్పులేదు. ఎలాంటి ఆసక్తి చూపలేదు. దీంతో ఆవేశానికి గురైన సిఎం, అయితే మన ఆస్తిపాస్తున్ని విజయ్‌కు చెందేలా వెంటనే వీలునామా రాస్తాను. మన తదనంతరం వాడికే చెందుతాయి. రేపే లాయర్‌ను పిలిపించి ఈ పని పూర్తి చేస్తాను.సరేనా అంటూ భార్యకు చెప్పడంతో ఆమె కొంత మెత్తపడ్డారు.
సరే మీ ఇష్టం అలాగే కానీయండి. కానీ రేపు తప్పనిసరిగా ఈ పనిచేస్తారుగా అంటూ మరోసారి ముఖ్యమంత్రి వైపు పట్టుదలగా చూసింది.
ఇక తప్పేలా లేదనుకున్న సిఎం, నీవు సంతోషంగా ఉండటం కంటే నాకు ఏమీ ముఖ్యం కాదు. ఇక మనస్సులో దత్తత మాట మర్చిపోయి, సంతృప్తిగా ఉండాలి. అయితే నీవు నాకో మాట ఇవ్వాలని మరి.
చెప్పండి, నా కోసం మీరు వీలునామా వరకు వచ్చారు కదా, తప్పకుండా .. ఏమిటో చెప్పండి.
వీలునామా విషయం మూడో వ్యక్తికి తెలయవద్దు. నీకు, నాకు, లాయర్‌కు తప్ప.. సరేనా..
ఇందులో రహస్యం ఎందుకండీ, విజయ్ అయినా చెబితే బాగుంటుందేమో అంది,
వద్దు, వానికి తెలిస్తే, ఆస్తికోసం వాన్ని మన ఇంట్లో ఉండటానికి ఒత్తిడి తెస్తున్నామనుకుంటాడు. వాడసలే ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి. పెళ్లి చేసిన తర్వాత మన ఇంట్లో ఉండటానికి ఒప్పు కోకపోతే నీకు బాధ కలుగుతుంది. అందుకే ఎవరికీ తెలియరాదని చెబుతున్నా..
సరేలెండి..మీరు ఎలా అంటే అలాగే..
నిట్టూర్చాడు సిఎం. ఏమిటిది అన్నపూర్ణ ఎందుకు ఇలాంటి కోరిక కోరింది. పిల్లలు లేరనే బాధ ఆయనకు కూడా ఉంది. కానీ విజయ్ విషయంలో భార్య ఇంతగా పట్టుపడుతుందని ఊహించలేకపోయాడు. మాట ఇచ్చాడు కాబట్టి వీలునామా రాసి లాకర్‌లో పెడదాం. ఎవరికి తెలియదు కాబట్టి నష్టం లేదు.పైగా వీలునామాలు వెంటనే ఎవరూ చూసే అవకాశం ఉండదు…నా తదనంతరమే కదా అది అమలులోకి వచ్చేదంటూ ఆలోచిస్తూ పడుకున్న భర్తపై చేయి వేసి, ఇక పడుకోండి ఇప్పటికే ఆలస్యమైందని అంటూ అన్నపూర్ణ కూడా నిద్రకు ఉపక్రమించింది.
(సశేషం)