విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-25)

ఆరు పదులుదాటిన వయస్సులో మళ్లీ పెళ్లి చేసుకున్న ఆ ముఖ్యమంత్రి హయాలో కూడా నీవు తెచ్చిన ఫైల్‌ లాంటి సంఘటనే జరిగింది. ఆయన పార్టీలో అసమ్మతి ప్రారంభానికి నాంధి అదే. మద్య పాన నిషేధానికి కట్టుబడి ఉన్నానని గొప్పగా చెప్పిన ఈ సిఎం, తాను విదేశాలకు వెళ్తున్న సమయంలో ఇలాగే మద్యం ఉత్పత్తికి లైసెన్స్‌లు ఇస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. ఆయన దేశం విడిచిపోగానే ఇక్కడ జిఒ వచ్చింది. ఇప్పుడు నీవు ఫైల్‌ తెచ్చినట్లుగానే మా సీనియర్‌ వద్దకు
జిఒ కాపీ వచ్చింది. ఆయన పనిచేస్తున్న పత్రిక ఆ పార్టీకి కొమ్ము కాస్తుందనే పేరుంది. దీంతో ఇంత ముఖ్యమైన వార్తను వదులుకోలేక పోయాడు. తన చీఫ్‌ను ఇదే విషయం అడిగితే తన బాధ్యతలేదు, నీవే పత్రికాధిపతిని అడుగు అని ఉచిత సలహా ఇచ్చాడు. ఆఫీసులో ఉంటే కలుద్దామని ఆయన పిఎకు ఇంటర్‌కంలో అడగగా ఆయన అప్పటికే ఇంటికి వెళ్లిపోయాడన్నాడు. ఎలా అని మథన పడుతూ ఆయన ఇంటికే ఫోన్‌ చేశాడట. ఓహో మంచి వార్త తప్ప కుండా రాయి. నేను డెస్కు వాళ్లకు చెబుతా, వారే కదా పేజీల్లో పెట్టేది అంటూ ప్రోత్సహించాడని, మర్నాడు పేపర్‌లో అదే కీలక వార్త కావడంతో తర్వాత దాని
ప్రభావం రాజకీయాల్లో ఎలా మారుమోగిందో మా సీనియర్‌ కళ్లకు కట్టినట్లుగా వివరించాడు. కొత్త పెళ్లాం ఒత్తిడితో ఆయన ఈ సంతకం చేశారనే అపవాదు కూడా ప్రచారంలోకి వచ్చింది. ప్రతిపక్షాలకు ఇది పెద్ద అస్త్రం అవుతుంది వెంటనే జిఒ ఉపసంహరించుకోవాల్సిందేనని, మంత్రిగా ఉన్న ఆయన అల్లుడే తన ఛాంబర్ లో ఇతర మంత్రులతో మీటింగ్‌ నిర్వహించారు. ఇదే అదనుగా ఎంఎల్‌ఎలను కూడగట్టాడు. దుష్ట శక్తి వల్లనే పార్టీకి ఈ దుస్థితి అని ఆమెతో కలిసి ఉండటానికి వీలు లేదనే స్థాయిలో ఆనాడు ప్రచారం చేశారు. ఆ ముఖ్యమంత్రి రాష్ట్రానికి తిరిగి వచ్చే సమయానికి తన గ్రూపును పెంచుకొని పార్టీ శాసనసభ్యులలో తనకే మెజారిటీ ఉందనే వరకు కుతంత్రాలు పన్నారు. ఎలాగైతేనేమి వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కాడు. ఇదంతా కళ్లకు కట్టినట్లుగా ఆ సీనియర్‌ వివరించారన్నారు.

పత్రికా వార్తలు బలం తెలిసినందున నేను మీ దగ్గరకు వచ్చాను సార్‌. ఏదో ఒక పత్రికకు ఇస్తే వారు పబ్లిష్‌ చేస్తారో లేదో. మీరు మీడియా సమావేంలో ఈ విషయం చెబితే అన్ని పత్రికల్లో వస్తుంది. పైగా ఎలక్ట్రానిక్‌ మీడియా కూడా బాగా కవర్‌ చేస్తుంది కదా సార్‌.

సరే. నేను కూడా కొంత విచారించి తొందరలోనే నిర్ణయం తీసుకుంటా.

మీరైతేనే ఈ విషయంలో కచ్ఛితంగా ఉంటారని నాకు తెలుసు. సరే సార్‌ వెళ్లి వస్తా అంటూ ఆ వ్యక్తి ,కనీసం తన పేరు కూడా చెప్పకుండా వెళ్లిపోయాడు.

అయితే పిఎ వద్ద అతని పేరు ఉంటుందిలే అని విజయ్‌ భావించాడు. ఆయన వెళ్లిన తర్వాత పిఎను అడిగితే లేదు సర్‌, ఏదో ల్యాండ్‌ నెంబర్‌ నుంచి కాల్‌ వచ్చేది. తర్వాత ఆయన కోసం అడిగితే మేం ఫోన్‌ చేయలేదని చెప్పే వాళ్లు.

ఆకాశరామన్న అన్న మాట. తన పేరు బయటపడితే తనకు ప్రమాదమని పబ్లిక్‌ ఇంట్రస్టుతో సమాచారం ఇచ్చాడని అనుకున్నాడు విజయ్‌. మంచి సమాచారమే. రేపు సెక్రటేరియట్‌లో ఆబ్కారీ శాఖలో మరిన్ని వివరాలు రాబడదాం. తర్వాతనే మీడియాకు అంటూ మద్యం ఫైల్‌ చూస్తూ ఉండిపోయాడు.

ఇదేమిటి, మరి కొంత కాలమైనా మీడియాకు దూరంగా ఉండాలని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయవద్దని అనుకున్నా, ఈ ఫైల్‌ చూస్తే ఎలా మౌనంగా ఉండిపోగలను. ఇది పత్రికల్లో వస్తే ముఖ్యమంత్రి కూడా బాధపడుతాడేమో. ఆయనకు తెలియకుండా మంత్రి స్వంతంగా నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. లోటుపాట్లు తెలిస్తే భయపడకుండా వ్యవహరించాలని ముఖ్యమంత్రి స్వయంగా నాకు ఇటీవలే చెప్పాడు కదా. అనవసరంగా తాను ఎక్కువగా
ఆలోచిస్తున్నాడని అనుకున్నాడు విజయ్‌. తన స్వభావానికి విరుద్ధంగా మౌనంగా ఉండలేకపోయాడు. సచివాలయానికి వెళ్లి ఎక్సయిజ్‌ శాఖ కార్యదర్శిని కాకుండా కింది స్థాయిలో తనకు తెలిసిన అధికారులను సంప్రదించాడు. సెక్రటరీని సంప్రదిస్తే సమాచారం వెంటనే మంత్రికి, తద్వారా సిఎంకు వెళ్తుందని విజయ్‌కు తెలుసు. కాబట్టి ఇతరత్రా తనకు తెలిసిన వారితో వివరాలు తీసుకొని అంతా నిర్థారించుకున్నాడు. పెద్దమొత్తమే చేతులు మారినందున ఈ జిఒ వచ్చిందని,
అయితే అది ఎంత అనేది చెప్పలేమని వారు విజయ్‌కు చెప్పారు.

అధికార పార్టీలో ఉన్న శాసనసభ్యుడు వెలుగులోకి తెచ్చిన భారీ కుంభకోణం ఇది అంటూ దాదాపు అన్ని పత్రికలు ఎక్సయిజ్‌ బాగోతాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. ఎలక్ట్రానిక్‌ మీడియాలో ముందే రావడంతో ఎక్సయిజ్‌ మంత్రి చిటపట లాడుతూ ముఖ్యమంత్రి జానకి రామయ్య ఛాంబర్‌కు వెళ్లాడు.

ఇదేమిటండి, ఆ విజయ్‌ నామీదపడ్డాడు. అంతా మీకు తెలుసు కదా, కంపెనీ వాళ్లు మిమ్ములను కలిస్తేనే కదా మీరు చెప్పిన తర్వాతనే ఫైల్‌ కదలింది.

నన్ను బలిపశువును చేస్తారా ఏమిటి? నాకు అన్నాయం జరిగితే నేను ఊరికే ఉండిపోను. అందరినీ బయటకు ఈడుస్తా అంటూ హుంకరించాడు.

చూద్దాం. రేపు పత్రికల్లో రాకుండా ప్రయత్నిద్దామంటే ఇప్పటికే అన్ని ఛానల్స్‌ ఊదరగొడుతున్నాయి. పత్రికాధిపతులకు మనం అంటే భయం ఉన్నా ఈ దశలో వాళ్ళను అడగలేం.

మరి ఎలాగండి. ప్రభుత్వానికి అప్రతిష్ఠ వస్తే మీకు వచ్చినట్లే కదా. ఏదో పరిష్కార మార్గం కనుగొనండి. లేకుంటే పార్టీ పరువు పోయి ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది మీకే.

ఇక్కడ ఏమి జరిగినా పర్వాలేదు. విపక్షాలను మ్యానేజీ చేయవచ్చు. నా భయం ఏమిటంటే అధిష్ఠాన వర్గం ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుందోనని, ఇప్పటికే ఈ విషయం ఢిల్లీ కి చేరుకొని ఉంటుంది. మన రాష్ట్రంనుంచి ఎక్కువ ఫ్యాక్స్‌లు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తుంటాయనే పేరు కూడా ఉంది. ఏ క్షణంలో అయినా నాకు ఫోన్‌ రావచ్చు. ఏమి చేసేది అంటూ సిఎం తలపట్టుకు కూర్చున్నాడు.

మీరే అలా ఢీలాపడితే నా పరిస్థితి ఏమిటండి ఏడుపు గొంతుతో అన్నాడు ఎక్సయిజ్‌ మంత్రి.

నీవేమో అందరినీ లాగుతాను అంటున్నావు. నేనున్నాగా.. నీ రాజకీయ భవిష్యత్తును కాపాడటానికి, నాకు ఎవరున్నారయా అంటూ ధీనంగా మాట్లాడిన సిఎంతో ఆవేశంలో ఏదో మాట్లాడినా..మీరు అన్యధా భావించకండి. మీ నిర్ణయం ఎలా ఉంటే అలా నడుచుకుంటా, కానీ నాకు సమస్యలు రాకుండా చూడండి. మీరే ముందుగా అధిష్ఠానంతో మాట్లాడితే బాగుంటుందేమో సార్‌ అని సూచించాడు.

అలా అయితే మనం తప్పు చేసినట్లుగా వాళ్లు అనుకుంటారు. వారు అడిగితే చూద్దాం. ఈ లోగా అధికారులతో మాట్లాడు. ఏదైనా వివరణతో పత్రికా ప్రకటన పంపడానికి వీలు అవుతుందో చూడాలి. వాడు జిఒ తో సహా ఇచ్చాడు. ఏమని సవరణ చేయగలమో అర్థం కావడం లేదు. చూద్దాం ఏమైతుందో అంటూ లోచనలో పడవికళ్లు మూసుకున్నాడు సిఎం.

మంత్రిమండలి నుంచి ఎక్సయిజ్‌ మంత్రిని భర్తరఫ్‌ చేయమనే లేక రాజీనామా చేయించమనో అధిష్ఠానం ఆదేశిస్తే ఓకే కానీ, నా రాజకీయ జీవితానికి మచ్చ పడకుండా ఎలా కాపాడు కోవాలనే యోచనకే సిఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. చూద్దాం హస్తిన నుంచి ఫోన్‌ వచ్చిన తర్వాత అనుకొని చూడు, జరిగిందేదో జరిగింది. పదవి,పరువు ఏదో ఒకటి అయినా కాపాడుకోవాలి మనం. రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు, నేడు పదవి పోయినా మళ్లీ మంచి పదవి మనకు రావచ్చు. నీవు నిశ్చింతగా ఉండు. లైసెన్స్‌లు రద్దు చేద్దాం, ఇదే ఢల్లీికి చెబుదాం, ముందు ఆ పనిలో ఉండు అంటూ ఎక్సయిజ్‌ మంత్రికి సూచన చేశాడు సిఎం.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ సెక్రటరీ, ఆబ్కారి శాఖ కమిషనర్‌, తన కార్యాలయ కార్యదర్శి, తదితరులు వచ్చారని చెప్పడంతో వారందరిని లోపలికి రమ్మని వారితో చర్చించి, ఈ నేపథ్యంలో ఏమి చర్య తీసుకుంటే సమంజసంగా ఉంటుందో చెప్పమన్నాడు.

జిఒ రద్దు చేస్తే మనం తప్పు ఒప్పుకున్నట్లుగా ఉంటుంది. ప్రస్తుతానికి అబెయన్స్‌ లో పెడదాం. ఒత్తిడి పెరిగితే రద్దు చేద్దాము, అంతా మన చేతులో పని కదా సార్‌ అంటూ ముఖ్యమంత్రి మెచ్చుకునేలా సలహా ఇచ్చారు వాళ్లు. సరే అంటూ తలూపి, రెవెన్యూ సెక్రటరీ వైపు చూస్తూ, మీ మంత్రితోనూ చర్చించండి, జిఒ నిలుపుదల ఉత్తర్వులు వెంటనే ఇవ్వండి. ఈ విషయం చెబుతూ మంత్రితో మీడియా సమావేశం పెట్టించండి. ఎండాకాలంలో బీర్ల కొరత ఉందని, విస్కీ, బ్రాండి మద్యం మన రాష్ట్రంలో తయారైనది సరిపోకపోక, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నందున ఈ జిఒ తేవాల్సిన అవసరం ఉందని చెప్పండి. కొత్త పరిశ్రమలు రావడం వల్ల ఉపాధి పెరిగి,నిరుద్యోగులకు మేలు జరుగుతుందనే సదుద్ధేశ్యంతోనే ఈ పని చేశామని, అన్ని మీడియాల్లోనూ వచ్చిన విశ్లేషణలు, ఇది మంచి పద్దతి కాదని మద్యపాన వ్యతిరేకులు కూడా అనడం వల్ల జిఒ వెంటనే నిలుపుదల చేస్తున్నామని వివరించాలని మంత్రికి చెప్పండని సిఎం సలహా ఇచ్చారు. సరే అంటూ అందరూ వెళ్లిపోయారు.

ఇంటలిజెన్స్‌ చీఫ్‌ కూడా మీ కోసం ఎదురు చూస్తున్నారని పిఎ చెప్పడంతో ఆగ్రహంగా రమ్మని చెప్పు అన్నాడు సిఎం.

ఆయన వచ్చి సల్యూట్‌ చేయకముందే కోపంగా చూసిన సిఎం, ఏమయ్యా, ఒక్క పని సక్రమంగా చేయవు. ఒక మనిషిని సక్రమ మార్గంలో పెట్టడానికి ఎంత సమయం కావాలి నీకు. ఇంత యంత్రాంగం ఉన్నా, నీకు నమ్మకస్తులు ఒక్కరు లేరా, ఒక్క బుల్లెట్‌తో అయ్యే పని అది. ఇంత జాప్యం చేస్తుండటంతో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో చూడు అంటూ మరింత ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏమి చెప్పాలో ఆ పోలీస్‌ అధికారికి పాలుపోలేదు. సర్‌,సర్‌ అంటూ నీళ్లు నములుతూనే నిలుచుని ఉన్నాడు.

ఎప్పుడు రాగానే చిరునవ్వుతో కూర్చోబెట్టి మాట్లాడే సిఎంకు ఇంత కోపం ఎందుకు వచ్చిందో తెలిసినా, ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఆయన మధనపడుతున్నాడు. నిజమే ఈ పని అప్పగించి కొన్ని నెలలు గడుస్తున్నది. ఆ పని అయిపోయిందని గతంలో సంతోషంగా చెబితే ఏమి కావాలి ప్రమోషనా, లేక పెద్ద గిఫ్టు కావాలా అంటూ ఎంతో మెచ్చుకున్న విషయం కూడా ఆయనకు గుర్తుకు వచ్చింది. ఏమి జరిగిందో కానీ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందో కూడా ఆ పోలీసు అధికారికే అంతుచిక్కలేదు. ఈ దఫా గట్టిగా ప్రయత్నించి మీకు ఇబ్బంది లేకుండా చూస్తాను సర్‌, నమ్మకస్తుడే ఉన్నాడు. వాడు తప్పక ఈ పనిని విజయవంతంగా పూర్తి చేస్తాడు. నాకు మరి కొద్దిసమయం ఇవ్వండి అని సెలవు తీసుకున్నాడు. రహస్యంగా జరగాల్సిన పని కాబట్టి చేసేది ఏమీ లేక ముఖ్యమంత్రి కూడా అప్పటికి మౌనం వహించక తప్పలేదు.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-24)

Leave A Reply

Your email address will not be published.