విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-26)

మీడియాలో విజయ్‌ పేరు మారుమ్రోగడంతో ముందుగా ఒక శాసనసభ్యుని నుంచి అభినంధన కాల్‌ రావడంతో విజయ్‌ కూడా ఆశ్చర్య పోయాడు. ప్రభుత్వ పనితీరుపై కాకుండా ఆ మంత్రి చేస్తున్న అనేక అక్రమాలపై ఆ యువ ఎంఎల్‌ఎ అనేక విషయాలు విజయ్‌తో పంచుకున్నారు. బ్రదర్‌ మీరు నాకు ముందునుంచి తెలుసు, ఒకసారి కలుద్దామా అంటూ ప్రతిపాదన చేశారు. తోటి ఎంఎల్‌ఎ కలుస్తానంటే వద్దని ఎలా చెప్పగలడు, పైగా ఇద్దరు ఒకే పార్టీ. అందుకే వెంటనే అంగీకరిస్తూ ఒకటి రెండు రోజుల్లో కాల్‌ చేయండి తప్పకుండా కలుద్దామని తెలిపాడు విజయ్‌.

తనకు ఫోన్‌ చేసిన ఎంఎల్‌ఎ గురించి కొంత వాకబ్‌ చేశాడు విజయ్‌. ఆయన పేరు రంజిత్‌,పోస్టు గ్రాడ్యుయేట్‌. బహుశ నేను చదువుకుంటున్నప్పుడు ఒకే హాస్టల్‌లో ఉన్నాడేమో. చూద్దాం కలిసినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. గ్రామీణ నియోజక వర్గం నుంచి వచ్చిన ఈ ఎంఎల్‌ఎ కూడా అభ్యుదయ భావాలు కలిగి, తన నియోజక వర్గం వరకే పరిమితమవుతూ వస్తున్నాడు. పార్టీలో క్రమశిక్షణగా ఉండాలని, అధికార పార్టీలో ఉన్నందున కొంత ఒదిగి ఉంట ఉన్నాడు. మంత్రులపై , ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విజయ్‌ వైఖరి ఏమిటో, ఆయన కూడా ఒకే పార్టీలో ఉండి ఎలా చేయగలుగుతున్నాడో, పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా విజయ్‌కు ఈ భయం ఎందుకు లేదో యువ ఎంఎల్‌ఎకు అర్థం కావడం లేదు. అందుకే విజయ్‌తో కలసి మాట్లాడాలని ఆయన భావించాడు.

ముందుగా విరంచి నుంచి లేదా కోటేశ్వర రావు నుంచి కాల్‌ వస్తుందని ఆశించాడు విజయ్‌. మరీ దూకుడుగా పోవద్దని ఇప్పటికే వారు చెప్పారు.

అందుకే వారు ప్రశ్నిస్తారని అనుకున్నాడు. వాళ్ల ఇంటికి పోయినప్పుడు కూడా నర్మగర్భంగా వారు ఇదే విషయం చెప్పడం, తాను కూడా కొన్నాళ్లపాటు ప్రభుత్వంపై విమర్శలు చేయవద్దని అనుకోవడం ఆయనకు గుర్తుకు వచ్చింది. కానీ వచ్చిన సబ్జెక్టు అలాంటిది. అందుకు నిగ్రహించుకోలేకపోయాడు. మద్యపాన నిషేధానికి ఉద్యమించిన వాళ్ల నుంచి అధిక ఫోన్లు వచ్చాయి. ముఖ్యంగా మహిళలు ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. సాయంత్రం మాత్రం విరంచి కాల్‌ చేసింది. మీడియాలో పతాక శీర్షికల్లో వచ్చిన ఈ వార్తలను కనీసం అమె ప్రస్తావించలేదు. తమ మాట వినలేదని వారు భావించారా? లేక పత్రికలు చూడలేదా అని విజయ్‌కు అనుమానం వచ్చింది. విరంచి మీడియా వార్తలు చూడకపోయినా కోటేశ్వర రావు తప్పక చూస్తాడు కదా అనుకున్నాడు. కలిసినప్పుడు మాట్లాడుకుందాం అనుకుంటూ విజయ్‌ తన కోసం ఎవరో వచ్చారని పిఎ చెప్పడంతో ఈ ఆలోచనలకు స్వస్థి చెప్పాడు.

పత్రికా వార్తలను చూశారట,కొందరు పూలమాలతో వచ్చి సత్కరించారు. నాకు ఇలాంటివి నచ్చవని చెప్పినా వారు వినిపించుకోలేదు. మద్యం తాగి ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నాయో, గృహ హింసలు, మానభంగాలు, ఎన్ని అనర్థాలో అంటూ ఒక్కరొక్కరు తమ అవేధన వ్యక్తం చేశారు. సంపూర్ణ మద్య నిషేధమే తరుణోపాయమని, ప్రభుత్వంపై మీలాంటి వారు ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఆ విషయాలన్నీ తనకు తెలిసినా వారిని కించపర్చరాదని, అన్నింటిని సావధానంగా విన్నాడు విజయ్‌. మన ఒక్క రాష్ట్రంలో నిషేధం విధించడం వల్ల సత్ఫలితాలు రావని, దేశ వ్యాప్తంగా ఈ సంస్కరణ అవసరమి ఆయన సోధారణంగా వివరించే ప్రయత్నం చేస్తూ ఈ విషయంలో తాను చేయగలిగినంత ప్రయత్నిస్తానని తెలిపారు.

సహచర శాసనసభ్యుడు రంజిత్‌ నుంచి ఫోన్‌ కాల్‌, ఎక్కడ కలుద్దాం బ్రదర్‌, ఏదైనా హోటల్‌లో కలిసి భోజనం చేస్తూ మాట్లాడు కుందామా లేక మీ క్వార్టర్‌కు రమ్మంటావా అని. నీ ఇష్టం నాకు ఎక్కడైనా అభ్యంతరం లేదన్నాడు విజయ్‌. క్వార్టర్‌కే వస్తా, హోటల్‌ అయితే అంత ఫ్రీగా మనం మాట్లాడుకోలేం బ్రో. అన్నాడు రంజిత్‌ బ్రదర్‌కు షార్టుకట్‌గా .

రేపు మధ్యాహ్నం నీవు రాగానే ఏదో హొటల్‌కు ఆర్టరిద్దాం. నీకు డ్రిరక్స్‌ అలవాటు ఉంటే చెప్పు మా పిఎకు చెప్పి నీ బ్రాండ్‌ తెప్పిస్తా అంటూ నవ్వుతూ ప్రశ్నించగా, లేదు బ్రో, నేను మా గ్రామంలో ఉన్నప్పుడు కల్లు మాత్రం తాగుతాను.ఇతరత్రా డ్రిరక్స్‌ నాకు అలవాటు లేదన్నాడు రంజిత్‌. నేను కూడా అంతే చిన్నప్పుడు మా తాతతో ప్రారంభించాను కల్లు. ప్రతి సాయంత్రం ఇంటికి వచ్చిన కల్లు ఇద్దరం కూర్చొని తాగే వాళ్లం. మా తాతకు కందులు పెనం మీదవేడి చేసి పలుకులుగా మార్చి ఇస్తే కల్లు తాగుతూ పటపట కొరుకుతూ వాటిని తినేవాడు. ఆ వయస్సులోనూ ఆయన పళ్లు గట్టి వస్తువులను కూడా నమిలేలా ఉండేవి. నాకు మాత్రం గుగ్గిళ్లు అయితే ఇష్టంగా తినేవాన్ని. ఉలువలు, కందులు, శెనగలు అంటే వేరు శనగలు కాదు. వాటిని ఉడకపెట్టి, కొద్దిగా పోప్‌ పెడితే ఎంతో మజా ఉండేది.

అయితే నిన్ను ఒకసారి మా గ్రామానికి తీసుకు వెళ్తా. కల్లు పుష్కలంగా లభించే సమయంలో వెళ్దాం. నగరం,శివారు ప్రాంతాల్లో అంతా కల్లీమయం. కానీ దానికే కొందరు బానిసలై తాగుతున్నారు. సరే కల్దాం అంటూ ఫోన్‌ కట్‌ చేశాడు రంజిత్‌.

అనుకున్న సమయం కంటే ముందే విజయ్‌ ఇంటికి చేరుకున్నాడు రంజిత్‌. చేతిలో స్వీట్‌, కారా, కొంత బేకరీ స్టఫ్‌. టెంకాయలు కొట్టించుకొని డ్రైవర్‌ అక్కడ పెట్టి వెళ్లాడు. ఎందుకు ఇవన్నీ, తెప్పించుకునే వాళ్లం కదా అని విజయ్‌ కొంత మొహమాటపడ్డాడు.

మీరు బ్రహ్మచారి కదా. అప్పుడప్పుడు తినడానికి ఉపయోగపడుతాయి. లంచ్‌కు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇవ్వడం కంటే తర్వాత డ్రైవర్‌ను పంపుదాం వేడివేడిగా తీసుకు వస్తాడు అంటూ రంజిత్‌ అనడంతో సరే అలాగే చేద్దామని మాటల్లో పడిపోయారిద్దరు.

యూనివర్సిటీలో మిమ్ములను చూశాని చెప్పాను కదా, మీరు నాకంటే సీనియర్‌ అనుకుంటా, విద్యార్థి సంఘం ఎన్నికల్లో మీరు ఆర్ట్స్‌ కాలేజీ ప్రసిడెంట్‌గా పోటీ చేశారు. నేను కూడా మీకు ఓటు వేశాను. అప్పుడు జానియర్లందరికీ మీరంటే క్రేజ్‌. మీరు ఇచ్చే ఉపన్యాసాలు వినడానికి క్లాస్‌లు ఎగ్గొట్టి వచ్చేవాళ్లం, అందుకే అనుకుంటా అత్యధికోట్ల మెజారిటీతో మీరుగెలిచారు. ఆర్ట్స్‌ కాలేజీ చరిత్రలోనే రికార్డు అని అందరూ అనుకునే వారు అన్నాడు రంజిత్‌.

అవును ఆ రోజులే వేరు. ఎప్పుడు కలివిడిగా ఉండేవాళ్లం. ఏ విద్యార్థికి సమస్య వచ్చినా నేను తట్టుకోలేక పోయే వాన్ని. ఒక్కో రాజకీయ పార్టీకి అనుబంధంగా అన్నట్లుగా ఎన్ని విద్యార్థి సంఘాలు..ఎన్‌ఎస్‌యుఐ, ఎబివిపి, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, డిఎస్‌ఒ, ఆర్‌ఎస్‌యు, పిడిఎస్‌యు వంటి సంఘాలు ఒకటికి మరొకటిపోటీ. అయితే అన్ని సంఘాలు కూడా విద్యార్థి సమస్యల పరిష్కారం విషయంలో నాకు సంపూర్ణ సహకారం అందించాయి. ఆరోజులే వేరు కదా.విజయ్‌ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లాడు..కాలేజీలో నీవంటే అమ్మాయిలు కూడా పడిచచ్చేవారని విన్నాను. ఎవరూ అంత దగ్గరకు రాలేకపోయారా? ప్రేమ,దోమా ఏదీ లేదా, ఇంకా బ్రహ్మచారిగా ఉన్నారంటే ఏదీ లేనట్లే కదూ అంటూ జోక్‌ చేశాడు రంజిత్‌.

నా పంథా వేరు, అప్పుడంతా ఫ్యూచర్‌పై ప్లాన్లు, భవిష్యత్తుపైనే ఆశలు. పదిమందికి ఉపయోగపడే కార్యక్రమాలపైనే నాకు ఆసక్తి ఉండేది. ప్రేమ వ్యవహారం నా దరికిచేరలేదు.ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థి సంఘ అధ్యక్షునిగా ఉన్నందున ఆయా పార్టీల నాయకులతో పరిచయం పెరిగింది. తరుచుగా వారిని కలవాల్సివచ్చేంది.కానీ వారి స్వార్థం కోసం విద్యార్థులను వినయోగించుకోవాలనే తలంపు తెలిసిన తర్వాత వారికి దూరంగా జరిగాను. అయితే వారి పరిచయాల వల్ల కొంత మంచి జరిగింది. తర్వాత పత్రికా రిపోర్టర్‌గా చేరిన తర్వాత అవి ఉపయోగపడ్డాయి. విలేకర్లకు సోర్స్‌ కీలకం. మనలను విశ్వసించి వార్తలు చెబితే మంచిగా రాస్తాడు, తన పేరు ఎక్కడా చెప్పడనుకుంటే మంచి వార్తలు లభిస్తాయి. అదే జరిగింది నాకు. మా పత్రికాధిపతి కూడా నా సర్వీసుకు సంతోషపడేవాడు. తర్వాతి రోజుల్లో ఇవే పరిచయాలు నన్ను రాజకీయ ప్రవేశానికి పురికొల్పాయన్నాడు విజయ్‌

మంత్రులు, రాజకీయ నేతలతో ఏర్పడిన పరిచయాల వల్ల రిపోర్టర్లకు ప్రభుత్వంలో ఏమిజరుగుతుందో తెలుస్తాయి. సచివాలయానికి వెళ్లి సీనియర్‌ అధికారలతోనూ ఎప్పటికప్పుడు కలిసి చర్చించే అవకాశం ఉంటుంది.ఈ అనుభవం మీకు ఎంఎల్‌ఎగా కూడా ఉపకరిస్తున్నది కదే అంటూ రంజిత్‌ ప్రశ్నించాడు.

అవును. ప్రభుత్వ యంత్రాంగం ఏమిటీ, జిఒలు ఎలా విడుదల చేస్తారు, ఎన్నికల తతంగం అంతా రిపోర్టర్లకు అవగాహనకు వస్తుంది. అయితే పత్రికలు ఎన్ని రాసినా చివరకు ఏ నిర్ణయమైనా చేయాల్సింది ప్రభుత్వమే. ఎన్నికల తర్వాత అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో మెజారిటీ సాధించిన అధికారంలోకి వస్తుంది.ఆ పార్టీ శాసనసభపక్ష నేత ముఖ్యమంత్రి అవుతారు. ఆయన మంత్రివర్గం ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగిస్తారు కాబటి ఇక అయిదేళ్ల వరకు వారిదే రాష్ట్రం. విపక్షాలు ఎంతగా గగ్గోలు పెట్టినా, పత్రికల విమర్శలు ఎలాఉన్నా, వారు ఏది భావిస్తే అదే పాలన, వారి విధానాలే అనుసరించాలి. ఇది తెలిసిన తర్వాత రిపోర్టర్‌ కంటే శాసనసభ్యునిగా ఎన్నికై, అవకాశం వస్తే మంత్రిగా ఉండి ప్రభుత్వంలో భాగస్వామి కావాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని వివరించాడు విజయ్‌.

మనలాంటి విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం వల్లనే ప్రజలకు కొంత మేలు జరుగుతుంది. నిస్వార్థంగా పనిచేసే వారు ముందుకు రావాలి, కానీ పెరుగుతున్న ఎన్నికల వ్యయం, కలుషితమైన రాజకీయాలంటూ చాలా మంది ఇందులోకి రావడం లేదని రంజిత్‌ అభిప్రాయపడ్డారు. నా విషయం తీసుకోండి, మా నియోజక వర్గలో నాకు ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థి కోట్లు ఖర్చు చేసైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఓటుకు ఇంత అని ఖర్చు చేశాడు. అయితే ప్రజల్లో ఆయనకు మంచి పేరు లేకపోవడంతో కొత్త అభ్యర్థి విద్యావంతుడు,యువకుడు అవకాశం ఇద్దామని నన్ను గెలిపించారు. అందుకే నేను ఎక్కువగా నియోజక వర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. అయితే ప్రభుత్వం నిధులు సకాలంలో అందించకపోవడంతో పనులు ఎక్కువగా జరగడం లేదని రంజిత్‌ నిట్టూర్పు విడిచారు.

ప్రభుత్వం వద్ద ఉన్న ప్రాధాన్యతలు వేరు. భారీ,వర్షాలు వరదల వల్ల ఇటీవలే అధిక నష్టం జరిగింది కదా బాధితులను తక్షణమే ఆదుకునేందుకు నిధులను మళ్లించక తప్పదు. మనం అర్థం చేసుకోవాలి. సంబంధిత శాఖా మంత్రులను, అధికారులను తరుచుగా కలిసి వాటిని గుర్తు చేయాలి. కొంత ఆలస్యం అయినప్పటికీ నిధులందుబాటులో ఉంటే మనం గుర్తుకు వస్తాం, వెంటనే నిధులు కేటాయిస్తారంటూ విజయ్‌ తన అనుభవాలను పంచుకున్నారు. తర్వాత వారి సంభాషణ రాజకీయాల్లోకి మళ్లింది.

మన పార్టీ ప్రభుత్వం కదా ఉంది, మీరు మొన్న ఎక్సయిజ్‌ మంత్రి ని రోడ్డుకీడ్చారు. పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలంటూ ఎవరూ ప్రశ్నించలేదా అని తన అనుమానం వ్యక్తం చేశాడు రంజిత్‌.

ఇప్పటివరకు పార్టీ పరంగా నాకు ప్రతిబంధకాలు రాలేదు కానీ మంత్రులే ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మాత్రం ఇప్పటివరకు నన్ను ఏమి ప్రశ్నించలేదు. పైగా నేను తరుచుగా ఆయనతో మాట్లాడుతుంటాను. ఇప్పటివరకు నేను అధిష్ఠాన వర్గంలోని ఏ సీనియర్‌ను కలువకపోయినా, మాట్లాడకపోయినా ఎందుకో మంత్రులు మాత్రం నాకు ఢిల్లీలో మంచి పలుకుబడి ఉందని అనుకుంటున్నారు. అందుకేనేమో ఎవరూ బహిరంగంగా నన్ను విమర్శించడం లేదు.

అవును నేను విన్నాను. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీ కూడా మీ గురించి అందరి వద్ద మంచిగా మాట్లాడుతాడట. పార్టీకి ఎసెట్‌ అని, ప్రజల మనిషి అంటూ మీకు సర్టిఫికేట్‌ ఇస్తాడట.ఫోన్‌లో అయినా మీరు మాట్లాడుతుంటారా ఆయనతో..
ఇప్పటివరకు ఆయనతో నేరుగా మాట్లాడిరది లేదు. పార్టీ మీటింగ్‌లో నేను ఏదైనా మాట్లాడితే శ్రద్దగా వింటాడు ఆయన. ఇందుకేనేమో అందరూ నన్ను అధిష్ఠానం వ్యక్తినని గుసగుసలాడుతుంటారు.

రాష్ట్ర ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. పత్రికల్లో కూడా తక్కువగానే వస్తున్నాయని, వాటిని ముఖ్యమంత్రి మేనేజ్‌ చేస్తున్నారని బయట ప్రచారం ఉంది. పైగా మీరే కొన్ని కుంభకోణాలను మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఇదంతా పార్టీకి నష్టం కలిగిస్తుందని, వచ్చే ఎన్నికల్లో మన పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకువస్తాయని, ఈ విషయమే మీతో సంప్రదించాలని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చానని తెలిపాడు రంజిత్‌.

ప్రభుత్వ వైఫల్యాలు ఏమిటో.పార్టీ పరంగా ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నామో అగ్రనేతలు అంచనా వేయకుండా ఉండరు. మన సలహాలు అడిగితే చెబుదాం. ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయాలన్నీ తెలియకుండా ఉండవు. నాకు తెలిసినవి మాత్రం ఆయన ప్రస్తావించిన ప్రతీసారి ఎలాంటి మొహమాటంలేకుండా సూటిగానే చెబుతున్నా అంటూ లంచ్‌కు సమయం అవుతుంది, మీడ్రైవర్‌ను పిలువు పంపిద్దామని విజయ్‌ అన్నారు. డ్రైవర్‌ రాగానే డబ్బులిచ్చి నాన్‌ వెజ్‌ ఫుడ్‌ ఎక్కడ బాగుంటుందో వెళ్లి త్వరగా తీసుకురా అని చెప్పి పంపాడు.

భోజనం వచ్చే వరకు టెంకాయ నీళ్లు తాగుతూ స్నాక్స్‌ కొద్దిగా తీసుకున్నారు.
మంత్రులపై మీరు నేరుగానే ఆరోపణలు చేస్తున్నారు, వారిలో కొందరు గుండాలుగా ఎదిగి నాయకులైన వారున్నారు.ఎప్పుడైనా భయం వేసిందా అని విజయ్‌ కళ్లలోకి చూస్తూ అడిగాడు రంజిత్‌.

భయం, ఆందోళన అందరికీ ఉంటాయి రంజిత్‌గారు. కానీ సమస్య తీవ్రత దృష్ట్యా వాటిని వెల్లడిరచక తప్పని పరిస్థితులు కలుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయితే ఎవరో ఒకరు కత్తిపట్టాలి కదా. చూద్దాం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో..మీరు పత్రికలు చూసే ఉంటారు. మంత్రివర్గ సమావేశంలోనే నా గురించి సీనియర్‌ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా.

అవును ముఖ్యమంత్రిని కూడా విలేకర్లు అడిగారు కదా..అయితే ఆయన నిన్నుసమర్థించడం గుడ్డిలో మెల్ల. కానీ అవినీతి మంత్రులపై చర్యలు తీసుకుంటానని సిఎం చెప్పి ఉంటే బాగుండేది. ఏమో ఆయన కు తెలిసే అన్ని జరుగుతున్నాయనుకుంటా అని అనుమానం వ్యక్తం చేశాడు రంజిత్‌

చెప్పలేం. ఏదీ జరిగినా నాయకుడుగా సిఎం బాధ్యత వహించాల్సిందే. కానీ అన్నింటికి ఆయనను తప్పుపట్టలేం.
ప్రజల్లో మాత్రం ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంది. నేను నియోజక వర్గంలో తిరిగుతున్నాను కదా ఏదేదో అంటారు వాళ్లు. సిఎం ఇక్కడ సంపాధించిన దాట్లో కొంత హస్తినకు పంపుతాడట. అధికంగానే తన వద్ద ఉంచుకొని తన విదేశీ ఖాతాల్లో జమచేస్తున్నాడట. మీ దృష్టికి రాలేదా అని క్వశ్చన్‌ మార్కు ఫేస్‌ పెట్టాడు రంజిత్‌.
నాతో ఇప్పటివరకు ఎవరూ అనలేదు.స్విస్‌ బ్యాంకులో మన దేశస్తుల ఎందరో నల్ల డబ్బు ఉందని తరుచుగా పేపర్లలో వస్తున్నది కదా. ఏదిఏమైనా మీరు నియోజక వర్గ అభివృద్ధికి అంకితభావంతో చేస్తున్న ప్రయత్నాలను అభినంధిస్తున్నా. ఈ టర్మ్‌లో ఎలా ఉన్నా, తిరిగి ఎన్నికైతే రాష్ట్ర స్థాయిలో ఎదగాలి మీరు. రాష్ట్రం మొత్తం మనదిగా భావించాలి.
డ్రైవర్‌ లంచ్‌ తెచ్చి టేబుల్‌పై పెట్టి ఇద్దరికి సర్వ్‌ చేస్తుండగా చేతులు కడుక్కొని కూర్చున్నారు.భోజనం చేస్తూనే వారు మాట్లాడుకున్నారు.

తప్పకుండా బ్రదర్‌, నీ మార్గదర్శకంలో నడవడానికే నేను ప్రాధాన్యత నిస్తాను. చూద్దాం మనలాంటి నిస్వార్థ సభ్యులు ఎవరెవరు ఉన్నారో వారందరిని కలుపుకొని పోయి మంచి పాలన రాష్ట్రప్రజలకు అందేలా కలిసి నడుద్దామన్నాడు రంజిత్‌.

నీ ఆలోచన మంచిదే కానీ ప్రత్యేకంగా కొందరు పార్టీ సభ్యులు వేరుగా మంతనాలు జరుపుతున్నారంటే అసమ్మతి కుంపంటి రాజుకుంటున్నదని, ముఖ్యమంత్రిని గద్దెదించే ఆలోచన విజయ్‌ నాయకత్వంలో జరుగుతున్నదని మీడియాలో వార్తలు వస్తాయి. వద్దు ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు చేయవద్దు. అంతా అధిష్ఠానం చూసుకుంటుంది. వాళ్లు తప్పక గమనిస్తారు. వారికి సమాచారం అందించే వారుంటారు అని విజయ్‌ టివి ఆన్‌ చేశాడు.రంజిత్‌.

బ్రేకింగ్‌ న్యూస్‌ అంటూ ఛానల్‌లో ప్రముఖంగా వస్తున్న వార్త విజయ్‌కు ఏమీ ఆశ్చర్యం అనిపించలేదు. ఎక్సయిజ్‌ మంత్రిని రాజీనామా కోరాలని, లేనట్లయితే వెంటనే భర్తరఫ్‌ చేయాలని అధిష్ఠానం ఆదేశించినట్లుగా వార్త సారాంశం.

కంగ్రాట్స్‌ బ్రో..మీ దెబ్బకు ఒక అవినీతి తిమింగళం ఇంటిబాటపట్టింది. ఇప్పటి నుంచి అయినా ఇతర మంత్రులు జాగ్రత్తగా ఉంటారనుకుంటా.ముఖ్యమంత్రికి చురక తగిలింది ఆనందంగా చెప్పాడు రంజిత్‌. అయితే విజయ్‌ ఆలోచనలో పడ్డాడు. ముఖ్యమంత్రి ఎలా వ్యవహరిస్తారో అనే ఆందోళన ప్రారంభమైంది. తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందో అని సిఎం భావిస్తే, దానికి తానే బాధ్యుడుగా భావిస్తాడు. కింకర్తవ్యమ్‌ అంటూ యోచనలో పడ్డాడు. ఏమిటి బ్రదర్‌నా ఆలోచనలో పడ్డారంటూ రంజిత్‌ ప్రశ్నించడంతో ఏమీ లేదు,భవిష్యత్తు రాజకీయం ఎలా మారుతుందని అంచనా వేస్తున్నానని విజయ్‌ అన్నాడు. భోజనం ముగియడంతో సోఫాలో కూర్చొని, ఎక్సయిజ్‌ మంత్రి వ్యవహారంపై జరుగుతున్న చర్చను టివిలో చూస్తూ కూర్చున్నారిద్దరు. సాయంత్రం కావడంతో ఇక వెళ్లివస్తానంటూ రంజిత్‌ సెలవు తీసుకొని వెళ్లిపోయాడు. నగరంలోనే ఉన్న మరో ఎంఎల్‌ఎ క్వార్టర్‌లో రంజిత్‌ ఉంటున్నాడు.

ఎక్సయిజ్‌ మంత్రి తన రాజీనామాను ముఖ్యమంత్రికి సమర్పించినట్లుగా మరో బ్రేకింగ్‌ న్యూస్‌ వచ్చింది. అంతకు ముందు పెద్ద డ్రామానే జరిగింది. తనను భర్తరఫ్‌ చేయాలని అధిష్ఠానం ముఖ్యమంత్రిని ఆదేశించినట్లు టివిలో రావడంతో ఆయన హుటాహుటిన సిఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లాడు. ఏమిటిది సార్‌, ముందుగానే మనం అనుకున్నాం. మీరు ఢిల్లీకి మాట్లాడి ఇలాంటిది రాకుండా చూస్తారని ఆశించాను. ఇందులో నేను ఒక్కడినే ప్రయోజనం పొందలేదని అందరం భాగస్మాములమేనని మీకు తెలిసినా, ఏ ప్రయత్నం చేయకపోవడం ఘోరం. ఇప్పుడే మీడియాతో మాట్లాడుతాను. ఆ జిఒలు రావడంలో ఎవరి పాత్ర ఎంత అనేది వివరంగా వెల్లడిస్తా అంటూ ఆవేశంగా మాట్లాడాడు.

మంత్రి మాట్లాడేంత వరకు మౌనంగా ఉన్న సిఎం, చెప్పవయ్యా, ఈ పదవిలోకి వచ్చిన తర్వాత నీ ఆస్తులు ఎంత పెరిగాయో,శివారు ప్రాంతాల్లో నీకున్న భూములు, ఇక ఇళ్ల వివరాలు, పాత కేసులు అంతా చెప్పేయి. వెళ్లు ఆలస్యం ఎందుకంటూ సిఎం తాఫీగా చెప్పడంతో కుప్పకూలిపోయాడు మంత్రి.

బాధలో నేనుంటే మీరు కూడా ఇలా అంటే ఎలా సార్‌. నన్ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారా.. మీ ఆస్తిపాస్తుల వివరాలు నాకు అన్ని తెలియకపోయినా, కొంత వరకు తెలుసు అవి కూడా చెప్పమంటారా? ఇద్దరం జైల్‌కు వెల్దామా అంటూ ఎదురు సవాల్‌ చేశాడు మంత్రి. వెళ్లు మరి నావద్ద ఎందుకు కూర్చున్నావు. అంతా ఆలోచించే వచ్చినట్లున్నావు…ఆలస్యం ఎందుకు అంటూ సిఎం మరింత రెచ్చగొట్టడంతో హతాశుడయ్యాడు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. మంత్రిపదివి పోయినా కనీసం ఉన్న ఆస్తులైనా కాపాడు కోవాలంటే ముఖ్యమంత్రి సహకారం తప్పదు.

సార్‌ ఆవేశంలో ఏదేదో మాట్లాడాను. సారీ..కానీ అంతా ఈ విజయ్‌ గాడి వల్లనే. మీరేమో వాన్ని వెనుకేసుకు వస్తున్నారు. గత మంత్రివర్గ సమావేశంలో వాని వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటున్నదని మంత్రులందరూ మీ దృష్టికి తెచ్చినా ఇప్పటివరకు మీరు ఏమి చేయలేదు. దీంతో వాడు మరింతగా రెచ్చిపోతున్నాడు. నేడు నావంతు అయింది.తర్వాత ఎవరిపై దాడి చేస్తాడో..చివరగా మీపై కూడా ఆరోపణలు చేస్తే ఏమి చేస్తారంటూ నిలదీసినంత పనిచేశాడు ఎక్సయిజ్‌ మంత్రి.

ప్రస్తుతానికి ఈ గండం గడవనీ.. భర్తరఫ్‌ ఎందుకు నీవే రాజీనామా చేసి మీడియాకు ఏదో ఒకటి చెప్పి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకో. ఎప్పటికీ ఇదే పరిస్థితి ఉండదు. నీ రాజకీయ భవిష్యత్తుకు నాదే భరోసా అని సిఎం మంచిమాటలు చెప్పి మంత్రిని అనునయించాడు. మీ మీదనే నమ్మకం పెట్టుకున్నాను సార్‌, ఏ సమస్య వచ్చినా మీరే రక్షించాలి మరి. మీరు చెబుతున్నారు కాబట్టి, రాజీనామా ఇస్తాననగానే సిఎం తన పిఎను పిలిచి లేఖ సిద్ధం చేసి తీసుకురమ్మన్నాడు. దానిపై సంతకం చేసిన ఎక్సయిజ్‌ మంత్రి అంతా మీరే చూసుకోవాలంటూ నమస్కరించి వెళ్లిపోయాడు.

ఛాంబర్‌లో ఒక్కడే కూర్చున్నా, ఆలోచనలు ఆయనను చుట్టుముట్టాయి. విజయ్‌ నాతో మంచిగా ఉంటున్నా, కుర్చీకిందనే గోతులు తవ్వుతున్నాడనిపించింది. రాజకీయంగా డక్కామొక్కీలు తిన్న తనకు ఇలాంటి సవాళ్లు ఒక లెక్క కాదు కానీ,విజయ్‌ను ఎలా కంట్రోల్‌ చేయగలడో అంతుచిక్కడం లేదు. వాడిప్పుడు అధిష్ఠానానికి మరింత ప్రీతిపాత్రుడయ్యాడు.ప్రజల్లో పలుకుబడి పెరిగింది. అలాంటివాన్ని ఎలా,ఎలా ఎలా అంటూ లేచి పచార్లు చేస్తున్నాడు. భార్య మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ రోజు తప్పకుండా వీలునామా రాయించాలి. ఈ సమస్య కంటే ఆమె మనస్సు దెబ్బతినకుండా ఎలా చూసుకోవాలనేది మరో చిక్కుముడిగా ఉంది. ఇంతగా నన్ను ఇబ్బంది పెడుతున్న విజయ్‌కు యావదాస్తి కట్టబెట్టాలంటే ఆత్మవంచన చేసుకున్నట్లే కదా. కానీ నా నోటి నుంచి భార్యకు ఇచ్చిన హామీ, ఎలా తప్పించుకోవాలి. ఏమి కారణం చెప్పను. విజయ్‌ చేసిన తప్పు ఏమిటీ, మంచిపనియేగా చేసింది. అవినీతి మంత్రిని తొలగించే అవకాశం ఈ విధంగా మీకు వచ్చింది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చని ఆమె ఉచిత సలహా కూడా ఇవ్వవచ్చు. ఈ అక్రమాల్లో తాను ఉన్నానని ఆమెకు ఎలా చెప్పగలనంటూ తర్జనభర్జన పడుతున్నాడు.

వీలునామా ఇప్పుడే అవసరమా? కొంత వాయిదా వేయాలనుకుంటుండగా భార్య నుంచి ఫోన్‌…అడ్వకేట్‌ను పిలిపిస్తున్నారా..? సాయంత్రం ఆఫీసు నుంచి త్వరగా రండి, ఈ పనిచేద్దాం. కొంతైనా సంతృప్తి కలుగుతుందని ఆమె ప్రస్తావించడంతో హతవిధీ అంటూ తలపట్టుకున్నాడు సిఎం.ఎలా ఎలా, కింకర్తవ్వం.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-25)

Leave A Reply

Your email address will not be published.