విజయుడు (ధారావాహిక నవల పార్ట్-27)
తన అంతరంగం కల్లోలంగా మారింది. అటు రాజకీయంగా, ఇటు కుటుంబపరంగా ఎక్కడా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి తనకు ఏర్పడుతున్నదా? మనస్సాక్షి ప్రశ్నించినట్లు అయింది. మంత్రిగా గతంలో కూడబెట్టిన ధనం, ముఖ్యమంత్రిగా మూడేళ్లలలోనే అందుకు కొన్ని రేట్లు వెనుకేసుకున్న సంపద…ఎవరి కోసమంటూ తనకు తానే అనేకసార్లు అనుకున్నాడు. అసలు నా ఆస్తి ఎంత ఉంటుంది? ఇప్పటివరకు లెక్కించనే లేదు. కొనుగోలు చేసిన భూములకు, ప్లాట్లకు రేట్లు పెరిగి వాటి విలువ ప్రస్తుత మార్కెట్‌లో ఎంతగా ధర పలుకుతుందో, ఏ స్థాయికి వాటి విలువలు పెరిగిపోయిందో ఒకనాడు కూడా చూసుకోలేదు. ఇంకా వజ్రాలు, బంగారం, స్విస్ బ్యాంకు ఖాతా…ఇదంతా అప్పనంగా వచ్చిన సంపదయే కదా..చెమటోడ్చి కష్టం చేసిన తన గతం కూడా గుర్తుకువచ్చింది. పెద్దగా చదువు కోకపోవడంతో అల్లరిగా తిరిగి స్థానిక రాజకీయ నేత ఒకరి అండన చేరి అంచెలంచెలుగా పైకెగిన తన గతం ఆయన కళ్ల ముందు కనిపించింది. ఇంత సంపాధించినా ఎందుకు తృప్తి లేదని ప్రశ్నించుకున్నాడు. పిల్లలు లేరు. అందుకే అన్నపూర్ణ ఈ సంపదను చూసి సంతోషపడటం లేదు సరికదా ఎవరి కోసమండీ అంటూ ఆవేధన చెందుతున్నది. అందుకే కాబోలు కొడుకులాగా ప్రేమ చూపుతున్న విజయ్ పట్ల అనురాగం పెంచుకుంటున్నది.
పిల్లలు లేని కారణంగా అణుకవగా ఉంటున్న విజయ్ పట్ల పుత్ర వ్యాత్సల్యం పెంపొందించుకుంది. ఆమె ఆలోచనలో ఎలాంటి లోపం లేదు. కానీ, విజయ్‌ను దత్తత తీసుకుంటే రాజకీయంగా నాకు ఎదురయ్యే కష్టనష్టాలను ఆమెకు వివరించలేని దురదృష్ణవంతున్ని. నేను చేస్తున్న అక్రమాలు, అవినీతి పనులు, నా పదవిని కాపాడుకోవడం కోసం చేస్తున్న రాజకీయ ఎత్తులు, జిత్తులు ఆమెకు చెప్పలేను. విజయ్ నీతి, నిజాయితీలే తనకు శత్రువులని వెల్లడిరచలేడు. అందుకే దత్తతను నిరాకరించి వీలునామా అంటూ అన్నపూర్ణకు సర్దిచెప్పాను. అడ్వకేట్‌ను పిలవాలా వద్దా అని మరోసారి ఆలోచించాడు. జీవితంలో నా సహధర్మచారిణిగా కష్టనష్టాల్లోనూ కలిసి నడిచిన తన భార్య కంటే ఏదీ, ఎవరూ ఎక్కువ కాదని, ఆమె మనస్సు నొప్పించవద్దంటే వీలునామా రాయించాలనే నిర్ణయానికి వచ్చాడు. తమ తదనంతరమే కదా విజయ్‌కు నా ఆస్తిపాస్తులు దక్కేది..అప్పటివరకు ఏమవుతుందో? ఎవరు ముందు పోతారో, ఎట్లా జరుగుతుందో, ప్రస్తుత కర్తవ్యం అన్నపూర్ణకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనుకుంటూ అడ్వకేట్‌కు ఫోన్ చేయించాడు. లైన్‌లోకి రాగానే సాయంత్రం బంగ్లాకు రావాలని కోరాడు.
ఆఫీసు పనులు ఏవైనా అర్జంట్ ఉన్నాయా అని తన కార్యాలయ ముఖ్యకార్యదర్శితో సంప్రదించి, బంగ్లాకు బయలు దేరాడు సిఎం. కారులో కూర్చున్నాడే కానీ మనస్సు కుదురుగా లేదు. ఇంటలిజెన్స్ విభాగం ఐజి గుర్తుకువచ్చాడు. నమ్మకస్తుడు మరిఎందుకు సకాలంలో పని పూర్తి చేయలేకపోయాడో అర్థం కాలేదు. అయితే రాష్ట్ర పరిధిలో కాకుండా బయట ఆ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించినందునే బహుశ అవకాశం రాక చేయలేకపోయాడని తలపోసాడు. ఎక్కడైనా సరే అని చెబితే సరిపోతుందేమో అని ఆలోచన చేశాడు.తన ఫోన్ నుంచి ఐజికి కాల్ చేసి మర్నాడు వచ్చి కలువమని ఆదేశించాడు.
తాను బంగ్లాకు చేరేవరకు అడ్వకేట్ వచ్చి ఉన్నాడు. అన్నపూర్ణ ఎంతో ఆనందంగా కనిపించింది. అంతా రహస్యంగా జరగాలని తన వ్యూహం. అందుకే తాము ముగ్గురు మాత్రమే కూర్చొని పనివాళ్లనుకూడా దగ్గరకు రావద్దని ఆదేశించాడు. వీలునామా వివరాలను అడ్వకేట్‌కు చెప్పి రెండు మూడు రోజుల్లో పత్రాలు రఢీ చేసుకొని తీసుకురావాలని చెప్పాడు. ఇప్పుడే దాని అవసరం ఏముందని అడ్వకేట్ అనడంతో అన్నపూర్ణ కల్పించుకుంది. మాకు వారసులు లేరు. సమీప బంధువుల లేరు. విజయ్ ఎందుకో మాకు దగ్గరయ్యాడు. అందుకే వానికి ఆస్తి అంతా చెందేలా విల్లు రాయాలని ఇద్దరం అనుకున్నాం. వాడు పెద్దవాడు కాబట్టి దత్తత తీసుకుంటే బాగుండదని ఆయన అభిప్రాయం. అయితే ఈ విషయాలు అప్పుడే విజయ్‌కు చెప్పడం లేదు. మా వృద్ధాప్యంలో చూస్తాం. ఎవరో ఒకరు అండగా ఉండాలి కదా, తలకొరివి పెట్టడానికైనా తనవారంటూ ఎవరు లేకపోతే ఎలా ఉంటుంది అడ్వకేట్ గారు అంటూ చెబుతున్న ఆమెవైపు సాలోచనగా చూశాడతడు.
మీ ఇష్టం, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు తొందర ఎందుకని మాత్రమే నేను అన్నాను. మీరుచెప్పినట్లుగానే అన్ని పత్రాలు సిద్దం చేసుకొని వచ్చి కలుస్తాను సెలవంటూ లేవబోతున్న సమయంలో ముఖ్యమంత్రి..అంతా రహస్యంగా ఉండాలి. మీ జూనియర్లకు కానీ, టైపు చేసే వారికి కానీ తెలియకుండా చూడాలి. అయినా వీలునామా ఫ్రొఫార్మాలు మీ దగ్గర ఉంటాయి కాదా అందులో మీరే స్వయంగా ఖాళీలు భర్తీ చేసే వీలుంటుందా అంటూ సిఎం ప్రశ్నించారు.
ఎందుకుండదు సార్, నాకు కంప్యూటర్‌లో ఫీడ్ చేయడం వచ్చు, ఇప్పుడంతా కంప్యూటర్‌తోనే పని, అందుకే నేను నేర్చుకున్నాను. ఎవకి సహాయం తీసుకోకుండా అంతా నేనే తయారు చేస్తానని చెప్పడంతో మంచిదన్నట్లుగా సిఎం తలూపాడు. అడ్వకేట్ వెళ్లగానే అన్నపూర్ణ,కళ్లలోకి నీళ్లు వచ్చాయి. మనకే ఒక నలుసు ఉండి ఉంటే అంటూ బావురుమంది. భార్యను ఓదార్చడానికి ఆయనకు కూడా మాటలు రాలేదు. ఆమె బాధలో పాలుపంచుకుంటూ ఓదార్చే ప్రయత్నం చేశారు. రాత్రి భోజనాల సమయం కావడంతో వర్కర్లు అమ్మా అంటూ లోనికి రావడానికి పర్మిషన్ అడిగారు. డిన్నర్ చేసి పడుకున్నారేకానీ ఇద్దరికీ కంటికికునుకు రాలేదు. ఎవరి ఆలోచనలో వారు నిమగ్నమై ఎప్పుడు నిద్రపోయారో తెలియదు.
ఢిల్లీలో తనకు జరిగిన రోడ్డు ప్రమాదంపై ఇంకా ఎలాంటి వివరాలు లభించకపోవడంపై విజయ్ తీవ్ర అసంతృప్తితో ఆలోచనలో పడ్డాడు. ఎందుకని ఒక్క క్లూ కూడా దొరకలేదు. తన శత్రువులు ఎవరో కనీసం పసిగట్టలేకపోతున్న అసమర్థతకు తనకుతానే తిట్టుకున్నాడు. కుటుంబరావుతో పరిచయం పెంచుకున్నా, ఈ విషయంలో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కానీ ఆయన కొన్ని హెచ్చరికలు చేయడంలో ఉన్న ఆంతర్యం మాత్రం వెల్లడి కాలేదు. మరింత లోతుగా ఆయనతో చర్చిస్తే బాగుండదని తానే ప్రస్తావించలేకపోయాడు. పైగా విరంచి ఉంటుంది..భుజంరావును కలిస్తే కొంత సమాచారం రావచ్చు. ఆయన హోటల్‌కు ఎక్కువ మంది వస్తుంటారు. వారందరితో కలుపుగోలుగా ఉండే అవకాశం ఉన్నందున నా విషయం చూచాయగా అయినా అతనికి తెలస్తుందని విజయ్ తలపోసాడు.చూద్దాం, హోటల్‌కు భోజనానికి వస్తాననని చెప్పానుగా ఫోన్ చేద్దామంటూ రింగ్ ఇచ్చాడు. అవతలి వైపు నుంచి నో రిప్లయి వచ్చింది. బహుశ బిజీగా ఉంటాడని కట్ చేసి ఆలోచనలో పడిపోయాడు విజయ్.
ఎక్సయిజ్ మంత్రి రాజీనామాకు దారితీసిన పరిస్థితులపై ముఖ్యమంత్రి తనకు ఒక్కసారి కూడా కాల్ చేసి మాట్లాడకపోవడం కూడా విజయ్‌కు ఆందోళనకు గురిచేసింది. సిఎం తనపట్ల ఆగ్రహంగా ఉండి ఉంటారు. లేకుంటే పిఎకు చెప్పి తప్పనిసరిగా ఫోన్ చేయించే వాడు. తానే ఫోన్ చేసి మాట్లాడటానికి కూడా విజయ్ సాహసించలేదు.తన మంత్రివర్గ సహచరునికి అన్యాయం జరిగిందనే సిఎం భావిస్తూ ఉండవచ్చు, ఈ సందర్భంలో నేను కాల్ చేస్తే బాగుండదని ఆయన అనుకున్నాడు. కొద్ది రోజులు మాట్లాడకపోవడమే మంచిదనిపించింది ఆయనకు. ఇంతలో భుజంగరావు నుంచి కాల్ వచ్చింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నానని, రేపు ఉదయం నగరానికి రాగానే ఫోన్ చేస్తాను, రాత్రి ఇద్దరం కలిసి ఢన్నిర్ చేద్దామని ఆహ్వానించాడు. తాను కోరుకున్నట్లుగా ఆయనను కలవడానికి వీలు చిక్కడంతో ఆయనతో సమాచారం ఎలా రాబట్టాలి, తెలిసినా చెబుతాడా? హత్య చేయాలనేంత శత్రుత్వ ఉన్న వారు ఎవరో ఆయనకు తెలుస్తుందా? ఏమో చూద్దాం అనుకున్నాడు. విరంచి గుర్తుకు రావడంతో ఆమెకు కాల్ చేశాడు. ఆమె కాల్ తీసుకోగానే..
ఒక తియ్యని కంఠస్వరం వినక చాలా రోజులైందని, ఫోన్ చేశాను. ఏమి డిస్టర్బ్ చేయలేదుగా…అన్నాడు విజయ్
మాటలకు ఏమి గానీ…అసలు నేను మీకు గుర్తుంటే కదా, రాజకీయాలు, కుంభకోణాలు వెలికి తీయడం, ప్రజల ధనానికి మీరు రక్షకులు, మీరు మాత్రమే ఇవన్నీ చేయగలరు కదూ వ్యగ్యంగా అభినంధించింది విరంచి….కొంతకాలం పాటు వీటన్నింటికీ దూరంగా ఉంటానని మీరు చెప్పినట్లుగా నాకు జ్ఞాపకం ఉంది. నేను ఏమైనా తప్పుగా విన్నానేమో. అయినా..మీ రాజకీయ జీవితం గురించి ఏమీ మాట్లాడకూడదని, మీ ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకంగా వ్యవహరించరాదని మేం నిర్ణయించుకున్నాం. మీరంటే ప్రజల్లో పెరుగుతున్న క్రేజ్‌ను తెలుసుకొని ఆనందిస్తున్నాం.అందుకే ఎన్నోసార్లు మీకు ఫోన్ చేయాలని అనిపించినా నా వల్ల మీ కార్యక్రమాలకు ఇబ్బంది కలగరాదనే మానుకున్నా, కానీ మీరు గుర్తుకు రాక కాదండి…
అమ్మయ్య…నన్ను ఎక్కడ అపార్థం చేసుకున్నారో అని మథన పడ్డాను సుమా? కొన్నాళ్లు వివాదాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న మాట నిజమే కానీ పరిస్థితుల అలా తరుముకుంటూ వచ్చాయి.. నన్ను మనస్సుపూర్తిగా అర్ధం చేసుకున్న మీ కుటుంబ అభిమానానికి కృతజ్ఞతలు.
రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని అంటారు పెద్దలు..ఇదిసరే, మీ థీసిస్ పని ఎంతవరకు వచ్చింది. కొత్త కోణం నుంచి సమాజాన్ని చదవడం నేర్చుకుంటున్నారా? చదువు కోసం కాకపోయినా…మారుతున్న వ్యవస్థపై అవగాహన పెంచుకోవడం వల్ల భవిష్యత్తులో మనం నిర్వర్తించే పాత్రకు అవి ఉపయుక్తంగా మారుతాయండీ… కానీ మీరు ఏ కొత్త విషయం గురించి నాతో చర్చిచ లేదంటే..మీరింకా వాటిపై దృష్టి పెట్టలేదనుకుంటున్నాను.
మీరు చెప్పింది నిజమే. మా నాన్నతోపాటు కాలేజీకి వెళ్లాను. ఎలాప్రారంభించాలో అర్థం కాలేదంటే నమ్మండి. అందుకే మీరు పక్కన ఉంటే…మీ ద్వారానే ఆ ప్రపంచంలోకి వెళ్లాలని ఉంది. శాసనసభ్యులుగా మీకున్న ప్రత్యేకతల వల్ల మీరు నాకు తోడుగా రావడం సాధ్యం కాదని తెలుసు, అయినా ప్రయత్నించవచ్చు కదా..అవునూ మీరు గడ్డంతో సినిమా నటుడు కంటే ఎంతో బాగా కనిపిస్తున్నారు.ఇంకా బాగా పెంచండి, బ్లాక్ గ్లాసెస్ పెడితే బహుశ ఎవరు గుర్తుకుపట్టకుండా ఉంటారు కలిసి తిరిగినా ఎవరూ గుర్తు పట్టరు కాబట్టి మనం వెళ్లవచ్చు. నాకు సహయం చేసినట్లు అవుతుందని కుతూహలంగా ప్రశ్నించింది. విరంచి.
మీ ఐడియా బాగానే ఉంది కానీ, ఎక్కువ సార్లు టివిలో కనిపించిన మొఖం కదా ఇది..అంత సులువుగా ఉంటుందంటారా? ప్రస్తుతం గడ్డం బాగానే పెరిగింది. ట్రిమ్ చేయకుండా వదిలేస్తా, మరింతగా పెరుగుతుందని అంటూ నవ్వాడు విజయ్. అవతలి వైపు నుంచి కూడా నవ్వులు.
మీకేంటీ గడ్డం పెరిగినా అందంగానే కనిపిస్తారు. పెరగనీయండి అంటూ మరింతగా నవ్వింది విరంచి.
రాజకీయ నాయకులం మూము, అందం, చందం మాకెందుకండీ, బాగా పనిచేస్తున్నామా లేదా, వారికి ఎంతవరకు ఉపయోగపడుతున్నామనేదే ప్రజలకు కావాలి కానీ ఆరడుగుల అందగాడు కాదండి, నేను ఏమైనా సినిమాల్లో నటిస్తున్నానా, గ్లామర్ కోసం ఆరాటపడటానికి…మీరండీ అందానికి నిర్వచనం. పైగా కట్టుబొట్టు అన్ని అద్దినట్లుగా ఉంటారు. మొదట మిమ్ములను చూసినప్పుడే చెప్పాననుకుంటా..రంభ,ఊర్వశి,మేనకలే కాదు ఏ గందర్వ కన్యకామణి మీకు సరిరారని.
అయ్యో మీరు మరో విధంగా అనుకున్నారు. నా ఉద్ధేశ్యం మనం కలిసి బయటికి వెలితే ఎవరూ గుర్తు పట్టరాదని ఈ విషయం ప్రస్తావిస్తే మీరు నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ మీరు అచ్చంగా ఇంద్రలోకం వెళ్లి, వారిని చూసినట్లుగా మాట్లాడుతున్నారు, ఏమిటీ విషయం. ఆరా తీసింది విరంచి.
ఏమో ఒక్కసారిగా అలా స్పురించింది. దేవేంద్ర సభలో ఉండే ఆ మహిళామణులను నేను చూశానా? మీకు అలా అనిపించిందా? ఏమో. అంటూనే..అదేనండి ఎన్ని సినిమాల్లో చూడలేదు మనం. చిరంజీవి సినిమా అనుకుంటా… ఇంద్రజగా శ్రీదేవికి ఎంత సోయగం,ఎంత సౌందర్యం..వారిద్దరి జంట కన్నుల పంట. టివిలో ఈ సినిమా వచ్చిన ప్రతిసారి అతుక్కుపోతా. యూట్యూబ్‌లో ఉంది కానీ మరీ అలా వెతికి చూడను లెండి.
అబ్బ మిమ్ములను కదిలిస్తే కవిత్వం చెబుతారు.కాలేజీ రోజుల్లో ఏమైనా రాసారా ఏమి ?
అప్పుడు అంతే పెద్దగా తీరుబడి ఉండేది కాదు. చదువుకుంటూనే ఏదో ఉద్యోగం చేసే వాన్ని. అయినా అందం గురించి మాట్లాడటానికి కవి యే కానక్కరలేదు సుమండి..మన దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో రాజీవ్ గాంధీని అందగాడంటారు. అధిక కాలం చిత్ర పరిశ్రమలో ఉండి, అంతా సంపాధించుకొని, స్థిరమైన ఆదాయం ఉండి రాజకీయాల్లోకి వచ్చిన సినిమా వాళ్ల గురించి కాదు కానీ ఇతరుల విషయం మాట్లాడుతున్నా. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు కూడా ఇదే జాబితాలోకి వస్తారా? మీరు అనవచ్చు. రాజీవ్ గాంధీ కుటుంబం కూడా సంపన్న కుటుంబమే అని. అవును రాజకీయ కుటుంబమే అది.
ఇక వదిలేయండి.మీరెంత సౌందర్యోపాసకులు అయినా, ఇక ఆచర్చ వద్దు లెండి.
సరే మీరు కూడా పిహెచ్‌డి సిద్దాంత వ్యాసాలపై దృష్టిపెట్టండి. అవునూ అంతా ఫోన్‌లోనే మాట్లాడుతుంటారా? దర్శన భాగ్యం ఏమైనా ఉంటుందా? అంటూ విజయ్ కూడా మరో ప్రస్తావన తెచ్చాడు.
మీరు అనాలా.. ఈ రోజు ఢన్నిర్‌కు రండి. మీకిష్టమైనవి చేయమని అమ్మకు చెబుతా, వస్తారా మరి, ప్రశ్నించింది. విరంచి.
సరాదాగా అన్నాను. నాకు వేరే పనులున్నాయి. తర్వాత కలుద్దామంటూ కాల్‌కట్ చేశాడు.
బెంగుళూరు నుంచి వచ్చిన భజంగ రావు మధ్యాహ్నం వరకు తన పనులు చూసకొని విజయ్‌కు కాల్ చేశాడు. డిన్నర్ గుర్తు చేద్దామని అంటూ అవిఇవి మాట్లాడి ఫోన్ పెట్టేసిన భుజంగ రావు, విజయ్ గురించే ఆలోచనలో పడ్డాడు. ఎవరికీ హాని తలపెట్టే ఆలోచన కూడా చేయని విజయ్‌కు కూడా శత్రువులు ఉన్నారంటే ఈ సమాజంలో ఇక ఎవరికి భద్రత ఉండదేమో. మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న విజయ్ అంటే అందరికీ అభిమానమే. తన హోటల్‌కు వచ్చే వారు రాజకీయాలు మాట్లాడుకుంటే ఆయన ప్రస్తావన లేకుండా ఉండదు. అనుకున్నాడు భుజంగరావు.
అనుకున్నట్లుగానే విజయ్ సాయంత్రం ఏడుగంటలకే హోటల్‌కు చేరుకున్నాడు. ముందుగా కాల్ చేయడంతో తన సిబ్బందిని గేట్ వరకు పంపి, ఆయన లోపలికి రాగానే స్వాగతం పలికారు. తన ఛాంబర్‌లోనే ఉన్న టేబుల్ వద్ద కూర్చున్నారిద్దరు. ఏమేమి సర్వ్ చేయాలో ముందుగానే బేరర్‌కు చెప్పడంతోపాటు ముందుగా స్టార్టర్స్, చికెన్ సూపు తెమ్మని చెప్పాడు. విజయ్‌కు సూపు తాగమని, తాను డ్రిరక్ తీసుకుంటున్నాడు.తాజా రాజకీయాలు, ఎక్సయిజ్ మంత్రి రాజీనామా ఇతర విషయాలు చర్చకు వచ్చాయి వారి మధ్య. ఛాంబర్‌లో ఇద్దరే ఉన్న సమయంలో విజయ్ మాట్లాడుతూ నాకు శత్రువులున్నారా అంటూ ప్రశ్నించాడు. ఊహించని ఈ ప్రశ్నతో భుజంగరావు కొద్దసేపు ఏమీ మాట్లాడ లేదు.
చెప్పండి, మీకు చాలా మందితో పరిచయాలున్నాయి. రాజకీయ నేతలు,వ్యాపారస్తులు, పోలీసులు, అన్ని వర్గాలతో మీరు మంచిగా ఉంటారు.నాకు అనుమానాలు రావడానికి ప్రత్యేక పరిస్థితులున్నాయి. మీకు ఏది తెలిస్తే అది చెప్పండి . నేను వేరే విధంగా అనుకోను. నిజం చెప్పండి అన్నాడు విజయ్.
దీర్ఘంగా నిట్టూర్పు విడిచిన భుజంగ రావు, సమాజం అంతా సజావుగా లేదు విజయ్ గారు. మీరనుకోవచ్చు, నేను ఎవరికి ఎలాంటి హాని చేయడం లేదని. మీరు నిజాయితీగా ఉండవచ్చు.కానీ మీ రాజకీయ ప్రసంగాలు, మీడియా సమావేశాలతో ప్రభుత్వమే ఇరుకున పడుతున్నది. చూశారుగా మొన్ననే ఎక్సయిజ్ మంత్రి రాజీనామా చేయక తప్పలేదు. ఒక పదవి పోతే వారికి ఎంత క్రోధం ఉంటుందో.. రాజకీయాల్లో పదవులు అంత ఆశామాషిగా రావు. అధిష్ఠాన వర్గంలో ఎవరినో పట్టుకొని ఆయన ఈ శాఖ కావాలని తీసుకున్నాడు. బాగా సంపాదించాడు అది ఓకే. ఇలాంటివే అన్ని. వ్యాపారులు పన్నులు ఎగవేస్తున్నారని,అధికారులు వారి వద్ద మామూళ్లు పుచ్చుకొని పట్టించుకోవడం లేదని, దాదాపు ఎక్కువ మంది వర్తకులనే మీరు టార్గెట్ చేస్తున్నారు. అది మీరుచేస్తున్న మంచిపనియే.కాదనను.
కానీ ఈ చర్చల వల్ల వారికి వచ్చే అధిక లాభంలో కోతపడుతున్నది. ఇలాగే ఎందరికో.. సదుద్ధేశ్యంతో మీరు చేస్తున్న అవినీతి నిర్మూళన కార్యక్రమాలకు ప్రజలు హర్షిస్తారు. కాదనను. కానీ దీని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వారంతా నీపై ఆగ్రహంతో ఉంటారు.
(సశేషం)