విజయుడు (ధారావాహిక నవల పార్ట్-29)
పాల సముద్రంలో శేషశయ్యపై ధ్యానముద్రలో ఉన్నాడు మహా విష్ణువు. విజయ్‌పై జరిగిన దాడి చూసిన లక్ష్మీదేవి,
స్వామి ఏమిటిది, మీరు అభయం ఇచ్చారు కదా, ధర్మమార్గాన పయనించినన్ని రోజులు దైవం అండదండలు లభిస్తాయని, మరి ఇదేమి స్వామి విజయ్‌కు ఈ కష్టాలు, ఆ జీవి చేసిన తప్పులేమిటి? ఎందుకలా జరుగుతున్నదంటూ ఆందోళన పడిరది. విజయ్‌పై దాడి ఘటన ఆమెను కదిలించింది.
దేవీ, మానవ లోకంలో ఇలాంటి సంఘటనలు సర్వ సాధారణమే. తాను మంచిగా ఉంటే సరిపోదు. ఈర్ష,అసూయ,ద్వేషాలు మానవుల సహజలక్షణాలు.
ఒకడు ఉన్నత మార్గంలో నడుస్తున్నా ,ఇతరులకు పట్టదు. వాని వల్ల మనకు ఏ నష్టం వస్తుందో, వాటి చేష్టలు మనకు ప్రమాదకరంగా పరిణమిస్తాయో అని భావించేవాళ్లు కోకొళ్లలు. ఒకరి సత్పప్రర్తన మరొకరికి సమస్యగా మారుతుంది. అది వారికి ఆగ్రహం తెప్పిస్తుంది. అది వారికి చేటు తెస్తుందని ముందుగా అంచనా వేయరు వాళ్లు.
విజయ్‌కు ఇబ్బందులు రావు కదా స్వామి అంటూ పుత్ర ప్రేమ ప్రదర్శించింది ఆమె.
చెప్పానుగా వస్తాయి, అన్నింటిని ఎదురొడ్డి నిలవాల్సి ఉంటుంది. దైవబలంతో అనుకున్నది విజయ్ సాధిస్తాడు దేవీ, నీవు అంతగా ఆతుర్థాపడనక్కర లేదు.
ఎలా ఉండగలను స్వామి, విజయ్ ఇప్పటివరకు తనను రోడ్డు ప్రమాదం పేరుతో హత్య చేసింది ఎవరో ఇంకా కనుగొననే లేదు. మీ దగ్గర ఇదే విషయం కదా వాడు పదేపదే గుర్తు చేసుకున్నాడు. ఇన్నాళ్లుగా వాని ప్రయత్నం ఫలించలేదు. కనీసం ఏ చిన్న ఆధారం కూడా లభించలేదని విజయ్ ఆందోళన చెందుతున్నాడు స్వామి. ఇంకా ఎంత కాలం పడుతుందో, ఎప్పటికి వాని ఆవేధన తీరుతుందో, స్వామి.
అందుకే కదా విజయ్ ప్రాణం తిరిగి ఇచ్చిన సమయంలో ఇంత కాలంలో నీ లక్ష్యం నెరవేర్చుకోమని మనం గడువు పెట్టలేదు గుర్తు చేశారు ఆ దేవదేవుడు. అధర్మ ప్రవర్తన లేకుండా వ్యవహరిస్తే భూలోకంలో ఆ జీవి నిండ నూరేళ్లు బతకవచ్చు.
కానీ స్వామి ఆ జీవికి ఎవరూ సహకరిస్తున్నట్లుగా లేదు.
పరిస్థితులు అవే కలిసి వస్తాయి. దైవబలం కూడా తోడవుతుంది. చూద్దాం ఎంత కాలం పడుతుందో..అంటూ యోగ నిద్రలోకి వెళ్లాడు శ్రీ మహావిష్ణువు.
భూలోకంలో అన్నపూర్ణమ్మ ఆరాటం అంతా ఇంతా కాదు. విజయ్ రాకకోసం ఎదురు చూస్తున్నది.సాయంత్రం కాగానే ముఖ్యమంత్రి గారి సతీమణి ఫోన్ కాల్ గుర్తుకు వచ్చి, తన ఇతర పనులు వదిలేసి బయలు దేరాడు విజయ్. ఇదివరకు ఎక్కడికి వెళ్లినా ఒంటరిగానే కారుడ్రైవ్ చేస్తూ బయలుదేరే వాడు. కొత్తగా వచ్చిన అంగరక్షక సిబ్బందికి తెలిపాలి కదా అంటూ పిఎ నగేష్‌కు కాల్ చేశాడు. తాను డ్రైవ్ చేస్తుంటే గన్‌మెన్‌లు కారులో తాఫీగా కూర్చోవడం చూసేవారికి ఎబ్బెట్టుగా ఉంటుంది. వెంటనే డ్రైవర్‌ను నియమించుకోవాలని అనుకొని… మరోసారి ఫోన్ చేసి డ్రైవర్ అవసరాన్ని తన పిఎ నగేష్‌కు చెప్పాడు.
అవును సర్ గన్‌మెన్‌లు రాగానే మీకు డ్రైవర్ అవసరం ఏర్పడుతుందని నాకు తెలిసిన ఒకరిని తీసుకు వచ్చాను సర్. ఈ రోజు ఆయన డ్రైవింగ్ చూసి నచ్చితే పర్మినెంట్‌గా పెట్టుకుందాం సార్ అంటూ వినయంగా చెప్పాడు నగేష్.
గుడ్ మంచి పనిచేశావు. రెఢీగా ఉండమను. కిందికి వస్తున్నా అంటూ బయలు దేరాడు విజయ్. తాను వెనుక కూర్చుంటే గన్‌మెన్ ఇద్దరు ముందు సీట్లో కూర్చోవడం సాధ్యం కాదు కాబట్టి ఇద్దరినీ వెనుక కూర్చోమని తాను డ్రైవర్ పక్కన కూర్చున్నాడు.
ముఖ్యమంత్రి బంగ్లాకు చేరుకున్న విజయ్‌ను చూసి అన్నపూర్ణమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. కాళ్లకు దండం పెట్టిన విజయ్ కన్నీళ్లు తుడిచాడు… పాపిష్టి వాళ్లు ఎవరురా, నీపై దాడికి వచ్చింది అంటూ విజయ్‌ను పట్టుకొని కత్తి గాయాన్ని చూసింది. ఆమెకు కన్నీరు ఆగడం లేదు. తన కన్న తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి, విజయ్ కళ్లలో కూడా నీళ్లు వచ్చాయి. నా కోసం ఇంతగా తపన పడుతున్న అన్నపూర్ణమ్మ చూసిన విజయ్‌కు కన్నీరు ఆగడం లేదు. ఒకరిని ఒకరు ఓదార్చుకున్నారు.
నీ ఫోన్‌కు ఏమైందిరా, ఎన్నిసార్లు ఫోన్‌చేయించినా నో రిప్లయి వస్తుందని సార్ పిఎలు చెప్పారు, చివరికి మీ సార్‌ను చేయమంటే నా సెల్ నుంచి చేస్తే మాట్లాడుతాడని ఆయనే ఉపాయం చెప్పాడు.
అవునమ్మా, వందల సంఖ్యలో ఫోన్లు, వేలాది మెసేజీలు అందరితో మాట్లాడం ఎలా కుదురుతుందమ్మా. అందుకే హోటల్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్‌లో ఫీడ్ అయిన పేర్లు చూసుకొని,ముఖ్యమైన వారివి మాత్రమే మాట్లాడుతున్నా. అలాగని నా క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని ఆరాటపడిన వారిని నిర్లక్ష్యం చేయలేదు. వచ్చిన అన్ని మిస్సుడ్ కాల్స్, మెసేజీలు రిప్లయి ఇవ్వాలని నా పిఎకు చెప్పి, అదే పనిలో పెట్టా. వ్యక్తిగతంగా వచ్చిన వారందరికీ థాక్స్ చెప్పి పంపాను.
నాకు ఫోన్ చేయాలని అనిపించలేదురా అంటూ మరోసారి కళ్లు ఒత్తుకుంది ఆమె.
కాదమ్మా, వచ్చిపోయే వారితో సరిపోయింది. అయినా వెంటనే సిఎం గారు మాట్లాడారు కదా, మీకు చెప్పి ఉంటారని అనుకున్నానే కానీ, మీ కంటే ముఖ్యులు నాకు ఎవరున్నారమ్మా అంటూ ఉద్వేగంగా విజయ్ మాట పెగలలేదు.
ఏమోరా. నీపై దాడి అని తెలియగానే నా మనస్సు మనస్సులో లేదు. ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలా అని పరితపించిందిరా…భగవంతుని కృపవల్ల ప్రమాదం తప్పింది.ఒరే. ఇకనైనా బంగ్లాలోనే ఉండురా. మాతోపాటు. కలిసే ఉందాం. నీకు అన్ని విధాలుగా రక్షణ ఉంటుంది. సార్‌కు నీవంటే ఎంతో అభిమానం అని తెలుసు కదా. ఆయనతో నేను మాట్లాడుతా. నా కళ్లముందు నీవుంటే ఎంతో ఆనందంగా ఉంటుందిరా నాకు,ఆతురతో అడిగింది ఆమె.
మీ దంపతులకు ఎంతో రుణపడి ఉంటాను. మీరిద్దరు నా శ్రేయోభిలాషులని తెలుసమ్మా.కానీ నేను బంగ్లాలో ఉండటం సిఎం గారి రాజకీయాలకు మంచిది కాదమ్మా.నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను, సమస్యలు వస్తాయి… అప్పుడప్పుడు కాదు కానీ, నీవు ఎప్పుడు పిలిచినా నీ ముందు వాలుతాను. సరేనా.
బంగ్లాలో ఉంటే ఇక నీకు రాజకీయాలు ఎందుకరా, అంతా మీ సార్ చూసుకుంటారు. ముఖ్యమంత్రి దగ్గర ఉంటున్నావంటే ఇంకా మరో పదవి అవసరమా..రాజీనామా చేసేయి. మా బిడ్డలాగా మాతో ఉండిపో బాబూ అంటూ విజయ్‌ను చిన్నపిల్లాడిలా మరింత దగ్గరకు తీసుకుంది.
ఎలా చెప్పాలో విజయ్‌కు అర్థం కాలేదు. తల్లి కంటే మిన్నగా ఆమె చూపుతున్న ప్రేమకు కరిగిపోతున్నాడు తను. కానీ తన లక్ష్యాలు వేరు. అవన్నీ చెప్పి ఒప్పించడం సాధ్యం కాదని తెలుసు. ఎలా ఒప్పించాలో తెలియక విజయ్ సతమతమవుతుండగా అప్పుడే ముఖ్యమంత్రి వచ్చాడు.
వెంటనే లేచిన విజయ్ సిఎంకు నమస్కారం చేశారు, దగ్గరకు వచ్చి గాయం ఎక్కడ అంటూ చేయి పట్టుకొని చూశాడు సిఎం. తల్లీ, బాబు కడుపు నిండా మాట్లాడుకున్నారా? అంటూ విజయ్‌వైపు చూస్తూ…డిజిపి చెప్పాడు నిందితులను అదుపులోకి తీసుకున్నారని…రక్షకభటులు వచ్చారు కదా, ఇక నిశ్చింతగా ఉండవచ్చు. అయినా మన జాగ్రత్తల్లో మనం ఉండాలన్నారు.
వీన్ని ఇక ఇక్కడే ఉండమని చెబుతున్నాను, అంటూ భర్త వైపు చూసింది అన్నపూర్ణమ్మ.
అవునా ఏమటంటున్నాడు మరి, ఉంటే నీ కోరిక కూడా నెరవేరుతుంది అనగానే, వాడు ఒప్పుకోవడం లేదండీ, మీరైనా గట్టిగా చెప్పండి వింటాడేమో..
అలాగా నేను చెప్పితే వింటాడంటావా ఏమి విజయ్, మీ అమ్మ
కోరికను అంగీకరించవచ్చు కదా? ఇక్కడ నీకు మరింత రక్షణ ఉంటుంది, బాగా ఆలోచించు, కనీసం కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి ఏమంటావు అన్నాడు సిఎం.
మీరు చెబితే కాదంటానా, కానీ నేను ఇక్కడ ఉండటం మీకు రాజకీయంగా ఇబ్బందిగా ఉంటుందేమో. అయినా ఈ బంగ్లాకు నేను ఎప్పుడంటే అప్పుడు వచ్చే అవకాశం ఉంది కదా, అమ్మ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానంటూ… ఇక్కడ ఉండలేనని పరోక్షంగా చెప్పడంతో సరే నీఇష్టం, కానీ మీ అమ్మ ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తుందని మాత్రం మరిచిపోకు. చూడు అన్న పూర్ణ వీడికి మనకంటే వాడి రాజకీయ భవిష్యత్తు ముఖ్యంగా కనిపిస్తున్నది. నీవు ఎంతగా మమకారం చూపుతున్నా, వాడు మన కొడుకు కాదు కదా అలాగే మాట్టాడుతాడంటూ భార్యను ఓదార్చాడు.
సార్, అంత పెద్ద మాటలు వద్దు. నాకు ఈ సమాజంలో మీకంటే ఎక్కువ కావాల్సిన వారు లేరని మీకు కూడా తెలుసు. నాకు రాజకీయాలు అంత ముఖ్యం కాదు కానీ ఎంఎల్‌ఎగా గెలుపొందిన నేను నా నియోజక వర్గ ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఈ దశలో వాటన్నింటిని వదులుకోవడం ఎంత కష్టమో మీకు తెలుసు. అమ్మ నీ మాట ప్రస్తుతానికి కాదంటున్నందుకు మన్నించు అంటూ రెండు చేతులు జోడిరచాడు విజయ్.
సరే బాబు నీ ఇష్టమే కానివ్వు. కానీ ఇక్కడ మీ అమ్మకాని అమ్మ ప్రాణం ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తుందని అంటుండగా, ఆమె కన్నులు నీళ్లతో నిండాయి. వెంటనే దగ్గరకు వచ్చిన విజయ్ ఆమె కళ్లు తూడ్చుతూ…వద్దమ్మా అలా అనకు. నిన్ను ఎప్పుడు మా తల్లిలాగే భావిస్తున్నా..అంటూ ఆమె మాతృప్రేమలో ఒదిగిపోయారు.
రాత్రి భోజన సమయంలో కూడా వారి మధ్య పెద్దగా మాటలు పెగల లేదు. డిన్నిర్ తర్వాత ఇక వెళ్లి వస్తా అంటూ విజయ్ ఇద్దరి వద్ద సెలవు తీసుకుంటూ, అమ్మా అంటూ ఆమె కాళ్లకు నమస్కరించి వెళ్లిపోయాడు.
ఏమండీ వాడు నైజం అలాంటిది. స్వతంత్రంగా ఎదిగిన వాడు. మీ మాట కూడా వినలేదని,మన వద్ద ఉండకపోయినా మీరు ఏమీ అనుకోకండీ, వాడి మనస్తత్వం మీరు అర్థం చేసుకున్నారు కదా..అంటూ చెబుతున్న భార్యను దగ్గరగా తీసుకున్నాడు సిఎం. విజయ్‌తో పూర్ణకు ఎందుకింత అనుబంధం పెనవేసుకుందో ఆయనకు అంతుబట్టలేదు. సంతానం లేమితో మహిళలు ఇంతగా బాధపడుతారని ఆయన భావించాడు. ఒకవేళ, విజయ్‌కు ఏదైనా జరగరానిది జరిగితే ఆమె ఎలా తట్టుకుంటుందనే ఆలోచన సిఎంకు భయం కలిగించింది. ఎందుకైనా మంచిది విజయ్‌ను కొంత కాలమైన దూరం పెట్టాలని సిఎం నిర్ణయానికి వచ్చాడు. వారిద్దరు తరచుగా మాట్లాడుకుంటే మమకారం మరింత పెరుగుతుందని, ఇప్పటికే వీలునామా అంటూ వత్తిడి పెంచుతున్నదని సిఎం ఆలోచించాడు. తాను కావాలనే వీలునామా రాయించడంలో జాప్యం చేస్తున్నాడు. చూద్దాం పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో అనుకుంటూ పడకగదిలోకి వచ్చాడు.
మంచినీళ్లు తాగుతారా అంటూ గదిలోకి వచ్చిన అన్నపూర్ణమ్మ, మంచం మీద కూర్చుంటూ, ఏమండీ వీలునామా తీసుకొని ఇంకా మన అడ్వకేట్ రాలేదేమిటని ప్రశ్నించింది.
(సశేషం)