విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-31)

ఈ చీర పనికిరాదు, మళ్లీ స్నానాలు చేయాలి అంటూ నళిని ఆ పనిలో నిమగ్నమైంది. భార్యనే చూస్తూ నగేష్‌ ఆమె తిరిగి తయారయ్యేవరకు వేచి ఉన్నాడు. తర్వాత తాను బట్టలు మార్చుకుని రడీ అయ్యాడు. ముందుగా గుడికి వెళ్లి,పూజలు చేసి, ఏదైనా సినిమాకు వెళ్దామ అని నగేష్‌ అనడంతో సినామాలు వద్దండి, టీవిల్లో చూస్తున్నాం కదా, మీరన్నట్లుగా సరదాగా అటు,ఇటు తిరిగి, కొంత సేపు షాపింగ్‌ చేసి, హోటల్‌లో భోజనం చేసి ఇంటికి వెల్దామని ప్రతిపాదించింది నళిని. చాలా రోజుల తర్వాత భర్తతో ఇలా గడపడం ఆనందంగా ఉంది నళినికీ.

ఇద్దరి తొలి పరిచయం గుర్తు చేసుకొని మనసారా నవ్యుకున్నారు. వంద రూపాయలు నీ దగ్గర తక్కువగా ఉండటం నాకు ఎంత మేలు చేసింది నళిని అంటూ నగేష్‌ ఉస్మానియా క్యాంపస్‌లో బ్యాంకు ఛలానా విషయాన్ని ప్రస్తావించడంతో నళిని మరింత బిగ్గరగా నవ్వింది. ఆనాటి బాకీ వెంటనేతీర్చాను మళ్లీ అడగరు కదా అంటూ హాస్యమాడిరది. మన కథ పిల్లలు పెద్ద అయిన తర్వాత చెబుదాం అనుకున్నారు. అయితే తానుకూడా మంచి ఉద్యోగం సంపాధించుకున్న తర్వాతనే పిల్లల విషయం ఆలోచిద్దామని నగేష్‌ చెప్పగా సరే అలాగే చేద్దాం, మనకు తొందరేమి లేదు, ఇలాగే కొన్నాళ్లు ఎంజాయి చేద్దాం ఇద్దరం, అంటూ నళినీ కూడా అంగీకరించింది.

ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు వరుసగా రాస్తున్నాడు నగేష్‌, కానీ కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల భర్తీ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నది. బ్యాంకు పోటీ పరీక్షలు కూడా రాసినా ఎందుకో వాటిని పొందలేకపోయాడు.పిజి ఎంట్రన్స్‌ రాసినా మంచి మార్కులు రాలేదు. దీంతో డిగ్రా పాస్‌ అయినప్పటి నుంచి పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాడు. విజయ్‌ వద్దకు విజిటర్స్‌రాని సమయంలోనూ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను ముందేసుకొని చదువుకుంటున్నాడు నగేష్‌.

సహచర శాసనసభ్యుడు రంజిత్‌ కూడా పలుసార్లు కాల్‌ చేస్తూ తాజా రాజకీయాల గురించి, ప్రతిపక్షాల విమర్శలను ప్రస్తావిస్తూ సంభాషిస్తున్నాడు విజయ్‌తో.తన పరిధిని మరింతగా పెంచుకోవాలని, రాష్ట్రంలో అధిక సంఖ్యాకులు విజయ్‌ పట్ల ఆదరణ చూపుతున్నారని వారందరికి అందుబాటులో ఉండేలా కార్యాచరణ అవసరమని రంజిత్‌ చెబుతున్నాడు. దీనికి ప్రణాళికా బద్దంగా ఎలాంటి కార్యక్రమం రూపొందించుకుంటే బాగుంటుందో కూడా సూచనలను ఇస్తున్నాడు కూడా..తాను కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటానని, ఏ చిన్న అవసరం పడినా తన సేవలు వినియోగించుకోవాలని చెబుతున్నాడు. హోటల్‌లో దాడి తర్వాత వారి మధ్య చర్చలు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రభుత్వ అవినీతిపై మనం స్పందించకుంటే పార్టీకి నష్టం కలుగుతుందని, నిలబడిన చెట్టుకొమ్మనే నరికేస్తున్న వారిని ఉపేక్షించడం మంచిది కాదని వారి చర్చల సారాంశం.
మనం నేరుగా ప్రజల్లోకి వెలితే బాగానే ఉంటుంది. ప్రజల సమస్యలకు పరిష్కార వేధికగా ఏదో ఒక పేరుతో యాత్ర చేయవచ్చు కానీ రంజిత్‌, ఒక విషయం ఆలోచించు, పార్టీకి చెప్పకుండా ఇలా చేస్తే మనమేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం ప్రారంభించినట్లుగా గగ్గోలు ప్రారంభమవుతుంది.

ముందుగా అధిష్ఠానం అనుమతి తీసుకోవాలి. ముందుగా మన రాష్ట్ర సీనియర్‌ నాయకుల సలహాలు తీసుకుంటే వారి నుంచి వ్యతిరేకత రాదు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునితో, ముఖ్యమంత్రి తో కూడా విషయం చెప్పి, మనం చేసే కార్యక్రమం అంతా పార్టీని మరింత పటిష్ఠం చేసేందుకు ఎలా దోహదపడుతుందో వివరించగలగాలి.వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించాలంటే యువ ఎంఎల్‌ఎ లందరం ఈ ప్రయత్నంలో ఉంటామని ఒప్పించగలిగితే రెండు విధాలుగా ప్రయోజనం కలుగుతుంది, ఏమంటావు అని ప్రశ్నించాడు విజయ్‌.

మీ అవగాహన బాగుంది కానీ అడిగితే ఎవరైనా ఒప్పుకుంటారా అని నా సందేహం, చూద్దాం మీన్నట్లుగా అందరితో సంప్రదించండి, మీ గురించి తెలిసిన అధిష్ఠానం అభ్యంతరం చెప్పకపోవచ్చు, కానీ రాష్ట్రనేతలతోనే తంటా. ఎలా ఒప్పిస్తారో,ఆలోచించి చూడండి అని రంజిత్‌ తన అనుమానాలను ముందుకు తెచ్చారు.

ఎన్నికలకు మరింత సమయం ఉంది కదా. కొంత కాలం తర్వాత ఈ ఆలోచనకు ఒక కార్యరూపం ఇద్దామని మాట్లాడుకున్నారిద్దరు. ఫోన్‌లోనే అధికంగా వారి మాటలు జరుగుతున్నాయి.

ఆదివారం మధ్యాహ్నం లంచ్‌ చేస్త్తుండగా కాల్‌ వచ్చింది విజయ్‌కు. సాయంత్రం నాలుగైదు గంటల మధ్యలోనే వస్తున్నారుగా అంటూ విరంచి ప్రశ్నించింది. ఈ రోజు సెలవు, డాడీకూడా ఇంట్లోనే ఉంటారు. ముందుగానే రండి అందరం కలిసి మాట్లాడుకోవచ్చని అంది.

దేవీ గారి ఆజ్ఞ తప్పక పాటిస్తాడు ఈ దాసుడు అంటూ సినీపక్కీలో జవాబు చెప్పడంతో విజయ్‌పై ఫోన్‌లోనే చిర్రుబుర్రులాడిరది విరంచి, మీరు ఎప్పుడు తిన్నగా మాట్లాడరా ఏమిటీ, ప్రతిసారి ఇలా నన్ను ఆటపట్టించాలనే చూస్తారా? ఏమిటో మీ దోరణి,నాకు మీరు అర్థం కావడం లేదు. ఇంటికి వస్తున్నారుగా చూద్దామని విరంచి అనగానే బెదిరింపులు ఎందుకండీ, మీతో ఎంతో సౌమ్యంగానే ఉంటాను ఇక, దాసుడి తప్పులు దండంతో సరి అంటారు, మీ ఇంటికి రాగానే…అంటే ఏదో అనబోయే లోగా విరంచి, అయ్యో మరింతగా రెచ్చగొడుతున్నారు ఫోన్‌లోనే, కొత్త కొత్త మాటలు నేర్చుకుంటున్నారు. సరే మహానుభావ, మా గృహమునకు విచ్చేసి పావనం చేయండంటూ కాల్‌ కట్‌ చేసింది విరంచి.

తాను ఒక్కడు వస్తే నలుగురు బయలు దేరాల్సి ఉంటుందని ముందే విరంచి చెప్పడంతో బయటికి వెళ్లాలి, సిద్దంగా ఉండండి అని డ్రైవర్‌కు, గన్‌మెన్‌లకు చెప్పాడు విజయ్‌. ఆయన కిందికి వచ్చేవరకు అందరూ కారు దగ్గరే ఉన్నారు. కారు ఎక్కగానే అమీర్‌పేటకు అంటూ డ్రైవర్‌కు చెప్పి, సెల్‌ఫోన్‌ తీసుకొని, వచ్చిన మెసేజీలను చదువుకుంటున్నాడు. ఇంకా సాయంత్రం కాకపోవడంతో ట్రాఫిక్‌ రద్ధీ కొంత తక్కువగానే ఉంది. తాము వెళ్లాల్సిన ఇంటి అడ్రస్‌ చెబుతూ కుటుంబరావు ఇంటికి దారి చెప్పాడు డ్రైవర్‌కు.

ఇదివరకు విన్న కారు హారన్‌ సౌండ్‌ వినగానే లేడీ పరుగులా బయటకు వచ్చింది విరంచి. ఇక్కడే మనం భోజనం చేసి కొంత ఆలస్యంగా బయలు దేరుతామని డ్రైవర్‌కు, గన్‌మెన్‌లకు కూడా చెప్పి ముందుకు అడుగు వేస్తూ కొంత దూరంగా నిలబడిన విరంచిని చూస్తూ అలాగే నిలబడి పోయాడు. ముగ్దమనోహర దృశ్యం తనకు సాక్షాత్కరిస్తున్నదని అనుకుంటూ ప్రతిసారి కొత్త అందాలతో దర్శనమిస్తున్న ఈ లతాంగిని చూడటానికి రెండు కళ్లు చాలటం లేదంటూ నిలబడ్డాడు.

రండి,రండి, అక్కడే ఆగిపోయారేమి, అంటూ స్వాగతం చెబుతున్న విరంచి వెంట మంత్రముగ్దుడై కదిలాడు విజయ్‌. డాడీకూడా ఇంట్లో ఉంటారని విరంచి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, ఎలాంటి కామెంట్స్‌ చేయకుండా మౌనంగానే ఆమెను అనుసరించి సోఫాలో కూర్చున్నాడు. రూం నుంచి బయటకు వస్తూ కుటుంబరావు విజయ్‌ను సమీపంచక ముందే నిలబడి నమస్కారంచేస్తూ చేతులు జోడిరచాడు.

ఎప్పటికప్పుడు మీకు కాల్‌ చేద్దామనుకుంటూనే ఆగిపోయాను. రాజకీయాల్లో మీరు తీరిక లేకుండాఉంటారని. హోటల్‌ సంఘటన తర్వాత పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దల నుంచి, మీ నియోజక వర్గ ప్రజల పరామర్శలు ఉంటాయని, ఈ పరిస్థితుల్లో డిస్టర్బ్‌చేయడం ఎందుకని భావించాం. స్వయంగా కలిసి మాట్లాడుకోవచ్చని నేనే అమ్మాయి చెప్పి ఆహ్వానించమని కోరాను. ఏదీ గాయం, తగ్గుతున్నది కదా అని చేయిని తీసుకొని చూశాడు కుటుంబరావు. గాయం చూసేందుకు విరంచి కూడా చేయి పట్టుకోగానే విజయ్‌కు కరెంట్‌ షాక్‌ తగిలినంతగా ఒక్కసారిగా హులిక్కి పడ్డాడు. సభ్యతకాదని తన ముఖంలో ఉలికిపాటును కనిపించనీయకుండా పక్కకు తిరిగి చూశాడు. ఆమె చేయి తగలగానే వెయ్యి వోల్టుల విద్యుత్‌ తన శరీరంలోకి ప్రవేశించినట్లు అయింది విజయ్‌కు.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి:విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-30)

Leave A Reply

Your email address will not be published.