విజయుడు (ధారావాహిక నవల పార్ట్-32)

నచ్చిన అమ్మాయి స్పర్శలో ఇంత అనుభూతి ఉంటుందని ఆయన అనుకోలేదు. ప్రబంధ కావ్యాల్లో, సినిమా కథల్లో ఇలాంటి అనుభవాల గురించి వివరిస్తుంటే అదంతా వాస్తవం కాదేమోనని అనుకునే వాడు విజయ్, కానీ ప్రత్యక్షంగా తనకు అనుభవమైన ఈ పులకింత నుంచి విజయ్ వెంటనే తేరుకోలేక పోతున్నాడు. ఆయన మానసిక అవస్థ అర్థం అయి కానట్లుగా ఉన్న విరంచి, కాఫీ తీసుకుంటారా అని ప్రశ్నించడంతో లోకంలోకి వచ్చాడు విజయ్.
ఆ, అంటూ ఏదో గిల్టీ ఫీలింగ్‌లో పడిపోయాడు విజయ్.
వంటగదిలోకి విరంచి వెళ్లిపోవడంతో కుటుంబరావు హోటల్ సంఘటనను ప్రస్తావిస్తూ, భుజంగం ఆరోజే తనకు అన్ని వివరాలు చెప్పాడని, అయితే ఇందులో మాజీ మంత్రి ప్రమేయం ఉండకపోవచ్చని కూడా తెలిపాడన్నాడు. ఇది మరెవరి కుట్రనో పోలీసులు ఆరా తీస్తున్నారన్నారు. నేను గతంలోనే చెప్పాను, కొంత సంయమనం పాటిస్తేనే మంచిది.రాజకీయాల్లో పట్టువిడుపులు ఉండాలనేది మీకు తెలియనది కాదు, పెద్దవాళ్లం కదా మా ఆలోచనలు వేరుగా ఉంటాయన్నారు కుటుంబరావు. మీరు నా మంచికే కదా చెబుతున్నారు. తర్వాత నేనుకూడా ఆ కేసు గురించి పెద్దగా పట్టించుకోలేదు. డిజిపి గారే ఒకసారి కాల్ చేసి, నింధితులను పట్టుకున్నామని, త్వరలో వాస్తవాలు వెల్లడవుతాయని చెప్పారు. నేను మళ్లీ ఆయనతో మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు కూడా శ్రద్ధ తీసుకుంటున్నారని నేను అడగలేదు. చూద్దాం అంటూ విజయ్ టాపిక్ డైవర్టు చేశాడు. కాలేజీలో విద్య, విద్యార్థుల ఇబ్బందులు, స్కాలర్‌షిప్పుల మంజూరు, ఉత్తీర్ణత శాతం వగైరా లు మాట్లాడుతుండగా కాఫీ కప్పులతో విరంచి వచ్చింది. ఆమె తనకు కాఫీ ఇస్తున్నప్పుడు కావాలనే ఆమె చేయి తాకడం విరంచి గమనించింది. గురుడు కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాడని ముసిముసిగా నవ్వుకుంది.
ఎంతవరకు వచ్చిందండి, మీ థీసిస్ వ్యాసంగం, ఏదీ ఒకసారి చూపెడుతారా అంటూ విరంచిని అడగడంతో ఆమె తన నోట్స్ తీసుకొని వచ్చింది. పిహెచ్‌డి పై వారి మధ్య చర్చలు ప్రారంభం కావడంతో కోటేశ్వర రావు తన గదిలోకి వెళ్లిపోయాడు. దీంతో వారిద్దరికీ స్వేచ్ఛ లభించినట్లు అయింది.
రాజకీయాలతో బిజీగా ఉన్నారని, మీతో బయటకు రావాలని అనుకుంటున్నా, కుదరదని మధ్యలో ఫోన్ చేయలేదు తెలుసా..
థీసిస్ రాయడానికి పుస్తకాలకే పరిమితం కావద్దు, సమాజాన్ని చదవాలని, ఎక్కడెక్కడో తిరగాలని, ప్రత్యక్షంగా చూడాలని ఇదంతా తెలుసుకోవాలంటే ప్రజల వద్దకే వెళ్లాలని ఏదేదో చెప్పారు కానీ ఇప్పటివరకు ఎక్కడికీ తీసుకు వెళ్లలేదు మీరంటూ గోముగా అడిగింది విరంచి. విజయ్‌తో ఏకాంతంగా ఎక్కడెక్కడో తిరగాలని మనస్సు కోరుకుంటుండంతో తన కోరికను పరోక్షంగా బయటపెట్టింది.
కాలేజీకి వెళ్లి సరదాగా గడిపే రోజులు ఇపుడులేవు. పోస్టు గ్రాడ్యుయేషన్ తర్వాత పిహెచ్‌డిలో చేరినప్పటికీ ఎప్పుడో కానీ విరంచి బయటకు వెళ్లడానికే అవసరం ఉండటం లేదు. పిహెచ్‌డి కి ప్రత్యేకంగా క్లాస్‌లు ఉండవు. తనే స్వంతంగా లైబ్రరీలు, ఇతరత్రా ఎక్కడ సమాచారం లభిస్తే అక్కడకు వెళ్లి రావడం తప్ప, ఏడాదిగా ఆమె ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్నది.ఇంట్లో అమ్మ,నాన్న మాత్రమే. వారితో ఎక్కువగా మాట్లాడటానికి విషయాలు ఏమి ఉండవు. కానీ ఇటీవల విజయ్‌తో పరిచయం ఏర్పడిననాటి నుంచి ఆమెలో సరికొత్త ఆలోచనలు, కొత్త ఊహలు బయలు దేరాయి. విజయ్ ఇంటికి వచ్చిన తొలిరోజే విరంచి మనస్సు పారేసుకుంది. అప్పటివరకు కేవలం చదువుపైనే ఉన్న శ్రద్ధ కాస్తా పక్కకు జారుతున్నట్లుగా ఆమెకు అనిపిస్తున్నది. థీసస్ రాయడంపై మనస్సును మళ్లించలేకపోతున్నది. విజయ్‌పై ద్యాస పెరుగుతున్నా, కంట్రోల్ చేసుకుంటున్నది.
విజయ్ కాలేజీ కుర్రాడు వాడు కాదు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి ఆమె ముందు వాలడానికి. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండటంతోపాటు, ఇతరనేతలకు చాలా భిన్నంగా ఉన్నవాడు విజయ్. రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరున్న నాయకుడు. ఆయనతో పరిచయం కాకముందే విజయ్ గురించి విన్నది, ఇంటివద్ద నాన్న మాట్లాడే అయిదారుగురు రాజకీయ ప్రముఖుల్లో విజయ్ ఒకరు. పైగా పత్రికల్లో, టివిల్లో తరుచుగా ఆయన పేరు ప్రస్తావనకు రావడంతోపాటు కీలక చర్చల్లోనూ ఆయన పేరును ఉదహరిస్తుంటారు విశ్లేషకులు.అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో విజయ్ మాట్లాడుతున్నప్పుడు ఒక్క విరంచియే కాదు ఎక్కువ మంది టివిలకు అతుక్కుపోయి ఉంటారంటే అందుకే ఆయన చేసే వాదన అలాంటిది.ఎత్తుకునే ప్రతి అంశం కూడా ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చర్చను తీసుకువెళ్తాడు. కాకలు తీరిన సీనియర్ నేతలకు, ప్రతిపక్ష నాయకులకు కూడా లేని వాదనా పటిమ ఆయనలో కనిపిస్తున్నది.సాగుతుంది. అన్నింటికి మించి రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తును అందించగలడనే ప్రచారం ఉంది. విద్యావంతుడు.సంస్కారవంతుడు,పైగా అందగాడు, అయిన విజయ్ గురించి ముందుగానే తెలిసినందున విరంచి,తన తొలిచూపులోనే మనస్సును పారేసుకున్నట్లుగా ఆమె మాటల్లో,చేతల్లో కనిపిస్తున్నది.
విరంచి గురించి కూడా విజయ్‌లో ఆలోచన అలజడి ప్రారంభమైంది. ఆమెను మొదటిసారి చూసినప్పటి నుంచి ఆకర్షణకుగురయ్యాడు విజయ్. క్రమంగా అది ఆరాధనగా మారింది. ఆమె గుర్తుకు వచ్చిన ప్రతిసారి తనకు తెలియకుండానే కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తున్నది. వింత అనుభూతి కలుగుతున్నట్లు విజయ్ గుర్తిస్తున్నాడు. అందుకే వారింటినుంచి ఆహ్వానం వస్తే వదులకోకుండా వస్తున్నాడు. ఆమెతో ఎక్కువ సమయం గడపాలనే హోటల్‌కు ప్లాన్ చేసాడు.తనపై దాడి జరిగిన తర్వాత వచ్చిన పరామర్శల కాల్స్‌లో విరంచి నుంచి కొంత ఆలస్యమైనా ఆయన మనస్సు ఆరాటపడిరది ఆమె ఫోన్ కోసమే. ఆమెకు దగ్గర కావాలని మనస్సు చేస్తున్న ఒత్తిడితో విజయ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. థీసిస్ పూర్తి అయి,డాక్టరేట్ డిగ్రీవచ్చే వరకుఆమెను ఎక్కువగా డిస్టర్బ్ చేయరాదని అనుకున్నాడు విజయ్. అందుకే మరన్సును కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నింటికీ మించి తాను బాధ్యతగల రాజకీయ నాయకుడిని కావడంతో ఏ విషయంలో అయినా ఆచితూచి అడుగు వేయడమే ఉత్తమమని నిర్ణయించుకున్నాడు.
ఎవరి మనస్సులో ఏమున్నా, ఇప్పటివరకు అది బయటపడలేదు. కలుసుకున్న ప్రతిసారి మాత్రం వారి భావాల్లో సంఘర్షణ ప్రారంభమవుతున్నది. విరంచి ఆహ్వానంతో వారింటికి వచ్చిన విజయ్‌తో కొద్దిసేపు మాట్లాడి ఆమె తండ్రి లోనికి వెళ్లిపోవడంతో అనుకోకుండా ఇద్దరే ఆఇద్దరు ఒక్కచోట కూర్చొని కొంత ఏకాంతంగా మాట్లాడుకునే సమయం లభించడంతో ముందుగా విరంచియే చొరవ తీసుకుంది. అందుకే తనను థీసిస్‌కు సమాచారం పేరుతో బయటకు తీసుకువెళ్లాలని పరోక్షంగా విజయ్‌తో షికార్ చేయాలనే ఆలోచనను బయటపెట్టింది. ఏ లైబ్రరీల్లో ఏ పుస్తకాలుంటాయో చెప్పాలనుకున్న విజయ్ ఆమె మనస్సు గమనించి, పాఠాలు పక్కకు పెట్టాడు.
విరంచి గారు నేను, నీవు ఇద్దరం ఎక్కడికైనా ఒంటరిగా వెలితే..అని కవితా దోరణిలో మాట్లాడుతున్న విజయ్‌ను అడ్డుకుంటూ,
ఏమిటండీ గారు, గీరు అంటూ, విరంచి అని పిలవండి చాలు. ఇంకా చెప్పాలంటే మీకు అభ్యంతరం లేకుంటే మిమ్ములను విజయ్ అనే పిలుస్తాను. ఎందుకో గార్లు అంటుంటే ఎవరో కొత్తవారితో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తున్నది నాకు. ఎందుకో మీరు నాకు ఆప్తులుగా అనిపిస్తున్నారు. అయ్యో మీకు అభ్యంతరం లేకుంటేనే సుమా అంటూ విరంచి జాగ్రత్తపడిరది.
చాల సంతోషం. నాకు పెద్దగా ఆప్తులు ఎవరూ లేరు. మా అమ్మనాన్న చనిపోయిన తర్వాత ఇంకా ఒంటరినయ్యాను అనిపించింది. ఇంకా చెప్పాలంటే మీ కుటుంబంతో పరిచయం అయిన తర్వాత నాలో కొద్ది ఆశలు చిగురించాయి.మీ కుటుంబం కూడా నన్ను ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నామనే మనోధైర్యం లభిస్తున్నది,మీ నాన్న, అమ్మల నుంచి కూడా.ముఖ్యమంత్రి గారు ఏమోకానీ ఆయన సతీమణి ఒక్కరు నా హృదయానికి దగ్గరగా ఉన్నారు. ఆమెలో నా తల్లిని చూసుకుంటున్నాను. ఆమె కూడా నన్ను అంతకంటే ఎక్కువ మమకారం అందిస్తున్నది. బహుశ ఈ రెండు కుటుంబాలతోనే నాకు కొంత అననుబంధం ఏర్పడిరదని మనస్సును నచ్చచెప్పుకుంటూ ఇతర లోటుపాట్లను పట్టించుకోవడం లేదు.
అంతగా ఎమోషనల్ కాకండి, విజయ్ గారు…చదువుకున్న వారు మీరు. పైగా లోకాన్ని చదివారు, చదువుతున్నారు. మీరు ఒంటరి కారు. మేమే కాదు, మన రాష్ట్రమే మొత్తంగా మిమ్ములను ఆరాధిస్తున్నది. చూశారుగా మొన్ననే ఏమి జరిగిందో? మీపై ఈగ వాలినా సహించని స్థాయిలో మన సమాజం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మీ కోసం ఆందోళనలు,నిరసనలు జరిగాయి. ఒకరిద్దరు ఆత్మహత్యా ప్రయత్నం చేసి మీ పట్ల వారి అభిమానాన్ని చాటుకున్నారు. మీరు ఇదే విధమైన అంకితభావం,నిబద్ధతతో, నిజాయితీగా అడుగులు వేయాలి. ఈ మీ బృహత్తర కార్యక్రమంలో నాకు చిన్న అవకాశం లభించినా అదే నాకు సంతృప్తి. మీ నీడలో నేనూ ప్రజాసేవలో నా వంతు కార్యక్రమం నిర్వర్తించడానికి సర్వత్రా మీ ఆదేశం కోసం వేచి ఉంటాను.మీ ఈ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్న క్రమంలో మన జాతి అంతా మీ వెనుక ఉండే రోజు వస్తుంది.
ఏమండీ, ఏమండీ ఇక ఆపండి, నన్ను ఆకాశానికి ఎత్తేశారు ఆల్‌రెఢీ, ఇక కిందపడిపోతానేమో అనే భయం కూడా కలుగుతున్నది. మీరు నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్లుగా ఈ మీ మాటలు చెబుతున్నాయి. కింది స్థాయి నుంచి వచ్చాను కాబట్టి, వారి కష్టసుఖాలు తెలసిన వానిగా
వారి బాగోగులను కొంత పట్టించుకుంటున్నాను. నా ఒక్కని కృషితోనే అంతా అయిపోదండీ…ప్రభుత్వ సహకరించాలి. ఏమో తెలియదు కానీ ముఖ్యమంత్రిగారు నా కార్యక్రమాలకు ఇప్పటివరకు అడ్డు చెప్పలేదు సరికదా, నేను ప్రస్తావించిన ఏ విషయాన్ని అంత తేలికగా తీసివేయలేదు. పైగా వాటిలోని న్యాయబద్ధతను అర్థం చేసుకొని వాటిపై చర్యలు తీసుకోవడం వల్లనే ప్రజలకు మేలు జరుగుతున్నది. అసెంబ్లీలోనూ నాకు తగిన అవకాశాలు రావడం వల్లనే మాట్లాడగలుతున్నాను. స్పీకర్‌కు పరోక్షంగా సంకేతాలిచ్చినా నాకు అంతసేపు మాట్లాడే అవకాశం రాదు.మీరు గమనించే ఉంటారు, ప్రతిపక్ష నేత మైక్‌లే కట్ చేస్తుంటారు స్పీకర్. మరి మీకు ఎందుకు అంతగా సమయం దొరుకుతున్నది అని మీరు అడిగితే నిజంగా నా వద్ద ఎలాంటి సమాధానం లేదు.నేను మాట్లాడే విషయాల్లో వాస్తవాలున్నాయని స్పీకర్ నమ్ముతున్నారో, అధికార పార్టీ సభ్యుడే కదా అని అనుకుంటున్నారో తెలియదు కానీ స్పీకర్ నేను ఎప్పుడుసమయం అడిగినా వెంటనే అవకాశం ఇస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి సుముఖంగా లేకపోయినా ఇబ్బందియే.
సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికార పార్టీ సభ్యులు సాధారణంగా మాట్లాడరు. అసెంబ్లీ ఎన్నికల్లో సగానికి మించి సీట్లుసాధించిన పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి వారందరూ పాలక పక్షమే. పాలకపక్ష నేతగా ముఖ్యమంత్రి, తన మంత్రివర్గ నిర్మాణం తర్వాత అయిదేళ్లపాటు అధికారంలో ఉండి పాలన సాగించడం ప్రజాస్వామ్య విధానం. ప్రభుత్వ వ్యతిరేకత అంటే పార్టీ క్రమశిక్షణ కూడా ఉల్లంఘించినట్లే. ఎవరైనా క్రమశిక్షణ పాటించలేదని భావిస్తే, పార్టీ క్రమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ లేదా బహిష్కరణ వేటు వేస్తుంది.
అయితే విజయ్ విషయంలో సిఎం కానీ, పార్టీ కానీ తప్పుగా భావించలేదు. పార్టీ పట్ల అంకితభావంతో ఉంటున్న విజయ్ క్రెడెన్షియల్స్ అందరికంటే అధికమే. అధిష్ఠాన వర్గంలోనూ అందుకు విజయ్ పట్ల ప్రత్యేకంగా వ్యవహరిస్తుంటుంది. బహుశ ఇదే కారణంతోనే ముఖ్యమంత్రిపై ఎన్ని ఒత్తిడులు వచ్చినా విజయ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కనీస సాహసంచేయడం లేదనే అనుమానాలున్నాయి. విజయ్‌కు ఇది తెలుసో లేదో కానీ ఇప్పటివరకు ఆయన, ఏ అధిష్ఠానం నేత తోనూ స్వయంగా కలిసి మాట్లాడిన సందర్బాలు లేవు.
కుటుంబరావు ఇంట్లో డిన్నిర్‌కు వచ్చిన విజయ్,విరంచి మరింత సన్నిహితంగా మాట్లాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. అప్పుడే విరంచి అమ్మ మరోసారి కాఫీ తాగుతారా అంటూ హాల్‌లోకి వచ్చింది. భోజనానికి మరింత సమయం ఉంది కదా తాగుతామని విరంచియే సమాధానం చెప్పింది. విజయ్,విరంచిలు అలా మాట్లాడుకోవడం ఆమెకు ఎంతో సంతోషంగానే ఉంది. ఒంటరిగా,దిగులగా, ఏవో పుస్తకాలు వేసుకొని కూర్చుండే విరంచి, విజయ్ సమక్షంలో ఎంతో ఆనందంగా కనిపించింది తల్లికి. వారిద్దరి స్నేహం, మరింత దగ్గరై, పెళ్లివరకు దారితీసే ఎంతో బాగుంటుందని ఆమె ఇప్పటికీ అనేక సార్లు అనుకుంటున్నది.
అబ్బా, మిమ్ములను కదిలిస్తే చివరికి రాజకీయాల్లోకే వెళ్లారు బాబు. మరేదైనా విషయం మాట్లాండండి అంది విరంచి.
అవునా, మరి నేను రాజకీయ నేతనే కదా..ఆషామాసి నాయకున్ని కాదని ఇప్పుడే మీరు సెలవిచ్చారు కదండీ అంటూ సాగదీసాడు విజయ్.
ఇప్పుడే అనుకున్నాం కదా అండీలు, గార్లు వద్దని మళ్లీ ఏమిటండీ బాబూ..
అదిగో మీరు అంటున్నారు కదా …అండీ?
సరే, ఇప్పటి నుంచి అనను గాక అనను, విజయ్, విజయ్, విజయ్ అంతే ఓకేనా
గుడ్ విరంచి, విరంచి,విరంచి
వారిలో ఇప్పుడిప్పుడే ప్రేమ భీజం మొలకెత్తడం ప్రారంభమైనట్లుగా ఉంది, ఒకరితో మరొకరు మరింత చనువుగా మాట్లాడుకునేందుకే ఈ ప్రయత్నాలు అన్నట్లుగా సంభాషణలు జరుగుతున్నాయి.
ఊ. ఇప్పుడు చెప్పు చదువా, ఇంకేదైనా…అంటూ గొణికాడు విజయ్.
అబ్బో, నేను ఎక్కడికి రమ్మనా అక్కడికి వస్తారా? కనీసం రోజుకోసారి కలిసి టీ లేదా కాఫీ మనం కలిసి తాగడానికి వీలవుతుందా? లేదూ రెండు,మూడు రోజులకోసారి కలిసి భోజనం చేసేలా అవకాశం ఇస్తారాÑ ఫోన్‌లో అయినా రోజు ఒకసారైనా మాట్లాడుతారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో ఈ వానలో తడిసి ముద్దయిపోయినట్లుగా….అయ్యో చలిచలి అంటూ విజయ్ వణకడం ప్రారంభించారు.అది గమనించిన విరంచి,
ఏమిటిది, నేను సీరియస్‌గా మాట్లాడుతుంటే ఈ కొత్త యాక్షన్ అంటూ కళ్లు పెద్దవి చేసింది. పగలబడి నవ్వండం విజయ్ వంతు అయింది.
లేకుంటే ఏమిటండీ ఇది స్కూల్లో టీచర్ వరుస ప్రశ్నలతో విద్యార్థులను అదరగొట్టినట్లుగా నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఏమి చేయాలి మరి? నాకు ఎంత సమయం దొరుకుతుందో మీకు తెలుసు, అన్నీ తెలిసిన మీలాంటి వారే నా గురించి ఇంతగా ఎక్స్‌పెక్టు చేస్తుంటే ఎలా అని ఆలోచిస్తున్నాను.
అవును మీరు నాకోసం ఎంతగా ఆలోచిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఏమీ తెలియని దాన్ని కాదంటూ బుంగమూతి పెట్టింది విరంచి.
ఇలా ఇంకా బాగున్నావు విరంచి అంటూ చిరునవ్వుతో ఆమెను చూసాడు విజయ్. మళ్లీ టాపిక్ మార్చుతున్నారు. ఎలా మనం కలుసుకునేది మీరే ఆలోచించండి అంటూ మారం చేస్తున్నది విరంచి.
వెంటనే ఏమి చెప్పాలో పాలుపోవడం లేదు విజయ్‌కు. కొత్తగా గన్‌మెన్‌ల సమస్య. ఎక్కడి వెళ్లినా వారు తోడుంటారు.డ్రైవర్, వారిద్దరు,ఓహో, ఏమిటి చేయ్యడం, డిజిపి గారు చెప్పడం ఎట్టిపరిస్థితిలోనూ ఒంటరిగా వెళ్లవద్దు, ఇంటలిజెన్స్ రిపోర్టుల ప్రకారం నీకు రక్షణ ఎప్పుడూ అవసరమని, ఎలా ఈమెను సముదాయించడం…తాను మనస్సులో అనుకుంటున్నాడనుకున్నాడు కానీ అంతా విరంచికి వినపడిరది.
ఇంకా ఏమనిపిస్తున్నది, నావల్ల సమస్యలు పెరుగుతున్నాయనే పెద్ద ఆలోచనే చేస్తున్నారే? వద్దులెండి. ఇలాగే ఉందాం. ఇదే విధంగా ఎప్పుడో ఒకసారి కలుసుకుందాం. నా కోసం అయ్యో మీరు బాధపడకండి నేను చూడలేను అంటూ వ్యంగ్యంగా అంది విరంచి.
ఏమిటీ? నీకు టెలిపతి కూడా తెలుసా, నేను మనస్సులో ఏదనుకున్నా నీకు వినిపిస్తుందా. నిజమా అంటూ అదే స్థాయిలో విజయ్ మాటలు విసిరాడు.
చాల్లెండి సంబరం, ఏదో అమ్మాయి అడిగుతున్నది, అలా వెళ్లి ఐస్‌క్రీం అయినా కలిసి తిందామనే ఆలోచన కాకుండా నేనేదో మీ ముందటి కాళ్లకు బంధం వేస్తున్నట్లుగా దీర్ఘాలోచనలు సాగిస్తుంటే ఇతరత్రా అమ్మాయిలయితే మరోలా వ్యవహరించే వారు. నేను కాబట్టి, పద్దతిగా పెరిగాను కాబట్టి, మీ సమస్యలన్నీ తెలుసు కాబట్టీ, ఇంకా మీరంటే పడిచేస్తున్నానంటూ విరంచి నిర్వేధం ప్రకటించింది. విజయ్‌కు ఆమె మనస్సు అర్థమవుతున్నా, తన నిస్సహాయతను తానే తిట్టుకున్నాడు.
స్నేహం నుంచి ప్రేమవైపు అడుగులు వేస్తున్న తరుణంలో తలెత్తుతున్న మానసిక సంఘర్షణ వారి చర్చల్లో వ్యక్తమవుతున్నది. ప్రేమ విత్తనం మెలకెత్తి చిగురులు తొడగాల్సిన స్థితి అది.కానీ వారి మధ్య స్వీట్ నథింగ్స్ మాటలకు బదులు ఇతరత్రా వాదనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు వేరు వేరు మార్గాల్లో జీవనయానం సాగుతున్న వ్యక్తులు వారు. కొద్ది కాలం పరిచయంలో ఒక్కసారిగా వారి జీవన విధానం ఒకేదిశకు చేరడానికి మరికొంత సమయమే పడుతుంది. సగటు అమ్మాయిలకు ఉండే కోరికలే విరంచికి ఉన్నాయి. వాటిని తప్పుపట్టడానికి వీలు లేదని విజయ్‌కు తెలుసు. ఆమె ప్రపంచం అది. సినిమాలు చూడటం, కథలు,నవలలు చదవవడంతో ఏర్పడిన ఊహాలోకంలో విహరిస్తున్న వయస్సు ఆమెది. పైగా చిన్నతనం నుంచి కూడా కష్టాలు అంటే ఏమిటో తెలియకుండా తండ్రి నీడలో ప్రశాంతంగా ఆటుపోట్లకుఅవకాశం లేకుండా పెరిగిన అమ్మాయి మరో విధంగా ఎలా ఆలోచించగలదు. కానీ తన జీవన శైలి వేరు. బాల్యం నుంచి పడరాని పాట్లు పడుతూ,పేరంట్స్ కష్టాన్ని దగ్గర నుంచి గమనించి, స్వయం కృషితో పై చదువులు చదువుకొని కొద్ది, రాజకీయంగా ఎదుగుతున్న జీవితం తనది.
విరంచి అనురాగాన్ని వదులుకోవాలని లేదు విజయ్‌కు. పైగా ఆమె కోరికలో అనౌచిత్యం కూడా కనిపించలేదు. తానే సమస్యను ఎందుకు భూతద్దంలో పెట్టి చూస్తున్నాడు. రాజకీయ నాయకునికి ఇతర వ్యాపకాలు,వ్యక్తిగత బంధాలు, అనుబంధాలకు తోడు కుటుంబపర సమస్యలు ఉండవా? నా ఆలోచనలో లోపం ఉందా? ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి నడిస్తేనే తాటాకులు కట్టే సమాజం మనది.అందుకే విరంచితో రోడ్డుపైనో, హోటల్ లేదా పార్కులో ఎక్కడైనా ఏ కొంత సన్నిహితంగా ఉన్నా, మాపై విష ప్రచారం జరుగుతుందనే ఆందోళన విజయ్‌ను కలిచివేస్తూ, ఆమె ప్రతిపాదనకు వెంటనే బదులివ్వలేకపోయాడు. డ్రైవర్,గన్‌మెన్‌లను వాహనం దగ్గర అండమంటే అక్కడే ఉంటారు, వారిది సమస్య కాదు కానీ జనం ఆలోచన విధానం వల్ల తన భవిష్యత్తు రాజకీయాలతోపాటు విరంచిపై ఎలాంటి మచ్చ రాకుండా జాగ్రత్తపడటానికే ఇదంతా అని విజయ్ తన ఆలోచనా దోరణిని సమర్థించుకున్నాడు. అయితే ఇదేమి విరంచి చెవులకు సోకకుండా, బయటకు రాకుండా అంతా మనస్సులోనే చెప్పుకున్నాడు.
విరంచి,సరే ఆదివారం నాడు మనం బయటకు వెళ్తున్నాం. అయితే నీ థీసిస్‌కు, మన సరదాకు కూడా పనికి వచ్చేలా, అంటే రెండు విధాలుగా ప్రయోజనకరంగా ఈ కార్యక్రమం ఉంటుంది. ఆ విధంగా నేను ప్లాన్ చేస్తాను. ఇది కూడా నీవు అంగీకరిస్తేనే. థీసిస్ కోసం అంటే మీ నాన్న కూడా వ్యతిరేకించరు ఓకేనా.
సరే కానీయండి, మీకు ఇబ్బంది కలుగకుండా నేను నడుచుకుంటాను. నాకు తెలుసు మీ రెందుకు ఇంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నారో. పలుకుబడి కలిగిన రాజకీయ వేత్త, ఒక అమ్మాయితో కనిపిస్తే, ఎవరో ఒకరు ఫోటో తీసి సామాజిక మీడియాలో వైరల్ చేస్తారు. యూట్యూబ్‌లో వేలాది వ్యూస్ వస్తాయి. మన సరదా మరొకరికి వినోదం కారాదు. ఇలా ఫోటోలు తీయడం, కామెంట్స్ చేయడం కొందరికి సరదా. ఇలాంటి వాటికి తెలిసీ మనం అవకాశాలు ఇవ్వడం ఇద్దరికీ మంచిది కాదు. నేనే తగిన ఆలోచన లేకుండా మీకు ఇబ్బంది కలిగేలా మాట్లాడాను. మరో విధంగా ప్లాన్ చేసుకుందాం. మెసేజీలు పంపుకుందాం, చాట్ చేసుకుందాం. చూడాలనుకుంటే వీడియో కాల్స్‌లో మాట్లాడుకుందాం. ఆధునికి సాంకేతిక పరిజ్ఞాం ఎంతో ఉంది.ప్రపంచమే కుగ్రామం అయింది. దేశ ప్రధానులే వర్చువల్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. మీ జాతీయ నేతలు కూడా ఇదే విధానంలో మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీకు తెలియంది కాదు కానీ,మన ప్రధాని కూడా 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశాలు నిర్వహించారు. మారిన ఈ పరిస్థితుల్లో మీతో కలసి బయటకు వెళ్లాలనే నా ఆలోచనకు నేనే గిల్టీగా ఫీల్ అవుతున్నాని చెబుతున్న విరంచి వైపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు విజయ్.
ఇంకా చెప్పు అన్నట్లుగా ఉన్నాయి ఆయన చూపులు. సిగ్గుపడిపోయింది ఆమె. అలాగే చూస్తూ ఉండిపోయారు కొద్ది సమయం. ఇంకా అలాగే ఎంతసేపు ఉండిపోయేవారో కానీ…. కాఫీ తెస్తున్న అంటూ రెండు కప్పులతో వచ్చింది విరంచి తల్లి. ఏదో తప్పు చేసి, దొరికిపోయినట్లుగా ఇద్దరూ చూపు దించుకొని కాఫీ అందుకున్నారు.
అమలిన శృంగారం తెలుసు కదా, ఇప్పుడు మన చూపులకు అదే అర్థం ఏమో అన్నాడు విజయ్. అర్థమై, అర్థం కానట్లుగా చూసింది విరంచి.
విజయ్ మాటలు వెంటనే అర్థం కావు విరంచికి ఎక్కడెక్కడికో పోతాయి అతని ఆలోచనలు. అవును తాను చదువింది ఈ అమలిన శృంగారం గురించి. ఇద్దరి శరీరాల కంటే మనస్సులు కలిస్తే అందులో కూడా అనుభూతి పొందవచ్చనేది దీని అర్థం.
మహాభాగవతంలో పోతన వర్ణించిన రాధా,కృష్ణుల ప్రణయం దీనికి మంచి ఉదాహరణగా చెబుతారు. శ్రీకృష్ణునికి అష్ట భార్యలున్నా,పదహార వేల మంది గోపికలున్నారనే కథలు ఎలా ఉన్నప్పటికీ రాధా,కృష్ణుల ప్రేమయే కీలకమని అంటారు. ప్రేమకు నిర్వచనం వారిద్దరే. వద్దు లెండి ఆ విషయం,
ఎందుకో తెలియదు కానీ, విరంచిని చూసినప్పుడు విజయ్‌కు కావ్యాలు, కథలు గుర్తుకు వస్తుంటాయి. ఇద్దరికి సాహిత్యంలో అధిక పరిచయం ఉండటమే కారణం కావచ్చు.
ముందుగా మీ నాన్న కాలేజీకి వెళ్లి, అక్కడ చదువుకుంటున్న పేద విద్యార్థుల కష్టనష్టాలు, వారి కుటుంబ చరిత్ర, ఇక్కడ హాస్టళ్లలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుందామా అంటూ ప్రతిపాదించాడు విజయ్.
వెళ్లవచ్చు కానీ, మనం అక్కడ కలిసి తిరిగిన తర్వాత ఎవరో మీడియాకు చెబితే ఆ ప్రచారం నాన్న కాలేజీకి వ్యతిరేకంగా ఉంటే, వద్దు లెండి, మరో విషయంపై ఆలోచించండి అంది విరంచి.
బడుగు, బలహీన వర్గాల నివాసాలు, అక్కడి పరిస్థితులు, తగిన సదుపాయాలు లేకపోవడం, అద్వాన్నంగా ఉన్న రోడ్లు, మరుగుదొడ్లు లేని దుస్థితి, తాగునీరు కూడా లేని విషయాలను మీరు అధ్యయనం చేయవచ్చు కదా అని విజయ్ సూచించగా వద్దు మరోసారి చూద్దామంది విరంచి.
పోనీ మరి, ప్రతి ఆదివారం మనం కలిసేలా ప్లాన్ చేసుకుందామా? అంటూ విజయ్ కొత్త ప్రతిపాదన చేశారు.
అయితే మీకు ప్రతి సన్‌డే మా ఇంట్లో ఆతిథ్యం ఉంటుంది,అంటూ నవ్వింది విరంచి
ప్రతిసారి మీ ఇంట్లో అంటే బాగుండదు.ఒకసారి నా ఆతిధ్యం కూడా ఉండాలి, అంటే వారం మీరు, వారం నేను, ఏమంటావు?
సరే, నేను మాత్రం మా ఇంట్లోనే అంటాను, ప్రతి ఆదివారం మా ఇంట్లో, ఇతర రోజుల్లో మీకు సమయం ఉంటే చెప్పండి అక్కడికి నేను వస్తాను, ఒక్కదానిని రమ్మంటే నేను మాత్రమే వస్తాను, మీకున్న సందేహాల కోసం అయితే అమ్మను తీసుకువస్తా? ఓకే నా అంటూ తిరిగి బాల్‌ను విజయ్ కోర్టులో వేసింది.
అమ్మో మీ ఆడాలంటే అందుకే నాకు భయం, ఏదో ఒక కిరికిరి పెడుతున్నారంటూ నవ్వాడు విజయ్.
మీకూ ఇలాంటి ఆలోచన ఉందన్న మాట.నేను ఏమన్నానండీ, మన ఇద్దరమే ఒక చోట ఉంటే వచ్చే, అపార్థాలకు తావివ్వకుండా అమ్మను కూడా వస్తుందని మాత్రమే కదా..సరే మీరే ప్లాన్ చేయండి అంటూ మౌనం వహించింది ఆమె.
రాత్రి ఢన్నిర్ చేస్తూ కూడా వారిద్దరు చనువుగా మాట్లాడుకుంటుంటే భుజంగరావు,కానీ ఆయన భార్య కానీ ఆసక్తిగా వింటూ జోకులువేసుకుంటూ భోజనం ముగించారు. అంతకుముందే విజయ్‌తో వచ్చిన వారికి ఆహారం అందించారు. వారి నుంచి వీడ్కోలు తీసుకుంటూ బయలు దేరిన విజయ్‌కు గేటు వరకు వచ్చి సాగనంపారు విరంచి, వాళ్లనాన్న.
కుటుంబరావు తన గదిలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్నాడు. వంటింటిలో అన్ని సర్దుకొని గదిలోకి వచ్చింది ఆయన భార్య. విజయ్ వెళ్లగానే విరంచి, తన గదిలోకి వెళ్లి,అప్పటికే నిద్రపోయింది.
ఏమండీ, ఇది గమనించారా? విజయ్ అంటే అమ్మాయికి ఎంతో అభిమానం ఉన్నట్లుగా కనిపిస్తున్నది. మొన్న హోటల్‌లో భుజంగరావు అన్న నాటి నుంచి నా మనస్సులో అదే ఆలోచన మెదలుతున్నది. మీ అల్లుడా అంటూ ఆయన ఏ క్షణాన అన్నాడో కానీ అప్పటికే నా మనస్సులో ఉన్న మాటను ఆయన అన్నాడని అనిపించింది. ఈ రోజు చూశారుగా…విజయ్ ఉన్నంత సేపు అమ్మాయి ఎంత సంతోషంగా ఉందో.. ఎందుకో వారిని ఒకటి చేస్తే బాగుంటుందని మీకు చెప్పాలని ఉన్నా, మీరు ఏమంటారో అని ఇన్నాళ్లు ఓపిక పట్టాను అంటూ చెప్పిన భార్య వైపు చూసి,
పిహెచ్‌డి పూర్తి చేసి, కాలేజీలో అధ్యాపకురాలిగా చేరే వరకైనా పెళ్లి మాట ఎత్తవద్దని ఇప్పటికే విరంచి చెప్పింది కదా అందుకే నేను ఈ విషయం ప్రస్తావించడం లేదు. ముందుగా అమ్మాయిని కదిపిచూడు. ఆమె సరే నంటే మనంప్రయత్నిద్దాం. వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటే మనకు ఇంకా కావాల్సింది ఇంకేముంటుంది.కొంత కాలం ఆగి వారే మనకు చెబుతారేమో చూద్దాం.
ఆడ పిల్లవాళ్లం కదా మనమే చొరవ తీసుకోవాలి. అబ్బాయితో మీరే మాట్లాడి చూడండి. వాళ్ల పెద్దవాళ్లను అడుగుతామని. ఎవరూ లేరన్నాడు కాబట్టి,ఆయనతోనే ప్రస్తావించ వచ్చు.
సరే కానీ, నీవు ముందుగా అమ్మాయి మనస్సుతెలుసుకో అంటూ కుటుంబరావు నిద్రకు ఉపక్రమించాడు.