విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-33)

అసెంబ్లీలో మాటల తూటాలు

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో అక్రమాలపై చర్చకు విపక్ష సభ్యులు ఇచ్చిన నోటీస్‌పై చర్చకు స్పీకర్‌ అనుమతి ఇచ్చారు.

వ్యవసాయాధార రాష్ట్రం మనది, రైతులకు సాగు చేసుకునేందుకు అస్యూర్డు నీటిని అందించడం ద్వారా వారు పంటలు పండిరచుకునే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ పరంగా ప్రాజెక్టుల నిర్మాణం కోసం అవలంభిస్తున్న విధానాలే లోపభూయిష్టంగా ఉన్నాయంటూ విజయ్‌ తన చర్చను ప్రారంభించారు. అవును ప్రాజెక్టుల నిర్మాణం అత్యవసరమేకానీ, అవి ఎవరి ప్రయోజనాల కోసం కడుతున్నామో వాటి నిర్మాణ వ్యయం పరిశీలిస్తే వెల్లడవుతున్నది. ముందుగా అంచానా వ్యయం రూపొందించడంలోనే అక్రమాలకు అవకాశం ఇస్తున్నారు. వందరూపాయలు ఖర్చు అయ్యే ప్రాజెక్టుకు నూటయాభై రూపాయల ఖర్చు అవుతుందని రికార్డులు రూపొందించి,టెండర్లు పిలుస్తున్నారు. తగిన అర్హతలు ఉన్న కంట్రాక్టర్లే టెండర్లు వేయాలని మరో నిబంధన తెస్తున్నారు. ఇలాంటి వారు అతి తక్కువ మంది ఉంటారు. వారు రింగ్‌ అవుతూ అధిక ఆదాయం వచ్చే విధంగా టెండర్లు వేస్తున్నారు. దీంతో అదే టెండర్‌ను ప్రభుత్వం ఖరారు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నది. అంటే ప్రభుత్వ యంత్రాంగంతో దగ్గర సంబంధం ఉన్న వారే టెండర్లు దక్కించుకుంటున్నారు. ఇక వారికి మెషినరీ తరలించుకోవడానికి అంటూ ఏ మాత్రం పని చేయకముందే నిధులు కొంత అందిస్తున్నది ప్రభుత్వం. టెండర్ల నిబంధనలు గతంలో ఉన్న ప్రకారం పని చేసిన తర్వాత ఆ మేరకు ఇంజనీరింగ్‌ విభాగం సర్టిఫై చేస్తేనే బిల్లులు ఇవ్వాలి. కానీ అడ్వాన్స్‌ను అందించిన ఇరిగేషన్‌ శాఖలో పెద్ద స్థాయి వరకు కమిషన్లు అందుతున్నాయనేది బహిరంగ రహస్యం. ఇదంతా అందరికీ తెలిసే జరుగుతున్నది.

ఈ పరిస్థితులో ప్రాజెక్టులు నిర్మించేది రైతులకు సాగునీరు అందించడానికా లేక పాలకులకు కమీసన్ల కోసమా అనే మీమాంశ ముందుకు వస్తున్నది. కంట్రాక్టర్లకు పనులు కల్పించడానికి, అధికారంలో ఉన్న పెద్దలకు భారీగా ముడుపులు లభించడానికి మాత్రమే ఈ పనులని గట్టి వాదనలు వస్తున్నాయి. దీనికి ఇరిగేషన్‌ శాఖా మంత్రి ఏమి సమాధానం చెబుతారని నిలదీశాడు విజయ్‌. ఇక జరుగుతున్న ఇతర ప్రాజెక్టుల పనులపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి.నాశిరకంగా జరుగుతున్న ప్రాజెక్టు పనులు అక్కడక్కడ వచ్చిన లీకేజీలు, నీరు పెద్దయెత్తున గ్రామాలకు చేరిన వార్తలు కూడా అందరికీ తెలిసిందే. ఈ స్థాయి అవినీతి జరుగుతుంటే పాలనా యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. కేటాయింపుల్లో 40 శాతం నిధులు చేతులు మారుతున్నాయి. ప్రజాధనం ఈ కొందరి జేబుల్లోకి వెళ్తున్నది.అక్రమాలను వెలికితీసేందుకకు పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలంటే శాసనసభా కమిటీని నియమించాలని విజయ్‌ డిమాండ్‌ చేశారు.

ప్రతిపక్షం నుంచి కంటే తన పార్టీ సభ్యుడే, అవినీతి అంటూ దుయ్యబట్టడంతో నీటిపారుదల శాఖా మంత్రి నిరుత్తరుడయ్యాడు. విజయ్‌ వాదనకు ఇతర పక్షాలు కూడా మద్దతు తెలిపాయి. అవును విచారణ జరగాల్సిందేనని ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. సభ సజావుగా నిర్వహించడానికి అవకాశంలేకపోవడంతో సభను వాయిదా వేసి,స్పీకర్‌ తన ఛాంబర్‌లోకి వెళ్లిపోయాడు. ఇరిగేషన్‌ మంతి ఇదే సమయంలో ముఖ్యమంత్రి ఛాంబర్‌లోకి వెళ్లి క్వశ్చన్‌ మార్కు మొఖంతో కూర్చున్నారు. ఇతర సభ్యులుకూడా సిఎం వద్ద ఉండటంతో కొంత సమయం మౌనంగా ఉండిపోయాడు మంత్రి.

ముఖ్యమంత్రి తన ఛాంబర్‌లో ఉన్నప్పటికీ విజయ్‌ ప్రసంగాన్ని టివిలో చూసాడు. ఆయన పరిస్థితి కూడా అడకత్తెరలో పోకచెక్కలా ఉంది.తానే సందిగ్దంలో ఉంటే ఇక మంత్రికి ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు. ఇతర విజిటర్లు వెళ్లిపోగానే బెల్‌కొట్టి పిఎను పిలిచి, కొద్ది సేపు ఎవరిని లోపలికి అనుమతించకుండా చూడమని ఆదేశించాడు.ఊ..చెప్పు అన్నట్లుగా చూసాడు ముఖ్యమంత్రి.

ఏమి చెప్పమంటారు? అంతా మీకు తెలిసిందే కదా.. విజయ్‌ వాదనకు ఇతర పార్టీల సభ్యులు కూడా తోడయితే చర్చ ఎటు దారితీస్తుందోనని నాకు భయం వేస్తున్నది. అవినీతి విచారణ వరకు అంగీకరిస్తే, మంత్రి రాజీనామా చేయాలని కూడా డిమాండ్‌ చేస్తే నా రాజకీయ భవిష్యత్తు ఏమిటని, ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఎలాంటి అవినీతి జరగలేదనే వాదన వినిపించు. ఈ మేరకు శాఖా పరంగా ఉన్న నిబంధనలు వివరించాలి. సభ్యులకు మరో అవకాశం ఇవ్వకుండా రూల్స్‌ను పటిష్టంగా ఉన్నాయని, విజిలెన్స్‌ విభాగం ఎప్పటికప్పుడు విచారణ చేస్తుందని సోదాహరణగా చెప్పాలి.

దీంతో విపక్ష సభ్యులు పట్టు సఢలించుకునేలా పరిస్థితి మారాలి. సాయంత్రం విపక్షనేతలకు కాల్‌ చేసి, ఏదో విధంగా వారు సంతృప్తి పడేలా మాట్లాడు. అవసరమైతే కంట్రాక్టర్‌ను వారి వద్దకు పంపాలి. వారికి ఏమి ఇవ్వాలో ఎలా సర్దుబాటు చేసుకోవాలో కంట్రాక్టర్‌కు బాగా తెలుసు. ఇదంతా చాలా గుట్టుగా సాగాలి. ముఖ్యంగా మన పార్టీ సభ్యుడే అయినా విజయ్‌కు ఏ మాత్రం తెలియకుండా జాగ్రత్తపడాలి. విజయ్‌ కార్యమ్రాలను పరిశీలించాలని నేను ఇంటలిజెన్స్‌ వర్గాలకు చెబుతా.

మీ మీదనే నమ్మకం పెట్టుకున్నా సార్‌. ఈ గండం నుంచి ఎలాగైనా గట్టెక్కాలి. లేకుంటే ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది. అన్నాడు మంత్రి.

ప్రభుత్వం సంగతి నేను చూసుకుంటా కానీ,అధిష్ఠానం నుంచి ఏమైనా కాల్‌ వస్తే మన ఇద్దరికీ కష్టమే, రాష్ట్ర ఇన్‌చార్జీని మనవైపు తిప్పుకున్నాం కానీ,పార్టీ అగ్రనేతలు ఏమంటారో అనేది నా భయం అంటూ ముఖ్యమంత్రి కొంత ఆందోళనగా కనిపించాడు.

మీరే భయపడితే ఎలా సార్‌, ముందుగా మనం విజయ్‌ను కంట్రోల్‌ చేసి ఉంటే బాగుండేదేమో. వాడి వల్లనే ఎక్సయిజ్‌ శాఖ నుంచి మంత్రి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పుడే మీరు వాన్ని పిలిచి హెచ్చరిస్తారనుకున్నా.

ఏమని పిలిచి మాట్లాడమంటావు? అవినీతి జరిగింది నిజమే నీవు చూసి చూడనట్లుగా ఉండమని చెప్పమంటావా? నేను చెప్పినా వాడు వింటాడా, నాకు పాత్ర ఉందని ఒప్పుకున్నట్లు వాడు మీడియాకు చెబుతాడు. ఇప్పటివరకు నాకు అయినా గౌరవం ఇస్తున్నాడు. అదీ పోతుంది. పైగా వాడికి హస్తిన వాళ్లతో సంబంధాలున్నాయని అంటున్నారు. వాడిపై ఈగ వాలినా పై వాళ్లు మనలను బాధ్యులుగా చేస్తారు. మనమే కొంత తగ్గి ఉండాల్సి వస్తున్నది వాడి విషయంలో అంటూ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసాడు సిఎం.

ముఖ్యమంత్రి నిస్సహాయతను చూసి మళ్లీ ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు ఇరిగేషన్‌ మంత్రికి.

వాడు అన్ని వాస్తవాలే మాట్లాడుతున్నాడు. ఎవరు వానికి ప్రభుత్వ సమాచారం లీక్‌ చేస్తున్నాడో కూడా మనం కనిపెట్టాలి. సెక్రటరీలు కూడా కమిషన్లు తీసుకుంటున్నారు కదా వాళ్లు చెబుతారంటావా అంటూ మంత్రి వైపు చూసాడు సిఎం.
లేదండి కంట్రాక్టర్లు వాళ్లను నా కంటే బాగా చూసుకుంటున్నారు. బిల్లులు మంజూరు చేస్తున్నప్పుడల్లా ముందుగానే సూట్‌కేసులు వాళ్ల ఇంటికే వెళ్తున్నాయి.

సచివాలయంలో వాడు ఎవరెవరిని కలుస్తున్నాడో కూడా నిఘా వేయమని చెబుతాను. అసెంబ్లీ వాయిదా పడిరది కదా రేపు చూద్దాం ఏమి జరుగనుందో..విజయ్‌కు పెద్దగా అవకాశం ఇవ్వరాదని, ఇచ్చినా ఎక్కువ సమయం వద్దని పరోక్షంగా స్పీకర్‌కు అర్థమయ్యేలా చెప్పు. అవసరమైతే నా మాట కూడా అదేనని వివరించు అంటూ సీటులో నుంచి లేచాడు సిఎం.

ఛాంబర్‌ నుంచి బయటకు రాగానే వేచి ఉన్న మీడియా ప్రశ్నలకు నో కామెంట్‌ అంటూ ముందుకు సాగాడు. అసెంబ్లీలో కీలకమైన శాఖపై పెద్దయెత్తున ఆరోపణలు వస్తే, ప్రభుత్వం ఏమి సమాధానం చెప్పలేకపోతే…అంటూ సీనియర్‌ రిపోర్టర్‌ ప్రస్తావించగానే వెనుదిరిగిన సిఎం.. మీకంతా తెలుసు, శాసనసభ జరుగుతున్న సమయంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి జవాబు అయినా అసెంబ్లీలోనే చెప్పాలని. తెలిసీ కూడా నన్నుఅడిగితే ఎలాగండి అంటూ నవ్వుతూ కారెక్కాడు సిఎం.

ముఖ్యమంత్రి సులువుగానే తప్పించుకున్నాడంటూ విలేకర్లు కూడా వెళ్లిపోయారు.

ఇరిగేషన్‌ మంత్రి అసహనంగా ఇళ్లు చేరుకున్నాడు. వెంటనే కంట్రాక్టర్‌కు కాల్‌ కలపాలని పిఎకు ఆర్డర్‌ పాస్‌ చేసాడు. అసెంబ్లీలో ఈ విషయంపై చర్చ జరుగుతున్నట్లు తెలియగానే కంట్రాక్టర్‌ కూడా అసెంబ్లీ సమీపంలో ఉన్నాడు. మంత్రి లేదా ముఖ్యమంత్రి నుంచి పిలుపు వస్తుందని ఆయనకు తెలుసు. గతంలోనూ ఇలాంటి సందర్భాల్లో వాళ్లు ఏమి ఆదేశిస్తారు, తానేమి చేయాలో కూడా ఆయనకు తెలుసు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలియగానేమి అవరం వస్తుందోనని, బ్యాంకుల నుంచి ఒకేసారి పెద్దమత్తం డ్రా చేసుకోవడం కష్టమని గత అనుభవాల దృష్ట్యా కొంత బ్లాక్‌ మనీ అందుబాటులో ఉంచుకున్నాడు. మంత్రి నుంచి కాల్‌ రాగానే అయిదు నిమిషాల్లో మీ ఇంటివద్ద ఉంటాననడంతో
రావయ్యా, కలిసి భోజనం చేద్దాం, లోనికి వచ్చేయి అని, బాత్‌రూంలోకి వెళ్లాడు మంత్రి.

మంత్రి ఇంటి వద్ద అందరూ తెలిసిన వాళ్లే కావడంతో సరాసరి డైనింగ్‌ హాల్‌కు వచ్చాడు కంట్రాక్టర్‌. విషయం తెలిసిందే కాబట్టి, ఏ పార్టీ నాయకునికి ఎంతెంత ఇవ్వాలో వారి మధ్య చర్చ జరిగింది. అయితే ముందుగా తాను అందరితో మాట్లాడుతానని, తర్వాతనే కంట్రాక్టర్‌ కలిస్తే బాగుంటుందని అనుకున్నారు.

మీ పార్టీ ఎంఎల్‌ఎ కదా అంతా పెంట చేసింది. ఆయనకు ఇద్దామంటారా అంటూ కంట్రాక్టర్‌ ప్రశ్నించడంతో మంత్రి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. విజయ్‌ పట్ల ఉన్న కోపం అంతా వెళ్లగక్కాడు. అంతా చేస్తున్నదే వాడు. దీంతో మనం ప్రతిపక్ష పార్టీ ల వాళ్లను మేపాల్సి వస్తున్నది. వాడు తినడు, ఇతరులను తిననీయడు, గడ్డివాము వద్ద కుక్క కాపాలా తయారయ్యడు వాడంటూ చిందులు తొక్కాడు. మంత్రి కోపం చూసి మౌనం వహించాడు కంట్రాక్టర్‌.

మళ్లీ మంత్రి మాట్లాడుతూ, ఆ ముఖ్యమంత్రి కూడా వాడంటే చడ్డీ తడుపుకుంటున్నాడు. ఏం చేద్దాం, తప్పదు. భోజనాలు ముగించి డబ్బు పంపిణీపై కార్యాచరణ రూపొందించుకున్నారు.

బిల్లులు సకాలంలో రావడం లేదు, పనులు పూర్తి చేసిన వరకైనా అంతా వస్తేనే కదా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సర్దుబాటు చేసుకోవడానికి నా వద్ద డబ్బు ఉంటుంది, దయచేసి మీరు ఒక్కసారి సెక్రెటరీలకు చెప్పాలి అంటూ ఈ క్లిష్ట సమయంలోనే అధికారులు త్వరంగా పనులు చేస్తారని కంట్రాక్టర్‌ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాడు.

సరే చూద్దాం, మీవాళ్లతో జాగ్రత్తగా ప్లాన్‌ చేయండి, మీడియా వాళ్లు ఉంటారు ఎక్కడైనా దొరికితే ఇక పని అంతే అంటూ తలపట్టుకున్నాడు మంత్రి.

లేదండి మన వాళ్లకు అలవాటే, ఇప్పటికే ఎన్నిసార్లు వాళ్లకు గిఫ్టులివ్వలేదు మనం. అంటూ తన పాత అనుభవాలను ఏకరువు పెట్టాడు కంట్రాక్టర్‌. మీకు తెలిసే ఉంటుంది మనం కొంత మంది మీడియా వాళ్లను కూడా మేనేజ్‌ చేస్తున్నాం. ప్రారంభోత్సవాలు, మీ మీటింగులు కవర్‌ చేయడానికి వాళ్లకు కవర్స్‌ అందుతుంటాయి. ఇదంతా వాళ్లకు తెలుసినా ఏమి పట్టించుకోరు అంటూ ధీమా వ్యక్తం చేసాడు కంట్రాక్టర్‌.

ఎవడో ఒకడు నీతి, నిజాయితీ అంటే ఉంటాడు, విజయ్‌ లాగా. అందుకే హెచ్చరిస్తున్నా అంటూ మంత్రి మరోసారి జాగ్రత్తలు చెప్పాడు.

కొద్ది విశ్రాంతి తీసుకోవాలని బెడ్‌ ఎక్కినా మంత్రికి నిద్ర కూడా పట్టడం లేదు. అంతా అనుకున్నట్లు జరిగితే ఓకే కానీ, అసెంబ్లీలో ఇదే విషయంపై చర్చ వేడిక్కితే ఎటు దారి తీస్తుందోననే ఆందోళన ఆయనకు కునుకు పట్టడం లేదు.

ఏదోలా ఈ గండం నుంచి బయటపడితే తిరుపతికి వెళ్లి, ఏడుకొండలు నడిచి పోవాలని మొక్కుకున్నాడు ఇరిగేషన్‌ మంత్రి. హుండీలో కూడా అధికమొత్తం వేస్తానని మరీమరీ దండాలు పెట్టుకుంటున్నాడు.

ఏమండీ నిద్రలో కలవరిస్తున్నారా, దండాలు పెడుతున్నారెవరికి అంటూ భార్య గదిలోకి రాగానే చిరాకు పడ్డాడు మంత్రి. దీంతో భర్త ఏదో సమస్యలో చిక్కుకున్నాడని భావించి ఆమె గది నుంచి వెళ్లిపోయింది. మంత్రి గబాలున ఫోన్‌ తీసుకొని, కంట్రాక్టర్‌కు కాల్‌ చేసాడు.

ఎవరికి ఎంత ఇస్తావో తెలియదు కానీ వారెవరూ రేపు అసెంబ్లీలో ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడ వద్దు. ఏదైనా జరిగితే కొంపలు మునుగుతాయి. ముఖ్యమంత్రి గారు అదే చెప్పమన్నారు. జాగ్రత్త. బాగా అనుభవంఉన్న వారినే పంపు. జాగ్రత్తగా డీల్‌ చేయాలి. చిన్న పార్టీల వారికి కూడా ఇవ్వు. అంటూ ఆందోళన పడ్డాడు మంత్రి.

నాకు తెలుసు సర్‌, ఎప్పుడు మన వద్ద ఉండే మంచి కుర్రాళ్లనే ఎంపిక చేసి పంపుతాను. మీరు విచారపడకండి, అంతా మంచిగానే జరుగుతుందని, మంత్రికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసాడు కంట్రాక్టర్‌. ఎంతపని చేసిండు ఈ విజయ్‌గాడు. వీన్ని ఏమైనా చేయాలని ముఖ్యమంత్రికి చెప్పాలి. స్వంత పార్టీ వాడు అయి ఉండి, నన్ను ఇంతగా ఇరకాటంలో పెట్టాలా, చూద్దాం ఏమిజరుగుతుందో…కంట్రాక్టర్‌ తెలివి కలవాడే. ప్రభుత్వానికి ఇబ్బంది వస్తే తనకు బిల్లులు ఆలస్యం అవుతాయని తెలిసిన బతక నేర్చినోడు. అందరికీ ఇస్తే ఎవరూ పెద్దగా అసెంబ్లీలో మాట్లాడరు మళ్లీ విజయ్‌కు అవకాశం ఇవ్వకుండా స్పీకర్‌ జాగ్రత్తపడుతాడు, అంటూ తనకు తాను సమాధానం చెప్పుకొని ఊపిరి పీల్చుకున్నాడు మంత్రి.

రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మంత్రికి ఫోన్‌ వచ్చింది. అంతా సజావుగా సాగిందని, అందరికీ అందించామనేది కంట్రాక్టర్‌ కాల్‌ సారాంశం.అమ్మయ్య అనుకుంటూ మరో రెండు పెగ్గులు లాగించి ప్రశాంతంగా నిద్రపోయాడు మంత్రి.

ఇంకా నిద్ర లేవకముందే మంత్రికి వచ్చిన కాల్‌తో దిగ్గున లేచాడు. అవతలి నుంచి ముఖ్యమంత్రి.

చిలకకు చెప్పినట్లు చెప్పాను. నీవు చేసిందేమిటి? ఇలాగేనా పనులు చేసేదంటూ ఎంతో కోపంగా చివాట్లు పెడుతున్న సిఎంకు ఏమి సమాధానం ఇవ్వాలో అర్థం కాలేదు మంత్రికి.

ఏమైంది సార్‌,నేను ఇప్పుడే నిద్ర లేచాను.

ఇంకా తాగి పడుకోవాల్సింది. ఎందుకయ్యా పదవులు కావాలని పట్టుబడతారు. సమాజం ఎలాగుంది. ఆవులిస్తే ప్రేవులు లెక్కపెడుతున్నారు కొందరు. మీ కంట్రాక్టర్‌ నిర్వాకం చూడు టివిల్లో వస్తున్నదనగానే గబాలున బెడ్‌ మీద నుంచి లేచి టివి ఆన్‌చేసిన మంత్రి అవాక్కయ్యాడు. ఎలా జరిగింది అనుకుంటూ వెంటనే కంట్రాక్టర్‌కు కాల్‌ చేశాడు మంత్రి.
అవును సార్‌ కొంప మునిగింది. సూట్‌కేస్‌ ఇస్తుంటే ఎవడో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి ఆ టివి ఛానల్‌కు పంపాడు. వాడెవడో కానీ కనీసం మనలను సంప్రదించకుండానే ప్రసారం చేస్తున్నాడు. ఎక్కడ లీక్‌ అయిందో తెలియడం లేదు సార్‌. కంట్రాక్టర్‌ గొల్లుమన్నాడు. వాడికి పెద్దయెత్తున నష్టం జరుగుతుందని తెలుసు మరి.

నన్ను కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నిద్రలేపాడు. ఆయన ఇరుకున్నాడు ఇప్పుడు. తాను ఎలా బయటపడాలనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. అందరికీ చుట్టుకుంటున్నది. మన మనషులకు తెలియకుండా ఫాలో అయి, ఎవడో స్పై కెమరాతో తీసినట్టున్నారు. ఇలాంటి ప్రయత్నం మనం తప్పకుండా చేస్తామని పసిగట్టిన మీడియా వాడెవడో ఈ పనిచేసి ఉంటాడు సార్‌. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదంటూ తన ఆవేధనంతా చెబుతున్న కంట్రాక్టర్‌ మాటలు వినపడుతున్నా, మంత్రి మొదడు పని చేయడం ఆగిపోయింది.

ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వెళ్లాలనుకుంటూ అలాగే కూలపడిపోయాడు. ఏళ్ల తరబడి కష్టపడి తెచ్చుకున్న ఇమేజికి గట్టి దెబ్బతగిలింది, పదవి కోసం నానా గడ్డి తినాల్సి వచ్చింది. పెద్దలకు ముడుపులు కూడా అధికంగానే ముట్టచెప్పాల్సి వచ్చింది. ఇప్పుడెలా,ఎలా ఎలా, అంతుబట్టడం లేదు.

అసెంబ్లీ టైం అవుతున్నది, బ్రష్‌ కూడా వేసుకోలేదంటూ వచ్చిన భార్యపై కళ్లురుమి చూసాడు మంత్రి. ఇదేమిటి నేను ఏమి తప్పు మాట్లాడాను అనుకుంటూ టివి ఆన్‌ చేసి ఉండటంతో చూసింది ఆమె.

అయ్యో, అయ్యో మన కొంప మునిగిందండి, మీ గురించే చెబుతున్నారు వాళ్లు. అంటూ శోకం తీస్తున్నది ఆమె. తాను ఏడవాలో, ఆమెను ఓదార్చాలో తెలియడం లేదు ఇరిగేషన్‌ మంత్రికి…ప్రాజెక్టుల నుంచి సాగు నీరు ఎప్పటికి రైతులకు అందుతుందో కానీ, పాపం భార్యాభర్తల కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి నుంచి ఫోన్‌, ఈ రోజు అసెంబ్లీకి రావద్దని. విపక్షాల ఒత్తిడితో అసెంబ్లీ వాయిదా పడుతుందని, తర్వాత ఈ విషయంపై ఏమి చేయాలో ఆలోచిద్దామని సిఎం చెప్పమన్నాడని సెక్రటరి చెబుతుండగా అంతా యాంత్రికంగా వినాడు మంత్రి.

ప్రభుత్వంతో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత, ఇతర విపక్ష నేతలందరికి అప్రతిష్ఠ కలిగించే సంఘటన ఇది. బహుశ చట్టసభల చరిత్రలో ఎక్కడ ఇలాంటి సందర్భం రాలేదు. మంత్రితోపాటు ముడుపులు అందిన వారెవరూ అసెంబ్లీకి రాలేదు. కానీ ఆయా పక్షాల ఉప నాయకులు, ఇతర సభ్యులందరూ ఠంచన్‌గా సభకు వచ్చారు.

ప్రతి రోజు కొంత ఆలస్యంగా సభకు వచ్చే ముఖ్యమంత్రి కూడా స్పీకర్‌ కార్యాయం సభా ప్రారంభానికి ముందు బెల్‌ మోగించే సమయానికి కరెక్టుగా ఈ రోజు అసెంబ్లీకి చేరుకున్నారు.నేరుగా సభలో ప్రవేశించి తన సీటులో కూర్చున్నారు. సభ అంతా గుంభనంగా ఉంది. స్పీకర్‌ వచ్చి, అధ్యక్ష స్థానంలో కూర్చోగానే విపక్ష సభ్యులందరూ లేచి ఒక్కసారిగా నినాదాలు చేయడం ప్రారంభించారు. అవినీతితో కంపుకొడుతున్న ప్రభుత్వం గద్దె దిగాలని,ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, ఇరిగేషన్‌ మంత్రిని అరెస్టు చేయాలని సభ్యులందరూ ఒక్కపెట్టును ఆందోళనకు దిగారు. స్పీకర్‌ పోడియం వద్దకు వచ్చి బైఠాయించిన సభ్యులను స్పీకర్‌ పదేపదే కోరినా ఫలితం లేకపోవడంతో సభను సోమవారం నాటికి వాయిదా వేసి వెళ్లిపోయారు.

ముఖ్యమంత్రి కోరుకున్నది అదే. సభలో సమాధానం చెప్పడం కష్టం కాబట్టి కొంత సమయం తీసుకుంటే కొంత వేడి తగ్గి క్రమంగా పరిస్థితి సద్దుమణుగుతుందని భావిస్తున్నారు. ఆలోగా పూర్వాపరాలను పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఆయన ఆలోచన. అసెంబ్లీకి బయలు దేరే ముందుగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కాల్‌ చేయించి, సంబంధిత అధికారులందరితో సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించాడు.

నీటిపారుదల శాఖ అధికారులందరిని పిలవాలని సూచించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా సిఎస్‌ కూడా ముందుగానే అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు హెచ్చరికలు చేశారు.

అసెంబ్లీ వాయిదా పడగానే తన ఛాంబర్‌లోకి వచ్చిన ముఖ్యమంత్రిని ఇతర శాఖల మంత్రులు కూడా అనుసరించారు. కొద్దిసేపు వారి మధ్య మౌనమే రాజ్యమేలింది. తేలుకుట్టిన దొంగళ్ల అందరూ మిన్నకుండిపోయారు. ఇంతలో పిఎ వచ్చి, మీడియా వాళ్లు సిఎంను కలువాలని పట్టుబడుతున్నారంటూ చెప్పాడు. అవునని కానీ, కాదని కాని అనకుండా సిఎం చూస్తూ ఉండిపోయాడు.

పత్రికా ప్రకటన పంపుతామని చెప్పండి సార్‌ అంటూ ఒక మంత్రి ఉచిత సలహా ఇవ్వగా కాదన్నట్లుగా సిఎం చెప్పారు. గంట తర్వాత నేనే పిలుస్తాను, సమావేశం గదిలో వారిని ఉండమని చెప్పు అని పిఎ ద్వారా సమాచారం పంపాడు. దీంతో విలేకర్లు అందరూ మీటింగ్‌ హాల్‌కు వెళ్లారు. ఇదే విషయం పిఎ చెప్పడంతో సిఎంతో పాటు మంత్రులు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సమయంలో విలేకర్ల సమావేశం అంటే వాళ్లు అడ్డుదిడ్డమైన ప్రశ్నలు అడుగుతారు కదా సార్‌, మీ తరపున సమాచార శాఖా మంత్రి వెళ్లమని చెప్పండి. ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత వివరాలు వెల్లడిస్తారని చెబితే సరిపోతుందని ఆర్థిక మంత్రిసలహా ఇచ్చారు.

ప్రతి పక్ష నేతలను కూడా అవినీతి మయంచేసి ప్రభుత్వం అంటూ మీడియా సూదుల్లాంటి మాటలతో ఇబ్బంది పెడుతుంది సార్‌, మీరే ఆలోచించండి అంటూ మరో మంత్రి, ఆర్థిక మంత్రి సూచనను సమర్థించారు. ఇదే మంచి ఐడియా అంటూ మరో మంత్రి మద్దతు తెలిపాడు. ఒక్కో మంత్రి ఒక్కో సమాధానం చెబుతున్నా, సిఎం ఆలోచనలు వేరేగా ఉన్నాయి.

ఇరిగేషన్‌ మంత్రికి ఫోన్‌ చేయమని పిఎకు చెప్పాడు సిఎం.

వణుకుతున్న గొంతుతో ఆ మంత్రి లైన్‌లోకి వచ్చాడు.

ఎలా జరిగిందంటావు ఇదంతా? ఏమంటున్నాడు మీ కంట్రాక్టర్‌ అని ప్రశ్నించాడు

ఏమో సార్‌ అంతా నా ప్రారబ్దం. కంట్రాక్టర్‌ కూడా తనకు ఏమీ తెలియదని, తన మనుష్యులను ఎవరో వెంబడిరచి, సీక్రెట్‌ కెమరాల ద్వారా షూట్‌ చేసినట్లు చెబుతున్నాడు. విలేకర్లను కూడా మ్యానేజీ చేసాడట కానీ వేరే వాడు ఎవరో ఇదంతా చేసినట్లు కంట్రాక్టర్‌ అంటున్నాడు. నాలుగైదు ఛానళ్లలో వచ్చిందంటే ఇది తీసిన వాడు రిపోర్టర్‌ కాకపోచ్చని, ఎవడో తీసి అందరికీ ఇచ్చి ఉంటాడని చెబుతున్నాడు సార్‌ అంటూ ఏడ్చేసాడు ఇరిగేషన్‌ మంత్రి.

అంతా విన్న తర్వాత తలపట్టుకున్నాడు సిఎం. పూర్తి ఆధారాలతో టివిల్లో వచ్చిన వార్తలను ఎలా ఖండిరచాలి? మా ఇరిగేషన్‌ శాఖా మంత్రికి ఏమి తెలియదని బుకాయించడానికి అవకాశాలున్నాయా అంటూ సహచర మంత్రులను ప్రశ్నించాడు.

ఈ విషయంలో మంత్రికి కానీ, ప్రభుత్వానికి కానీ సంబంధం లేదని ఎందుకు చెప్పలేం సార్‌. అసెంబ్లీలో జరిగిన వాడివేడి చర్చతో కంట్రాక్టరే తనకు ఇబ్బందులు రాకుండా స్వయంగా ఈ దుర్మార్గానికి పూనుకున్నాడని చెబుదాం. విపక్ష నేతలకు,కంట్రాక్టర్లకు ఎలాంటి సంబంధ,బాంధవ్యాలు ఏమిటో మాకు తెలియదు అంటూ బుకాయించవచ్చు అని సీనియర్‌ మంత్రి తరుణోపాయం చెప్పాడు.

ఇరిగేషన్‌ మంత్రి స్వయంగా ఏ నాయకునితో అయినా మాట్లాడారా? ఇది కూడా తెలుసుకోండి సర్‌ అంటూ మరో మంత్రి అనుమానం వ్యక్తం చేశారు.

లేదు, ఈ విషయంలో మన వాడు జాగ్రత్తగానే ఉన్నాడు. అంతా కంట్రాక్టరుకే అప్పగించాడు. కనీసం ఈ తెలిపి అయినా ప్రదర్శించాడు మనవాడు అంటూ సిఎం చెప్పగానే..

ఇంకేమి మనం సులువుగానే మంత్రిని రక్షించవచ్చని అదే సీనియర్‌ మంత్రి ధీమా వ్యక్తం చేసాడు.

సమాచార శాఖా మంత్రి అయితే ఎక్కువ ప్రశ్నలతో మీడియా వాళ్లు ఉక్కిరి బిక్కిరి చేస్తారు.మరో సీనియర్‌ మంత్రిని పంపడమో లేక మీరు వెళ్లడమో మంచిదని రెవెన్యూ శాఖా మంత్రి చెప్పడంతో అందరూ ఇదే విషయాన్ని బలపర్చారు. సిఎం గారే ఉంటే రిపోర్టర్లు కొంత తక్కువగా ప్రశ్నలు వేస్తారని,అంతగా ఇబ్బంది ఉండదని కూడా పలువురు సూచించడంతో ముఖ్యమంత్రి యే సిద్దమయ్యారు.

ఈ విషయం సరే, అధిష్ఠానం నుంచి ఫోన్‌ వస్తే ఎలా అని ప్రశ్నించాడు ముఖ్యమంత్రి. ఈ మాట రాగానే అందరూ గంభీరంగా మారిపోయారు. దీనికంతటికి కారణమైన విజయ్‌ పేరును ప్రస్తావించి ఉడుక్కున్నారు పలువురు. హస్తిన నుంచి కాల్‌ వస్తే ఏమి చేద్దామనే విషయంలో సమాధానం చెప్పలేదు ఎవరూ.

మంత్రులందరూ మౌనం వహించడంతో ,ఇక సమయం అయిందంటూ విలేకర్ల సమావేశానికి బయలు దేరాడు సిఎం. అయితే మీడియా మీట్‌ అనగానే ముఖ్యమంత్రి వెంట వచ్చేందుకు గతంలో ఎక్కువ మంది పోటీపడే వారు. కానీ ఈ దఫా అందరూ వెనకు వెళ్లడంతో సీనియర్ల నిద్దరిని స్వయంగా ముఖ్యమంత్రి పిలుచుకొని పోయారు.

మీటింగ్‌ హాల్‌ కోలాహలంగా ఉంది. ఉదయమే టివిల్లో పెద్దయెత్తున ప్రసారం కావడంతో సీనియర్లుకూడా రావడంతో గతంలో ఎన్నడూ లేనంతగా కిక్కిరిసి పోయింది. ముందుగానే ఊహించినందున సిఎం కూడా ఆశ్యర్యపోలేదు. రాజకీయాల్లో డక్కామొక్కిళ్లు తిన్న ముఖ్యమంత్రి ఎలాంటి ఆందోళన మొఖంలో కనిపించకుండా మీటింగ్‌ హాల్‌లోకి ప్రవేశించాడు.

సీట్లో కూర్చున్నాడో లేదో విలేకర్లు సిఎంపై ఒకరి తర్వాత ఒకరు కాదు ఎక్కువ మంది ఒక్కసారే అన్నట్లుగా ప్రశ్నలు సంధించారు. అంతా ఓపిగా ఉన్న సిఎం,

మీరే మాట్లాడుతారా? నాకు కూడా అవకాశం ఇవ్వండి అంటూ నవ్వాడు. ఇంత సీరియస్‌ సమయంలోనూ ముఖ్యమంత్రి నవ్వడం వాళ్లకు ఆశ్చర్యం అనిపించింది. ఇదే ప్రశ్న ఒక సీనియర్‌ రిపోర్టర్‌ అడిగారు.

ఏమి జరిగిందని మీరంతగా హైరానా పడుతున్నారు. సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి. అన్నింటికీ ప్రభుత్వాన్ని బాధ్యులు చేయడం మీలాంటి సీనియర్లకు తగదు.ఎందుకో ఈ రోజు అందరూ చాలా వేడిగా కనిపిస్తున్నారంటూ సిఎం మరోసారి నవ్వాడు.

మీ అందరిలాగే నేను టివిలు చూసాను. విషయం వాకబ్‌ చేస్తున్నాను. లేవగానే అసెంబ్లీకి తయారవుతూనే సిఎస్‌కు కాల్‌ చేసి ఉన్నత స్థాయి సమావేశంఏర్పాటు చేయాలని ఆదేశించాను. ఎక్కడ లోటుపాట్లు జరిగినా ప్రభుత్వం తప్పక పరిశీలించాలి కదా? ఏమంటారు? లోతుగా అధ్యయం చేద్దాం, విపక్ష నేతలందరికీ ఒక్కరోజే సూట్‌కేసులు ఇచ్చారనేది టివిలలో వచ్చిన సమాచారం. ఎవరు ఎందుకు ఇచ్చారో ప్రభుత్వం నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. మీడియా తనకు ఏ సమాచారం వచ్చినా వెంటనే వార్తలిస్తుంది కానీ ప్రభుత్వం అలా చేయలేదు. దర్యాప్తు చేయాలి, నిజానిజాలు కనుక్కోవాలి. అసలు దీని వెనుక ఎవరున్నారో వాస్తవం వెలికి తీయాలి. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఎవరో ఈ ప్రయత్నం చేసి ఉంటారు, పాత్ర దారులను ముందుగా పసిగట్టాలి. ఇంటలిజెన్స్‌ అధికారులకు, దర్యాప్తు సంస్థలను అలర్టుచేసి తగిన ఆదేశాలిచ్చామంటూ మొత్తం కేసులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా చాలా జాగ్రత్తగా చెప్పుకొచ్చాడు సిఎం.
ముఖ్యమంత్రి సమయస్పూర్తిని కొందరు సీనియర్‌ విలేకర్లు మనస్సులోనే అభినందించారు. తప్పు జరిగిన విషయం స్పష్టంగా తెలిసినా సిఎం తన రాజకీయ అనుభవంతో ఎలా సమర్థించుకుంటున్నారో వారికి అవగతమైంది. ఇదే విషయం నేరుగా ప్రశ్నిస్తే సిఎం నుంచి యాజమాన్యాలకు ఫోన్లు వెళ్తాయనే విషయం కూడా వారికి తెలుసు. ప్రభుత్వ ప్రకటన కోసం ఆరాటపడే యాజమాన్యాల పరిస్థితి వారికి తెలుసు. సిఎంతో వారికున్న సంబంధాలు తెలుసు. అందుకే సీనియర్లు కొంత మౌనం వహించగా జూనియర్లే కత్తుల దూస్తున్నారు.

ఇరిగేషన్‌ మంత్రి ప్రోద్భలంతోనే కంట్రాక్టర్‌ నేరుగా విపక్ష నేతలకు లంచాలిచ్చినట్లుగా అంత స్పష్టంగా వీడియోలుండగా ఎలా కాదంటారు అని సూటిగానే ప్రశ్నించాడు రిపోర్టర్‌.

అసెంబ్లీకి రావాలనే తొందరలో ఉదయం ఆ వీడియోను నేను చూసాను. అందులో మీరన్నట్లుగా కంట్రక్టర్‌ కనిపించలేదు. మీకు కన్పించారా అంటూ ఎదురు ప్రశ్నించాడు సిఎం.

ఏమి చెప్పాలో అర్థం కాలేదు ఆ రిపోర్టర్‌కు.

కాదు సార్‌, నిన్న అసెంబ్లీలో ఇరిగేషన్‌ శాఖలో అవినీతిపై చర్చ జరిగింది, అసెంబ్లీలో ఇంకా దుమారం లేస్తే రాజీనామా చేయాల్సి వస్తుందని మంత్రి స్వయంగా దీనికి కారణమని వార్తలు వచ్చాయి. అంతా తెలిసి మీరే ప్రశ్నిస్తే ఎలాగండి అంటూ రిపోర్టర్‌ మాట్లాడుతున్న స మయంలోనే సిఎం జోక్యం చేసుకుంటూ…అంతా మీరే చెబుతున్నారు, వీడియోలో ఏముందో అది నేను చెబుతున్నా, కావాలని ఎవరో ఈ పనిచేసి ఉంటారు, కాదనగలరా? మధ్యలో మంత్రిని బదనాం చేస్తున్నారు మీరే అంటూ చురక అంటించాడు సిఎం.

లేదు సార్‌, మీ పార్టీ సభ్యుడు విజయ్‌ వెలుగులోకి తెచ్చిన కుంభకోణంపై ఇతర పక్షాలు నిలదీయకుండా మంత్రి చెప్పి, ఈ లంచాలు ఇప్పించినట్లుగా అందరూ అనుకుంటున్నారు. కాదని మీరు ఎలా చెబుతారని మరో రిపోర్టర్‌ ప్రశ్నించాడు.
మీరంటే అది నిజం అవుతుందా? మా పార్టీ సభ్యుడే విజయ్‌. సమాజంలో అంతా మంచి జరగాలని,ప్రజాధనం దుర్వినియోగం కారాదని తపన పడుతున్న సభ్యుడు.కాదనను. ఇందులో ప్రతిపక్షాల పాత్ర ఏమీ లేదే. మాపార్టీ సభ్యుడు లేవనెత్తిన అంశం కదా ఇది. మరి మంత్రి విపక్ష సభ్యులకు లంచాలివ్వాల్సిన అవసరం ఏమిటి? మీరే ఆలోచించండి. ఇదంతా మా పార్టీ పరిధిలోని అంశం. అంతేకాని విపక్షాలను మెప్పించాల్సిన అవసరం ఏకోశానా మంత్రికి ఉండదని మీరు అర్థం చేసుకోవాలి. సిఎం ఇచ్చిన వివరణతో మేమి అడగాలో తోచలేదు ఆ విలేకరికి.

ఇరిగేషన్‌ శాఖలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని విజయ్‌గారు చెప్పారు కదా దీనిపై ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి అనేప్రశ్నకు బదులిస్తూ, అవినీతి ఎక్కడ ఉన్నప్పటికీ సహించేదిలేదు. ఈ మేరకు సిఐడి విచారణకు ఆదేశిస్తాం. విజిలెన్స్‌ విభాగాన్ని కూడా దర్యాప్తు చేయాలని కోరుతాం. ఎక్కడైనా అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేలితే బాధ్యులైనవారిని శిక్షిస్తాం. ప్రజాధనం దుర్వినియోగాన్ని సభ దృష్టికి తెచ్చినందున మా ఎంఎల్‌ఎ విజయ్‌ను కూడా ప్రభుత్వ పరంగా తగువిధంగా గౌరవిస్తామంటూ సిఎం వివరించారు.

ముఖ్యమంత్రి ప్రతి ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం చెబుతున్న తీరును దగ్గరే ఉన్న సీనియర్‌ మంత్రులకు ముచ్చటేసింది. మాకు మంచి నాయకుడు దొరికాడు,తప్పును కూడా ఎంతో సమర్థవంతంగా సమర్ధిస్తున్నాడు అనుకుంటూ లోలోన సిఎంను అభినంధించకుండా ఉండలేకపోతున్నారు. ఛాంబర్‌లో ఎంతో భయంగా కనిపించిన సిఎంలో ప్రస్తుతం విశ్వాసం తొణికిసలాడుతున్నది. ఇక సమస్య లేదు, మీడియా వాళ్లకు దొరకలేదనే సంతోషం కూడాఆయనలో చోటుచేసుకుంది. సచివాలయంలో అధికారులు ఎదురు చూస్తున్నారు. మీటింగ్‌ అని ముందుగానే చెప్పాను, సమీక్షించాల్సి ఉంది. అంటూ సిఎంమరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా బయలు దేరారు. మంత్రులిద్దరు కూడా సిఎం కారులోనే కూర్చున్నారు.

అసెంబ్లీ నుంచి కారు బయలు దేరిన తర్వాత ఇద్దరు మంత్రులు కూడా సిఎంను ప్రశంసలతో ముచ్చెతారు. అతి క్లిష్ట సమస్యను ఇంత సులువుగా తప్పించుకుంటారను కోలేదంటూ వారు చెబుతున్నా, ముఖ్యమంత్రి గంభీరంగానే ఉన్నారు. ఏ మాత్రం సంతోషం ఆయనలో కనిపించలేదు. ఎందుకు ఇంకా ముభావంగానే ఉన్నారు. మీడియా సమావేశం ఫలవంతంగానే ముగిసింది కదా, ఇంకా విచారానికి కారణం అడిగారు మంత్రులు.

రాష్ట్ర స్థాయిలో అంతా మనవారు, ఏదో ఒక విధంగా తప్పించుకోవచ్చు. మీరు గమనించారో లేదో సీనియర్‌ పాత్రికేయులు పెద్దగా ప్రశ్నలు వేయలేదు. చూశారా? ఎందుకో తెలుసా. వారివారి యాజమాన్యాలతో ముందుగానే నేను మాట్లాడాను. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సహకరించాలని. వాళ్లు అంగీకరించి, తమతమ సీనియర్లను ముందే హెచ్చరించారు. ఇది మనకు కలిసి వచ్చింది. ఇందులో మన గొప్ప ఏమీ లేదు.

ఎంతైనా మీ మేథస్సును మెచ్చుకోవాల్సిందే సర్‌ అన్నారు ఇద్దరు

మన రాష్ట్రంలో చీమచిటుక్కుమన్నా, ఢల్లీికి ఫాక్స్‌లు, ఫోన్లుపోతుంటాయి.చూడాలి ఈ విషయంలో హస్తినకు ఎలాంటి సమాచారం పోతుందో..వారేమి ఆదేశిస్తారో, ఇప్పుడు మనకు అదే కీలకం. ఈ సమస్యను మనం ఎలా ఎదుర్కొంటామనేదే ముఖ్యం. సరే వేచి ఉందాం. అధిష్ఠానం ఏది చెబితే అదే చేయాలి. ఇంకా మన పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీ నుంచి కాల్‌ రాలేదు. అంటే కొంత సమయం ఉంది మనకు అంటూ నిట్టూర్పు విడిచారు సిఎం.

ఇంకా మన పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీ నుంచి కాల్‌ రాలేదు. అంటే కొంత సమయం ఉంది మనకు అంటూ నిట్టూర్పు విడిచారు సిఎం.

అధిష్ఠానం మాట రాగానే మంత్రులిద్దరు ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు. ఈలోగా సచివాలయం కూడా రావడంతో ముఖ్యమంత్రి వద్ద వీడ్కోలు తీసుకొని వారు తమ ఇళ్లకు పోయారు.

అధికారులతో సమావేశం ప్రారంభం కాగానే వాస్తవాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు సిఎం. టెండర్ల ప్రక్రియలో లోపాలు జరిగాయా? ఎక్కడైనా విధానపరమైనా అతిక్రమణలు చోటుచేసుకున్నాయా? శాసనసభ్యుడు విజయ్‌ చెప్పిన దాట్లో వాస్తవాలు ఎంతవరకున్నాయి. రూల్స్‌ను పాటించని సందర్భాలు ఎక్కడెక్కడ జరిగాయో నాకు చెప్పండి అని ప్రశ్నించారు.

స్థూలంగా మాట్లాడితే మనం అవలంభించిన విధానంలో ఎక్కడా లోపాలు కనిపించవు కానీ… అంటూ ఇరిగేషన్‌ సెక్రటరీ మొత్తం ప్రక్రియను వివరించారు. అయితే లోతుగా పరిశీలిస్తే మాత్రం… ప్రస్తుత కంట్రాక్టర్‌కు మాత్రమే ఈ టెండర్‌ దక్కేలా మనం టెండర్‌ విధానాన్ని రూపొందించిన విషయం తెలుస్తుంది. ఇది రాజకీయ నేతలకు పెద్దగా అవగాహనలోకి రాదు. ఎవరో అధికారి ఈ విధానంపై పూర్తి అవగాహనతోనే విజయ్‌ గారికి చెప్పి ఉంటాడని అనుకుంటున్నాను. ఇందులోని సంక్లిష్టతను విజయ్‌ గారు అర్థం చేసుకొని, అసెంబ్లీ వేధికగా ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమాలంటూ చెప్పగలిగారు.అయినా విజయ్‌ గారిని తక్కువగా అంచనా వేయలేం. ప్రతి ప్రభుత్వ శాఖపై ఆయనకు మంచి పట్టు ఉంది. పైగా ప్రతి ఉన్నతాధికారితో ఆయన తరుచుగా మాట్లాడుతుంటాడు. ఇతర శానసభ్యుల వలె ఏ పైరవీలు, సిఫారసులంటూ రారు. ఏదైనా ప్రభుత్వంలో జరుగుతున్న పనులు ఎలా ఉన్నాయనే అంశానికే పరిమితమవుతారు. అయితే అసెంబ్లీలో మనం పూర్తి స్థాయిలో సమర్ధించుకునే అవకాశాలున్నా, విజయ్‌ గారు తన సమాచారంతో మళ్లీ ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇరుకునపడక తప్పదు. అంటూ ముగించాడు.

విజయ్‌కు ఎవరు సహకరిస్తున్నారో నాకు తెలియాలి. ఎంఎల్‌ఎగా అధికారులతో మాట్లాడే అధికారం ఆయనకు ఉంటుంది. దీన్ని ఎవరం కాదనలేం. కానీ ఇది ప్రభుత్వానికి తలనొప్పిగా మారితే ఎలా? సిఎస్‌ గారు ఏమి చేద్దాం చెప్పండి. అధికారులందరూ మీ పర్యవేక్షణలోనే ఉంటారు. మరోసారి ఇలా జరగకుండా ఏమి చేద్దామంటూ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించాడు సిఎం.

సార్‌, ఐఎఎస్‌ అధికారులను కంట్రోల్‌ చేయడం కష్టం. ఎవరి స్థాయిలో వారు ఉన్నతులే. మంత్రులు కానీ, నేను కానీ, మీరైనా కావచ్చు, ఫైల్‌ ఇలాగే రాయమని ఆదేశించే అవకాశాలు ఉండవు. వారి అభిప్రాయాలు మాత్రమే వారు నోట్‌ చేస్తారు. మంత్రులకు, మీకు నచ్చనట్లయితే సెక్రటరీల అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ప్రజాప్రతినిధులకే నష్టం. ఫైల్‌పై తమ అభిప్రాయం ముందే ఇచ్చామని మంత్రులు లేదా సిఎం వాటికి భిన్నంగా వ్యవహరించారని వాళ్లు తప్పుకునే అవకాశం ఉంటుంది. అవినీతి కేసుల్లో అందుకే ఐఎఎస్‌లు సురక్షితంగా ఉంటారు. మీరు ఐదేళ్లు అధికారంలో ఉంటారు,కానీ సర్వీసు మొత్తం అధికారంలో ఉండే సెక్రటరీలు అందుకే ఆచితూచి వ్యవహరిస్తారని సిఎస్‌, అధికారులను కట్టడి చేయడం సాధ్యం కాదని పరోక్షంగా వివరించారు.

గత ప్రభుత్వం అనేక అవినీతి కార్యక్రమాలు చేసినట్లుగా పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయి కదా, అధికారుల ప్రమేయం లేకుండా అదంతా జరిగిందా? అప్పుడు ఇదే అధికారులు ఏమి చేశారంటూ సిఎం కొంత ఆగ్రహంతోనే ప్రశ్నించారు.
అవును సార్‌, మీరన్నట్లుగా కొందరు అధికారులు తమ స్థాయిని మరిచిపోయి, ఫైల్‌ ఎలా రాయాలో మంత్రులు,ముఖ్యమంత్రులు చెప్పినట్లుగా విన్నారు. అవినీతిలో తాము చేతులు తడుపుకున్నారు. అందుకే అనుభవిస్తున్నారు కదా, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. సీనియర్‌ అధికారులు కూడా తప్పు చేస్తే ఇలాంటి శిక్ష తప్పదని గత ప్రభుత్వ విధానాలే వెల్లడిస్తున్నాయి. ఆ పార్టీ ఓడిపోయి, మీ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి ఈ అవనీతి చరిత్ర కూడా కారణమని మీరు కూడా గతంలో అన్నారు.

సరే ఏదో ఒకటి ఆలోచించండి. ప్రభుత్వం ఇరుకున పడకుండా సోమవారం గట్టి సమాధానం చెప్పడానికి అంటూ సిఎం సమావేశం ముగించారు.శుక్రవారం ఉదయం అసెంబ్లీని వాయిదా వేస్తూ ముఖ్యమంత్రి కోరిక మేరకే, స్పీకర్‌ సోమవారం వరకు అవకాశం ఇచ్చారు.
సాయంత్రం బంగ్లాకు వెళ్లిన ముఖ్యమంత్రిని కలిసేందుకు ఇరిగేషన్‌ మంత్రి వచ్చాడు. విలేకర్ల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూసిన మంత్రి, ఎంతో సంతోషపడ్డాడు. సిఎం బంగ్లాకు వచ్చినట్లు తెలుసుకొని వెంటనే బయటు దేరాడు. సిఎం తనను ఒడ్డున పడేసాడనే ఆనందంతో వచ్చిరాగానే దాదాపు కాళ్లమీదపడినంత పనిచేసాడు మంత్రి.

చాలా థాంక్స్‌ సార్‌, మీ మేలు ఎప్పటికీ మరువలేను. ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేనట్లు బాగా చెప్పారంటూ మంత్రి అభినందిస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు సిఎం.

ఇంకేమిటి సార్‌, దిగులుగా కన్పిస్తున్నారు. మరేదైనా సమస్య వచ్చిందా అంటూ ఆరా తీసాడు ఇరిగేషన్‌ మంత్రి.
అవునయ్యా, పార్టీ ఇన్‌చార్జీ నుంచి కాల్‌ వచ్చింది. ఏమి జరిగిందో మొత్తం రిపోర్టు పంపాలని పెద్దల ఆదేశం అట. వాళ్లను సంతృప్తి పర్చడం అంత సులువు కాదు. అందుకే ఆలోచిస్తున్నా…

మీరు విలేకర్లకు చెప్పిందే వాళ్లకు రిపోర్టుగా ఇద్దాం సార్‌, ఇతరలెవరో కావాలని చేసిన కుట్ర అని చెబుదాం. ఆతురతగా చెప్పాడు మంత్రి.

అంత సులువు కాదు ఇది. ఢల్లీి వాళ్లు ముందుగానే అంతా తెలుసుకొని అడుగుతారు ఏదైనా…మన రిపోర్టులో వాస్తవాలను మసిపూసి మారెడు కాయ చేసినట్లుగా తయారు చేయాలి. అధికారులతో సమీక్షించినా పెద్దగా ఉపయోగపడే విషయాలు చెప్పలేక పోయారు వాళ్లు. మీ సెక్రటరీని పిలిపించుకొని మనం బయటపడకుండా రిపోర్టును రూపొందించాలని చెప్పు. చూద్దాం, చివరికి ఏమవుతుందో? కానీ నీవు అన్నింటికి సిద్ధమై ఉండాలి.పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడటానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చెప్పడంతో మంత్రికి భయం వేసింది. ఎక్కడ రాజీనామా అడుగుతాడోనని ఆందోళన పడ్డాడు. ఇది గమనించిన సిఎం…

వెంటనే పదవి నుంచి దిగిపోవాల్సిన అవసరం కనిపించడం లేదు కానీ, ఏమో పెద్దలు ఎలా వ్యవహరిస్తారో, ఏమి చెయ్యమంటారో అందుకు దిగులుగా ఉన్నాను. నీవు మాత్రం ధైర్యంగా ఉండాలి. తాత్కాలికంగా ఇబ్బందులు ఏర్పడినా నేనున్నానని భరోసాగా ఉండు. నీకు ఎల్లప్పుడు నా అండదండలుంటాయి. కానీ ఎట్టిపరిస్థితుల్లో ఈ డబ్బుల కుంభకోణం వెనుక నీ పాత్ర ఉందని కంట్రాక్టర్‌ చెప్పకుండా చూసుకోవాలి. కొన్నాళ్లు ఆ కంట్రాక్టర్‌ను రాష్ట్రం విడిచి పొమ్మని చెప్పు.

విలేకర్లు కనబడినా జాగ్రత్తగా ఉండు. అంతా సర్దుకుందని అనుకోవద్దు. ఢల్లీి నుంచి వచ్చే ఆదేశాల వరకు వేచి చూద్దాం అంటూ మరిన్ని జాగ్రత్తలు చెబుతున్న సిఎంకు సరే సార్‌ అంటూ ఇంటిదారి పట్టాడు మంత్రి.

ముఖ్యమంత్రి తనపట్ల ఎంతో అభిమానంతో ఉన్నారని,ఎంతైనా ఆయన అనుభవం ముందు ఇతరులందరూ దిగదుడిపే అనుకున్నాడు కారులో కూర్చున్న ఇరిగేషన్‌ మంత్రి. అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజుల తర్వాత తిరిగి ప్రారంభం అయితే కానీ సమస్య ఒక కొలిక్కి వస్తుందని అనుకుంటున్నాడు మంత్రి.

విపక్షాల్లో కూడా పెద్ద గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి. చిన్న పార్టీలకు ఇదే సమస్య. నాయకత్వంపట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.ప్రభుత్వ అక్రమాలను బయటపెట్టకుండా అవినీతిలో భాగస్వామ్యులైన వారిని నాయకత్వం నుంచి తొలగించాలనే ఆందోళన వారిలో ప్రారంభమైంది. ఏ పార్టీకి ఆ పార్టీతమతమ ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకోవాలని సమయం నిర్ణయించాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాతనే ఈ మీటింగ్స్‌ ఉండాలనే ఒత్తిడితో తాత్కాలికంగా సమావేశాలను వాయిదా వేసుకున్నాయి.

తన నుంచి సెలవు తీసుకొని ఇరిగేషన్‌ మంత్రి వెళ్లిపోగానే క్యాంపు ఆఫీసు నుంచి సిఎం ఇంట్లోకి వెల్లాడు.
మన విజయ్‌ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతుంది కదండీ, టివిల్లో ఎప్పుడు చూసినా వాని పేరే. సమర్థుడండీ మన విజయ్‌ అంటూ అన్నపూర్ణమ్మ ఆయనను ఆకాశానికి ఎత్తుతండటంతో మనస్సులో కంపరం పుట్టింది సిఎంకు. ఎప్పుడు విజయ్‌ గోలా నీకు. వాడు అసలు నీకు కాల్‌ చేస్తున్నాడా? నిన్ను చూడటానికైనా వచ్చాడా? అంటూ భర్త చిరాకుగా అడగటంతో ఆమెకు విషయం అర్థం కాలేదు. రాజకీయంగా సిఎంకు విజయ్‌ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా ఆమె భావించడం లేదు. కానీ విజయ్‌ మరింతగా రాణిస్తున్నాడని, రాజకీయాల్లో ఎదుగుదలకు ఇవి ఉపకరిస్తాయని మాత్రం ఆమె ఆలోచనలో చేస్తున్నది. భర్త మనస్సు ఎలా ఉన్నా, వెంటనే విజయ్‌కు కాల్‌ చేసింది ఆమె.

రేపు ఆదివారం ఉదయమే బంగ్లాకు వచ్చేయిరా…ఎన్నాళ్లయింది నిన్ను చూడక.కనీసం ఫోన్‌ అయినా చేయడం లేదు. రాజకీయాల్లో ఎంత తీరిక లేకున్నా, అమ్మను మరిచిపోతారా? అంటూ మందలించింది అన్నపూర్ణమ్మ.

లేదమ్మా, ఎప్పటికప్పుడు నీకు కాల్‌ చేద్దామనే అనుకుంటున్నా, విజిటర్స్‌ ఎక్కువగా ఉంటున్నారు. అందుకే…అంటూ నసిగాడు విజయ్‌.

నాకు ఏ సాకులు చెప్పద్దు. నిన్ను టివిల్లో చూసి ఎంత ఆనందపడుతున్నానో తెలుసా…మా బాబు ఎంతగా ఎదుగుతున్నాడనే ఆనందం నాకు. అంటూ కాల్‌ కట్‌ చేసింది ఆమె.ఎలాగైనా అమ్మ దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు విజయ్‌.

భోజనాల సమయంలో , ఏమండి, వీలునామా విషయం మరిచిపోయినట్లున్నారంటూ ముఖ్యమంత్రి వద్ద మరోసారి ప్రస్తావించింది అన్నపూర్నమ్మ.

చూస్తున్నావుగా అసెంబ్లీలో అంతా హడావుడి, కొంత తెరపి లభించగానే అడ్వకేట్‌ను పిలుస్తా. అంటూ అప్పటికీ తప్పించుకున్నాడు సిఎం.పూర్ణా, తిరుమల వెంకటేశ్వరున్ని దర్శించుకుంటాను వెళ్లాలి, అన్నావుగా, నాకు ఇప్పట్లో తీరిక దొరకడం కష్టమే. విజయ్‌ను తీసుకొని పోయి వస్తానని నీవు అనుకుంటే అన్ని ఏర్పాట్లు చేయమని మా అధికారులకు చెబుతా, ఏమంటావు అంటూ భార్యవైపు చూసాడు.

అబ్బ ఎంత మంచి మాట చెప్పారండి. ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నా. తిరుపతి వెళ్లాలని. సరే మీరు రాకున్నా పర్వాలేదు లెండి. మన అబ్బాయితో వెళ్లి వస్తాను అంది అన్నపూర్ణమ్మ. తన పాచిక పారినందుకు సిఎం ఎంతో ఆనందించాడు. ఓ రెండు రోజులు విజయ్‌ అసెంబ్లీకి రాకుంటే ప్రాజెక్టుల కుంభకోణం చర్చ ఒక కొలిక్కి వస్తుందని ఆయన ఆశ. విపక్షాల్లో వారిలో వారికి గొడవలు జరుగుతున్నందున ఎవరూ ఈ విషయంపై అంతగా రాద్దాంతం చేయరని సిఎం అనుకుంటున్నాడు. అసెంబ్లీలో మరింత అలజడి కాకుండా ఈ సమస్య ఆగిపోతే ఇక అధిష్ఠాన వర్గం కూడా పట్టించుకోదని, ఇరిగేషన్‌ మంత్రికి గండం తప్పినట్లేనని సంతోషంగా ఉన్నాడు.

తిరుపతికి ఎప్పుడు వెళ్లమంటారు అంటూ భార్య అడగటంతో సోమవారం ఉదయమే విమానంలో వెళ్లి, దర్శనం చేసుకోండి, తర్వాత కానీపాకంలో వినాయక స్మామిని, శ్రీకాళహస్తికి కూడా వెళ్లండి. అన్ని అక్కడక్కడే కదా మన వాళ్లు చెబుతారు. అక్కడి అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తారు. తోడుగా విజయ్‌ ఉంటాడు కాబట్టి నీకు ఎలాంటి ఇబ్బంది రాదని చెప్పాడు సిఎం. విజయ్‌ పేరు చెప్పగానే ఆమెలో మరింత ఆనందం కనిపించింది. వీలునామా రాయడానికి సిఎం అంగీకరించిన నాటి నుంచి విజయ్‌ను తన స్వంత బిడ్డగానే భావిస్తున్నది అన్నపూర్ణమ్మ. ఆమె సంతోషానికి లోటు రాకుండా చూసుకోవాలనే తలంపుతో సిఎం మసలుకుంటున్నాడు. అయితే తన రాజకీయ ప్రయోజనం కోసమే విజయ్‌ను ఆమెతో పంపాలని తనకు వచ్చిన ఆలోచనకు మాత్రం మధనపడుతున్నాడు.అమ్మా ఉదయం టిఫిన్‌ టైంకే బంగ్లాకు వద్దామనుకున్నా, కానీ కుదరడం లేదు, ఈరోజు ఉదయం నుంచి విజిటర్లు ఎక్కువ మంది వచ్చారు. వారందరితో మాట్లాడే వరకు ఎక్కువ టైం అవుతుంది. మీరు తినండి. నేను లంచ్‌కు అక్కడికి తప్పక వస్తానని ఆమెకు ఫోన్‌ చేసి చెప్పాడు విజయ్‌.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-32)

Leave A Reply

Your email address will not be published.