విజయుడు (ధారావాహిక నవల పార్ట్-41)

తల్లిని పట్టుకొని ఊపేస్తూ, నా విజయ్ కుదుటపడుతున్నాడు. రేపు నేను వెళ్తున్నా. నాతో మాట్లాడుతాడు కూడా. నేనంటే ఆయనకు ప్రాణం కంటే అధికం. నా విజయ్‌ను చూస్తున్నా రేపు అని పలుసార్లు అనుకుంటున్న కూతురు విరంచిని సంతృప్తిగా చూసింది తల్లి.
తల్లీ,కూతుర్లకు ఈ సాయంత్రం మొత్తం విజయ్ గురించిన కబుర్లే. కాలేజీ నుంచి అప్పుడే వచ్చిన తండ్రికి వెలిగిపోతున్న ముఖంతో ఎదురు వచ్చింది. కూతురు గమనిస్తూ, ఏమిటమ్మా విషయం అని అనగానే విజయ్ గురించి ఎంతో ఆనందంతో తండ్రికి వివరించింది. ముఖ్యమంత్రి సతమణికి కాల్ చేసానని, ఆమె నిమ్స్‌కుతనను తీసుకువెళ్తానని చెప్పడతో పాటు కార్ పంపిస్తున్నదని చెబుతున్న కూతురును గమనిస్తూ, విజయ్ అంటే ఇంతగా ప్రేమ పెంచుకున్నదని అనుకున్నాడు కుటుంబరావు. రాత్రి భోజనాల దగ్గర కూడా విజయ్ గురించే చెబుతున్న కూతురు మనస్సులో మాట ఆమె చెప్పకుండానే గ్రహించాడు ఆయన.
విరంచికి ఆరోజు రాత్రి నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, విజయ్‌ను ఎప్పుడు చూస్తానా అంటూ అదే తలంపుతో ఉండిపోయింది.
బెడ్ రూంలోకి వచ్చిన తర్వాత కుటంబరావుతో సంభాషణలు ప్రారంభించింది విరంచి తల్లి,
చూసారా? ఇన్ని రోజులు తర్వాత విరంచి మామూలు మనిషి అయింది. విజయ్ ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి కడుపు నిండ తిన్నది లేదు.మనతో సక్రమంగా మాట్లాడిరది లేదు కదండీ…
అవును నేనూ గమనించాను అంతా… విరంచికి విజయ్ అంటే ఎంతో అభిమానం మరి.
కాదండీ… విరంచికి విజయ్ అంటూ చచ్చేటంతటి ప్రేమ. మనకు చెప్పడం లేదు కానీ వారు ఒకరినొకరు బాగా ఇష్టపడుతున్నారు. విజయ్ ఆరోగ్యం కూడా మెరుగవుతున్నదట. కొద్ది రోజులు ఓపిక పట్టి,మనం ఇద్దరిని కదిపి చూడాలి. వీలైనంత త్వరంగా వారికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అంటూ భర్త చాతిపై తలపెట్టి అడిగింది. ఇక ఆలస్యం చేయవద్దని, ముందుగా విజయ్ మనస్సులో ఏముందో కూడా మీరు తెలుసుకోవాలని భర్తకు పదేపదే చెబుతున్నది. ఒక్కగా నొక్క కూతురు. మన పాప సుఖసంతోషాలే మనకు ముఖ్యం కదా అంటూ భర్తకు చెప్పింది.
నాకు తెలియదా ఏమి? విరంచి ఈ రోజు ఎంత సంతోషంగా ఉందో నేనూ చూస్తున్నానుగా, అలాగే చేద్దాం.విజయ్ పూర్తిగా కోలుకున్న తర్వాతనే మనం ముందుకు పోవాలి. ఏ మాత్రం తొందరపడవద్దు, అన్నాడు కుటుంబరావు.
విరంచి ఇచ్చిన లొకేషన్ ఆధారంగా బంగ్లా డ్రైవర్ నేరుగా ఇంటికి వచ్చాడు. అప్పటికే రడీగా ఉన్న విరంచి అమ్మ.నాన్నలకు టాటా చెబుతూ సంతోషంగా కారు ఎక్కింది. అత్తగారింటికి వెళ్తున్న కూతురు ను చూసినట్లుగా ఉన్నారు వారిద్దరు. ఈ రోజు కూతురు ముఖంలో ఎన్నడూ లేనంత ఆనందం కనిపించడంతో, తల్లీ దండ్రులు కూడా కూతురు సుఖంపైనే చర్చించుకున్నారు.
కారు బంగ్లాకు రాగానే అన్నపూర్ణమ్మ పరుగున ముందుకు వచ్చి విరంచిని కౌగలించుకుంది. కొంత దూరంగా జరిగి, విరించిని ఆపాదమస్తకం పరిశీలనగా చూసింది. ఊ…అందగత్తె. పైగా విద్యావంతురాలు. అందుకనే విజయ్ ఇష్టపడుతున్నాడు కాబోలు. అనుకుంది.
పదపద ముందుగా టిఫిన్ చేద్దామంటూ విరంచిని డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకువచ్చింది.ఏమండోయి రండి, ఎవరు వచ్చారో చూడండి అంటూ భర్తను పిలిచింది.
డైనింగ్ హాల్‌లోకి ముఖ్యమంత్రి జానకి రామయ్య రాగానే విరంచి లేచి నమస్కారం చేసింది. ఒద్దికైనా అమ్మాయి అనుకున్నాడు సిఎం.
విరంచి గురించి చెబుతున్న భార్యను వారించి నిన్ననే చెప్పావుగా, విజయ్ స్నేహితురాలని…అమ్మాయిని టిఫిన్ తిననీవు, కబుర్లు తర్వాత చెబుదువుగానీ అన్నాడు సిఎం.
అల్పహారం తీసుకున్న తర్వాత విరంచిని తన గదిలోకి తీసికెళ్లింది. మళ్లీ అవే ముచ్చట్లు. విజయ్ గురించే వారిద్దరిమాటలు. ఒకరిది మాతృహృదయం, మరొకరిది గుండెలనిండా నింపుకున్న ప్రేమ. వారి ప్రతి ఆలోచన, పలుకు అంతా విజయ్,విజయ్, విజయ్.
ఆస్పత్రికి టైం అవుతుంది తొందరగా రడీ కండి అంటూ భర్త చెప్పే వరకు వారి మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. విజయ్ పట్ల విరంచి ఆరాదనను గమనించింది అన్నపూర్ణమ్మ. వాడు తొందరగా కోలుకుంటే బాగుండు.వీరిద్దరికి మూడుముళ్లు వేసి, బంగ్లాకు తీసుకు వస్తే నాకు అంతకంటే ఏమి కావాలి, వారి పిల్లపాపలతో నేను ఆడుకోవచ్చు. విరంచిని చూస్తూ ఆలోచనలో మునిగిపోయింది అన్నపూర్ణమ్మ.
నిమ్స్‌లో ప్రత్యేక గదిలో ఉన్నాడు విజయ్. ఐసియులో బెడ్‌పై అచేతనంగా ఉన్న బాబును చూసిన అన్నపూర్ణమ్మ, ఈ రోజు విజయ్‌లో కనిపించిన మార్పుకు ఆనందం వేసింది. బాబు అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లతో బెడ్ వద్దకు వెళ్లింది. ఆమెను చూసి లేవడానికి అన్నట్లుగా విజయ్ లేవబోతుండగా అక్కడే ఉన్న డాక్టర్ వద్దని వారించాడు. అమ్మా అంటూ ఆమె వైపు చూసాడు విజయ్. లోగొంతుకతో వస్తున్నది ఆయన మాట. అంత స్పష్టంగా కూడా లేదు.
ఎవరు వచ్చారో చూడు అంటూ పక్కకు జరిగింది ఆమె.
అన్నపూర్ణమ్మ పక్కకు తొలగగానే విరంచి కనబడిరది. ఆమెను చూడగానే విజయ్ కళ్లలో మెరుపు. ఒకరినొకరు అలాగే చూస్తూ ఉండిపోయారు. విరంచి కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. వారిలో ఒకరిపట్ల,మరొకరికి ఉన్న ఆరాధన, అర్తి అన్నపూర్ణమ్మ పసిగట్టింది. మాటలకందని అనుభూతిని వారు అనుభవిస్తున్నారు. డాక్టర్‌ను కూడా తనతో బయటికి పిలిచింది అన్నపూర్ణమ్మ. గదిలో వారిద్దరినే వదిలి వచ్చారు.
పక్కగదిలో విరంచి, విజయ్‌లున్నారు. వారు ఏమి మాట్లాడుకుంటున్నారో వినాలనే కుతూహలంతో ఉన్నా సభ్యత కాదనుకుంది అన్నపూర్ణమ్మ. కానీ ఆ రూం నుంచి ఒక్కమాట కూడా వినబడటం లేదు.అసలు మాట్లాడుకున్న శబ్దమే లేదు. హత్యాయత్నం నుంచి బయటపడిన ప్రియుడిని చూడటానికి అమ్మాయి వచ్చింది. కానీ ఉలుకుపలుకు లేకుండా ఇద్దరు ఎలా ఉండగలుగుతున్నారో ఆమెకు అర్థం కాలేదు. అయితే వారి మనోగతం మరోలా ఉంది. కేవలం చూపులతోనే భావాలను వ్యక్తం చేసుకుంటున్నారని పాపం ఆమెకు తెలియదు. విజయ్‌ను ఆ పరిస్థితుల్లో చూడటంతో నోటమాటరావడం లేదు విరంచికి. ఎంతో చలాకీగా ఉండే విజయ్ ఆస్పత్రి బెడ్‌పై ఇలా ఉన్నాడేమిటనేది విరంచి ఆందోళన చెందింది. చాలా రోజుల తర్వాత విరంచిని చూడగలిగాననే ఆనందం విజయ్ కళ్లలో కనిపించింది.తర్వాత విజయ్ తన ఉద్వేగాన్ని ఆపుకోలేక…ఎలా ఉన్నావు విరంచి అన్నాడు.
నేను కదా ఆ మాటలు అడగాల్సింది అంటూ కన్నీళ్లు తుడుచుకుంటా అంది విరంచి.
చూస్తున్నావుగా బాగానే ఉన్నా అన్నాడు అంత బాధలోనూ నవ్వు తెచ్చిపెట్టుకుంటా విజయ్…
కొద్దిసేపు వారి మధ్య మాటలే కరువయ్యాయి.
అమ్మను ఎలా కలుసుకున్నావు అడిగాడు విజయ్.
తాను కాల్ చేసిన విషయం, ఆమె తనను ఆప్యాయంగా ఇంటికి పిలిచి, ఆస్పత్రికి తీసుకువచ్చిన విషయం విరంచి చెప్పింది.
కొద్ది రోజుల్లోనే డిశ్చార్జీ అవుతారని డాక్టర్లు చెప్పారట, అమ్మ చెప్పింది.
అలాగా, డాక్టర్లు ఇంకా నాకు ఏమీ చెప్పలేదు. నిన్ననే కదా నేను మరోసారి పునర్జన్మ పొందింది. అంటూ నాలిక కర్చుకున్నాడు విజయ్.
అదేమిటి అలా అంటున్నారు. రెండుసార్లు పునర్జన్మ ఏమిటి…తూటాలు మీ చాతిని చేధించినప్పటికీ గుండె, ఊపిరి తిత్తులు యధావిధిగా పనిచేస్తున్నాయని డాక్టర్లు చెప్పారు కదా? మీరేమిటి అలా మాట్లాడుతున్నారు అంటూ ఆందోళనగా చూసింది విరంచి.
యధాలాపంగా అలా అన్నాను. అంతే. అంతే అంటూ విజయ్ కలవరిస్తున్నట్లుగా మాట్లాడాడు. విరంచిలో కనిపిస్తున్న ఆవేధనను పోగొట్టాలని టాపిక్ మార్చిన విజయ్, పిహెచ్‌డి ఎంతవరకు వచ్చిందని అడిగాడు.
ఇంకేమి థీసిస్ మీ విషయం తెలిసినప్పటి నుంచి దాని జోలికే పోలేదు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిద్దాం లెండి. అంది విరంచి.
ఇలాగైతే మీ పిహెచ్‌డి ఇప్పట్లో పూర్తి కాదు అన్నాడు నవ్వుకుంటూ.
ఏమో నాకు ఆ ధ్యాసే రాలేదు. అంతా మీరు ఎలా ఉన్నారనే ఆలోచనతోనే గడిచిపోయింది. బంగ్లాకు వచ్చి అమ్మను కలిసిన తర్వాత ఆమె దయ వల్ల నిన్ను చూడగలిగాను లేకుంటే అసలు మీవద్దకు రావడం ఎంత కష్టంగా ఉందో నీకు తెలేసా…
క్లిష్ట పరిస్థితిలో ఉన్న పేషంట్ ఎవరి వద్దకైనా డాక్టర్లు ఎవరినీ అనుమతించరు కదా? ఇది అంతే అన్నాడు విజయ్.
రూంలో కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత మాటలు వినబడుతుండటంతో విజయ్ గొంతులో కొత్త ఉత్సాహం వచ్చిందని అన్నపూర్ణమ్మ గమనించింది.విజయ్ ఇక్కడ ఉన్నంత కాలం ఇక రోజు విరంచిని తీసుకొని ఆస్పత్రికి రావాలని ఆమె నిర్ణయించుకుంది.
విజయ్ ఆరోగ్యం గురించి డాక్టర్లతో సంప్రదిస్తున్నాడు సిఎం. డిస్‌చార్జీకి ఇక కొద్ది రోజులే పడుతుందని, రికవరీ బాగుందని వివరిస్తున్నారు వాళ్లు. ఈ మాటలకు పక్కనే ఉన్న భార్యలో కనిపిస్తున్న ఆనందాన్ని గమనిస్తున్నాడు సిఎం.
విజిటర్లను ఎక్కువగా అనుమతించకండి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు ముఖ్యమంత్రి. అక్కడ ఎక్కువ సమయం ఉండటం వల్ల పేషంట్స్‌కు, డాక్టర్లకు కూడా ఇబ్బందిగా ఉంటుందని భావించిన సిఎం లేచి మళ్లీ విజయ్ ఉన్న బెడ్ వద్దకు వెళ్లారు. సిఎంతోపాటు అన్నపూర్ణమ్మ రాగానే విరంచి కొంత దూరం జరిగి నిలబడిరది.
విజయ్, ధైర్యంగా ఉండు. అంతా మంచే జరుగుతుంది. అమ్మ ఇక రోజూ వచ్చి నిన్ను చూసుకుంటుంది. వీలైతే నేనూ వస్తాను. అంటూ బయటకు వస్తుండగా అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మ, విరంచి చేయి పట్టుకొని, ఇద్దరం రోజూ వస్తాం… మందులు టైంకువేసుకో..అయినా డాక్టర్లు కనిపెట్టుకుని ఉంటారు లే..ఇక్కడ ఎవరు నీ వద్ద ఉన్నారు? ఎక్కడ, నీ పిఎ అనగానే బయట ఉన్న నగేష్ అక్కడికి పిలిపించారు డాక్టర్లు.
చూడు బాబు సార్‌ను జాగ్రత్తగా చూసుకో… ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయి అంది అన్నపూర్ణమ్మ. విజయ్ చూపు విరంచిపై పడిరది. ఆమె కూడా విజయ్‌నే చూస్తూ ఉంది.
తప్పదన్నట్లుగా విరంచి కూడా సిఎం దంపతులతో పాటు వెళ్లిపోతున్నట్లుగా సంజ్ఞ చేసింది. తలూపాడు విజయ్.
విజయ్ దాదాపుగా కోలుకున్నాడు. డిశ్చార్జీ చేసే రోజున కొత్త సమస్య ముందుకు వచ్చింది. ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌కు వెలితే విజయ్‌ను దగ్గరుండి చూసుకునే వారెవరనే విషయంపై విరంచి, అన్నపూర్ణమ్మల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అప్పటివరకు ఇద్దరూ ప్రతి రోజూ ఆస్పత్రికి కలిసే వచ్చి వెళ్తున్నారు. కానీ ఈసమస్య గురించి వారి మధ్య ప్రస్తావన రాలేదు.
ముందుగా విరంచియే అంది.
అమ్మా, క్వార్టర్స్‌కు వెలితే విజయ్‌కు దగ్గరుండి అన్ని సముకూర్చడం నగేష్‌కు సాధ్యం కాదు. పైగా ఇప్పటికే పాపం నగేష్ చాలా కష్టపడ్డాడు. అతనికి పెళ్లి అయింది, రాత్రి, పగలు విజయ్ దగ్గర ఉండలేడు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో నగేష్ రాత్రి ఇంటికే పోయి తర్వాత ఉదయం వచ్చే వాడు..అందుకే మా ఇంటికే విజయ్‌ను తీసుకుపోతాను అంది విరంచి.
ఆమె వైపు విచిత్రంగా చూసింది అన్నపూర్ణమ్మ. ఏమిటీ విజయ్‌ను మీ ఇంటికి తీసుకు పోతావా? ఆశ్చర్యపోతూ అడిగింది.
ఏమిటి ఆమ్మగారు, నేను తీసుకుపోకూడదా? ఎందుకు మీకు అనుమానం అంటూ విరంచి ప్రశ్నించింది.
ఏమీ లేదు, ఏ బంధంతో విజయ్‌ను తీసుకు వెళ్తావా అని వ్యగ్యంగా అడిగింది…
స్నేహ బంధం అన్నింటికంటే గొప్పది అమ్మగారు. మా అమ్మనాన్నకు కూడా తెలుసు, వాళ్లేమి అభ్యంతరం చెప్పరు తెలుసా అంది ఆరందిలా విరంచి.
ఓహో, అలాగా…పెళ్లి కాకుండానే అల్లుడు ఇంట్లో ఉంటాడంటే పాపం వాళ్లు మాత్రం ఏమి చేస్తారులే అంటూ నవ్వింది అన్నపూర్ణమ్మ.
(సశేషం)