విజయుడు (ధారావాహిక నవల పార్ట్-42)

విరంచి బుంగమూతిపెడుతూ, ఈ సమయంలో మీరు వేలాకోలాలు ఆడితే ఎలా అమ్మ. విజయ్‌కు ఎవరున్నారు. ఒంటరి వాడు. చెప్పానుగా నగేష్‌కు సాధ్యం కాదు. ఇంకా పూర్తిగా కోలుకోని విజయ్‌ను అలా ఒంటరిగా ఎలా వదిలిపెట్టను చెప్పండి అంటూ అన్నపూర్ణమ్మ చేతులు పట్టుకొని ఊపింది.
విజయ్ పట్ల విరంచిలో ఉన్న ప్రేమానురాగాలకు చలించిపోయింది ఆమె. ఆమెను దగ్గరగా తీసుకొంది. వారిద్దరు కలకాలం కలిసి సుఖంగా ఉండేలా దీవించు అంటూ మనస్సులోనే దేవున్ని వేడుకుంది.
పిచ్చి పిల్లా నీ ఆరాటం చూద్దామనే అలా అడిగా.. తల్లిని ఇక్కడ ఉన్నాననే ద్యాసే లేకుండా నీవే అన్ని నిర్ణయాలు తీసుకుంటుంటే మచ్చటేసింది విరంచి. నీకు మా విజయ్ పట్ల ఉన్న అనురాగమే నీ కళ్లలో నాకు కనిపించింది. భవిష్యత్తులోనూ నీవు విజయ్‌ను బాగా చూసుకుంటావనే భరోసా కలిగింది నాలో.. చాలు తల్లీ చాలు. విజయ్‌కు ఎవరు లేరని తల్లడిల్లే నాకు, నీ రూపంలో ఆ నీడ కనిపించింది.
అమ్మా అంటూ మరింతగా హత్తుకుపోయింది విరంచి.
వద్దమ్మా, పెళ్లి కాకుండా ఈ పరిస్థితిలో విజయ్ మీ ఇంటికి వెళ్లడం సముచితం కాదు. సిఎం గారికి ముందే చెప్పాను. వాన్ని బంగ్లాకు తీసుకు వస్తానని. ముందుగా నీకు చెప్పలేదు కదూ…సరే డాక్టర్లను అడుగుదాం కరెక్టుగా ఏ టైంకు విజయ్‌ను డిశ్చార్జీ చేస్తారో అనడంతో వారి సంభాషణ ఆగిపోయింది.
ఆరోగ్యం దాదాపుగా కుదుటపడటంతో విజయ్‌ను ఇంటికి పంపే ముందు డాక్టర్లు అన్నిజాగ్రత్తలు చెప్పారు. లేచి కూర్చొని తన పనులు తాను చేసుకోగలుగుతున్నాడు. డిశ్చార్జీ తర్వాత తన క్వార్టర్‌కే వెళ్తున్నట్లుగా విజయ్ భావిస్తున్నాడు. పిఎ నగేష్‌కు పిలిచి డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం అంతా చూసుకోవాని సూచించాడు. ఏ మందు ఎప్పుడువేసుకోవాలో విజయ్‌కు డాక్టర్లు వివరిస్తుంటే, అన్నపూర్ణమ్మనే శ్రద్ధగా వింటున్నది. అనుమానాలు అడుగుతున్నది. ఎలాంటి ఆహారం పెట్టాలి, ఎప్పుడు పెట్టాలని ప్రశ్నలు వేస్తున్నది. ఇంకా ఏమైనా గుర్తుకు వస్తే నేను ఫోన్ చేయాలి, ఎవరి నంబర్ ఇస్తారంటూ డాక్టర్లను అడిగింది. విజయ్‌ను దగ్గరుండి అనేక మంది డాక్టర్లు చూసుకున్నప్పటికీ హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ ముందుకు వచ్చి తన సెల్ నెంబర్‌తో మిస్స్‌డ్ కాల్ ఇచ్చి, ఈ నంబర్‌కు నాకు కాల్ చేయండి అన్నారు. విజయ్ తదేకంగా అమ్మనే గమనిస్తున్నాడు. తనపట్ల ఆమె చూపుతున్న ప్రేమకు లోలోనే ఆనందపడుతున్నాడు. ఎన్ని జన్మలెత్తినా ఆమె రుణం తీర్చుకోలేనని అనుకున్నాడు.
విజయ్‌తోపాటు అన్నపూర్ణమ్మ, విరంచి, నగేష్ కారులో కూర్చున్నారు. కారు ఎక్కగానే బంగ్లాకు పోనియ్ అని అన్నపూర్ణమ్మ చెప్పింది. ఆశ్యర్య పోవడం విజయ్‌వంతు అయింది.
ఎందుకమ్మా, క్వార్టర్ప్‌కు వెళ్లిపోతా… బాగుండదు. బంగ్లాకు ఎందుకు అన్నాడు.
ఏమిటీ, క్వార్టర్స్‌కు వెలుతావా? అమ్మ దగ్గరకు రావడం ఇష్టం లేదా…
అదికాదు అమ్మా…మీకు ఎందుకు శ్రమ. నగేష్ ఉంటాడు. అన్ని చూసుకుంటాడు అన్నాడు విజయ్
అలాగా, క్వార్టర్స్‌కు వెలితే టైంకు ఎవరు వండిపెడతారు. అయినా ఈ పరిస్థితిలో ఒంటరిగా ఉంటే ఎలారా బాబు. అయినా నీతో నాకు వాదనలు ఎందుకుడ్రైవర్ బంగ్లాకు వెళ్లు. అంది అన్నపూర్ణమ్మ. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా.
విరంచి మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఈ విషయంపై ఇప్పటికే అన్నపూర్ణమ్మతో మాట్లాడినందున విరంచి ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదు. ఆమె ఇప్పటికే నిర్నయానికి వచ్చినందున విజయ్‌తో పాటు విరంచి ఒకరినొకరు చూసుకోవడం తప్ప ఏమీ మాట్లాడలేకపోయారు.
ఆమెకు ఎదురు చెప్పలేని స్థితిలో ఉండిపోయాడు విజయ్.
కారు నేరుగా బంగ్లాకు చేరుకుంది.
అన్నపూర్ణమ్మ ఆరాటం అంతా ఇంత కాదు. స్వంత కొడుకు వచ్చినట్లుగానే ఆమె ఫీలవుతున్నది. వర్కర్లను అది చేయ్యండి, ఇది చెయ్యండి అంటూ పురమాయిస్తున్నది. స్వయంగా దిష్టి తీసింది.
విజయ్ ఇది నీ రూం. విరంచి రోజూ నిన్ను చూసి రావడానికి కారు పంపిస్తాను. చూడమ్మాయి, ఇది కూడా నీ ఇళ్లు అనిఅనుకో.. ఎప్పుడు రావాలనుకున్నా నాకు కాల్ చేయి. నా ఉద్ధేశ్యం అయితే నీవు రాత్రి వరకు ఇక్కడే ఉండి భోజనం చేసి వెళ్లు. ఉదయమే మళ్లీ కారు పంపుతాను వచ్చి ఇక్కడే టిపిన్ చేసి రాత్రి వరకు ఉండవచ్చు. రాత్రి కూడా ఇక్కడ ఉన్నా నాకు అభ్యంతరం లేదు. అంటూ నవ్వింది అమ్మ.
ఏమి మాట్లాడాలో విరంచి కి అర్థం కాలేదు. విజయ్‌ను చూస్తూ ఉండిపోయింది.
హాస్యం కెసం అన్నానే కానీ, మీ అమ్మ నాన్నలు ఒప్పుకోరు కానీ రాత్రికి వెళ్లిపో అంటూ విరంచి ఇబ్బందిని గమనిస్తూ మళ్లీ అంది అన్నపూర్ణమ్మ.
విజయ్ కూడా అమ్మ మాటలకే మద్దతు పలికాడు.
డిన్నర్ చేసి, వెళ్లిపోయింది విరంచి.
రాత్రి విజయ్ రూంలోనే మరో మంచం వెసుకుని పడుకోవాలని అనుకుంది ఆమె, కానీ వర్కర్లు ఉంటారు , అయినా నాకు మంచిగానే ఉంది. అంటూ విజయ్ వారించాడు. దీంతో ఆమె సణుగుతూనే వెళ్లిపోయింది.
పడక గదికి వెళ్లి భర్తతో ఇదే విషయం చెప్పింది. వాడు వద్దన్నాడు అంటూ బాధపడిరది.
సరే పూర్ణ. పోనియి, ఇప్పటివరకు ఒంటరిగా ఉంటున్నాడు కదా, మన ఇంటిలో అలవాటు అయితే వాడే మారుతాడు. తల్లి వి కదా అన్ని ఓర్చుకోవాలి అంటూ ఓదర్చాడు.
తానే తల్లిగా అన్నీ విజయ్‌కు దగ్గర ఉండి చూసుకోవాలని ఆమె ఆరాటం అర్థం చేసుకున్నాడు సిఎం. వాడు వచ్చిన తర్వాత నుంచి భార్య ఎంతో సంతోసంగా ఉంటుంది. ప్రస్తుతానికి అదే చాలు అనుకున్నాడు.
(సశేషం)