విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-46)

అయిదారు నిమిషాల పాటు డిజిపి హత్యకు కుట్రదారు ఎవరో, తనశాఖలో సహకరించిందెవరో, నింధితులెవరో వివరించారు. ముందుగా నమ్మలేదు. విజయ్‌.. అయితే చెబుతున్నది సాక్షాత్తు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి. తప్పదు ఇదే నమ్మాలి. వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. ఇలా జరుగుతుందని కళలో కూడా అనుకోలేదు. ఊహించడానికే భయంగా ఉంది. రాజకీయాల్లో పదవుల కోసం ఇంతగా దిగజారుతారా? ఒకటికి పదిసార్లు అదే ప్రశ్న. ఇంత నీచానికి పాల్పడిన వాన్ని వదల కూడదు అనుకున్నాడు.తగిన శిక్షపడాల్సిందే. రాజకీయంగా ఎంత నష్టం అయినా పర్వాలేదు. అయితే మళ్లీ ఆలోచనలో పడ్డాడు. తేరుకోలేక పోతున్నాడు విజయ్‌.

కొద్ది సేపు ఇద్దరి మధ్య మౌనం.

కేసు తీవ్రత దృష్ట్యా అందుకే మీకు ముందుగా చెప్పాలని పిలిపించాను. ఇక మీ ఇష్టం. అంటూ వేరే ఫైళ్లు చూస్తున్నాడు డిజిపి.

ఇన్నాళ్లుగా తనను తొలుస్తున్న ప్రశ్నకు ఇలాంటి సమాధానం దొరుకుతుందని ఊహించలేదు.. ఇలాంటి కుట్ర జరుగుతున్నదని తెలుసుకోలేక పోయాను. ఇందుకేనా నా అన్వేషణ..మధన పడుతున్నాడు విజయ్‌, ఆలోచనల పరంపర, ఎక్కడా ఆగడం లేదు. ఘోరమైన విషయం. కానీ ఏమి చేయాలి.కిం కర్తవ్యం అంటూ తనకు తానే ఎన్ని సార్లు ప్రశ్నించుకున్నాడో తెలియదు. అంటే తనపై ఢిల్లీలో జరిగిన హత్యా ప్రయత్నం పై కూడా మబ్బులు వీడినట్లే. అంతా ఒక్కరి కుట్రే.

హత విధి,ఎంతపని జరిగింది. సమాజంలో ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో కూడా తెలియని దుస్థితి ఇది, పగవాడికి కూడా రావద్దు. ఒక్కసారిగా ఆ దేవదేవుడు గుర్తుకు వచ్చాడు.తాను రోజు పూజించే శ్రీహరికి మనస్సులోనే దండం పెట్టుకున్నాడు.

ఎటూ పాలుపోవడం లేదు. ఈ విషయపై తాను ఎలా వ్యవహరించాలో ఆ మహా విష్టువువే దారి చూపితే బాగుండు అనుకుంటున్నాడు. ఒక ఆలోచన మెరిసింది విజయ్‌కు

డిజిపి గారు మీరు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి. అంటూ చేయి చాపాడు విజయ్‌.

మళ్లీ ఏదో ఉపద్రవం ఏమిటో అనుకుంటూ అనుమానంగా చేయి ఇచ్చి కలిపాడు డిజిపి.

మాట ఇచ్చారు, గుర్తుంచుకోండి అంటూ విజయ్‌ తన మనస్సులోని ఆలోచనను పంచుకున్నాడు విజయ్‌.

కేసు ఇప్పటికే ఆలస్యం ఎలాగూ అయింది కాబట్టి కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయి.ఈ కేసు ముందుకు వస్తే అదే చర్చనీయాంశం అవుతుంది.. మీరు ఏ చర్య తీసుకున్నా, అది ఎన్నికల్లో మాపార్టీకి తీవ్ర నష్టంజరుగుతుంది. అందుకే మిమ్ములను అభ్యర్థిస్తున్నా…

ఏమంటున్నారు విజయ్‌ గారు.

అదే…కేసును కోర్టు వరకు తీసుకు వెళ్లడం కాదు,అసలు కేసులో నిందితులను అదుపులోకి కూడా వెంటనే తీసుకోవద్దు. మరి కొంత సమయం తీసుకుందాం. మీరు మాటిచ్చారు కాబట్టి అడుగుతున్నా, ఈ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు కేసును విషయంలో మీరు ఎలాంటి తొందర పడవద్దు. పైగా మీ అధికారి కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. మీ శాఖకు కూడా అప్రతిష్టయే.. అందుకే అడుగుతున్నా, ప్రజల్లో రాజకీయ నేతలు, పోలీసులంటే నమ్మకం పూర్తిగా పోతుంది. అందుకు మరీమరీ అడుగుతున్నా…రేసును పెండిరగ్‌లో పెట్టండి. తర్వాత ఆలోచిద్దామన్నాడు విజయ్‌.

నోటమాట రాలేదు డిజిపికి.

అలా ఎలా కుదురుతుందండి, ఇప్పటికే పోలీసు శాఖకు అపఖ్యాతి వచ్చింది. అధికార పార్టీ ఎంఎల్‌ఎపై హత్యా ప్రయత్నం జరిగితే కేసును సీరియస్‌గా తీసుకోలేదని,ఎవరినీ పట్టుకోలేకపోతున్నారని పెద్దయెత్తున మా పై విమర్శలు… కేసును పెండిరగ్‌ లో పెట్టడం ఎలాగండి ప్రశ్నించారు డిజిపి.

అందుకే ముందుగా మీ నుంచి మాటతీసుకున్నాను. నేను తెలుసుకోవాల్సింది ఏమిటో పూర్తిగా నాకు అర్థమైంది. నన్ను ఎందుకు ఎవరు చంపాలనుకున్నారో…అనేది. అయితే నేను క్షేమంగా బయటపడ్డాను. ఇక కేసుతో వచ్చే ప్రయోజనం లేదు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చానంటూ…

నేను కాదు మీరు ఎవరికీ చెప్పవద్దని,డిజిపిని ఒప్పించాడు విజయ్‌.

పోలీసు కార్యాలయం నుంచి యాత్రికంగా బయటకు వచ్చిన విజయ్‌ మనస్సు అల్లకల్లోలానికి గురువుతున్నది. మనస్సుకు పెద్ద గాయమే.దీనికి మందు లేదు. కాలమే పరిష్కారం చెబుతుందా అంటే ఇది మరిచిపోయే విషయం కాదు. ఎల్లకాలం గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఎటు నుంచి ఎటు పోతున్నది నా జీవితం. ఇన్ని ఆటుపోట్లకు గురువుతున్నా కూడా ఎందుకో ఆ దైవం తోడున్నాడనే విశ్వాసం కలుగుతున్నది.

డిజిపి గారు చెప్పినట్లు అన్ని తూటాలు కూడా నా ప్రాణాలు తీయలేకపోయాయి. ఢిల్లీలో కూడా అంతే కారు మంటలకు ఆహుతి కాగా డ్రైవర్‌ సజీవంగా తగలపడిపోయాడు.తాను మాత్రం దూరంగా పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడా? బతికి వచ్చాడా? హత్యా ప్రయత్నం జరిగిందని మాత్రం తెలసింది కానీ…తర్వాత ఏమి జరిగింది. పునర్జన్మ ఎలా వచ్చింది… నాడు చనిపోలేదా, అసలు ఏమైందో…అన్నీ ప్రశ్నలే.

ఢిల్లీ ప్రమాదమే భయంకరం అయితే మళ్లీ ఇక్కడ దాడి, నాకే ఎందుకు ఇలా జరుగుతున్నది? సరే ఏమైతేనేం రెండుసార్లు పునర్జన్మ లభించినట్లేనా? దైవం అనుకూలించడం వల్లనే ఇది సాధ్యమవుతున్నదా? ఎటు వైపు మళ్లుతుంది ఈ జీవితం…ఆలోచనల సుడిగుండం నుంచి బయటపడటానికి అధిక సమయమే పట్టింది. డిజిపి గారు తాను చెప్పింది అంగీకరించినందుకు కొంత సంతోషం అనిపించింది.పార్టీ కోసం మాత్రమే తాను మాట తీసుకున్నాని పాపం డిజిపి అనుకున్నాడు. వేరే ఆలోచన కూడా ఆయనకు రాదు. ఏదైతేనేమ తాను మంచి నిర్ణయమే తీసుకున్నానని అనుకున్నాడు విజయ్‌.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి:విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-45)

Leave A Reply

Your email address will not be published.