విజయుడు (ధారావాహిక నవల పార్ట్-47)

రోజులు గడుస్తున్నాయి. రాజకీయ కార్యకలాపాలతో విజయ్‌కు తీరిక లభించడం లేదు. అయితే విరంచి తండ్రి నుంచి పిలుపు. తమ ఇంటికి రాక చాలా రోజులైంది. రేపు మధ్యాహ్నం భోజనానికి రావాలని. ఆనందించాడు విజయ్.
నిజమే, విరంచి చూడాలని ఉన్నా, ఆ సంఘటన తర్వాత కనీసం ఆమెకు ఫోన్ చేయాలన్నా ఏదో బెరుకు అనిపించడంతో సాహసం చేయలేకపోయాడు.పైగా విరంచి నుండి కాల్ రాకపోవడంతో ఆమె కోపంగా ఉందేమో అనే అనుమానం.
ఎంతో ఉద్వేగంతో విరంచి ఇంట్లోకి ప్రవేశించాడు విజయ్, ఎప్పటిలాగా విరంచి తాను రాగానే ఎదురు రాకపోవడంతో ఏదో ప్రమాదాన్ని శంకించాడు. అయితే కుటుంబరావు స్వయంగా వచ్చి ఆహ్వానించడంతో భయం కొంత తగ్గింది. కొంతసేపటికి హాల్‌లోకి వచ్చిన విరంచి తన కళ్లకు కొత్తగా అనిపించింది. మరింత సుందరంగా ఉంది. పెద్దగా మేకప్ చేసుకోకపోయినప్పటికీ ఆమెలో ఏదో ఆకర్షణ ఉందనిపించింది విజయ్‌కు. హాలులో ఇద్దరే ఉన్నా.. ఇద్దరి మధ్య మాటలు పెగలడం లేదు.
విజయ్ బిడియ పడుతున్నాడని అర్థం చేసుకుంది విరంచి. ఆనాటి సంఘటనకు విజయ్ తప్పు ఏమీలేదని చెప్పాలని ప్రయత్నించింది ఆమె. అదే మాట వివరిస్తూ, ఇద్దరం తొందరపడ్డామని నీది,నాది ఎవరిది తప్పులేదు ఆసమయంలో అలా జరగడానికి నీతోపాటు, నా పాత్ర కూడా ఉందని ఆమె వివరించడంతో ఊపిరి పీల్చుకున్నాడు విజయ్.
భోజనాలు ముగించిన తర్వాత కుటుంబరావు, విజయ్, హాల్‌లో కూర్చున్నారు. విరంచి ఆమె తల్లి కూడా పక్కపక్కనే ఉన్నారు. పరిస్థితి గంభీరంగా ఉన్నట్లు అనిపించింది విజయ్‌కు. విరంచి కూడా ఏదో జరగబోతున్నదని అర్ధం అయింది.
మీ తరపున పెద్ద వాళ్లు ఎవరున్నారంటూ సంభాషణ ప్రారంభించారు కుటుంబరావు.
ఎందుకో అర్థం కానట్లుగా విజయ్ చూస్తుండగా విరంచియే చొరవ తీసుకొంటూ, ఆయనకు ప్రత్యేకంగా పెద్దవాళ్లు ఎవరూ లేరు… కానీ ముఖ్యమంత్రి గారి సతీమణి అన్నపూర్ణమ్మకు విజయ్ అంటూ ప్రాణం, స్వంత కొడుకులాగే చూసుకుంటుంది డాడీ, అయినా మీకెందుకు వచ్చింది అనుమానం అంది విరంచి.
నీకు ఏమి తెలియదు మాట్లాడకుండా కూర్చో అంది తల్లి.
అవునండి, విరంచి చెప్పింది కరెక్టే, ఇంకా నాకంటూ ఆత్మీయులు ఆమె తర్వాత మీరే అన్నాడు విజయ్.
మంచిది ఒకసారి ఆమెను కలిసి మాట్లాడుకుందాం, ఎప్పుడు వెళ్దామంటారో చెప్పండి అనడంతో ఏమీపాలుపోలేదు విజయ్‌కు.
దేని కోసం అంటారు అన్నట్లుగా ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి విరంచి వైపు చూసాడు. తనకేమి తెలియదని ఆమె సంకేతాలిచ్చింది.
బాబుకు అర్థం కావడం లేదు, విడమర్చి చెప్పండి ఇందులో దాపరికం ఏముందంటూ తల్లి చెబుతుంటే ఆశ్చర్యంగా చూసింది విరంచి.
అవును బాబు మీ ఇద్దరికి పెళ్లి చేద్దామనుకుంటున్నాం. మీరు కొద్ది నెలలుగా కలిసిమెలిసి ఉంటున్నారు. ఒకరిని మరొకరు అర్థం చేసుకొన్నారని, మీరే మాకు చెబుతారని ఇన్నాళ్లు ఆగాం. ఆడపిల్ల తండ్రిని కదా అందుకే నేనే తొందరపడుతున్నాను, ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందని మనస్సులో మాట చెప్పాడు, కుటుంబరావు.
తెల్ల ముఖం వేసాడు విజయ్. విరంచిని చూస్తున్నాడు. ఏమి చెప్పాలా అనుకుంటూ..
విరంచి పిహెచ్‌డి పూర్తి కావాలి. ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. అంటూ నసిగాడు. పైగా రేపోమాపో నేను ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. పార్టీ పెద్దలు పిలిచారు అన్నాడు విజయ్
పెళ్లి ఎప్పుడైనా, ఎంత జాప్యం అయినా పర్వాలేదు. మాటముచ్చట జరిగితే బాగుంటుంది, అన్నాడు కుటుంబరావు.
ఇరకాటంలో పడిపోయాడు విజయ్. పెళ్లి ప్రస్తావన వస్తుందని ఆలోచించలేదు. విరంచి మనస్సులో ఏముందో అనుకుంటూ ఆమెవైపు చూసాడు. తన అభిప్రాయాన్ని అంగీకరిస్తుందని అతని ఆశ.
అవును డాడీ ఇప్పుడే ఎందుకు అవన్నీ. తర్వాత చూద్దాం, ఏదో తతంగం జరిగితేనే విజయ్ నా వాడు కాదు నాన్నా…విజయ్ ఎప్పటికీ నా వాడే అంటూ ఉద్వేగంగా మాట్లాడింది విరంచి.
కూతురు ఇలా మాట్లాడుతుందని ఊహించని తల్లిదండ్రులు బిత్తర పోయారు. కాగా ఒక గండం నుంచి గట్టెక్కినట్లుగా విజయ్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ అమ్మాయి నా మనస్సును కూడా చదువుతున్నట్లుగా ఉంది. లేకుంటే నేను ఆశించినట్లుగానే ఎలా మాట్లాడుతుందని ఆమె వైపు ప్రశంసాపూర్వకంగా చూసాడు విజయ్.
కూతురు అలా చెప్పడంతో ఈ విషయాన్ని ఇక సాగదీయలేదు కుటుంబరావు. ముందుగా తన కూతురితోనే సంప్రదించి ఉండాల్సింది అనుకున్నాడు.
సాయంత్రం తిరిగి క్వార్టర్స్‌కు వెళ్లిపోయే ముందు సెలవు తీసుకొని బయలు దేరాడు. విరంచికి మాత్రం కళ్లతోనే కృతజ్ఞతలు చెప్పాడు విజయ్.
కారులో వస్తూ విజయ్ ఆలోచనల్లో పడ్డాడు. ఢిల్లీ వాళ్లు ఎందుకు పిలిచారో తెలియక సతమతమువుతుండగా, విరంచి తండ్రి మరో సమస్యను ముందుకు తెచ్చారు. విరంచితో కలిసి ఉండటం ఎంతో ఇష్టం తనకు… కానీ పెళ్లి అనే సరికి ఎందుకో వెంటనే అంగీకరించలేకపోతున్నాడు. ఈ విషయంలో మరోసారి విరంచితో స్పష్టంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు విజయ్.
కారులో వెళ్తుండగా కాల్ చేసింది విరంచి.
ఎలా కనిపెడుతావు నీవు. ఇలా నీగురించే ఆలోచిస్తుండగా కాల్ వచ్చిందంటూ విరంచిని ఆకాశానికి ఎత్తేసాడు విజయ్. విజయ్ అలా పొగుడుతూ ఉంటే వినాలని కోరుకుంటున్నది ఆమె మనస్సు.
ఇంకా చెప్పండి అంది యధాలాపంగా…
అవును విరంచి ఇప్పుడే పెళ్లి ప్రస్తావన వద్దని నేను అనుకున్న విషయాన్ని ఎలా కనిపెట్టావో చెప్పు. నిజంగా నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు విజయ్.
నా విషయం అప్రస్తుతం విజయ్. రాజకీయంగా నీ ఎదుగుదలకు సహకరించాలే కానీ,నేను నీకు ఏ విధంగా ప్రతిబంధకం కారాదు. నీ ముఖకవలికలను బట్టి నీ మనస్సును చదివాను అందుకే నేను అలా చెప్పాను. దీనికే నన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారంటూ నవ్వింది.
లేదు విరంచి, నీవు నాకు ఎప్పుడు అడ్డు కాదు. పైగా నీ సమక్షంలోనే నేను నేనుగా ఉంటాను. నా మార్గంలో నీ తోడు ఎప్పటికీ ఆనందమే కాదు అవసరం నాకు. అసలు నీవు లేనిదే నేను లేనని అనుకుంటున్నాను. నీ నుంచి ఏమీ ఆశించకుండా ఎప్పటికీ నీవాడుగానే మిగిలిపోవాలని ఉందని చెబుతున్న విజయ్ అంతరార్ధం విరించికి అర్థం అయి, కానట్లుగా ఉంది. ఎలాగైతేమి, విజయ్ నాకే స్వంతం అని మురిపెంగా అనుకుంది.
క్వార్టర్స్‌కు చేరుకోగానే విజయ్ కు అన్నపూర్ణమ్మ నుంచి కాల్ వచ్చింది.
ఏరా వాగ్దానభంగం చేస్తున్నావు. రాజకీయ నేతవనిపించుకున్నావు లే. మీకు అలవాటే కదా అంది నిష్ఠూరంగా…
అమ్మా, అందరితో నన్ను పోల్చుతున్నావా,వద్దమ్మా…అవును నిన్న రాత్రి నీకు గుడ్‌నైట్ చెప్పలేదు. ఈ ఉదయం గుడ్ మార్నింగ్ చెప్పలేదు. తప్పే. కానీ ఎందుకో నా మనస్సులో మరో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అదే ద్యాస. దీంతో నీకు కాల్ చేయలేదు. క్షమించమని కోరుకుంటున్నా కదా అన్నాడు విజయ్.
అదికాదురా… నీ నుంచి కాల్ రాకపోతే ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటుంది నాకు. అందుకు అలా అన్నాను. నీ మనస్సు ఈ అమ్మకు తెలియదట్రా. ఏమిటి నీ సమస్యలు అంత డల్‌గా మాట్లాడుతున్నావు.
ఏమిలేదమ్మా, ఢిల్లీ వాళ్లు ఎందుకో పిలిచారు. పార్టీ పనులట. వెళ్లాలి, అదే ఆలోచనలో ఉండగా,విరంచి డాడి కాల్ చేసి భోజనానికి రమ్మన్నాడు, వెళ్లి వస్తున్నాను.
ఓహో అత్తగారింటికి వెళ్లావన్నమాట. అందుకే అమ్మ గుర్తుకు రాలేదంటూ నవ్వింది.
అదేమి లేదమ్మా. ఢిల్లీకి వెలితే నీకు ఫోన్ చేయడం కుదరకపోవచ్చు. కోపగించుకోవద్దంటూ బ్రతిమాలాడు.
అయితే ముందుగా ఒకసారి బంగ్లాకు వచ్చి వెళ్లు అంటూ హుకుం జారీ చేసింది అన్నపూర్ణమ్మ.
విజయ్ ముఖ్యమంత్రి బంగ్లాకు చేరుకోగానే ఎదురుగా విరంచి కూడా కనిపించడంతో ఎంతో ఉల్లాసంగా ఫీల్ అయ్యాడు విజయ్. నా మనస్సు తెలిసిన అమ్మ అనుకుంటూ ఆమె కాళ్లకు దండం పెట్టాడు.
శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ దీవించింది అమ్మ.
ఏమిటమ్మా కొత్త దీవనలు అంటూ నవ్వాడు విజయ్, విరంచి కూడా జతకలిసింది.
ఇంకా నాకేమి కావాలిరా..మీరిద్దరు ఇలా అనోన్యంగా కనిపిస్తుంటే నాకు అదే పదివేలు. కళ్లు ఒత్తుకుంది అమ్మ.
భోజనాలు ముగిసాయి. తిరిగి అదే అల్బమ్‌ను తెచ్చుకొని చూస్తున్నాడు విజయ్…
మీ పెళ్లి ఆహ్వానం కార్డులో సార్ పేరు బయ్యన్నగారి జానకి రామయ్య (బిజెఆర్) అని ఉంది. ఇంటిపేరు కె తో ఉండాలి కదా, కానీ బిజెఆర్ ఏమిటి?
మీ సార్‌కు తాత అంటే ఎంతో ఇష్టం అందుకే తాతపేరు ఎప్పటికీ గుర్తుండి పోతుందని అలా మార్చుకున్నాడట.
అమ్మా, సిఎం గారి బంధువులెవరూ ఇక్కడకు వచ్చినట్లుగా లేదు. కారణం ఏమిటి. కనీసం ఆయన తమ్ముడు ఆయన భార్య కూడా రాలేదా? ఉత్సాహంగా అడిగాడు విజయ్.
లేదురా మా పెళ్లి తర్వాత కొన్ని నెలలకే ఏదో గొడవలు తెచ్చుకొని మీ సిఎంగారే వారందరికీ దూరం అయ్యారు. రాజకీయాల్లో పేరు రావడంతో తన వారందరితో మాట్లాడటమే మానేసి, వారికి అందుబాటులో రాకుండా ప్రయత్నించాడు. స్వంత తమ్మున్ని కూడా దరిచేరనీయలేదు. పాపం శ్రీహరి అదే ఆయన తమ్ముడు ఏదో అవసరం ఉందని కొంత డబ్బు సర్దుబాటు చేయాలని లెటర్ రాసినా పట్టించుకోలేదు. శ్రీహరి భార్య లక్ష్మీదేవి పురిటినొప్పులు పడుతున్నదని తెలిసి, నేను అయినా అస్పత్రికి వెళ్తానని చెప్పినా వెళ్లనీయలేదు. ఇదంతా జరిగి 30 ఏళ్లు అయిదనుకుంటా…తర్వాత వారి గురించి కూడా మా వద్ద చర్చ కూడా జరగకుండా కట్టడి చేసాడు. నేను మర్చి పోయాను. శ్రీహరి కొడుకు దాదాపు నీ వయస్సులో ఉండి ఉంటాడు.ఎక్కడున్నాడో అంటూ విచారం వ్యక్తం చేసింది అన్నపూర్ణమ్మ.
భార్యతోపాటు శ్రీహరి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం కూడా ఆలస్యంగా తెలిసిందని కన్నీరు కార్చింది ఆమె.
వీరిద్దరే కదే వాళ్లు అంటూ విజయ్ మరోసారి వారి ఫోటోలను చూపించాడు.
అవును బాబు. దురదృష్టవంతులం మేం. ఉపకారం చేసే స్థాయిలో ఉన్నా, ఎవరిని ఆదుకోలేని ఆ పాపమే మాకు తగిలిందేమో… పిల్లలు కూడా కలుగలేదంటూ వెక్కివెక్కి ఏడ్చింది.
ఆమెను సముదాయించడం ఇద్దరికీ సాధ్యం కాలేదు. తనకు వారసులు లేరనేది గుర్తుకు వచ్చిన ప్రతిసారి అన్నపూర్ణ తట్టుకోలేకపోతున్నది.
గంభీర వాతావరణం ఏర్పడిరది. అన్నపూర్ణమ్మకు నిజం తెలిస్తే తనను ఇక బంగ్లా నుంచి కదలనీయదని విజయ్ ఆలోచిస్తున్నాడు. ఈ విషయం చెప్పకపోవడమే మంచిదని మరోసారి అనుకున్నాడు. విరంచి కూడా విజయ్‌వైపు చూసి మౌనంగా ఉండిపోయింది. తన వాళ్ల వద్ద కూడా పరాయివానిలాగా తాను ఉండటం విజయ్‌కు కూడా ఇబ్బందిగానే అనిపిస్తున్నది. అంతా విధి లిఖితం అంటూ నిట్టూర్చాడు.
సిఎం సోదరుని కొడుకే విజయ్, ఆయనే మీ వారసుడు అని విరంచి ఎక్కడ చెబుతుందో అనే అనుమానం విజయ్‌కు కలిగింది. కానీ ఆమె తనవైపు చూసిన చూపులతో ఆ అవకాశం లేదని నమ్మకం కలిగింది.
తాను వాస్తవం చెప్పడు. వాళ్లకు తెలిసే అవకాశాలు లేవు. జీవితాంతం ఈ రహస్యం అలాగే మరుగున పడిపోవాల్సిందే. వారు చేసిన తప్పుకు చివరివరకు వారు కూడా ఇదే క్షోభ పడాల్సిందే అనుకున్నాడు విజయ్.
(సశేషం)