విజయుడు (ధారావాహిక నవల పార్ట్-50)
ప్రచార పర్వం

రాష్ట్ర పార్టీ సమావేశం జరుగుతున్నది. ముఖ్యమంత్రి జానకి రామయ్య, ఢిల్లీ నుంచి పార్టీ వచ్చిన వ్యవహారాల ఇన్‌చార్జీతో పాటు రాష్ట్ర కీలక నేతలందరూ హాజరయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుని నిర్ణయాలను వివరిస్తూ, విజయ్‌కు అప్పగించిన భాద్యతలేమిటో ప్రత్యేకంగా తెలిపాడు ఇన్‌చార్జీ. అందరూ ఊహించిదే కాబట్టి ఎవరూ ఆశ్చర్య పోలేదు సరికదా వ్యతిరేకించే వారే లేరు. రాష్ట్రంలో ఆయనకు పెరుగుతున్న ప్రజాధరణ అందరికీ తెలిసినందున విజయ్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామని దాదాపు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి కూడా మరో మాట చెప్పలేకపోయాడు. అనువుకానీ చోట అధికులమనరాదని సర్దుకుకూర్చున్నాడు సిఎం.
ఇక విజయ్ ఒక నిమిషం కూడా వృధా చేయకుండా తన కార్యాచరణను ప్రారంభించాడు. తన పిఎకు సహాయకులుగా మరో ఆరుగురిని పార్టీ కార్యాలయం నుంచి ఎంపిక చేసి క్వార్టర్స్‌కు పిలిపించారు. టెక్నికల్ టీంను ఏర్పాటు చేసి, వారికి అవసరమైన సిబ్బందిని తీసుకున్నారు. అంతా యుద్ధ ప్రాతిపదికగా పనుల జరగాలని ఎలాంటి వనరులు కావాలన్నా తక్షణమే అందించేలా చర్యలు తీసుకున్నారు.
సోషల్ మీడియా ప్రభావం పెరిగినందున ప్రతి గ్రామంతోనూ కంటాక్టు పెంపొందించారు. గతంలో విజయ్ ఆరోగ్య పరామర్శ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన మెసేజీల వల్ల కూడా వారందరి నెంబర్లు ఉపకరించాయి. వారి నెంబర్లు ఈ కనెక్టివిటీకి ఎంతగానో ఉపయోగపడినాయి.
విజయ్ నేరుగా వారందరితో మాట్లాడేలా వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్లాన్ చేశారు. కొంత ప్రాముఖ్యత ఉన్న వారందరితో ఒక గ్రూపు, అది జిల్లా యూనిట్‌గా ఏర్పాటు అయ్యేలా విభజించారు. తర్వాత మండల వారీగా, గ్రామాల వారీగా విభజనలు పూర్తి చేసారు. ఒక్కో గ్రూపులో ఎంతమందితో ఒకేసారి మాట్లాడే వీలుంటుందో పరిశీలించి, అంతవరకే సెట్ చేశారు.
ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు ఈ నెట్‌వర్కును విస్తృతంగా వాడుకునేలా ప్రణాళికను రూపొందించారు. ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉందో, ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేస్తున్నారు. సిట్టింగ్ ఎంఎల్‌ఎలపై వ్యతిరేకత శాతాన్ని కూడా మరోవైపు లెక్కిస్తున్నారు. క్షేత్ర స్థాయి సర్వేకు ఒకవైపు చర్యలు తీసుకుంటూనే నెట్ వర్కు ద్వారా కూడా సమాచారం సేకరిస్తున్నారు. తర్వాతి దశలో రెండిరటిని క్రోఢీకరించి అభ్యర్థులను మార్చడం, కొత్తవారికి అవకాశాలివ్వడం సులువవుతుందని అంచనా వేసుకుంటున్నారు. ఇదే సమయంలో కొత్త అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందో ఇద్దరు లేదా ముగ్గురి పేర్లను సిఫారసు చేయాలని సర్వే టీంకు భాద్యతలను అప్పగించారు. ఏఏ సీట్లలో పార్టీ సునాయాసంగా గెలుపు సాధిస్తుందో, అధిక శ్రమ తీసుకోవాల్ని స్థానాలు ఏవిటో కూడా ముందుగానే తెలుసుకునేలా వివరాల సేకరణ జరుగుతున్నది.
పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామానికి వెళ్లి, ప్రజలతో మమేకం కావాలని, స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని విజయ్ ముందుగా ఆలోచించాడు. కానీ పెరిగిన ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థతో ఫీల్డు స్టడీకి అంత సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకున్నాడు. అయితే ఉన్న సమయంలో వీలైనంతగా ప్రయాణించి,ఎక్కువ ప్రాంతాలను చుట్టిముట్టి రావాలనే ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు అన్ని వసతులున్న వాహనానికి ముందుగానే ఆర్డర్ చేసి, సంసిద్ధంగా పెట్టారు. స్నానం చేయడంతోపాటు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, పది మందితో మీటింగ్ కూడా నిర్వహించుకోవడానికి అనువుగా వాహనంలో ఏర్పాట్లు ఉన్నాయి. రాత్రి నలుగురు పడుకోవడానికి కూడా అనువుగా సీట్లు మార్చు కోవచ్చు.
కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తుందని తెలియడంతో విజయ్ తన ప్రచారాన్ని ఉదృతం చేశారు. అప్పటికే అభ్యర్థుల జాబితాను పంపి అధిష్ఠానం వద్ద అప్రూవల్ కూడా తీసుకున్నారు.ప్రతి నియోజక వర్గం కవర్ చేయాలని, అక్కడే అభ్యర్థిని ప్రకటించాలనే ప్రణాళికతో ఆయన ముందుకు పోతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎవరి ఒత్తిడి లేకుండా అన్ని విధాలుగా యోగ్యులనుకున్న వారినే ఎంపిక చేయడంలో విజయ్ కృతకృత్యుడు కావడంతో పార్టీలో ఆయనకు ఇక ఎదురే లేకుండా పోయింది.
ఏ ప్రాంతానికి వెళ్లినా విజయ్‌కు జనం జేజేలు పలుకుతున్నారు. బహిరంగ సమావేశాలకు తరలివస్తున్న ప్రజా సందోహం చూసి ప్రత్యర్థులు బెంబేలెత్తున్నారు. తమ అభ్యర్థులకు డిపాజిట్స్ కూడా దక్కుతాయా అనే ఆందోళనలో విపక్ష నేతలు పడిపోయారు. దీంతో కాబోయే ముఖ్యమంత్రి విజయ్ మాత్రమేనని, ఎవరూ ఆయనకు పోటీ వచ్చే అవకాశమే లేదనే స్థాయిలో విజయ్ అందరికంటే ముందున్నాడు.
టెక్నికల్ టీంతో ప్రతి రోజు రాత్రి పడుకునే సమయంలో విజయ్ మాట్లాడుతూ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నాడు. లోటుపాట్లను సరిచేసుకుంటూ రాష్ట్రమంతా సుడిగాలిలా చుట్టేశాడు విజయ్. ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. ఎంపిక చేసిన అభ్యర్థులందరినీ నగరానికే పిలిచి మీటింగ్ హాల్‌లోని బి.ఫారంలు అందజేసాడు విజయ్. ప్రజాసేవ కోసం పునరంకితం అవుదామని అందరితో ప్రతిజ్ఞ కూడా చేయించాడు. తమతమ నియోజక వర్గాలకు వెళ్లి ఓటర్లతో ముఖాముఖి కలవాలని, ఇతర నేతలను, కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని కూడా విజయ్ మార్గనిర్ధేశనం చేసాడు. ఎన్నికల ప్రచార సామాగ్రి, ఇతర విషయాలు అధిష్ఠానం చూసుకుంటుందని వివరించాడు.
ప్రతిపక్ష నేతలు డమ్మీలుగా మారిపోయారు. వారివారి పార్టీల బహిరంగ సభలు వెలవెల పోతున్నాయి. ప్రతికూల పరిస్థితులు కనిపిస్తుండటంతో, కొన్ని సీట్లు అయినా గెలుచుకొని పరువు దక్కించుకోవాలని ఆ పార్టీలు కూటమిగా ఏర్పడినాయి. దీంతో ముఖాముఖి పోటీలే అధికంగా జరుగుతున్నాయి. అధికార పార్టీలో టికెట్లు రాని సిట్టింగ్‌లను ఆహ్వానించి తమ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దింపారు.
అధికార పార్టీ అభ్యర్థులందరూ రెట్టించిన ఉత్సాహంగా ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు.
రెండో దశ ప్రచారం ప్రారంభించిన విజయ్ మొదటి దశలో వెళ్లని ప్రాంతాలకు ప్రాధాన్యతనిచ్చారు. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ సమీపిస్తుండటంతో ఒక రోజు ముందే తన నియోజక వర్గంలో అన్ని వర్గాల నేతలు, ప్రజలతో సమావేశం నిర్వహించారు. నామినేషన్ దాఖలుకు విజయ్ వెళ్తుంటే ఆయన కార్యక్రమం తెలిసి, వేలాదిగా ప్రజలు ఊరేగింపుగా ఆయన వెంట నడిచారు. ఈ ఊపు చూసి, విజయ్ ప్రత్యర్థికి డిపాజిట్ రాదని మీడియాలో విశ్లేషణలు వచ్చాయి. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రులు కూడా తమతమ నియోజక వర్గాలకే పరిమితమయ్యారు. అయితే మంత్రుల్లో ఆరుగురికి తిరిగి టికెట్ లభించకపోవడంతో చివరి నిమిషంలో వారు ప్రతిపక్ష పార్టీలలో చేరి పోటీలో దిగారు.
అధికార పార్టీ ఘన విజయం సాధిస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నా, విజయ్ చివరి వరకు తన ప్రచారాన్ని పెద్దయెత్తున నిర్వహించారు. నాలుగైదు సీట్లలో మాత్రమే ఓటమి ఉంటుందని ఇతర అసెంబ్లీ సీట్లు అన్ని విజయ్ పార్టీ కైవసం చేసుకుంటుందని మీడియాలో వార్తలు వచ్చాయి.
పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అంతా ఏకపక్షంగా సాగిన ప్రచారంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటలను చోటు చేసుకోలేదు.
సర్వేల అంచనాలే వాస్తవ రూపం దాల్చినట్లుగా ఒకే ఒక్క సీటు తప్ప అన్నిఅసెంబ్లీ స్థానాలను అధికార పార్టీ గెలుచుకొని విజయ ఢంకా మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు విజయ్‌కు నీరాజనం పట్టారని ఫలితాలు వెల్లడించాయి. పార్టీ జాతీయ అధ్యక్షునితోపాటు కీలక నేతలందరూ విజయ్‌ను అభినందలతో ముంచెత్తారు. తమ వ్యూహం ఫలించిందని హస్తిన నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల పక్రియ పూర్తి కావడంతో జానకి రామయ్య తన పదవికి రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు పదవిలో కొనసాగాలని గవర్నర్ ఆయనను కోరారు.
ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన పార్టీ నేతను ముఖ్యమంత్రి చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. ఈ మేరకు శాసనసభా పక్షం తమ నాయకున్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మీటింగ్‌కు అధిష్ఠానం తరపున సీనియర్ నాయకుడు హాజరయ్యారు. ఈ ఎన్నిక కూడా ప్రజాస్వామ్య పద్దతిలో జరగాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పారని, పార్టీ అధిష్ఠానం ఎవరి పేరు సూచించడం లేదని, మీకు ఇష్టమైన వారినే నేతగా ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు.
దీంతో గెలుపొందిన వారందరూ ఒక్కసారిగా లేచి విజయ్, విజయ్ అంటూ ప్రతిపాదించడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఆ తర్వాత సీనియర్ సభ్యులతో కలిసి విజయ్ రాజ్‌భవన్ కు వెళ్లి శాసనసభా పక్ష నేతగా తనను ఎన్నుకున్నట్లుగా లేఖను అందజేశారు.
(సశేషం)