విజయుడు (ధారావాహిక నవల పార్ట్-53)
చివరి భాగం

వైకుంఠపురంలో…
దీర్ఘంగా ఆలోచిస్తున్న లక్ష్మీదేవి వైపు చిరునవ్వుతో చూశారు శ్రీమన్నారాయణుడు. ఆమె మనస్సు భూలోకంలో విజయ్ ప్రస్థానం పైగా ఆలోచిస్తున్నది. ఎంతగా ఎదుగుతున్నాడు. అందుకేనేమో శ్రీహరి ఒక అవకాశం ఇచ్చి, భూలోకానికి తిరిగి పంపించాడు అనుకుంటూ పతిదేవుని వైపు దృష్టి సారించింది. అప్పటికే ఆమెనే చూస్తూ ఉన్న మహావిష్ణువును చూడగానే ఒక్కసారిగా తత్తరపాటుకు గురైంది.
ఏమిటి దేవి అలా ఉన్నావు, ఏదో ఆలోచనలో మునిగిపోయావంటూ ప్రశ్నించారు దేవదేవుడు.
స్వామి, మీ లీలలు ఎవరికీ అంతుబట్టవు. ఆ విజయ్ ఉజ్వల భవిష్యత్తును మీరు ముందుగా ఊహించే ప్రాణం పోశారేమో అనిపిస్తున్నది స్వామి …
అంటూ శ్రీహరిపైపు ఆరాదనగా చూసింది.
నారాయణ, నారాయణ అంటూ అప్పుడే అక్కడికి వచ్చాడు నారదుడు.
చూసావా నారదా, మీ సహచరుడు ఎంతగా ఎదిగిపోతున్నాడో…దేశాన్ని సన్నార్గంలో నడిపే ప్రధాన మంత్రిగా, ఆ జీవికి అవకాశం లభించనుందట. విజయుడుగా కీర్తిపతాకాలను అందుకుంటాడట. ఎంతో ఆనందంగా చెబుతున్నది శ్రీలక్ష్మీదేవి.
ఆమ్మా నన్ను భూలోక విలేకర్లకు సహచరునిగా చేస్తున్నావు, నేను ప్రజలందరికీ వార్తలు ఇవ్వడం లేదమ్మా. కేవలం దేవలోకంలో త్రిమూర్తులకు మాత్రమే సమాచారం అందించడానికి ప్రయత్నిస్తుంటానని అనుకుంటున్నానే కానీ…నా అజ్ఞానం ఏమంటే ఆ మహానుభావులకు తెలియని విషయం అంటూ ఉంటుందా తల్లీ. ఆ విజయుడు వైకుంఠానికి వచ్చినప్పుడు మాత్రమే ఒకసారి చూసాను. భూలోకంలో ఆయన గొప్పతనం గురించి వినడమే కానీ నేను స్వయంగా వెళ్లి చూడలేదు. మీరు అనుజ్ఞనిస్తే ఒకసారి భూలోకంలో సంచరించి,విజయుని… విజయ గాథను స్వయంగా తెలుసుకోవాలనుకుంటున్నానంటూ శ్రీహరికి ప్రణమిల్లాడు నారదుడు.
నారదా నీకు ఎవరి అనుమతి అక్కరలేదు. త్రిలోక సంచారివి… స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లిరాగల సమర్ధుడివి అంటూ ఆశ్వీరదించారు మహావిష్ణువు.
నారదా, ఆగు, దేశ ప్రధానిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయం నిర్ణయం కాగానే వచ్చి… ముందుగా నాకు ఆ సమాచారం ఇవ్వాలి,అంటూ చెబుతున్న లక్ష్మీదేవి వైపు ప్రసన్నంగా చూస్తున్నారు శ్రీమన్నారాయణుడు…ఢల్లీిలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన విజయ్‌కు పునర్జన్మ నిచ్చిన సందర్భం జ్ఞప్తికి వచ్చింది స్వామికి… వాదించి, మెప్పించి తీసుకున్న అవకాశం సద్వినియోగం చేసుకున్నాడు. ప్రజారంజక పాలన అందిస్తున్న వారికి దైవ కృప తప్పక ఉంటుందని భూలోకంలో నిరూపించిన ఘటికుడే విజయ్…రాష్ట్ర స్థాయిలో సాధించిన విజయాలను జాతీయ స్థాయిలోనూ నెరవేర్చే నైతిక గుణం, సామర్థ్యం ఆయనకు ఉన్నాయి. శ్రేయో రాజ్య స్థాపనకు నిరంతరం శ్రమిస్తున్న విజయ్ ధన్యుడు. ఆ త్యాగశీలి, ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండటంతోపాటు దేశ ప్రజలను కన్నబిడ్డల వలె పాలిస్తాడు…అనుకున్నవి సాధించే విజయుడుగా దేశ చరిత్రలో చిరకాలం నిలుస్తాడు, విజయుడుగా రాణిస్తాడని అనుకుంటూ ఆశ్వీరధించారు మహావిష్ణువు.
———————————-
సమాప్తం
———————————-
తప్పకచదవండి:విజయుడు (ధారావాహిక నవల పార్ట్-52)