విజయుడు (ధారావాహిక నవల పార్ట్-8)
ఊహించని ఈ ప్రశ్నకు ఎలాంటి బదులు చెప్పాలో ఇంద్రునికి అంతుబట్టలేదు. మళ్లీ విజయ్ మాట్లాడుతూ గౌతమ ముని ఉదయమే నదికి వెళ్లి స్నానమాచరించడం ఆయన దినచర్య. ముని రోజువారి కార్యక్రమాలను తెలిసుకొని అదే అదనుగా సమయం తీసుకొని మీరు ఆ మునీంద్రుని సతి అహల్య వద్దకు వెళ్లి ముని రూపంలో కూడటం ఏ విధంగా సమర్థించుకుంటున్నారో… కానీ భూలోకంలో మీపై విమర్శలు అధికంగానే ఉన్నాయి. తప్పు జరిగిందని తెలుసుకున్న అహల్య కూడా మీ విషయం భర్తకు వెంటనే చెప్పకపోవడంతో శాపగ్రస్త అయింది.. బండరాయిగా మారింది కదా.. ముని శాప ప్రభావం అది. మీపై కూడా తీవ్ర ఆగ్రహం వహించి గౌతమ ముని ఇచ్చిన శాప ప్రభావం ఇంకా ఉందా దేవేంద్రా…నపుంసుకునిగా మారిపొమ్మని ముని ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందారా? పాపం అహల్య, శ్రీరాముని పాద స్పర్ష వరకు రాయిగానే మిగిలిపోయింది. ఏమంటారు స్వర్గాధిపతి…విజయ్ ప్రస్తావనకు ఖిన్నుడయ్యాడు…దేవేంద్రుడు
తపస్సు చేసే మునులకు తపోభంగం చేసేందుకు మీ ఆస్థాన నర్తకీమణులను పంపుతారు..వెయ్యి యాగాలు చేసిన వారికి ఇంద్ర పదవి అనే నిబంధన ఉండటంతో తపస్సు చేసేవారికి భంగం కలిగిస్తుంటారు. ఈ చర్యలు లోపభూయిష్టాలే. కానీ పదవిని కాపాడుకోవడానికి ఈ చర్యలని మీరు సమర్ధించుకుంటున్నారు. రాక్షసుల భారి నుంచి దేవతలను రక్షించేందుకు కూడా మీరు కొన్ని చేయకూడని పనులు చేశారు. మీ తప్పిదాలు అధికంగానే ఉన్నా అవన్నీ సర్గలోక సింహాసనం వైపు ఇతరులు కన్ను వేయకుండా సామ్రాజ్య రక్షణ కోసం అని,మీ దేవతలు సమర్థిస్తారేమో కానీ అహల్య విషయంలో మీరు చేసిన పని ఏమి బాగలేదు. వ్యక్తిగతంగా ఇది నా అభిప్రాయం మాత్రమే సుమా.. అతిధి అంటూ పిలిచి నన్ను గౌరవించిన మీతో ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది కానీ ఎందుకో ఈ రోజు మీ సభలో అప్సరోశిరోమణులందరిని చూసిన తర్వాత మిమ్ములను అలా అడగాలనిపించింది. అన్యథా భావించకండి, భూలోకంలో జర్నలిస్టుగా పనిచేసిన అనుభవంతో ప్రశ్నలే ముందుకు వస్తాయి నాకు. క్షమించండి, దేవేంద్ర అని విజయ్ చివరలో అనునయంగా మాట్లాడే ప్రయత్నం చేశారు.
ఈ విషయాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఇంద్రుడు విజయ్ ప్రస్తావనలన్నింటిని తేలికగానే తీసుకుంటూ…స్వర్గలోకంలో మీకు ఎలాంటి సమస్యలు తలెత్త లేదు కదా..మరి ఇక్కడ ఉండిపోతారా అని ప్రశించారు. లేదు ఇంద్రా వెంటనే తిరిగి వైకుంఠానికి వెళ్లాలి, శ్రీహరి సమక్షంలోకి చేరుకోవాలని విజయ్ ఆతురత ప్రదర్శించారు. సరే ఆ ఏర్పాట్లు చేస్తానని దేవేంద్రుడు చెప్పారు.
భూలోకంలో… విజయ్ను హత్య చేసిన వారిని కనుగొనే విషయంలో ఇన్స్పెక్టర్ తివారి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా,అవి ఒక కొలిక్కి రాకపోవడంతో అన్ని రాష్ట్రాల ెం మంత్రిత్వ శాఖలకు వర్తమానం ఎలా పంపాలా అని తన పై స్థాయి అధికారులను కలిసారు. పోలీసు కమిషనర్‌ను కలిస్తే ఆయన తరుణోపాయం చెబుతారని వారు సలహాలివ్వడంతో, సిటి కమిషనర్ కార్యాలయంతో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఒక మిస్టరీ మర్డర్ కేసు విషయంలో అర్జంట్ పనిమీద కమిషనర్‌తో సమావేశం అవసరమైందని తివారి చెప్పడంతో అదే రోజు సాయంత్రానికే అపాయింట్మెంట్ లభించింది. కమిషనర్ కార్యాలయంకు వెళ్లే సమయానికి ముందే కేసు పూర్వాపరాలు,విజయ్ ఫోటో తో తాము విడుదల చేసిన పత్రికా ప్రకటనలు కూడా సిద్దం చేసుకున్నాడు సిఐ. ఈ కేసు విషయంలో ఎందుకు అధిక వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నావని పోలీసు కమిషనర్ ప్రశ్నిస్తే ఎలాంటి జవాబు చెప్పాలో కూడా తివారి ఆలోచించుకున్నాడు. దేశ రాజధానికి వచ్చిన వారు హత్యలకు గురి అయితే నగరానికి చెడ్డపేరు వస్తుందనేదే తన తపన అని, పైగా ఈ కేసు డిపార్టుమెంట్‌కు సవాల్ విసిరినట్లుగా ఉంది. ఎలాంటి ఆధారం లభించకుండా హతుడు జాగ్రత్తలు తీసుకున్నారని, విజయ్ హత్య మిస్టరీని ఛేదించాలని ప్రయత్నిస్తున్నాని తివారి ఇచ్చిన వివరణతో కమిషనర్ సంతృప్తిపడ్డారు. ెం మంత్రిత్వ శాఖతో సంప్రదించి, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం పంపించే ఏర్పాట్లుచేస్తానని కూడా హామీ ఇచ్చారు. మృతుని ఫోటో ఉన్నందున వారు సులువుగానే గుర్తించే అవకాశాలుంటాయని, వారు తప్పక సహకరిస్తారనే అశాభావాన్ని వ్యక్తం చేశారు.హత్య జరిగిన రోజు ఆగ్రా నుంచి ఢిల్లీకి బయలు దేరిన వాహనాలు, లారీలు, కార్ల నెంబర్లు సేకరించే పనిలో నిమగ్నమైన తన సిబ్బందితోనూ తివారి మాట్లాడారు. అయితే ఆగ్రా నుంచి తమకు ఇంకా సిసి ఫుటేజీ రాలేదని,దీంతో మన పోలీసు కానిస్టేబుల్‌ను ఈ రోజే ఆగ్రాకు పంపినట్లుగా తెలిపారు. తనకు దర్యాప్తులో సహకరిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసి తనను కలవాలని ఆదేశించడంతో పక్క రూంలో ఉన్న ఎస్ఐ హుటాహుటిన సిఐ ఛాంబర్‌కు వచ్చారు. విజయ్ హత్యకు సంబంధించి ఆయా రాష్ట్రాల పత్రికా కార్యాలయాలకు ఇచ్చిన ప్రెస్ నోటు, కవరేజిపై వారిద్దరు మాట్లాడుకున్నారు. పబ్లిష్ అయిన వార్తల క్లిపింగ్స్‌ను పత్రికా కార్యాలయాల నుంచి సేకరించామని చెబుతూ, సిఐకి చూపాడు ఎస్ఐ..కేసును తర్వగా తేల్చాలని తివారి ఆలోచించసాగాడు.
స్వర్గంలో ఉన్న విజయ్ వెంటనే మహా విష్ణువును సందర్శించేందుకు వైకుంఠానికి వెళ్లాలని అభిలషించగానే దేవేంద్రుడు తన భటులను పురమాయించాడు. ఈ వెంటనే వైకుంఠానికి బయలు దేరారు.
పాల సముద్రంలో లక్ష్మిదేవితో సరససల్లాపాలు సాగిస్తున్న శ్రీమన్నారాయణునికి నారాయణ, నారాయణ అంటూ మాటలు వినబడినాయి. మరోసారి నారాయణ అంటూ నారద మునీశ్వరుడు లక్ష్మిదేవి, శ్రీహరిలకు ప్రణమిల్లాడు. తమ సమక్షంలోకి వచ్చిన నారదున్ని, శ్రీహరి కుశల ప్రశ్నలు అడిగారు. ఏమిటి నారదా హునాళ్లతర్వాత వైకుంఠానికి వచ్చావు…ఊరికే రావు కదా..విశేషాలు ఏమిటి, ముల్లోకాల్లో ఏమి జరిగిన తెలుసుకునే వార్తాహరునివి నీవు. అంటూ మహా లక్ష్మి ప్రశ్నించింది.
ఏమున్నాయి తల్లీ. ఇప్పుడు వైకుంఠంలోనే కొత్త విషయం ఉందనే వార్త.. స్వర్గ లోకంలో కైలాసంలో, సత్యలోకంలోనూ చర్చ అవుతున్నది దేవి..
అటులనా ఏమిటో అది
నారాయణుని ద్వారానే తెలుసుకోగోరి మీ సమక్షంలోకి వచ్చాను తల్లీ.
అవునా ఏ మంటున్నారు ఆ లోకం వాళ్లు.
పూర్తిగా తెలియదు కానీ తల్లీ..ఒక జీవి ఇటీవలే కైకుంఠానికి వచ్చిందని, ఆ జీవికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని, ఏదో ప్రత్యేక కారణం లేకుండా శ్రీహరి ఆ జీవికి వైకుంఠ ప్రవేశానికి అర్హునిగా నిర్ణయించరని… అలా అలా చెవులు కొరుక్కుంటున్నారమ్మా.. వచ్చిన జీవి, పత్రికా విలేకరిగా పనిచేసిన అనుభవంతో రాజకీయ నాయకునిగా మారి, చట్టసభకు ఎన్నికయ్యారని కూడా అంటున్నారమ్మా. విలేకరి కావడంతో నాకు అతనిని చూడాలని అనిపించింది. నా దినచర్యలో భాగంగా విలేకరిగా నేను ఒక విధంగా పనిచేస్తున్నట్లేకదా ..అంటూ ఏదో చెప్పబోతుండగా ద్వారపాలకుడు వచ్చి నిలబడ్డాడు. ఏమిటన్నట్లుగా శ్రీహరి చూడటంతో స్వర్గం నుంచి తిరిగి వచ్చిన విజయ్ ద్వారం వద్ద వేచి ఉన్నారని చెప్పాడు. వెంటనే ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించడంతో విజయ్…శ్రీ మహా విష్ణువు సమక్షానికి వచ్చేశాడు. ముఖిలిత హస్తాలతో తమ ముందుకు వచ్చిన జీవిని, శ్రీహరి, లక్ష్మీదేవి కూడా ఒకసారి పరికించారు.
స్వర్గలోకం ఎలా ఉంది..నీకు నచ్చిందా..దేవేంద్రుడితో మాట్లాడావా, అప్సరాంగనలను పరికించావా అంటూ లక్ష్మీదేవి అడగటంతో విజయ్ సిగ్గుపడ్డాడు. ఏమి చెప్పాలో అర్థం కాలేదు. ఇంతలో నారదుడు విజయ్ను సమీపించాడు.
ఓహా, ఈ జీవి యేనా అన్నట్లూ విజయ్ను పరికించారు.
ఏమి నారద.. ఈ జీవి, నీవు కలసి వార్తలు, జర్నలిజం వృత్తిపై ఏమైనా చర్చించుకుంటారా? అంది లక్ష్మీదేవి.
లేదమ్మా, ఏమిటీ ఈ జీవి ప్రత్యేకతా అని చూస్తున్నానంతే.. ఇటీవలి కాలంలో ఎవరూ ఇలా నేరుగా వైకుంఠ ద్వారం వద్దకు కూడా వచ్చిన దాఖలాలు లేవు. వినలేదు కూడా..కానీ ఈ జీవిని మీరు అనుమతించాంటే ఏదో పరమార్థం ఉంటుంది కదా స్వామి…లోక కళ్యాణం కోసమే మహా విష్ణువు ఈ నిర్ణయం తీసుకుంటారనేది నా అభిప్రాయం. అది ముందుముందు మనేక అవగతమవుతుందని. ..నారదుడు తనలో తాను అనుకుంటున్నట్లుగా బయటికే అన్నాడు.
ఏమంటున్నావు అని శ్రీహరి,నారదున్ని చూడగానే నారాయణ నారాయణ ఏమీ లేదని మౌనం దాల్చాడు నారదుడు.
జీవుడు..దేవుని మధ్యలో నేనెందుకు దేవా అని, నాకు సెలవు ఇప్పించండి అని నారదుడు శ్రీమన్నారాయణున్ని అభ్యర్థించాడు.
సరే అన్నట్లుగా శ్రీహరి తలూపడంతో నారాయణ, నారాయణ అంటూ నారదుడు నిష్ర్కమించారు.
అనంతరం మహాలక్ష్మి మాట్లాడుతూ..ఏమి జీవుడా ఎలా జరిగింది నీ స్వర్గలోక పర్యటన అంటూ మరోసారి ప్రశ్నించింది.
ఏముంది తల్లీ నేను ఊహించిన దాని కంటే ఎంతో ఆహ్లాదంగా,ఆనందంగా, అద్భుతంగా తోచింది. జీవితంలో నిజంగా ఇలాంటి సందర్భం వస్తుందా అని అనుకుంటే మరణించిన తర్వాత శ్రీహరి కృపతో ఇది నాకు సంప్రాప్తించింది. మీకు తెలియని అమరావతియా అమ్మా.. అంటూనే శ్రీహరి వైపు చూస్తూ ,,దేవదేవా నాకు మరికొన్ని సందేహాలు ఉన్నాయి ప్రస్తావించవచ్చా, అనుజ్ఞన్విండన్నట్లుగా చూశాడు విజయ్.. సరే కానివ్వు అన్నట్లుగా శ్రీహరి తలపంకించారు.
మీరింత ప్రశాంతంగా ఉండటానికి కారణం నేను ఊహిస్తున్నాను. దుష్ట శిక్షణ, భూభారం తగ్గించే అవసరం లేనంతగా నేడు భూలోకంలో పరిస్థితులు పెరుగుతున్నాయి. జనాభా ఏదో విధంగా తగ్గిపోతున్నది. యుద్ధాలు, వ్యాధుల వ్యాప్తి వల్ల జనం మరణిస్తున్నారు. ప్లేగ్, అత్రాక్స్, ప్రస్తుతం కోవిడ్ లేదా కరోనా వైరస్ సోకి ప్రజలు పిట్టల్లా నేలకొరుగుతున్నారు. లక్షల సంఖ్యలో జనం కొద్ది కాలంలోనే శ్వాస విడుస్తున్నారు. కురుక్షేత్ర సంగ్రామంలో హతులైన వీరుల సంఖ్యతో సమానంగా వింత,వింత వ్యాధులతో భూలోకంలో జనాభా తగ్గిపోతున్నది.
అవునా అన్నట్లుగా శ్రీహరి, లక్ష్మిదేవి కూడా తలపంకించారు.
ప్రజలకు భూలోకంలో పెద్ద ప్రమాదమే వచ్చిపడింది దేవా…ఒకరా ఇద్దరా..కుటుంబాలకు కుటుంబాలే ఖాలీ అవుతున్నాయి. ఒక ప్రాంతం, దేశం అని లేదు..ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి..ధనిక దేశం అని లేదు, పేద దేశం అని లేదు..నిరుపేద కుటుంబాలే కాదు సంపన్న కుటుంబాలు కూడా కరోనా భారిన పడిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఈ సంక్షోభం ఎప్పటికి పరిష్కారం అవుతురదో అక్కడి శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టడం లేదు. 1999లో ఏర్పడిన ఈ దుస్థితి 2021 సంవత్సరాంతం వరకు అణగిపోయేలా లేదు. పైగా ప్రపంచం ఎంతో ఆధునీకత, సాంకేతికత సాధించినట్లుగా గొప్పగా చెప్పుకుంటున్నా, కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేసే మందును ఏ దేశంలోని సైంటిస్టులు కూడా రెండేళ్లు అయినా కనిపెట్టలేక పోయారు. ఇది ఏప్పటికి సాధ్యమవుతుందో కూడా తెలియని పరిస్థితి. అయితే ఇదంతా మానవ తప్పిదమని సామాన్య ప్రజలతోపాటు ప్రభుత్వ అధినేతలకు అర్థమైంది. ఎవరు కారణమనే విషయంపై దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి కానీ తరుణోపాయం తెలియని స్థితిలో ప్రపంచ పరిశోధకులు తలలు పట్టుకుంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్లుగా డ్రగ్స్ ఉత్పత్తిదారులతో కుమ్ముక్కు అయిన నేతలు కొందరు ఏదో ఒక మందును విడుదల చేసి అధిక సంపాధనార్జనలో మునిగి తేలుతున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా వెలిసిన వైద్య శాలలు వ్యాపార కేంద్రాలుగా మారాయి దేవా..అయ్యో భూలోకంలో ప్రజల ఈతిబాధలను చూసిన నేను ఆ సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమాజం జ్ఞప్తికి వచ్చి అధిక ప్రసంగమే చేసినట్లు ఉన్నాను. క్షంతవ్యున్ని అంటూనే వైరస్ అరికట్టలేక పోతున్న భూలోక శాస్త్ర,సాంకేతిక రంగాల వైఫల్యాలను వివరించాడు విజయ్..
సర్వంతార్యామికే ఎన్ని విషయాలు చెప్పావు జీవుడా అని లక్ష్మి దేవి విజయ్ వైపు చూసింది. భూలోకంలో ప్రజల ఆగచాట్లు నాకు గుర్తుకు రావడంతో వాటిని ఏకరువు పెట్టానే కానీ దేవదేవునికి తెలియవని కాదు, అమ్మా అని చేతులు జోడించాడు, విజయ్.
జీవుడు చెప్పింది శ్రీహరి విన్నాడే కానీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు. సరికదా ఆసక్తిగానే విన్నారని విజయ్ భావించాడు. భూలోకంలో తలెత్తిన సంక్షోభానికి శ్రీహరి నుంచి ఎలాంటి ప్రస్తావన వస్తుందోనని విజయ్ ఎదురు చూశారు కానీ ఈ విషయాన్ని దేవదేవుడు పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. మరో అవతారం ఎత్తకుండా భూభారం తగ్గిపోతుందనే భావన బహుశ శ్రీహరిలో ఉందని విజయ్ తలపోస్తూ..పైకే ఈ మాటలు అనేసి నాలుకకర్చుకున్నారు. అయిన శ్రీహరి నుంచి స్పంధన ఏమీ లేదు. అవును మరి భూలోకవాసులు తమ తప్పిదంతో చేసుకుంటున్న వైరస్లు అవి. తమ మాటే నెగ్గాలని అగ్రరాజ్యాల కుట్రలు కూడా కలిసి ఉన్నాయి. పైగా చిన్నదేశాలను అణచివేసేందుకు యుద్ధాలను ప్రేరేపిస్తున్నాయి కొన్ని దేశాలు. ఆయుధ వ్యాపారాన్ని పెంచుకునేందుకు అమెరికాలాంటి దేశాలు చేస్తున్న కుయుక్తులు ప్రంచవ్యాప్తంగా చర్చనీయాంశంగానే ఉంది. దేశాధ్యక్షులు ఎవరున్నా ఇదే పోకడలు.. ఎన్ని వ్యాసాలు పత్రికల్లో తాను చదవలేదు. పైగా పర్యావరణానికి ముప్పు కలిగించే అనేక చర్యలు ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచం తన నాశనాన్ని తనే కోరుకుంటున్నది. పర్యావరణ పరిరక్షణకు ఏ ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు తీసుకోవడం లేదనేది వాస్తవం. ఆధునికత పేరుతో చేస్తున్నఅనేక దుశ్చర్యలకు అడ్డుఅదుపులేకుండా పోతున్నది. అందుకే ప్రపంచం అధోగతి పాలవుతున్నది. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో పర్యావరణ సమస్య అధికంగా ఉంది. ఓజోన్ పొర దెబ్బతిన్నది. పర్యావరణ దినోత్సవం అంటూ ఏటేటా ఒక్కటి, రెండు రోజలు హడావుడి చేస్తున్న ప్రభుత్వాలు, స్మగ్లర్లు అడవులను తెగనరుకుతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి.. అమెరికాలో సహితం హెక్టార్లకు హెక్టార్ల అటవీ ప్రాతం అప్పుడప్పుడు అగ్నికి ఆహుతి అవుతున్నది. ఇండియా లాంటి దేశాల్లో మరీ అద్వాన్నంగా ఉంది అడవుల పరిరక్షణ వ్యవహారం …విజయ్ అనుకున్నాడు.
ఏమిటి మానవా నీలో నీవే గొణుకుంటున్నట్లుగా ఉంది. భూలోకం విడిచి వచ్చినా నీ మనస్సు అక్కడే తచ్చాడుతున్నట్లుగా ఉంది. అశాంతిగా ఉంటున్నావు. సాక్షాత్తు దేవదేవుడు..మహావిష్ణువు సమక్షంలోనూ అదే ఆలోచనయా, ఏమిటిది మానవా నీ బెంగ అంటూ లక్ష్మిదేవి ప్రశ్నించారు.
అవునమ్మా, ఎందుకో ఏకాగ్రత కుదరడం లేదు… నా తలరాత ఎందుకు ఇలా రాశారో, అర్థాంతరంగా నాకు మరణం ఎందుకు సంభవించిందో, ఎవరు హత్య చేశారో, ఏ ప్రయోజనం ఆశించారో? తెలుసుకోవాలని ఉంది. శ్రీహరి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవున్ని సందర్శించి నా ఈ దీనావస్థకు కారణాలు తెలుసుకోవాలని అనుకుంటున్నానని విజయ్ ఆశగా పలికాడు.
ఓహా మరో కోరికయా…బాగు,బాగు.. మానవా..త్రిలోకాలు తిరగాలని ఉందా? బ్రహ్మ దేవుని దగ్గరికి తర్వాత వెండికొండలో కొలువైన మహేశ్వరున్ని కూడా సందర్శిస్తానని…ఆ తర్వాత దేవుళ్లందరినీ సందర్శించేందుకు ప్రయత్నిస్తున్నావా జీవి అంటూ లక్ష్మి దేవి అంది… అమ్మా నా ఉద్ధేశ్యం అది కాదు.. స్వర్గానికి వెళ్లి వచ్చినా…సాక్షాత్తు శ్రీహరి ముందే ఉన్నప్పటికీ నాకు ఎందుకో…సంతృప్తిగా కలగడం లేదు..నా మరణంపై సందేహాలు వీడటం లేదు.ఎవరు,ఎందుకు,చంపారో అంతుబట్టడం లేదు. మరోసారి భూలోకం వెళ్లి నా హత్యకు కారణాలు,కారకుల విషయం తెలుసుకోవాలని బలంగా ఉంది తల్లి..ఇది అన్ని నియమాలకు విరుద్దమే కావచ్చు కానీ దేవదేవుడు శ్రీమన్నారాయణుని అభీష్టమైతే, అసంభవం ఏదీ ఉండదని నా ఆశ,అమ్మా అంటూ సాష్టాంగ పడ్డాడు జీవుడు…
(సశేషం)