విజయుడు (ధారావాహిక నవల పార్ట్-9)
విజయ్ హత్య కేసు పరిశోధిస్తున్న ఇన్స్‌పెక్టర్ తివారి తాజా సమాచారంపై ఎస్‌ఐతో మాట్లాడుతున్నాడు. హోం మంత్రిత్వ శాఖ ద్వారా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించిన వివరాలపై ఏ ఒక్క చోట నుంచి కూడా ప్రత్యుత్తరం రాకపోవడంతో ఎస్‌ఐ నిరాశగా సిఐతో చర్చించారు. ఇలా ఎందుకు జరుగుతున్నది. ఏ ఒక్క రాష్ట్రం నుంచి కూడా అవుననో కాదనో చిన్న మెసేజీ రాకపోవడాన్ని సిఐ జీర్ణించుకోలేక పోయారు. పోలీసు శాఖలో ఏర్పడిన స్థబ్దత ఆయనకు తెలియంది కాదు. శాఖలో వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది మాత్రమే వృత్తి పట్ల అంకిత భావంతో వ్యవహరిస్తున్నారు. రాజకీయ జోక్యం అన్నిదశల్లో అధికంగా కనిపిస్తుండటంతోనే ఈ దుస్థితి ఏర్పడింది. ఎస్‌ఐ పోస్టు నుంచి అత్యున్నత పోస్టు డిజిపి స్థాయి వరకు కూడా ప్రతి పోస్టు నియామకం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగుతున్నాయి. సీనియారిటీ ప్రమోషన్లు పాటించడం లేదు. పైరవీలదే రాజ్యం అవుతున్నది. దీంతో పోస్టింగ్ లభించిన తర్వాత తనకు మళ్లీ ట్రాన్స్‌ఫర్ కాకుండా అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తడం వారి చుట్టూ ప్రదక్షణాలు చేయడానికే సమయం సరిపోతున్నది. నేతల భూకబ్జాలు, ఇతర అక్రమాల్లో పోలీసు అధికారుల భాగస్వాములవుతున్న సంఘటనలు దాదాపు అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. అందుకేనేమో ఏ పోలీసు అధికారిపై అవినీతి నిరోదక శాఖ అధికారులు అప్పుడప్పుడు చేసే దాడుల్లో కోట్లాది రూపాయల విలువ చేసే భూములు, నగలు బ్యాంకు లాకర్లు బయటపడుతున్నాయి. ఇది బహిరంగ రహస్యమే. పోలీసులు అధికార పార్టీ నేతల కొమ్ముకాస్తున్నారు వచ్చే ఎన్నికల్లో మా పార్టీ విజయం సాధించి అధికారలోకి వచ్చిన తర్వాత వారి భరతం పడతామని విపక్షంలో ఉన్న సమయంలో పార్టీలు ప్రకటిస్తున్నా, వారు అధికారంలోకి రాగానే తిరిగి వారికి అండదండలు అందిస్తున్న పోలీసులతో కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ వారు కూడా కలిసిపోతున్నారు. మళ్లీ అదే తంతు పునరావృతం అవుతున్నది. తీవ్రవాదులు, ఉగ్రవాదుల ప్రాభల్యం ఉన్నరాష్ట్రాల్లో పరిస్థితి మరింత అద్వాన్నంగా మారుతున్నది. పత్రికల్లో ఇదే సమాచారం ప్రముఖంగా కనిపిస్తుంటుంది. నక్సల్స్ బూచి చూపి ముఖ్యమంత్రులను కూడా కట్టడి చేస్తున్న పోలీసు అధికారులు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయంటే పోలీసు విభాగం ఎంతగా బ్రష్టుపట్టింది కదా అని సిఐ తివారి ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రం నుంచి సమాచారం లేదు.. మన సరిహద్దు ప్రాంతాల నుంచి కనీస ఫిర్యాదులేదు.. ఇక మనం కేసు దర్యాప్తుకు ఎలా ముందుకు వెళ్దాం సర్ అని ఎస్‌ఐ అనడంతో ఆలోచన నుంచి సిఐ బయటికి వచ్చి.. చూద్దాం ఏదో ఒక క్లూ దొరకక పోదు.. మార్చురీలో ఉన్న హతుని శవం పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. డాక్టర్లతో మాట్లాడుతూ ఉండు.. మనం చెప్పే వరకు శవానికి అంత్యక్రియలంటూ ఎవరు ఒత్తిడి చేసినా పట్టించుకోవద్దని ఆస్పత్రి సూపరింటిండెంట్‌కు ఖచ్చితంగా చెప్పాలి అని ఎస్‌ఐకి సిఐ కఠినంగా తెలిపారు. సరే అంటూ ఎస్‌ఐ వెళ్లిపోగానే ఇతర కేసులను పరిశీలిస్తున్నారు తివారి.
రెండు రోజులు గడిచినప్పటికీ ఇంకా విజయ్ రాకపోవడంతో పరిస్థితిని కనుక్కోవాలని ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. వెంటనే ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయానికి ఫోన్‌చేసి శాసనసభ్యుడు విజయ్ కొద్దిరోజుల కిందట ఢిల్లీకి వచ్చారు. మన భవన్‌లో ఏ రూంలో దిగారు ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు. వెంటనే తెలుసుకొని సమాచారం అర్జంట్‌గా ఇవ్వాలి ఇక్కడ ముఖ్యమంత్రిగారు పదేపదే అడుగుతున్నారని, అవసరమైతే ఈ విషయం భవన్ రెసిడెంట్ కమిషనర్‌తోనూ సంప్రదించాలని పురమాయించారు సిఎంఒ అధికారులు. నేరుగా ముఖ్యమంత్రి ఆదేశించారని తెలియడంతో భవన్ అధికారులు వారం రోజులుగా భవన్‌కు వచ్చిన వారందరి జాభితాను పరిశీలించారు. రాష్ట్రం నుంచి ఏ ఒక ఎంపీ కానీ, ఎంఎల్‌ఎగాని, అధికారులు కానీ ఢిల్లీకి వచ్చినా ముందుగా భవన్‌లోనే బస చేయడానికే ప్రాధాన్యతనిస్తారు. స్వాతంత్య్ర సమరయోధులు, ఇతరత్రా హోదా ఉన్న వారు విలేకర్లుకూడా జిఎడి నుంచి ప్రత్యేక లెటర్ తీసుకు వస్తే ప్రభుత్వ అతిధిగానే పరిగణించి వసతి కల్పిస్తారు. సబ్సిడీ రేటుకే భోజన వసతి లభిస్తుంది. ఏ హోదా లేని వారికికూడా వసతి లభిస్తుంది కానీ అధిక రేటును చెల్లించాల్సి ఉంటుంది. అదికూడా ప్రజాప్రతినిధులు, అధికారులు లేని సమయంలో గదులు ఖాళీగా ఉంటేనే, వారికి సదుపాయం లభిస్తుంది.
జాబితాలన్నీ పరిశీలించిన ఎంఎల్‌ఎ విజయ్ పేరు లేకపోవడంతో భవన్ అధికారులకు ముచ్చెమటలు పోసినట్లు అయింది. వెంటనే విషయం రెసిడెంట్ కమిషనర్ దృష్టికి తెచ్చారు. దీంతో కమిషనర్ తన సెల్‌ఫోన్ ద్వారానే ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శితో మాట్లాడారు. శాసనసభ్యుడు విజయ్‌ను తానుకూడా గుర్తు పడతానని, అసెంబ్లీలో ఆయన ప్రసంగాలు ఆసక్తికరంగా ఉంటున్నందున తానుకూడా టీవీల్లో చూశానని, అయితే విజయ్ మన భవన్‌కు రాలేదని, వేరే ఎక్కడో బస చేసి ఉండి వచ్చని ఆయన ఆచూకీని తెలుసుకునేందుకు ప్రయత్నించి తర్వాత ఫోన్ చేస్తానని వివరణ ఇచ్చారు. రెండు రోజులుగా ఇక్కడ నుంచి మేం ప్రయత్నిస్తున్నాం. చివరగా ముఖ్యమంత్రిగారే విజయ్‌తో మాట్లాడారు. తర్వాత మరోసారి మా సిబ్బంది ప్రయత్నిస్తే ఫోన్ నెట్‌వర్కు పరిధిలో లేదనే జవాబు వచ్చింది. ఏమి జరిగిందో అంతుబట్టడం లేదు. ముఖ్యమంత్రిగారితో ఉన్న సన్నిహితత్వం వల్ల విజయ్ కూడా నేరుగా సిఎంతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. కానీ రెండు, మూడు రోజులుగా విజయ్ తనతో మాట్లాడలేదని ముఖ్యమంత్రి గారే చెబుతున్నారు. సీరియస్‌గా తీసుకొని విజయ్‌కు ఏమైంది. ఆస్పత్రిలో ఏమేనా అనారోగ్యంతో చేరారా? లేక ఏదైనా ప్రమాదంలో ఇరుకున్నారా.. వెంనే తెలుసుకునే ప్రయత్నంచేయండి.. విజయ్ కు ఇక్కడ ఎవరూ లేరు. తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నారు. బంధువులు కూడా ఆయన గురించి వాకబ్ చేసినట్లుగా లేదు. విజయ్‌కు పిఎ ఒకరుండాలి కానీ ఆయనను అడిగినా తనకు తెలియదు వారం నుంచి విజయ్ తనతో మాట్లాడలేదని కూడా అంటున్నాడు. అవసరమైతే ఢిల్లీ పోలీసుల సహాయం కూడా తీసుకోండి అని సిఎంఒ అధికారి కొంత ఆందోళనతో కమిషనర్‌కు సూచనలిచ్చారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు పడి నాయి. నాలుగు రోజులపాటు ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటికి రాలేని దుర్బర పరిస్థితి. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్లు కొన్ని చోట్ల గండిపడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తక్షణ సహాయం అందించాలని ముఖ్యమంత్రులు ప్రాథమిక సమాచారంతో దేశ ప్రధానిని అభ్యర్థించారు. అనేక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వయంత్రాంగాలు సహాయ కార్యక్రమాలు అందించేందుకు కార్యక్రమాలు రూపొందించుకోవడంలో నిమగ్నమయ్యాయి. ఈ విపత్తు ముంచెత్తడంతో ముఖ్యమంత్రి కానీ, ఆయన కార్యాలయ అధికారులు కానీ విజయ్ విషయంలో శ్రద్ద పెట్టలేకపోయారు. రెసిడెంట్ కమిషనర్‌కు కూడా ప్రత్యేక భాద్యతలు వచ్చి పడ్డాయి. కేంద్రం నుంచి సహాయం లభించాలంటే ఆయా కేంద్ర మంత్రిత్వ శాఖలతో సంప్రదించాల్సి ఉంటుంది. దీంతో కమిషనర్ కార్యాయం అధికారులందరూ ఇదే పనిలో నిమగ్నమై, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి చెప్పిన విజయ్ వాకబ్‌ను విస్మరించారు. దీంతో విజయ్ కేసు విషయంలో దర్యాప్తు వెనుకబడింది. కానీ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ తివారి మాత్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ భవనాలకు వెళ్లి విచారించాలని నిర్ణయించుకున్నారు. న్యూఢిలీలో దాదాపు అన్ని రాష్ట్రాలకు ప్రభుత్వ భవనాలు ఉండి, ఆయా రాష్ట్రాల అధికారులతో నిర్వహించబడుతున్నాయి. భవన్‌లకు అనుబంధంగా ఆయా రాష్ట్రాల భోజనాలే లభిస్తాయి. తమ రాష్ట్ర ఫుడ్ కావాలనుకునే వారు అక్కడికే వెళ్లి టిఫిన్స్, భోజనం చేయడం రివాజు. అన్ని వసతులున్నా ప్రభుత్వ భవన్‌లో విజయ్ ఎందుకు బస చేయలేదదో కమిషనర్ కార్యాలయ అధికారులకు అంతుబట్టలేదు.
(సశేషం)