వినుడు వినుడు రామ కథ…
రామకథ
వినుడీ వినుడీ రామ కథ
విన్న వారికిది పుణ్యమట
మదిలో బాధలు తొలుగునట
మనకు భాగ్యము కలుగునట..| విను |
తనయుల కోసం వగచి దశరథుడు
తలచి యాగమొకటి చేసేనట
యాగ ఫలమున నలుగురు పుత్రులు
మువ్వురు రాణులకు కలిగిరట… |విను |
అంతః పురమున దివారాత్రములు
పుత్ర ప్రేమలో మునిగి పోయిరట
ఎదుగు తున్న ఆ పుత్రుల విడచి
క్షణ మొక యుగముగ తలిచెరట..|విను |
యాగరక్షణ కై విశ్వామిత్రుడు
తనయుల పంపమని కోరెనట
విశ్వశాంతి కై వారిరువురికి
దివ్యాస్త్రమ్ములుపదేశించెనట..|విను |
పాషాణంగా మారినహల్యను
పాద ధూళియే పడతిగ మార్చెనట
ముని ఆనతి విని విల్లును విరిచి
సీతను పరిణయ మాడెనట,..|విను |
తండ్రి మాటను శిరమున దాల్చి
పిన తల్లి కోర్కెను తీర్చేనట
సీతా లక్ష్మణ తోడుగ కలిసి
రాజ్యము విడిచి వెళ్లేనట..|విను |
ముచ్చట పడిన బంగరు జింకను
పట్టి తెమ్మని సీత కోరేనట
వెడలిన రాముని కదలిక చూచి
అసరుడమ్మని అపహరించెనట…|విను |
అన్నదమ్ములు సీత జాడకై
అడుగడున అడవులు వెదికిరట
హనుమంతుగని వారిరువురు
వానర రాజు సాయము కోరిరట…|విను |
వానర మూక తో వారధి కట్టి
లంకా నగరమునకు కేగిరట
రావణు జంపి అమ్మను తెచ్చి
అయోధ్య నగరికి తిరిగి చేరిరట..|విను |
ధర్మ నిరతి లో రాముని మించిన
నాయకుడిలలో లేనే లేడట
ఆతని పాలనే లోకమందున
రామరాజ్యముగ వర్ధిల్లెనట…|విను |
-శేషం శ్రీనివాసచార్య,కరీంనగర్
Rtd GHM.