జిహెచ్ ఎమ్‌సి ఉన్నతాధికారులతో జలమండలి ఎండీ సమీక్షా సమావేశం

హైదరాబాద్ (CLiC2NEWS): జిహెచ్ఎమ్‌సి చేపట్టే అభివృద్ధి పనుల వద్ద, జలమండలి ఆధ్వర్యంలో జరుగుతున్న పైప్ లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని జలమండలి ఎండీ శ్రీ. దాన కిషోర్, ఐఏఎస్ జలమండలి అధికారులను ఆదేశించారు. తేదీ:24.12.2021, శుక్రవారం రోజు ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయం లో జలమండలి, జిహెచ్ఎమ్‌సి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నగరంలో జిహెచ్ఎమ్‌సి ఆధ్వర్యంలో జరుగుతున్న ఎస్సార్డీపీ, ఆర్వోబీ (రోడ్ ఆన్ బ్రిడ్జి), ఎఫ్వోబి తదితర అభివృద్ధి పనుల వద్ద జరుగుతున్న జలమండలి పైప్ లైన్ మళ్లింపు, విస్తరణ వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అవసరమైతే రెండు శాఖల అధికారులు సంయుక్తంగా ఈ పనులను సందర్శించి, సమన్వయంతో పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణా, స్వామి, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, సీజీఎంలు, జిహెచ్ఎమ్‌సి ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.