అధికారులను అప్రమత్తం చేసిన జలమండలి ఎండీ

హాట్‌స్పాట్లపై దృష్టి పెట్టాలని ఆదేశం
మ్యాన్‌హోళ్ల మూతలు తెరవొద్దని ప్రజలకు వినతి
రంగంలోకి ఈఆర్‌టీ బృందాలు
హైదరాబాద్ (CLiC2NEWS): గులాబ్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఈఆర్‌టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ దానకిషోర్ అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ… భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తరచూ సెవరేజీ ఓవర్‌ఫ్లో అయ్యే ప్రాంతాలను గుర్తించి మ్యాన్‌హోళ్లు ఉప్పొంగకుండా ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని అన్నారు. దీని కోసం ఇప్పటికే నగరంలో దాదాపు 16 ఈఆర్‌టీ బృందాలను ఏర్పాటు చేయగా, ఒక్కో బృందంలో ఐదుగురు సిబ్బందితో పాటు ఇతర అత్యవసరం సామాగ్రి ఉంటుంది. అలాగే, ఏదైనా అత్యవసర సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించడానికి 16 ఎయిర్‌టెక్ మిషన్లు అందుబాటులో ఉంచాలని ఎండీ ఆదేశించారు.
ఈ వర్షాకాల ముందస్తు కార్యచరణలో భాగంగా దాదాపుగా 22 వేల మ్యాన్‌హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎక్కువ లోతు ఉన్న మ్యాన్‌హోళ్లపై మూతలు, సేఫ్టీ గ్రిల్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని, జలమండలి, జీహెచ్ఎంసీ వాటర్ లాగింగ్ పాయింట్లను నిత్యం పర్యవేక్షించాలని, డ్రైనేజీ పనులకు సంబంధించిన వ్యర్థాలను తక్షణం తొలగించాలని , అలాగే మంచి నీటి పైపు నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా జీఎంలు జాగ్రత్త వహించాలని సూచించారు. అలాగే, ముంపునకు గురైన ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, డీప్ మ్యాన్‌హోళ్ల దగ్గర సీవరేజి సూపర్‌వైజర్లు ఉండేలా చూడాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బంది తప్పనిసరిగా రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వర్షాల వల్ల తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.
నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్ మూతలను తెరవకూడదని ఆయన సూచించారు. ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూత ధ్వంసం అయినా, తెరిచి ఉంచినట్లు తెలిస్తే జలమండలి కస్టమర్ కేర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
ఇతర వివరాలకు జలమండలి కస్టమేర్ కేర్ 155313కి కాల్ చేయాలని ఆయన కోరారు.