72 సీట్లు గెలిచి కచ్చితంగా అధికారంలోకి వస్తాం: రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌(CLiC2NEWS): తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ కచ్చితంగా 72 సీట్లు గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈసారి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం.. ఎవరు ఆపలేరు అని కూడా తెలిపారు. దీని కోసం కాంగ్రెస్‌ పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో నాయకులు చురుగ్గా ఉండాలని సూచించారు. దీనిలో భాగంగా క్షేత్ర స్థాయి నుండి డిసిసి వరకు నాయకుల, కార్యకర్తల పనితీరుపై నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఆపేసి… కేసీఆర్ ఇప్పుడు దళితబంధు పేరుతో పథకాన్ని ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని అమలు చేస్తున్నారని.. వీటన్నింటిపై ప్రధాన ప్రతిపక్షంగా మనమంతా నిలదీయాలని సూచించారు. హైదరాబాద్‌లో రూ. 10వేలు ఇవ్వలేని ముఖ్య‌మంత్రి రాష్ట్రంలో ఉన్న 30 లక్షల దళిత గిరిజన కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎలా ఇస్తారని ప్రశ్నించాలన్నారు. అందుకోసమే ఆగస్టు 9న క్విట్‌ ఇండియా దినం నుంచి తెలంగాణ విలీన దినం సెప్టెంబర్‌ 17వరకు 40 రోజులపాటు ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు..

ఆగస్టు 9 క్విట్‌ ఇండియా దినం నుంచి సెప్టెంబర్‌ 17 తెలంగాణ విలీన దినం వరకు 40 రోజుల పాటు ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంలో అందరూ చురుకుగా పాల్గొనాలని తెలిపారు. 17 పార్లమెంట్‌, 119 నియోజక వర్గాలకు ఇంచార్జుల పనితీరుకు ఇదో కొలబద్దగా నిలుస్తుందని అన్నారు. మండలాల అధ్యక్షులు గట్టిగా పనిచేస్తే ఆయా నియోజకవర్గాలలో గెలవడం సులభమని తెలిపారు.

రాష్ట్రానికి రాహుల్ గాంధీ
సెప్టెంబ‌రులో తెలంగాణ‌లో రాహుల్‌గాంధీ పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ సభకు ఆయన హాజరుకానున్నారు. వచ్చే నెల 17న వరంగల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభను నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వరంగల్‌ సభను భారీగా నిర్వహించాలని భావిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.