అగ్నిప్రమాదంలో 11 మంది వృద్ధులు మృతి

మాస్కో: రష్యాలోని బష్కోర్టోస్థాన్‌లో ఘోరం జరిగింది. ఓ వృద్ధాశ్రమంలో మంటలు చెలరేగి 11 మంది మృతి వృద్ధుల సజీవదహనం అయ్యారు. ఉరల్ పర్వత శ్రేణుల్లోగల వృద్ధాశ్రమంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించాయి. ఆశ్రమంలో ఉన్న వారంతా వృద్ధులు కావడంతో ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారని అక్కడి అధికారులు తెలిపారు.
ఆ వృద్ధాశ్రమంలో మొత్తం 16 మంది ఉన్నారని, వారిలో 11 మంది మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని, మరో ఇద్దరు మాత్రమే సురక్షితంగా తప్పించుకోగలిగారని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల్లో ఏడుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.